military rule
-
నియంతకు పరాభవం
‘ప్రభుత్వం ప్రజలకు భయపడినంతకాలం స్వేచ్ఛ ఉంటుంది...ప్రజలు ప్రభుత్వానికి భయపడితే నియంతృత్వం తప్పదు’ అని ఒక రాజనీతిజ్ఞుడు అంటాడు. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సెక్–యోల్ మంగళవారం హఠాత్తుగా దేశంలో విధించిన సైనికపాలన కాస్తా జనం తిరగబడేసరికి కేవలం ఆరు గంటల్లో తోకముడిచిన తీరు దాన్ని మరోసారి అందరికీ గుర్తుచేసింది. వచ్చే నెలనుంచి డోనాల్డ్ ట్రంప్ ఏలుబడిని చవిచూడబోతున్న అమెరికా ప్రజానీకం మొదలు దేశదేశాల పౌరులూ ఈ ప్రహసనం నుంచి చాలా నేర్చుకోవచ్చు. ‘రాజ్య వ్యతిరేక శక్తుల్ని సాధ్యమైనంత త్వరగా ఏరిపారేసి దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పడానికి’ ఎమర్జెన్సీ విధింపు, సైనిక పాలన తప్పనిసరయినట్టు రాత్రి పొద్దుపోయాక యూన్ ప్రకటించారు. పొరుగునున్న శత్రు దేశం ఉత్తరకొరియాకు చెందిన కమ్యూనిస్టు పాలకులతో కుమ్మక్కయిన విపక్షాలు దేశాన్ని అస్థిరపరచాలని చూస్తున్నాయని ఆరోపించారు. కానీ రోడ్లపైకొచ్చిన సైనికులకు దేశమంతా ప్రతిఘటన ఎదురవుతున్నట్టు, నిరసనోద్యమాలు తారస్థాయికి చేరినట్టు అందిన సమాచారంతో బెంబేలెత్తిన ఆయన సైనికపాలనను ఎత్తేస్తున్నట్టు తెల్లారుజామున నాలుగుగంటలప్రాంతంలో తెలియజేయాల్సివచ్చింది. పార్లమెంటు భవనంలోకి ప్రవేశించటానికి ప్రయత్నించిన సైనికులను జనం తరిమికొట్టడంతో ఆయనకు తత్వం బోధపడింది. విపక్షం తీసుకురాబోతున్న అవిశ్వాస తీర్మానంతో తనకు పదవీభ్రష్టత్వం తప్పదనుకుని హడావిడిగా వేసిన సైనిక పాలన ఎత్తుగడ కాస్తా వికటించి ఆయన రాజకీయ భవిష్యత్తుకు పూర్తిగా తలుపులు మూసేసింది. 2027 వరకూ ఉండాల్సిన అధ్యక్షపదవి మరికొన్ని రోజుల్లో ఊడటం ఖాయమన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మితవాద పీపుల్ పవర్ పార్టీ (పీపీపీ) తరఫున 2022 ఎన్నికల్లో పోటీచేసేనాటికి యూన్ అనామకుడు. అప్పటికి హద్దులు దాటిన ద్రవ్యోల్బణం, ప్రజల్లో ప్రభుత్వంపై ఏర్పడ్డ తీవ్ర అసంతృప్తి ఆసరాగా చేసుకుని ఆయన అధ్యక్షుడిగా విజయం సాధించాడు. అయితే ప్రత్యర్థి డెమాక్రటిక్ పార్టీ అభ్యర్థి లీ జే–మ్యుంగ్ కన్నా ఆయనకు కేవలం ఒక శాతం ఓట్లు అధికంగా వచ్చాయి. మ్యుంగ్ సఫాయి కార్మికుడి కుమారుడు.సంపన్నవంతమైన దక్షిణ కొరియాకు అసలు సమస్యలేమిటన్న సందేహం అందరికీ వస్తుంది. దాని తలసరి ఆదాయం 36,000 డాలర్లు. పొరుగునున్న చైనాతో పోల్చినా ఇది మూడు రెట్లు అధికం. అంతర్జాతీయ మార్కెట్లో మెరిసిపోయే బ్రాండ్లకు అది పుట్టినిల్లు. శామ్సంగ్, హ్యుందయ్, కియా, పోక్సో, ఎల్జీ, ఎస్కే... ఒకటేమిటి రకరకాల సంస్థల స్థావరం ఆ దేశం. వీటిలో 600 కంపెనీల వరకూ మన దేశంతోసహా చాలా దేశాల్లో వ్యాపారాలు సాగిస్తున్నాయి. దక్షిణ కొరియా ప్రపంచంలోనే ఆరో అతి పెద్ద ఎగుమతిదారు. ఆసియాలో అది నాలుగో అతి పెద్ద ఆర్థికవ్యవస్థ. 2009నాటి ఆర్థికమాంద్యాన్ని దక్షిణకొరియా తన దరిదాపులకు రానీయలేదు. అయినా ఏదో తెలియని వెలితి ప్రజలను నిరాశానిస్పృహల్లో ముంచింది. వృద్ధుల శాతం క్రమేపీ పెరగటం, జననాల సంఖ్య పడిపోవటం సమస్యగా మారింది. అధిక పనిగంటల వల్ల మానసిక ఒత్తిళ్లు అధికం కావటం, పెళ్లిళ్లు వాయిదా వేసుకోవటం, దంపతులు సైతం కలిసుండే గంటలు తగ్గిపోవటం వంటివి ఇందుకు కారణాలు. కానీ యూన్ దీన్ని మరో కోణంలో చూశారు. ఫెమినిస్టు ఉద్యమాలే ఈ స్థితికి కారణమంటున్న ఉద్యమాలను వెనకేసుకొచ్చారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బహిరంగంగా స్త్రీ ద్వేషాన్ని చాటుకున్నారు. అధికారం చేతికి రాగానే లింగ సమానత్వాన్ని పర్యవేక్షించే సంస్థను రద్దుచేశారు. మహిళలకుండే వెసులుబాట్లు కొన్ని రద్దుచేశారు. పైగా వారానికి 52 గంటల పనిని కాస్తా పెంచే ప్రయత్నం చేశారు. వైద్యరంగ ప్రక్షాళన పేరిట దాన్ని అస్తవ్యçస్తం చేశారు. పర్యవసానంగా దేశం సమ్మెలతో హోరెత్తింది. దీనికితోడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎడాపెడా అవినీతికి పాల్పడ్డారు. కనుకనే మొన్న ఏప్రిల్‌లో 300 స్థానాలుగల నేషనల్ అసెంబ్లీకి ఎన్నికలు జరిపినప్పుడు భారీ స్థాయిలో 67 శాతంమంది పోలింగ్‌లో పాల్గొన్నారు. విపక్షమైన డెమాక్రటిక్ పార్టీకి 180 స్థానాలు రాగా, అధికారపక్షం 108 స్థానాలకు పరిమితమైంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై కూడా గత సైనిక పాలకుల్ని కీర్తించటం యూన్ ఒక అలవాటుగా చేసుకున్నారు. వారివల్లే దేశ ఆర్థికవ్యవస్థ పటిష్ఠంగా ఉన్నదని ఆయన నిశ్చితాభిప్రాయం. ఇందుకు భిన్నంగా ప్రజలంతా ఆనాటి నియంతృత్వాన్ని మరిచిపోలేకపోయారు. 1987కు ముందున్న సైనిక పాలన తెచ్చిన అగచాట్లు గుర్తుండబట్టే యూన్ ప్రకటన వెలువడిన వెంటనే జనం వరదలై పోటెత్తారు. ప్రజల మద్దతు గమనించినందు వల్లే అధికార, విపక్ష ఎంపీలు పార్లమెంటుకు బారులు తీరారు. ప్రధానద్వారాన్ని సైనికులు మూసేయగా జనం సాయంతో స్పీకర్‌తో సహా అందరూ గోడలు దూకి, కిటికీలు బద్దలుకొట్టి భవనంలోకి ప్రవేశించారు. సైనిక పాలన వెనక్కు తీసుకోవాలంటూ అధ్యక్షుణ్ణి కోరే తీర్మానాన్ని హాజరైన 190మంది ఎంపీలు ఏకగ్రీవంగా ఆమోదించారు. శత్రు దేశాలను చూపించి, కమ్యూనిస్టుల పేరు చెప్పి ఇష్టారాజ్యంగా ప్రవర్తించే శకం ముగిసిందని దక్షిణ కొరియా ఉదంతం చెబుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో సమస్యలుండటం తప్పనిసరి. కానీ వాటిని సాకుగా చూపి అందరినీ మభ్యపెట్టి అధికారంలోకొచ్చాక నియంతృత్వ పోకడలకు పోతే చెల్లదని జనం చాటారు. యూన్ ఏలుబడి ఎప్పుడు ముగుస్తుందన్న సంగతి అలావుంచితే, ప్రజలు ఇదే చైతన్యాన్ని కొనసాగించగలిగితే భవిష్యత్తులో అక్కడ ఏ పాలకుడూ నియంతగా మారే ప్రమాదం ఉండదు. -
అజ్ఞాతవాసులు.. ఏ తల్లి కన్న బిడ్డలో!
పేరూ తెలియదు.. ఊరూ తెలియదు.. ఎక్కడి నుంచో సడన్‌గా ఊడిపడతారు. పరీక్షలు చేస్తారు. మందులు ఇస్తారు. జాగ్రత్తలూ చెప్తారు. వీళైతే మంచి తిండి కూడా అందిస్తారు. వాళ్ల ధ్యాసంతా అవతలి ప్రాణం కాపాడాలనే. కానీ, వాళ్ల ప్రాణం పోతుందన్న భయం మాత్రం వాళ్లకు ఉండట్లేదు ఎందుకనో!. ఈ కరోనా కష్టకాలంలో వైద్య సిబ్బంది పడుతున్న పాట్లు అంతా ఇంతా కాదు. వేవ్‌ల వారీగా విరుచుకుపడుతున్నా.. ఫ్రంట్ లైన్ వారియర్లుగా వాళ్లందించిన సేవల్ని అంత త్వరగా మరిచిపోలేం కూడా. అయితే వైరస్‌ను మించిన ముప్పు నుంచి తప్పించుకుంటూ తిరుగుతూ సేవలందిస్తున్నారు మయన్మార్‌లో వైద్యసిబ్బంది. ఈ ప్రయాణంలో నిర్బంధాలతోపాటు ప్రాణాలు సైతం పొగొట్టుకుంటున్నారు. ఏ తల్లి కన్నబిడ్డలో పాపం.. ఇప్పుడు వేలమంది ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు . చేతిలో బ్యాగు. బ్యాగు నిండా మందుల సరంజామా. ఒక చోటు నుంచి మరో చోటుకి గప్‌చుప్ ప్రయాణం. దొరికితే మాత్రం ఆయువు ముడినట్లే!. మయన్మార్‌లో హెల్త్ వర్కర్స్ క్షణమోక నరకంగా గడుపుతున్నారు. సైన్యం చేతిలో పదుల సంఖ్యలో వైద్య సిబ్బంది ప్రాణాలు పొగొట్టుకున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఫిబ్రవరిలో ఉవ్వెత్తున చెలరేగిన మయన్మార్ సైన్య దురాగతాలు.. 1500 మంది దాకా బలిగొన్నట్లు ఒక అంచనా(అనధికారికం). అప్పటి నుంచి ఆస్పత్రులు సిబ్బంది లేకుండా బోసిపోతున్నాయి. నిరసనకారుల్లో ఉన్న వైద్య సిబ్బందిని సైతం నిర్దాక్షిణ్యంగా మట్టుబెట్టింది జుంటా సైన్యం. జుంటా నుండి దాక్కున్న అనేక మంది మయన్మార్ నర్సులు కోవిడ్ రోగులకు చికిత్స చేయడానికి తాత్కాలిక క్లినిక్‌లను నడుపుతున్నారు. మిలిటరీ చెక్పాయింట్ల గుండా అక్రమంగా రవాణా చేయబడిన మందులతో సైన్యం కళ్లు కప్పి తిరుగుతున్నారు. సంబంధిత వార్త: మయన్మార్ నియంతల ఆగడం అడవుల్లో మకాం, పాడుబడ్డ స్కూళ్లలో.. మయన్మార్‌లో సైన్యం ఆరాచకాలు మొదలయ్యాక.. చాలామంది ప్రాణ భీతితో దేశం విడిచి పారిపోయే ప్రయత్నాలు చేశారు. వైద్య సిబ్బంది మాత్రం అక్కడే ఉండిపోయారు. మిలిటరీ-నిరసనకారుల మధ్య పోరు తారాస్థాయికి చేరడంతో.. వాళ్లలో చాలామంది అడవుల్లో తలదాచుకున్నారు. అదే టైంలో రోజూ 40వేల చొప్పున నమోదు అవుతూ వస్తున్న రోజూవారీ కొవిడ్ కేసుల్ని తగ్గించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. పాడుబడ్డ ఇళ్లలో, స్కూళ్లలో క్యాంపెయిన్లు నిర్వహిస్తున్నారు. పల్లెల్లో ఉన్న సౌకర్యాలతోనే పాపం వాళ్లు టెస్టులు, చికిత్స కొనసాగిస్తున్నారు. ఇప్పటిదాకా ఒమిక్రాన్ కేసు నమోదు కాలేదని, ఒకవేళ విజృంభణ మొదలైతే మాత్రం జనాలకు ఇబ్బందులు తప్పవని వాళ్లు జాగ్రత్తలు సూచిస్తున్నారు. సైన్యం ఆరాచకం కరోనా సోకినా పౌరులకు సైన్యం నుండి అందే వైద్యసాయం ఘోరంగా ఉంటోంది. బతికితే బతుకుతారు. చస్తే చస్తారు. అదే టైంలో సైన్యంలో ఎవరికైనా కరోనా సోకితే మాత్రం.. అత్యవసర సేవల కింద చికిత్స అందిస్తున్నారు. మరోవైపు అజ్ఞాతంలో ఉన్న వైద్య సిబ్బందికి మందులు చేరకుండా ఉండేందుకు వీలైనన్ని ఎక్కువ చెక్ పోస్టుల ద్వారా అడ్డుకుంటోంది సైన్యం. ఆరునెలలుగా కొనసాగుతున్న సైన్యం ఆరాచకాల్లో 190 మంది వైద్య సిబ్బందిని అరెస్ట్ చేయగా.. 25 మందికి దారుణాతిదారుణంగా హతమార్చినట్లు ఓ నివేదిక సారాంశం. వైద్య సిబ్బంది కుటుంబాలు సైతం తమ ప్రాణాలకు తెగించి.. పేషెంట్ల కోసం కృషి చేస్తుండడం ఈ పరిణామాల్లో అసలైన కొసమెరుపు. చదవండి: ఒక పోరాట యోధుడి అస్తమయం -
Myanmar Beauty Queen: దేశమాత స్వేచ్ఛ కోరి
మయన్మార్ బ్యూటీ క్వీన్ హటటున్.. జుంటా సైనిక నియంత పాలకులపై సమర శంఖాన్ని పూరించారు! జన్మభూమి విముక్తి కోసం మరణానికైనా తను సిద్ధమేనని ప్రకటించారు. మూడున్నర నెలల క్రితం మయన్మార్ సైన్యం ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి దేశాన్ని హస్తగతం చేసుకున్నాక మొదలైన తిరుగుబాటు ప్రదర్శనల్లో ఇప్పటివరకు వందల మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వారి ప్రాణత్యాగం వృథా కాకూదని అంటూ.. సైన్యంతో ప్రత్యక్ష పోరుకు సిద్ధం కమ్మని యువతకు పిలుపునిస్తున్నారు హటటున్. మయన్మార్ బ్యూటీ క్వీన్ హటటున్ 1992లో పుట్టే నాటికే ముప్పై ఏళ్లుగా ఆ దేశం సైనిక పాలనలో ఉంది. పుట్టాక కూడా మరో ఇరవై ఏళ్లు మయన్మార్ సైనిక పాలనలోనే ఉంది. మధ్యలో పదేళ్ల ప్రజాస్వామ్య పాలన తర్వాత మళ్లీ ఇప్పుడు సైనిక పాలన! ఈ మధ్యలోని పదేళ్లలో హటటున్ బి.టెక్ సివిల్ ఇంజనీరింగ్ చదివారు. మోడల్ అయ్యారు. సినిమాల్లో నటించారు. టీవీ సీరియల్స్‌లో కనిపించారు. మిస్ మయన్మార్ అయ్యారు. మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ టైటిల్ గెలిచారు. జిమ్నాస్టిక్స్ ఇన్‌స్ట్రక్టర్‌గా పని చేస్తున్నారు. ఇప్పుడు ‘మిలిటెంట్’ అయ్యారు! దేశమాత స్వేచ్ఛ కోసం తుపాకీని చేతికి అందుకున్నారు. ఇందుకు ఆమెను ప్రేరేపించిన పరిణామాలు ప్రపంచం అంతటికీ తెలిసినవే. నిత్యం ప్రపంచం కళ్లబడుతున్నవే. ఈ ఏడాది ఫిబ్రవరి 1న మయన్మార్ సైన్యం ప్రజాప్రభుత్వాన్ని కూలదోసింది. ప్రజలెన్నుకున్న నేత ఆంగ్‌సాంగ్ సూకీని అరెస్ట్ చేసి అధికారాన్ని చేజిక్కించుకుంది. ప్రజలెవరూ ప్రశ్నించడానికి, నిరసన ప్రదర్శనలు చేయడానికి వీధుల్లోకి రాకుండా యుద్ధట్యాంకుల్ని కవాతు చేయించింది. గగనతలంపై నుంచి బాంబులు జారవిడిచింది. సైన్యం కుట్రకు వ్యతిరేకంగా బిగిసిన పిడికిళ్లకు సంకెళ్లు వేసింది. గర్జించిన గళాలను అణిచివేసింది. ఇప్పటికి 800 మందికి పైగా ప్రదర్శనకారులు నియంత సైన్యం ‘జుంటా’ కాల్పుల్లో అమరులయ్యారు. బందీలుగా చిత్రహింసలు అనుభవిస్తూ తదిశ్వాస విడిచారు. ఈ ఘటనలన్నీ హటటున్‌ను కలచివేశాయి. ఆగ్రహోదగ్రురాలిని చేశాయి. అందాలరాణి కిరీటాన్ని పక్కనపెట్టి తుపాకీని చేతబట్టేలా ఆమెను ప్రేరేపించాయి. తనకు జన్మనిచ్చిన తల్లిని కాపాడుకోలేకపోతే తన జన్మే వృథా అనే ఆలోచనను ఆమెలో కలిగించాయి. ఇన్నాళ్లూ హటటున్‌ను ఒక అందాలరాణిగా మాత్రమే చూసిన మయన్మార్ యువత అత్యవసర సమయంలో ఆమెనొక పీపుల్స్ సోల్జర్‌గా చూసి సైనిక నియంతలపై తమ తిరుగుబాటుకు ఒక దివ్యాస్త్రం దొరికినట్లుగా భావిస్తున్నారు. కలిసికట్టుగా చేస్తున్న యుద్ధంలో హటటున్ ఇచ్చిన పిలుపు వారిలో ధైర్యాన్ని, సమరోత్సాహాన్ని రేకెత్తిస్తోంది. ‘‘తిప్పికొట్టేందుకు సమయం ఆసన్నమైంది. మీ చేతిలో ఉన్న ఆయుధం అది ఏమిటన్నది కాదు. కలం, కీబోర్డు, ప్రజాస్వామ్య ఉద్యమానికి విరాళాలు ఇవ్వడం.. ఏదైనా సరే. అది ఆయుధమే. విప్లవం విజయం సాధించడానికి ఎవరి వంతుగా వారు పోరాడాలి’’ అని హటటున్ సోషల్ మీడియాలో విప్లవ నినాదం చేశారు. ఆ వెంటనే మయన్మార్ సైనిక ప్రభుత్వం ఆమెపై నిఘాపెట్టింది. ఆమె ఏ ప్రదేశం నుంచి తిరుగుబాటును రాజేస్తున్నదీ ఇప్పటికే సైన్యం కనిపెట్టిందనీ, ఏ క్షణమైనా ఆమెను రహస్య నిర్బంధంలోకి తీసుకోవచ్చనీ ఐక్యరాజ్యసమితికి వర్తమానం అందినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి! అయితే సైన్యం బూట్లచప్పుడుకు బెదిరేది లేదని హటటున్ అంటున్నారు. ‘‘నా దేశం కోసం నా ప్రాణాన్ని మూల్యంగా చెల్లించడానికైనా నేను సిద్ధమే. ‘విప్లవం అనేది చెట్టుపైనే మగ్గి రాలిపడే ఆపిల్ పండు కాదు. ఆ పండును నువ్వే చెట్టుపై నుంచి రాలిపడేలా చెయ్యాలి’ అని చే గువేరా అన్నారు. ఆయన మాటల్ని మదిలో ఉంచుకుంటే మనం విజయం సాధించినట్లే..’’ అని మే 11న ఫేస్బుక్లో, ట్విట్టర్లో ఇచ్చిన ఒక పోస్టుతో యువతరంలో విప్లవస్ఫూర్తిని రగిలించే ప్రయత్నం చేశారు హటటున్. ∙∙ మయన్మార్‌లోని ప్రధాన నగరం యాంగూన్‌లో ఉండేవారు హటటున్. గత ఏప్రిల్‌లో అక్కడి నుంచి తన ఫ్రెండ్‌తో కలిసి అజ్ఞాత ప్రదేశానికి తరలి వెళ్లారు. అక్కడ కారెన్ నేషనల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్, యునైటెడ్ డిఫెన్స్ ఫోర్స్‌లతో కలిసి యుద్ధవిద్యల్లో శిక్షణ తీసుకుంటున్నారు. నెలా పదిరోజులు ఆమె ఆ శిక్షణలో ఉన్నట్లు సోషల్ మీడియా పోస్ట్‌లను బట్టి తెలుస్తోంది. -
మరోసారి సైన్యం కాల్పులు, 82 మంది మృతి!
యాంగూన్: మయన్మార్‌లో సైనిక పాలనకు వ్యతిరేకంగా ప్రజా నిరసనలను ఆర్మీ ఉక్కుపాదంతో అణచివేస్తోంది. ప్రజాస్వామ్య అనుకూలవాదులపై బాగో నగరంలో జరిపిన కాల్పుల్లో శనివారం ఒక్కరోజే 82 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వెలువడుతున్నాయి. అసిస్టెన్స్ అసోసియేషన్ ఫర్ పొలిటికల్ ప్రిజనర్స్ అనే స్వతంత్ర సంస్థ ఈ గణాంకాలు వెలువరించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా తెలిపింది. మయన్మార్ నౌ అనే వెబ్సైట్ కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తోంది. సైనికవాహనాల్లో మృతదేహాలను తీసుకెళ్లి పగోడా వద్ద పడేశారని తెలిపింది. ఆందోళ నకారులపైకి సైన్యం భారీ ఆయుధాలను, రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్లను, మోర్టార్లను ప్రయోగిస్తోందని పేర్కొంది. మార్చి 14న యాంగూన్‌లో జరిగిన కాల్పుల్లో 100 మంది వరకు మృతి చెందిన విషయం తెలిసిందే. -
ఒకే దేశం రెండు పేర్లు
బాంకాక్: మయన్మార్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చివేసి, అధికారాన్ని హస్తగతం చేసుకున్న సైన్యం, అక్కడ తిరిగి సైనిక పాలనకు అంకురార్పణ చేయడమే కాక గత నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన ఆంగ్‌సాంగ్ సూకీ, ఆమె అనుచరులను గృహనిర్భంధంలో ఉంచింది. పైగా మయన్మార్‌లో సైనిక పాలన విధించడం సబబేనని, ఆంగ్‌సాంగ్ సూకీ ప్రభుత్వం నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడడమే అందుకు కారణమని తన చర్యలను మయన్మార్ సైన్యం సమర్థించుకుంది. సుదీర్ఘ సైనిక పాలన అనంతరం నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఆంగ్‌సాంగ్ సూకీ ప్రభుత్వం విజయ దుందుభి మోగించిన విషయం తెలిసిందే. మయన్మారా? బర్మానా? నిజానికి ఈ సైనిక తిరుగుబాటు ఎక్కడ జరిగింది? అధికారికంగా ఈ దేశాన్ని మయన్మార్ అనాలా? లేక ఇప్పటికీ అమెరికా సంభోదిస్తున్నట్టు బర్మా అని పిలవాలా? దీనికి సమాధానం క్లిష్టమైన విషయమే. మయన్మార్‌లో ప్రతిదీ రాజకీయమే. భాషతో సహా. ఒకే దేశానికి రెండు పేర్లు ఎందుకు? ► ఆధిపత్య జుంటాలు, బర్మన్ జాతి ప్రజల ప్రజాస్వామిక తిరుగుబాటుని అణచివేసిన తరువాత, 1989లో ఈ దేశం పేరుని బర్మాకి బదులుగా మయన్మార్‌గా మార్చారు. అక్కడి ప్రభుత్వాన్ని సైనిక పాలకులు ‘‘యూనియన్ ఆఫ్ బర్మా’’కి బదులుగా ‘‘యూనియన్ ఆఫ్ మయన్మార్’’గా మార్చారు. పాత పేరు అనేక పురాతన జాతులెన్నింటినో విస్మరించిందన్న విమర్శలున్నాయి. ► నిజానికి ఈ పేరులో పెద్ద తేడా ఏమీ లేదు. అయితే సాహిత్యపరంగా చిన్న తేడా వుంది. ‘మయన్మార్’ ‘బర్మా’ అధికారిక వర్షన్. రెండు పేర్లూ అంతిమంగా అతిపెద్ద జాతి సమూహమైన బామర్ ప్రజలు మాట్లాడే భాషకి సంబంధించినవే. ఒకటి రెండు బామర్ కాని సమూహాలు ముఖ్యంగా బామర్ మైనారిటీలు ఇందులో మినహాయింపు. మన్మా అనే శబ్దం ఎలా ఉద్భవించింది అనే విషయంలో స్పష్టత లేదు. అయితే 9వ శతాబ్దంలో సెంట్రల్ ఇర్వాడి నదీ లోయలోకి ప్రవేశించిన ‘‘బామాస్’’ పాగన్ రాజ్యాన్ని స్థాపించారు. అలాగే తమని తాము మన్మా అని సంభోదించుకున్నారు. ఆ తరువాత 1989లో ఈ దేశం పేరుని ఇంగ్లీషులో మయన్మార్‌గా మార్చారు. ప్రపంచంలోని చాలా మంది ఈ పేరుతో పిలవడాన్ని తిరస్కరించారు. ఈ మార్పు ఎప్పుడు జరిగింది? ► దేశం ప్రజాస్వామ్యం వైపు అడుగులు వేస్తోన్న తరుణంలో దశాబ్దం క్రితం ఈ పేరుని మార్పు చేశారు. బర్మాలో సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకొని, అత్యధిక రాజకీయాధికారాలను దక్కించుకుంది. అయితే ప్రతిపక్ష నాయకులు జైలు నుంచి విడుదలై గృహనిర్భంధంలో ఉన్నారు. ఈ సందర్భంలో ఎన్నికలకు అనుమతిచ్చారు. సుదీర్ఘకాలంగా ప్రజాస్వామ్యం కోసం పోరాడుతోన్న ఆంగ్‌సాంగ్ సూకీ ఈ ఎన్నికల్లో దేశానికి నాయకురాలయ్యారు. ► చాలా ఏళ్ళ పాటు చాలా దేశాలు, అసోసియేషన్ ప్రెస్‌తో సహా మీడియా అంతా ఈ దేశాన్ని అధికారికపు పేరుతోనే పిలవడం ప్రారంభించారు. నిర్భంధం, ఆంక్షలు తగ్గి, మిలిటరీ పాలనకు అంతర్జాతీయంగా పెద్దగా వ్యతిరేకత లేకపోవడంతో ‘‘మయన్మార్’’ పేరు కామన్‌గా మారిపోయింది. దేశంలోని ప్రతిపక్షాలు మాత్రం తమకు ఈ విషయంలో పెద్ద పట్టింపు లేదని తేల్చి చెప్పారు. అయితే మొత్తం ప్రపంచానికి భిన్నంగా అమెరికా ప్రభుత్వం మాత్రం ఈ దేశాన్ని ‘బర్మా’ పేరుతోనే పిలుస్తూండడం విశేషం. ► 2012లో అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ఈ దేశాన్ని సందర్శించినప్పుడు బర్మా, మయన్మార్ రెండు పేర్లతో సంభోదించారు. మయన్మార్ అధ్యక్షులు దీన్ని చాలా అనుకూలంగా భావించారు. ఇప్పుడేంటి? సైనిక తిరుగుబాటుపై అమెరికా విమర్శలు కురిపిస్తోంది. అమెరికా స్టేట్ సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్, అధ్యుడు జో బైడెన్లు దేశం యొక్క చట్టబద్దమైన పేరుని కావాలనే విస్మరిస్తున్నారని భావిస్తున్నారు. బర్మాలో ప్రజాస్వామ్య పురోగతి నేపథ్యంలో బర్మాపై దశాబ్ద కాలంగా అమెరికా ఆంక్షలను సడలించింది. అయితే తిరిగి ఆ ఆంక్షల కొనసాగింపు అవసరాన్ని అమెరికా పునరాలోచిస్తోంది. -
మాలిలో మూడేళ్ల పాటు సైనిక పాలనే : జుంటా
మాలి : అధికారాన్ని చేజిక్కించుకున్న జుంటా.. సైనిక నేతృత్వంలోనే మూడేళ్లపాటు పరిపాలన కొనసాగనున్నట్లు వెల్లడించింది. ఇందుకు బదులుగా అపహరణకు గురైన మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం బౌబాకర్ కీతాను విడుదల చేయడానికి అంగీకరించినట్లు ప్రతినిధుల బృందం తెలిపింది. మాలిలో మూడేళ్లపాటు సైనిక నేతృత్వంలోని ఒక సంస్థ నాయకత్వం వహిస్తుందని అతనే దేశాధినేతగా కొనసాగుతాడు అని జుంటా స్పష్టం చేసింది. గత కొన్నాళ్లుగా తిరుగుబాటు జండా ఎగరవేస్తున్న.. జుంటా పలువురు రాజకీయ నాయకులను అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం అధికారాన్ని చేజిక్కించుకున్న నేపథ్యంలో కీతాను విడుదల చేస్తామని అంతేకాకుండా అతను చికిత్స నిమిత్తం విదేశాలకు కూడా వెళ్లవచ్చునని పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. (మూతి పగులగొడతా: బ్రెజిల్ అధ్యక్షుడు) ఇక దేశంలో నిరసనసెగలు వెల్లువెత్తుతున్న వేళ ముందు జాగ్రత్త చర్యగా ప్రధాని బౌబౌ సిస్సేను సురక్షిత ప్రాంతానికి తరలించారు. బౌబాకర్ కీతను అదుపులోకి తీసుకోవడంతో సిస్పేకు భయం పట్టుకుందంటూ ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. జుంటా చర్యకు మద్ధతుగా ప్రతిపక్ష నేతలు సంబురాలు జరుపుకున్నారు. గత ఎనిమిదేళ్ల కాలంలో మాలిలో నాయకత్వంపై తిరుగుబాటు జరగడం ఇది రెండోసారి. ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతున్నా ఏమీ చేయలేని అసమర్థ అధ్యక్షుడు కీత రాజీనామా చేయాలని పిలుపునిచ్చారు. గత కొన్ని నెలలుగా ప్రభుత్వంపై తిరుగుబాటు పెరగడంతో ప్రజల కోసమే జుంటా పనిచేస్తుందని ప్రకటించుకుంది. ఈ నేపథ్యంలో తగిన సమయంలో ఎన్నికలను నిర్వహిస్తామని ప్రతిజ్ఞ చేసింది. రాజ్యాంగ సంక్షేమమే లక్ష్యంగా జుంటా పనిచేస్తుందని తెలిపింది. అయితే కొందరు మద్దతుదారులు మాత్రం కీతానే తిరిగి అధ్యక్షుడిగా నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. (కోమాలోకి కిమ్ జోంగ్ ఉన్.. సోదరికి అధ్యక్ష బాధ్యతలు!) -
అక్కడ ఏ చట్టాలూ పని చేయడంలేదు
► ఛత్తీస్‌గఢ్‌లో సైనిక పాలన సాగుతోంది ► ఆదివాసీ ఉద్యమనాయకురాలు సోనీసోరి సాక్షి, హైదరాబాద్: ‘‘హమ్ మర్‌జాయేంగే లేకిన్ జమీన్ నహీ దేంగే’’... ఇదే ఇప్పుడు ఛత్తీస్‌గఢ్ బస్తర్ ప్రాం తంలోని బుర్కాపాల్ గ్రామ మహిళల నినాద మని ఆ రాష్ట్ర ఆదివాసీ ఉద్యమ నాయకురాలు సోనీసోరి చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌లో ఇప్పుడు ఏ చట్టాలూ, న్యాయ వ్యవస్థా పనిచేయడంలేదని, సైనిక పాలన కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అడుగడుగునా పోలీసు క్యాంపులు, వారి లైంగిక వేధింపులతో అక్కడి ఆదివాసీ స్త్రీలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. అయి నా వారి భూముల కోసం ధైర్యంగా పోరాడు తూనే ఉన్నారన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ప్రజాస్వామిక హక్కుల సమన్వయ సంస్థ దశాబ్ది ఉద్యమ అఖిల భారత సదస్సు జరిగింది. సీనియర్ జర్నలిస్టు రత్నమాల అధ్యక్షతన ప్రజా ఉద్యమాలపై ప్రభుత్వ అణచివేతకు వ్యతిరేకంగా నిర్వహిం చిన ఈ సదస్సులో సోనీసోరి మాట్లాడారు. బుర్కాపాల్‌లో 40 మంది మగవారిని పోలీసు లు ఇళ్ల నుంచి పట్టుకుపోయి, వారిపై మావో యిస్టులంటూ కేసులు బనాయించి, జైల్లో పెట్టారన్నారు. వీరిలో ఏడుగురి జాడ లేదన్నా రు. మగవారు జైలు పాలవ్వడంతో ఇప్పుడు ఆ భూములు దున్నుకుంటున్న స్త్రీలను పోలీసులు కొట్టి, లైంగిక దాడులతో వేధిస్తున్నారన్నారు. ఊర్లన్నీ తగులబెట్టి, ఆదివాసీలను పిట్టలను కాల్చినట్టు కాల్చి ఇప్పుడు నక్సలైట్లతో శాంతి చర్చలంటూ ప్రభుత్వం దొంగ మాటలు చెబుతోందని సోనీసోరి ఆరోపించారు. చేయని నేరానికి ఏడేళ్ల జైలు... నా చెల్లెళ్లకు గోరింటాకు పెడుతుంటే హఠాత్తుగా పోలీసు లు వచ్చి నన్ను పట్టుకుపోయారు. చెల్లెళ్లతో పాటు, అక్కడున్న పిల్లలు భయంతో పరుగులు పెట్టారు. 20 రోజులు పోలీస్ స్టేషన్లో నిర్బంధించి, చిత్రహింసలు పెట్టి, అత్యాచారం చేశారు. చేయని నేరానికి ఏడేళ్లు నన్ను జైల్లో పెట్టారు. అక్కడ నా లాంటి వారెందరో ఉన్నారు. మావోయిస్టులనే ముద్ర వేసి అత్యాచారాలు చేస్తున్నారు. – హిడిమె, దంతెవాడ ఆదివాసీ, ఛత్తీస్‌గఢ్ పాత్రికేయులపై దాడులు అక్కడ జరుగుతున్న వాస్త వాలను వెలికితీయాలని చూస్తున్న పాత్రికేయులపై దాడులకు తెగబ డుతున్నారు. బస్తర్‌లో పాత్రికేయు లు, హక్కుల నేతలను అక్రమంగా జైలుపాలు చేస్తున్నారు. ఏ చట్టా లూ అక్కడ పనిచేయవు. ఆదివాసీలకు రక్షణా లేదు. – మాలిని సుబ్రహ్మణ్యం, పాత్రికేయురాలు మిలిటరీ పాలన... ఛత్తీస్‌గఢ్‌లో మానవహక్కు లను అణచివేస్తూ మిలిటరీ పాలన సాగిస్తున్నారు. అత్యాచారాలు అక్కడ నిత్యకృత్యం. పాల్నార్ లోని గురుకుల పాఠశాలలో సీఆర్పీఎఫ్ జవాన్లు పోలీసు అధి కారుల సమక్షంలోనే చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడ్డారంటే అక్కడ పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. – బేలా భాటియా, సామాజిక కార్యకర్త ప్రశ్నించడమే మహానేరం అడుగంటిపోతోన్న పౌరహ క్కుల గురించి ప్రశ్నించడమే ఛత్తీస్ గఢ్‌లో మహానేరం. ప్రశ్నిస్తే ఏం చేయడానికైనా సైన్యం, పోలీసులు వెనుకాడరు. అక్కడ జరుగుతున్న అత్యాచారాలు, ఎన్కౌంటర్ల పేరుతో హత్యలు అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఈ ఘోరాలు వెలికితీసేందుకు వెళ్లిన నిజనిర్ధారణ కమిటీవారిని, హక్కుల నేతలను నిర్బంధించారు. – చిలుకా చంద్రశేఖర్, సీఎల్సీ ఏపీ నాయకుడు -
సైనిక పాలనకు వ్యతిరేకం: ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లో సైనిక పాలనకు తాను వ్యతిరేకమని పాకిస్థాన్ తెహ్రరిక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ అన్నారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు సైనిక పాలన పరిష్కారం కాదని ఆయన అన్నారు. సైనిక పాలనకు ఇమ్రాన్ మొగ్గు చూపుతున్నారని వస్తున్న వార్తలను ఇమ్రాన్ ఖండించారు. హింసాత్మక సంఘటల్ని తాము కోరుకోవడం లేదని ఇస్లామాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తెలిపారు. ప్రజల ఆందోళనలు, నిరసనల్ని అడ్డుకోలేక విఫలమైన పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ సైనిక పాలన వైపుకు అడుగులేస్తున్నారని ఇమ్రాన్ ఆరోపించారు. ప్రజల హక్కులను సైనిక పాలన ద్వారా అణిచివేయాలని చూస్తే ఊరుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు.