పేరూ తెలియదు.. ఊరూ తెలియదు.. ఎక్కడి నుంచో సడన్‌గా ఊడిపడతారు. పరీక్షలు చేస్తారు. మందులు ఇస్తారు. జాగ్రత్తలూ చెప్తారు. వీళైతే మంచి తిండి కూడా అందిస్తారు. వాళ్ల ధ్యాసంతా అవతలి ప్రాణం కాపాడాలనే. కానీ, వాళ్ల ప్రాణం పోతుందన్న భయం మాత్రం వాళ్లకు ఉండట్లేదు ఎందుకనో!.
ఈ కరోనా కష్టకాలంలో వైద్య సిబ్బంది పడుతున్న పాట్లు అంతా ఇంతా కాదు. వేవ్‌ల వారీగా విరుచుకుపడుతున్నా.. ఫ్రంట్ లైన్ వారియర్‌లుగా వాళ్లందించిన సేవల్ని అంత త్వరగా మరిచిపోలేం కూడా. అయితే వైరస్‌ను మించిన ముప్పు నుంచి తప్పించుకుంటూ తిరుగుతూ సేవలందిస్తున్నారు మయన్మార్‌లో వైద్యసిబ్బంది. ఈ ప్రయాణంలో నిర్బంధాలతోపాటు ప్రాణాలు సైతం పొగొట్టుకుంటున్నారు. ఏ తల్లి కన్నబిడ్డలో పాపం.. ఇప్పుడు వేలమంది ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు .
చేతిలో బ్యాగు. బ్యాగు నిండా మందుల సరంజామా. ఒక చోటు నుంచి మరో చోటుకి గప్‌చుప్ ప్రయాణం. దొరికితే మాత్రం ఆయువు ముడినట్లే!. మయన్మార్‌లో హెల్త్ వర్కర్స్ క్షణమోక నరకంగా గడుపుతున్నారు. సైన్యం చేతిలో పదుల సంఖ్యలో వైద్య సిబ్బంది ప్రాణాలు పొగొట్టుకున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి.
ఫిబ్రవరిలో ఉవ్వెత్తున చెలరేగిన మయన్మార్ సైన్య దురాగతాలు.. 1500 మంది దాకా బలిగొన్నట్లు ఒక అంచనా(అనధికారికం). అప్పటి నుంచి ఆస్పత్రులు సిబ్బంది లేకుండా బోసిపోతున్నాయి. నిరసనకారుల్లో ఉన్న వైద్య సిబ్బందిని సైతం నిర్దాక్షిణ్యంగా మట్టుబెట్టింది జుంటా సైన్యం. జుంటా నుండి దాక్కున్న అనేక మంది మయన్మార్ నర్సులు కోవిడ్ రోగులకు చికిత్స చేయడానికి తాత్కాలిక క్లినిక్‌లను నడుపుతున్నారు. మిలిటరీ చెక్‌పాయింట్‌ల గుండా అక్రమంగా రవాణా చేయబడిన మందులతో సైన్యం కళ్లు కప్పి తిరుగుతున్నారు.
సంబంధిత వార్త: మయన్మార్ నియంతల ఆగడం
అడవుల్లో మకాం, పాడుబడ్డ స్కూళ్లలో..
మయన్మార్‌లో సైన్యం ఆరాచకాలు మొదలయ్యాక.. చాలామంది ప్రాణ భీతితో దేశం విడిచి పారిపోయే ప్రయత్నాలు చేశారు. వైద్య సిబ్బంది మాత్రం అక్కడే ఉండిపోయారు. మిలిటరీ-నిరసనకారుల మధ్య పోరు తారాస్థాయికి చేరడంతో.. వాళ్లలో చాలామంది అడవుల్లో తలదాచుకున్నారు. అదే టైంలో రోజూ 40వేల చొప్పున నమోదు అవుతూ వస్తున్న రోజూవారీ కొవిడ్ కేసుల్ని తగ్గించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. పాడుబడ్డ ఇళ్లలో, స్కూళ్లలో క్యాంపెయిన్‌లు నిర్వహిస్తున్నారు. పల్లెల్లో ఉన్న సౌకర్యాలతోనే పాపం వాళ్లు టెస్టులు, చికిత్స కొనసాగిస్తున్నారు. ఇప్పటిదాకా ఒమిక్రాన్ కేసు నమోదు కాలేదని, ఒకవేళ విజృంభణ మొదలైతే మాత్రం జనాలకు ఇబ్బందులు తప్పవని వాళ్లు జాగ్రత్తలు సూచిస్తున్నారు.
సైన్యం ఆరాచకం
కరోనా సోకినా పౌరులకు సైన్యం నుండి అందే వైద్యసాయం ఘోరంగా ఉంటోంది. బతికితే బతుకుతారు. చస్తే చస్తారు. అదే టైంలో సైన్యంలో ఎవరికైనా కరోనా సోకితే మాత్రం.. అత్యవసర సేవల కింద చికిత్స అందిస్తున్నారు. మరోవైపు అజ్ఞాతంలో ఉన్న వైద్య సిబ్బందికి మందులు చేరకుండా ఉండేందుకు వీలైనన్ని ఎక్కువ చెక్ పోస్టుల ద్వారా అడ్డుకుంటోంది సైన్యం. ఆరునెలలుగా కొనసాగుతున్న సైన్యం ఆరాచకాల్లో 190 మంది వైద్య సిబ్బందిని అరెస్ట్ చేయగా.. 25 మందికి దారుణాతిదారుణంగా హతమార్చినట్లు ఓ నివేదిక సారాంశం. వైద్య సిబ్బంది కుటుంబాలు సైతం తమ ప్రాణాలకు తెగించి.. పేషెంట్ల కోసం కృషి చేస్తుండడం ఈ పరిణామాల్లో అసలైన కొసమెరుపు.
చదవండి: ఒక పోరాట యోధుడి అస్తమయం
Comments
Please login to add a commentAdd a comment