‘ప్రభుత్వం ప్రజలకు భయపడినంతకాలం స్వేచ్ఛ ఉంటుంది...ప్రజలు ప్రభుత్వానికి భయపడితే నియంతృత్వం తప్పదు’ అని ఒక రాజనీతిజ్ఞుడు అంటాడు. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సెక్–యోల్ మంగళవారం హఠాత్తుగా దేశంలో విధించిన సైనికపాలన కాస్తా జనం తిరగబడేసరికి కేవలం ఆరు గంటల్లో తోకముడిచిన తీరు దాన్ని మరోసారి అందరికీ గుర్తుచేసింది. వచ్చే నెలనుంచి డోనాల్డ్ ట్రంప్ ఏలుబడిని చవిచూడబోతున్న అమెరికా ప్రజానీకం మొదలు దేశదేశాల పౌరులూ ఈ ప్రహసనం నుంచి చాలా నేర్చుకోవచ్చు.
‘రాజ్య వ్యతిరేక శక్తుల్ని సాధ్యమైనంత త్వరగా ఏరిపారేసి దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పడానికి’ ఎమర్జెన్సీ విధింపు, సైనిక పాలన తప్పనిసరయినట్టు రాత్రి పొద్దుపోయాక యూన్ ప్రకటించారు. పొరుగునున్న శత్రు దేశం ఉత్తరకొరియాకు చెందిన కమ్యూనిస్టు పాలకులతో కుమ్మక్కయిన విపక్షాలు దేశాన్ని అస్థిరపరచాలని చూస్తున్నాయని ఆరోపించారు. కానీ రోడ్లపైకొచ్చిన సైనికులకు దేశమంతా ప్రతిఘటన ఎదురవుతున్నట్టు, నిరసనోద్యమాలు తారస్థాయికి చేరినట్టు అందిన సమాచారంతో బెంబేలెత్తిన ఆయన సైనికపాలనను ఎత్తేస్తున్నట్టు తెల్లారుజామున నాలుగుగంటలప్రాంతంలో తెలియజేయాల్సివచ్చింది.
పార్లమెంటు భవనంలోకి ప్రవేశించటానికి ప్రయత్నించిన సైనికులను జనం తరిమికొట్టడంతో ఆయనకు తత్వం బోధపడింది. విపక్షం తీసుకురాబోతున్న అవిశ్వాస తీర్మానంతో తనకు పదవీభ్రష్టత్వం తప్పదనుకుని హడావిడిగా వేసిన సైనిక పాలన ఎత్తుగడ కాస్తా వికటించి ఆయన రాజకీయ భవిష్యత్తుకు పూర్తిగా తలుపులు మూసేసింది. 2027 వరకూ ఉండాల్సిన అధ్యక్షపదవి మరికొన్ని రోజుల్లో ఊడటం ఖాయమన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
మితవాద పీపుల్ పవర్ పార్టీ (పీపీపీ) తరఫున 2022 ఎన్నికల్లో పోటీచేసేనాటికి యూన్ అనామకుడు. అప్పటికి హద్దులు దాటిన ద్రవ్యోల్బణం, ప్రజల్లో ప్రభుత్వంపై ఏర్పడ్డ తీవ్ర అసంతృప్తి ఆసరాగా చేసుకుని ఆయన అధ్యక్షుడిగా విజయం సాధించాడు. అయితే ప్రత్యర్థి డెమాక్రటిక్ పార్టీ అభ్యర్థి లీ జే–మ్యుంగ్ కన్నా ఆయనకు కేవలం ఒక శాతం ఓట్లు అధికంగా వచ్చాయి. మ్యుంగ్ సఫాయి కార్మికుడి కుమారుడు.
సంపన్నవంతమైన దక్షిణ కొరియాకు అసలు సమస్యలేమిటన్న సందేహం అందరికీ వస్తుంది. దాని తలసరి ఆదాయం 36,000 డాలర్లు. పొరుగునున్న చైనాతో పోల్చినా ఇది మూడు రెట్లు అధికం. అంతర్జాతీయ మార్కెట్లో మెరిసిపోయే బ్రాండ్లకు అది పుట్టినిల్లు. శామ్‌సంగ్, హ్యుందయ్, కియా, పోక్సో, ఎల్‌జీ, ఎస్‌కే... ఒకటేమిటి రకరకాల సంస్థల స్థావరం ఆ దేశం. వీటిలో 600 కంపెనీల వరకూ మన దేశంతోసహా చాలా దేశాల్లో వ్యాపారాలు సాగిస్తున్నాయి. దక్షిణ కొరియా ప్రపంచంలోనే ఆరో అతి పెద్ద ఎగుమతిదారు.
ఆసియాలో అది నాలుగో అతి పెద్ద ఆర్థికవ్యవస్థ. 2009నాటి ఆర్థికమాంద్యాన్ని దక్షిణకొరియా తన దరిదాపులకు రానీయలేదు. అయినా ఏదో తెలియని వెలితి ప్రజలను నిరాశానిస్పృహల్లో ముంచింది. వృద్ధుల శాతం క్రమేపీ పెరగటం, జననాల సంఖ్య పడిపోవటం సమస్యగా మారింది. అధిక పనిగంటల వల్ల మానసిక ఒత్తిళ్లు అధికం కావటం, పెళ్లిళ్లు వాయిదా వేసుకోవటం, దంపతులు సైతం కలిసుండే గంటలు తగ్గిపోవటం వంటివి ఇందుకు కారణాలు. కానీ యూన్ దీన్ని మరో కోణంలో చూశారు.
ఫెమినిస్టు ఉద్యమాలే ఈ స్థితికి కారణమంటున్న ఉద్యమాలను వెనకేసుకొచ్చారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బహిరంగంగా స్త్రీ ద్వేషాన్ని చాటుకున్నారు. అధికారం చేతికి రాగానే లింగ సమానత్వాన్ని పర్యవేక్షించే సంస్థను రద్దుచేశారు. మహిళలకుండే వెసులుబాట్లు కొన్ని రద్దుచేశారు. పైగా వారానికి 52 గంటల పనిని కాస్తా పెంచే ప్రయత్నం చేశారు. వైద్యరంగ ప్రక్షాళన పేరిట దాన్ని అస్తవ్యçస్తం చేశారు. పర్యవసానంగా దేశం సమ్మెలతో హోరెత్తింది. దీనికితోడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎడాపెడా అవినీతికి పాల్పడ్డారు.
కనుకనే మొన్న ఏప్రిల్‌లో 300 స్థానాలుగల నేషనల్ అసెంబ్లీకి ఎన్నికలు జరిపినప్పుడు భారీ స్థాయిలో 67 శాతంమంది పోలింగ్‌లో పాల్గొన్నారు. విపక్షమైన డెమాక్రటిక్ పార్టీకి 180 స్థానాలు రాగా, అధికారపక్షం 108 స్థానాలకు పరిమితమైంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై కూడా గత సైనిక పాలకుల్ని కీర్తించటం యూన్ ఒక అలవాటుగా చేసుకున్నారు. వారివల్లే దేశ ఆర్థికవ్యవస్థ పటిష్ఠంగా ఉన్నదని ఆయన నిశ్చితాభిప్రాయం. ఇందుకు భిన్నంగా ప్రజలంతా ఆనాటి నియంతృత్వాన్ని మరిచిపోలేకపోయారు.
1987కు ముందున్న సైనిక పాలన తెచ్చిన అగచాట్లు గుర్తుండబట్టే యూన్ ప్రకటన వెలువడిన వెంటనే జనం వరదలై పోటెత్తారు. ప్రజల మద్దతు గమనించినందు వల్లే అధికార, విపక్ష ఎంపీలు పార్లమెంటుకు బారులు తీరారు. ప్రధానద్వారాన్ని సైనికులు మూసేయగా జనం సాయంతో స్పీకర్‌తో సహా అందరూ గోడలు దూకి, కిటికీలు బద్దలుకొట్టి భవనంలోకి ప్రవేశించారు. సైనిక పాలన వెనక్కు తీసుకోవాలంటూ అధ్యక్షుణ్ణి కోరే తీర్మానాన్ని హాజరైన 190మంది ఎంపీలు ఏకగ్రీవంగా ఆమోదించారు.
శత్రు దేశాలను చూపించి, కమ్యూనిస్టుల పేరు చెప్పి ఇష్టారాజ్యంగా ప్రవర్తించే శకం ముగిసిందని దక్షిణ కొరియా ఉదంతం చెబుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో సమస్యలుండటం తప్పనిసరి. కానీ వాటిని సాకుగా చూపి అందరినీ మభ్యపెట్టి అధికారంలోకొచ్చాక నియంతృత్వ పోకడలకు పోతే చెల్లదని జనం చాటారు. యూన్ ఏలుబడి ఎప్పుడు ముగుస్తుందన్న సంగతి అలావుంచితే, ప్రజలు ఇదే చైతన్యాన్ని కొనసాగించగలిగితే భవిష్యత్తులో అక్కడ ఏ పాలకుడూ నియంతగా మారే ప్రమాదం ఉండదు.
Comments
Please login to add a commentAdd a comment