PPP
-
‘ఇమ్రాన్‌కు పోటీగా విపక్షాల అభ్యర్థి’
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ఈ నెల 11న పాకిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనుండగా ఆయనకు వ్యతిరేకంగా విపక్ష పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఇందుకోసం ప్రత్యర్థి పార్టీలైనా నవాజ్ షరీఫ్‌కు చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగ్- నవాజ్(పీఎంఎల్-ఎన్) పార్టీ, బెనర్జీర్ భుట్టో కుమారుడి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ)లు ఏకతాటిపైకి వచ్చాయి. ఇతర చిన్న పార్టీలను కలుపుకొని విపక్ష కూటమిని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాయి. గురువారం రెండు పార్టీల నేతలు మాట్లాడుతూ.. పార్లమెంటులో ఇమ్రాన్‌కు పోటీగా విపక్ష కూటమి తరఫున అభ్యర్థిని నిలుపడానికి ప్రయత్నిస్తున్నట్టు ప్రకటించారు. ఎన్నికల్లో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగానే ఈ కూటమి ఏర్పాటు జరిగిందని పీఎంఎల్-ఎన్ పార్టీ నేత మర్యమ్ ఔరంగజేబు తెలిపారు. ఎన్నికలు జరిగనప్పటి నుంచి పీఎంఎల్-ఎన్, పీపీపీ పార్టీలు ఇమ్రాన్ రిగ్గింగ్‌కు పాల్పడినట్టు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, జూలై 25న జరిగిన సాధారణ ఎన్నికల్లో ఇమ్రాన్ పార్టీ 116 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటుకు ఇతరుల మద్దతు కూడగట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఇందుకోసం కొన్ని చిన్న పార్టీలు, పలువురు ఇండిపెండెట్ల మద్దతుతో ఇమ్రాన్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధపడ్డారు.విపక్షాలు ఎంతగా ప్రయత్నించిన ఇమ్రాన్ ప్రధాని కాకుండా అడ్డుకోవడం కష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ఇన్ఫ్రాకు పెద్దపీట..
- అదనంగా రూ. 70,000 కోట్ల కేటాయింపులు - ఎన్ఐఐఎఫ్ ఏర్పాటు ‘పీపీపీ’ ప్రాజెక్టులకు ఊతం న్యూఢిల్లీ: వృద్ధి ఆశలతో పొంతన లేకుండా ఉన్న మౌలిక సదుపాయాలను మెరుగుపర్చే చర్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దృష్టి పెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2015-16లో అదనంగా రూ. 70,000 కోట్లు కేటాయిస్తున్నట్లు బడ్జెట్లో పేర్కొన్నారు. ప్రభుత్వం ముందున్న అయిదు ప్రధాన సవాళ్లలో.. ఇన్ఫ్రా రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం కూడా ఒకటని ఆయన చెప్పారు. ఈ రంగ వృద్ధికి ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) ప్రాతిపదికన ప్రాజెక్టులకు ఊతమివ్వాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. రహదారుల నిర్మాణానికి రూ. 14,031 కోట్ల మేర, రైల్వేలకు రూ. 10,050 కోట్ల మేర స్థూలంగా బడ్జెట్లో కేటాయింపులు పెంచినట్లు జైట్లీ చెప్పారు. మొత్తం మీద ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడులు రూ. 3,17,889 కోట్ల స్థాయిలో ఉంటాయని... 2014-15తో పోలిస్తే ఇది సుమారు రూ. 80,844 కోట్ల పెరుగుదలని వివరించారు. జాతీయ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ..: మౌలిక రంగానికి ఊతం ఇచ్చే దిశగా జాతీయ పెట్టుబడి, మౌలిక సదుపాయాల నిధి(ఎన్ఐఐఎఫ్)ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు జైట్లీ చెప్పారు. దీనికి ఏటా రూ. 20,000 కోట్ల మేర నిధులు దక్కేలా చూడనున్నట్లు వివరించారు. ఇది ఐఆర్ఎఫ్సీ, ఎన్‌హెచ్‌బీ వంటి మౌలిక సదుపాయాల ఫైనాన్స్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయగలదని తద్వారా ఇన్ఫ్రా సంస్థలకు నిధులు లభించగలవని పేర్కొన్నారు. రైలు, రహదారులు, నీటి పారుదల రంగ ప్రాజెక్టులకు సంబంధించి పన్నురహిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ల జారీని కూడా అనుమతించే ప్రతిపాదన పరిశీలనలో ఉందని జైట్లీ చెప్పారు. పీపీపీ విధానాన్ని సమీక్షించి, పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు రూ. 1 లక్ష కోట్ల పెట్టుబడితో కొత్తగా మరో 5 అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు తెలిపారు. గ్రామగ్రామానికీ రహదారులు..: ప్రస్తుతం రహదారి సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉన్న 1,78,000 పైచిలుకు ప్రాంతాలకు రోడ్ల నిర్మాణంపై దృష్టి పెడుతున్నట్లు జైట్లీ తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే నిర్మాణంలో ఉన్న లక్ష కిలోమీటర్ల రహదారులతో పాటు మరో లక్ష కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందన్నారు. ఇక పెట్రోలు, డీజిల్‌పై ప్రస్తుతం విధిస్తున్న ఎక్సైజ్ సుంకంలో కొంత భాగాన్ని రోడ్డు సెస్సు కింద మార్చాలని, ఈ నిధులను రహదారులు ఇతర ఇన్ఫ్రా ప్రాజెక్టుల నిర్మాణానికి ఉపయోగించాలని యోచిస్తున్నట్లు జైట్లీ చెప్పారు. -
ప్రపంచ స్థాయి ఇన్ఫ్రాలో 6 దేశీ ప్రాజెక్టులు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా వినూత్న ఇన్ఫ్రా ప్రాజెక్టుల్లో ఆరు దేశీ ప్రాజెక్టులు చోటు దక్కించుకున్నాయి. ఇందులో హైదరాబాద్‌కి చెందిన దిగ్గజం మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఎంఈఐఎల్) చేపట్టిన నర్మదా కెనాల్ సోలార్ ప్రాజెక్టు కూడా ఉంది. ఇదే కాకుండా ఢిల్లీ మెట్రో, యమునా ఎక్స్‌ప్రెస్‌వే, టాటా పవర్‌కి చెందిన ముంద్రా అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు (గుజరాత్), ఇంటర్‌సెప్టర్ స్యూవేజ్ సిస్టమ్, గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-సిటీ (గిఫ్ట్) ఈ జాబితాలో ఉన్నాయి. అత్యంత ప్రభావం చూపగలిగే వినూత్నమైన ప్రాజెక్టులతో ‘ఇన్ఫ్రాస్ట్రక్చర్ 100’ పేరిట అంతర్జాతీయ అకౌంటింగ్ సంస్థ కేపీఎంజీ ఈ జాబితాను తయారు చేసింది. ప్రాజెక్టు వ్యయం, సంక్లిష్టత, సాధ్యాసాధ్యాలు, నవ్యత, సమాజంపై ప్రభావం అంశాల ప్రాతిపదికగా దీన్ని రూపొందించినట్లు కేపీఎంజీ వివరించింది. న్యూఢిల్లీ, ఆగ్రాను కలుపుతూ దాదాపు 165 కిలోమీటర్ల పొడవుండే ఆరు లేన్ల యమునా ఎక్స్‌ప్రెస్‌వే 2012లో ప్రారంభమైంది. దీని నిర్మాణానికి 1.9 బిలియన్ డాలర్ల వ్యయం అయ్యింది. ప్రపంచ స్థాయి ఇన్ఫ్రాను అభివృద్ధి చేయగలిగే సత్తా భారత్‌కి ఉందని ఇది చాటిచెప్పగలదని కేపీఎంజీ వివరించింది. మరోవైపు, 2.3 బిలియన్ డాలర్ల వ్యయంతో ఏర్పాటైన ఢిల్లీ మెట్రో ఎప్పటికప్పుడు సవాళ్లను అధిగమిస్తూ మరింతగా విస్తరిస్తోందని పేర్కొంది. 4.4 బిలియన్ డాలర్ల ముంద్రా అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు.. భారత విద్యుత్ రంగంలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టుల్లో మైలురాయిలాంటిదని కేపీఎంజీ తెలిపింది. ఇక గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీని 20 బిలియన్ డాలర్ల వ్యయంతో త లపెట్టారు. దాదాపు 400 వైవిధ్యమైన ప్రాజెక్టులను పరి శీలించి కేపీఎంజీ 100 సంస్థలను ఎంపిక చేసింది. ఎంఈఐఎల్ ప్రాజెక్టు..: 17.9 మిలియన్ డాలర్ల వ్యయంతో కూడిన నర్మదా కెనాల్ సౌర విద్యుత్ ప్రాజెక్టును ఎంఈఐఎల్ చేపట్టింది. కాంట్రాక్టులో భాగంగా దాదాపు 5.5 కిలోమీటర్ల పొడవునా కెనాల్‌పై సోలార్ ఫొటోవోల్టయిక్ గ్రిడ్‌ను ఏర్పాటు చేసి, 25 సంవత్సరాల పాటు నిర్వహించాల్సి ఉంటుంది. ఇది ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టు. -
80% భూమి సేకరించాకే హైవే ప్రాజెక్టులు
న్యూఢిల్లీ: జాతీయ రహదారుల ప్రాజెక్టులకు అవసరమైన భూమిలో కనీసం 80 శాతాన్ని సేకరించకుండా ఆయా ప్రాజెక్టులకు టెండర్లు పిలవబోమని కేంద్ర రహదారి రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన బుధవారం ఇక్కడ జరిగిన ఫిక్కీ సదస్సులో తెలిపారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో కనీసం 10 శాతం భూమిని కూడా సేకరించకుండానే ప్రాజెక్టులు మొదలుపెట్టారనీ, రహదారుల రంగంలో నెలకొన్న సమస్యలకు ఇదే కారణమనీ విమర్శించారు. వచ్చే 5-10 ఏళ్లలో బిడ్డింగ్ నిర్వహించడానికి 300 ప్రాజెక్టులను అన్ని అనుమతులతో సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ రంగంలో అభివృద్ధి మందగించడానికి ఫైళ్లను త్వరగా క్లియర్ చేయకపోవడమే కారణమని గుర్తించినట్లు చెప్పారు. మౌలిక సౌకర్యాలు, వ్యాపారాల్లో సమయమే అత్యంత కీలకమైనదనీ, ఫైళ్లు మూడు నుంచి ఆరునెలల పాటు పెండింగులో ఉంటున్నాయనీ చెప్పారు. ఇలాంటి జాప్యాల కారణంగా దేశంపై రోజుకు రూ.15 కోట్ల భారం పడుతోందన్నారు. రైల్వేల నుంచి అనుమతులు లేకపోవడంతో 300కు పైగా రైల్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం పెండింగులో ఉందన్నారు. మౌలికం వృద్ధికి పటిష్ట పీపీపీ నమూనా మౌలిక రంగం అభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆర్థిక కార్యదర్శి అరవింద్ మయారామ్ సదస్సులో పేర్కొన్నారు. ఈ దిశలో పటిష్టవంతమైన, సంక్లిష్టతలకు తావులేని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధాన నమూనాకు రూపకల్పన చేస్తున్నట్లు కూడా వెల్లడించారు. -
రైలు దారి మార్చుకుంటోంది....
న్యూఢిల్లీ : కూ చిక్ చిక్ అంటు వచ్చిన ఎన్డీయే రైలు బండి దారి మార్చుకుంటోంది. విదేశీ పెట్టుబడులకు రైల్వేశాఖ తలుపులు తెరుస్తోంది. రైల్వేలో వందశాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించే సూచనలు కనిపిస్తున్నాయి. పీపీపీల పేరు (ప్రభుత్వ, ప్రయివేట్ భాగస్వామ్యం)తో ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేసే ప్రయత్నం చేపట్టింది. పదేళ్ల తర్వాత తొలిసారి రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన బీజేపీ రైల్వేల్లో ఎఫ్‌డీఐలకు అనుమతించాలని కేంద్రాన్ని కోరింది. మౌలిక సదుపాయాల కల్పనకు పీపీపీ పద్దతిలో పనులు చేపడతామని రైల్వే మంత్రి సదానందగౌడ ప్రకటించిన విషయం తెలిసిందే. భారత దేశ ఆర్థిక వ్యవస్థకు రైల్వే శాఖ ఆత్మ వంటిదన్న సదానంద గౌడ 62 నిమిషాల ప్రసంగంలో ఎక్కువ సార్లు వినిపించిన పదం పీపీపీ. దేశం మొత్తంలో చాలా రంగాలు ప్రైవేటీకరణ చేతికి అప్పగించినాఇప్పటి వరకు రైల్వే శాఖను ప్రైవేటు పరం చేయాలనే ఆలోచనను ధైర్యంగా ప్రభుత్వం చేయలేదు. ఒకవేళ రైల్వే శాఖలో కూడా ప్రైవేటు భాగస్వామ్యం కల్పిస్తే ఇక దేశం మొత్తం కూడా ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టినట్టే అవుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు విపక్షాలు కూడా మోడీ సర్కార్ రైల్వే శాఖను ప్రయివేటీకరణ చేసే దిశగా అడుగులు వేస్తోందని విమర్శిస్తున్నాయి. నిజానికి కి ప్రధాని మోడీ ఎఫ్‌డిఐలకు ఇప్పటికే సూత్రప్రాయంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జమ్ము కాశ్మీర్ లో కాత్రా-ఉధంపూర్ రైల్వే లైన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. రైల్వే సంస్థ అభివద్ధి కోసం ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంచాల్సిన అవసరముందని మోడీ వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే ఈ చర్యలు తప్పవని చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.