సాక్షి, న్యూఢిల్లీ: నులిపురుగులను నియంత్రించే నిక్లోసమైడ్ ఔషధాన్ని కరోనా చికిత్స నిమిత్తం లక్సాయ్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో సీఎస్‌ఐఆర్ రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించింది. ఆసుపత్రుల్లో చికిత్స పొందు తున్న కరోనా రోగులపై నిక్లోసమైడ్ ఎంతమేర సమర్థంగా పనిచేస్తుంది, భద్రత తదితరాలు అంచనా వేయడానికి పలు అధ్యయనాలు చేపట్టారు. గతంలో పెద్దలు సహా పిల్లలకు కూడా నులిపురుగు (టేప్–వార్మ్) నివారణకు నిక్లోసమైడ్ విస్తృతంగా వినియోగించేవారు. ఈ ఔషధం భద్రతా ప్రమాణాలు ఎప్పటికప్పుడు పరీక్షించినట్లు శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వశాఖ పేర్కొంది.
నిక్లోసమైడ్ రెండోదశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతే తక్కువ ఖర్చుతో కూడిన చికిత్స అందుబాటులోకి వస్తుందని సీఎస్‌ఐఆర్ డైరెక్టర్ జనరల్ శేఖర్ సి మాండే తెలిపారు. సీఎస్‌ఐఆర్ డీజీ సలహాదారు రామ్ విశ్వకర్మ మాట్లాడుతూ... సిన్సిటియా (ఒక కణంలో ప్రవేశించిన వైరస్ సమీపంలోని మరిన్ని సెల్స్‌ను కలుపుకొని సమూహంగా ఏర్పాటై వైరస్ వ్యాప్తి చేసే క్రమం) ఏర్పడటాన్ని నిరోధించే ఔషధాలను గుర్తించే క్రమంలో నిక్లోసమైడ్ సురక్షితమైన ఔషధంగా లండన్‌కు చెందిన కింగ్స్ కళాశాల పరిశోధకుల అధ్యయనంలో తేలిందన్నారు.
కరోనా రోగుల్లోని ఊపిరితిత్తుల్లో సిన్సిటియా ఏర్పాటును నిక్లోసమైడ్ నియంత్రిస్తుందన్నారు. ఎండోసైటిక్ పాత్‌వే (పీహెచ్ డిపెండెంట్) ద్వారా వైరస్ ప్రవేశాన్ని నిరోధించడంతోపాటు సార్స్–కోవ్ 2 ప్రవేశాన్ని కూడా సమర్థంగా నిరోధించగల ఔషధంగా నిక్లోసమైడ్ పనిచేస్తుందని జమ్మూలోని సీఎస్‌ఐఆర్–ఐఐఐఎం, బెంగళూరులోని ఎన్‌సీబీఎస్‌ల సంయుక్త పరిశోధనలో తేలిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment