ఒకే దేశం రెండు పేర్లు | Special Story of different names on Myanmar-Burma | Sakshi
Sakshi News home page

ఒకే దేశం రెండు పేర్లు

Published Sun, Feb 7 2021 4:57 AM | Last Updated on Sun, Feb 7 2021 10:09 AM

Special Story of different names on Myanmar-Burma - Sakshi

బాంకాక్‌: మయన్మార్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చివేసి, అధికారాన్ని హస్తగతం చేసుకున్న సైన్యం, అక్కడ తిరిగి సైనిక పాలనకు అంకురార్పణ చేయడమే కాక గత నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన ఆంగ్‌సాంగ్‌ సూకీ, ఆమె అనుచరులను గృహనిర్భంధంలో ఉంచింది. పైగా మయన్మార్‌లో సైనిక పాలన విధించడం సబబేనని, ఆంగ్‌సాంగ్‌ సూకీ ప్రభుత్వం నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడడమే అందుకు కారణమని తన చర్యలను మయన్మార్‌ సైన్యం సమర్థించుకుంది. సుదీర్ఘ సైనిక పాలన అనంతరం నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఆంగ్‌సాంగ్‌ సూకీ ప్రభుత్వం విజయ దుందుభి మోగించిన విషయం తెలిసిందే.  

మయన్మారా? బర్మానా?  
నిజానికి ఈ సైనిక తిరుగుబాటు ఎక్కడ జరిగింది? అధికారికంగా ఈ దేశాన్ని మయన్మార్‌ అనాలా? లేక ఇప్పటికీ అమెరికా సంభోదిస్తున్నట్టు బర్మా అని పిలవాలా? దీనికి సమాధానం క్లిష్టమైన విషయమే. మయన్మార్‌లో ప్రతిదీ రాజకీయమే. భాషతో సహా.  

ఒకే దేశానికి రెండు పేర్లు ఎందుకు?
► ఆధిపత్య జుంటాలు, బర్మన్‌ జాతి ప్రజల ప్రజాస్వామిక తిరుగుబాటుని అణచివేసిన తరువాత, 1989లో ఈ దేశం పేరుని బర్మాకి బదులుగా మయన్మార్‌గా మార్చారు. అక్కడి ప్రభుత్వాన్ని సైనిక పాలకులు ‘‘యూనియన్‌ ఆఫ్‌ బర్మా’’కి బదులుగా ‘‘యూనియన్‌ ఆఫ్‌ మయన్మార్‌’’గా మార్చారు. పాత పేరు అనేక పురాతన జాతులెన్నింటినో విస్మరించిందన్న విమర్శలున్నాయి.

► నిజానికి ఈ పేరులో పెద్ద తేడా ఏమీ లేదు. అయితే సాహిత్యపరంగా చిన్న తేడా వుంది. ‘మయన్మార్‌’ ‘బర్మా’ అధికారిక వర్షన్‌. రెండు పేర్లూ అంతిమంగా అతిపెద్ద జాతి సమూహమైన బామర్‌ ప్రజలు మాట్లాడే భాషకి సంబంధించినవే. ఒకటి రెండు బామర్‌ కాని సమూహాలు ముఖ్యంగా బామర్‌ మైనారిటీలు ఇందులో మినహాయింపు. మన్మా అనే శబ్దం ఎలా ఉద్భవించింది అనే విషయంలో స్పష్టత లేదు. అయితే 9వ శతాబ్దంలో సెంట్రల్‌ ఇర్వాడి నదీ లోయలోకి ప్రవేశించిన ‘‘బామాస్‌’’ పాగన్‌ రాజ్యాన్ని స్థాపించారు. అలాగే తమని తాము మన్మా అని సంభోదించుకున్నారు. ఆ తరువాత 1989లో ఈ దేశం పేరుని ఇంగ్లీషులో మయన్మార్‌గా మార్చారు. ప్రపంచంలోని చాలా మంది ఈ పేరుతో పిలవడాన్ని తిరస్కరించారు.  


ఈ మార్పు ఎప్పుడు జరిగింది?  
► దేశం ప్రజాస్వామ్యం వైపు అడుగులు వేస్తోన్న తరుణంలో దశాబ్దం క్రితం ఈ పేరుని మార్పు చేశారు. బర్మాలో సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకొని, అత్యధిక రాజకీయాధికారాలను దక్కించుకుంది. అయితే ప్రతిపక్ష నాయకులు జైలు నుంచి విడుదలై గృహనిర్భంధంలో ఉన్నారు. ఈ సందర్భంలో ఎన్నికలకు అనుమతిచ్చారు. సుదీర్ఘకాలంగా ప్రజాస్వామ్యం కోసం పోరాడుతోన్న ఆంగ్‌సాంగ్‌ సూకీ ఈ ఎన్నికల్లో దేశానికి నాయకురాలయ్యారు.  

► చాలా ఏళ్ళ పాటు చాలా దేశాలు, అసోసియేషన్‌ ప్రెస్‌తో సహా మీడియా అంతా ఈ దేశాన్ని అధికారికపు పేరుతోనే పిలవడం ప్రారంభించారు. నిర్భంధం, ఆంక్షలు తగ్గి, మిలిటరీ పాలనకు అంతర్జాతీయంగా పెద్దగా వ్యతిరేకత లేకపోవడంతో ‘‘మయన్మార్‌’’ పేరు కామన్‌గా మారిపోయింది. దేశంలోని ప్రతిపక్షాలు మాత్రం తమకు ఈ విషయంలో పెద్ద పట్టింపు లేదని తేల్చి చెప్పారు. అయితే మొత్తం ప్రపంచానికి భిన్నంగా అమెరికా ప్రభుత్వం మాత్రం ఈ దేశాన్ని ‘బర్మా’ పేరుతోనే పిలుస్తూండడం విశేషం.  

► 2012లో అమెరికా అధ్యక్షుడు బారక్‌ ఒబామా ఈ దేశాన్ని సందర్శించినప్పుడు బర్మా, మయన్మార్‌ రెండు పేర్లతో సంభోదించారు. మయన్మార్‌ అధ్యక్షులు దీన్ని చాలా అనుకూలంగా భావించారు.   


ఇప్పుడేంటి?  
సైనిక తిరుగుబాటుపై అమెరికా విమర్శలు కురిపిస్తోంది. అమెరికా స్టేట్‌ సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్, అధ్యుడు జో బైడెన్‌లు దేశం యొక్క చట్టబద్దమైన పేరుని కావాలనే విస్మరిస్తున్నారని భావిస్తున్నారు. బర్మాలో ప్రజాస్వామ్య పురోగతి నేపథ్యంలో బర్మాపై దశాబ్ద కాలంగా అమెరికా ఆంక్షలను సడలించింది. అయితే తిరిగి ఆ ఆంక్షల కొనసాగింపు అవసరాన్ని అమెరికా పునరాలోచిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement