జియోమ్యాగ్నటిక్ అబ్జర్వేటరీ యంత్రంలోని రీడింగ్‌ను పరిశీలిస్తున్న శేఖర్ సి.మండే
సాక్షి, చౌటుప్పల్: కరోనా థర్డ్ వేవ్‌ను సమర్థంగా తట్టుకొనే శక్తి దేశానికి ఉందని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సి.మండే తెలిపారు. సెకండ్ వేవ్ సమయంలో సరైన జాగ్రత్తలు లేకపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని, పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించిందని చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మందోళ్లగూడెం గ్రామంలోని భూ అయస్కాంత పరిశోధన క్షేత్రం (ఎన్జీఆర్‌ఐ)లో కొత్తగా ఏర్పాటు చేసిన జియో మ్యాగ్నటిక్ అబ్జర్వేటరీని శనివారం ఆయన ప్రారంభించారు. జియోమ్యాగ్నటిక్ అబ్జర్వేటరీ పనితీరును పరిశీలించారు. కార్యాలయంలో ఫొటో గ్యాలరీని తిలకించారు.
అనంతరం విలేకరుల సమావేశంలో శేఖర్ మాట్లాడుతూ థర్డ్‌వేవ్ సంభవించినా అంతగా నష్టం ఉండదని అంచనా వేశారు. వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగుతుండడం, 60–65 శాతం మందిలో ఇప్పటికే యాంటీబాడీలు వృద్ధి చెందడంతో థర్డ్‌వేవ్ పెద్దగా ప్రభావం చూపదన్నారు. కరోనా వ్యాక్సినేషన్‌లో సీఎస్‌ఐఆర్ కీలకపాత్ర పోషించిందన్నారు. సీసీఎంబీతో కలసి సమన్వయంతో పనిచేసిందని, కోవాగ్జిన్ తయారీకి అవసరమైన తోడ్పాటును అందించామన్నారు. మొదటి, రెండోడోస్ టీకా వేసుకున్న వ్యక్తులకు మూడో డోస్(బూస్టర్) అవసరం వస్తుందా రాదా అన్న విషయంపై పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. కరోనా వైరస్ మానవ సృష్టా లేదా ప్రకృతి పరంగా వచ్చిందా అన్న అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదన్నారు.
ప్రకృతి విపత్తులపై అలర్ట్...
జియో మ్యాగ్నటిక్ అబ్జర్వేటరీలు ప్రపంచ వ్యాప్తంగా 450 ఉండగా, వాటిలో 150 డిజిటల్ అబ్జర్వేటరీలు ఉన్నాయని సీఎస్‌ఐఆర్ డీజీ శేఖర్ సి. మండే తెలిపారు. అయితే మన దేశంలో 10 చోట్లే అబ్జర్వేటరీల ఏర్పాటు జరిగిందన్నారు. ఈ అబ్జర్వేటరీలో ప్రతి సెకనుకు సేకరించే నమూనాలు ఉపగ్రహం ద్వారా ప్రపంచంలోని అన్ని అబ్జర్వేటరీలతో అనుసంధానమై ఉంటాయన్నారు. దీంతో అన్ని అబ్జర్వేటరీల నుంచి వచ్చే సమాచారాన్ని శాస్త్రవేత్తలు విశ్లేషించడం ద్వారా భూ అయస్కాంత క్షేత్రాల మార్పును గుర్తించవచ్చన్నారు.
భూకంపాలు, సౌర తుపానులు, సునామీలను ముందుగా గుర్తించి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా అప్రమత్తం కావొచ్చన్నారు. భూగర్భంలో ఖనిజాలు, జలవనరులు, చమురు నిక్షేపాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ అబ్జర్వేటరీ గుర్తిస్తుందని శేఖర్ మండే తెలిపారు. ఈ నూతన అబ్జర్వేటరీలో కెనడా, డెన్మార్క్ తయారు చేసిన అత్యాధునిక మ్యాగ్నో మీటర్లను అమర్చామన్నారు. విలేకరుల సమావేశంలో ఎన్‌జీఆర్‌ఐ డైరెక్టర్ వి.ఎం. తివారీ, సీనియర్ సైంటిస్టులు డాక్టర్ నందన్, డాక్టర్ దేవేందర్, డాక్టర్ శ్రీనాగేష్, అజయ్ మాంగీక్, కీర్తిశ్రీవాత్సవ, కుస్మిత అలోక తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment