ప్రపంచ స్థాయి ఇన్‌ఫ్రాలో 6 దేశీ ప్రాజెక్టులు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా వినూత్న ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల్లో ఆరు దేశీ ప్రాజెక్టులు చోటు దక్కించుకున్నాయి. ఇందులో హైదరాబాద్‌కి చెందిన దిగ్గజం మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (ఎంఈఐఎల్) చేపట్టిన నర్మదా కెనాల్ సోలార్ ప్రాజెక్టు కూడా ఉంది.
ఇదే కాకుండా ఢిల్లీ మెట్రో, యమునా ఎక్స్‌ప్రెస్‌వే, టాటా పవర్‌కి చెందిన ముంద్రా అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు (గుజరాత్), ఇంటర్‌సెప్టర్ స్యూవేజ్ సిస్టమ్, గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-సిటీ (గిఫ్ట్) ఈ జాబితాలో ఉన్నాయి. అత్యంత ప్రభావం చూపగలిగే వినూత్నమైన ప్రాజెక్టులతో ‘ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ 100’ పేరిట అంతర్జాతీయ అకౌంటింగ్ సంస్థ కేపీఎంజీ ఈ జాబితాను తయారు చేసింది. ప్రాజెక్టు వ్యయం, సంక్లిష్టత, సాధ్యాసాధ్యాలు, నవ్యత, సమాజంపై ప్రభావం అంశాల ప్రాతిపదికగా దీన్ని రూపొందించినట్లు కేపీఎంజీ వివరించింది.
న్యూఢిల్లీ, ఆగ్రాను కలుపుతూ దాదాపు 165 కిలోమీటర్ల పొడవుండే ఆరు లేన్ల యమునా ఎక్స్‌ప్రెస్‌వే 2012లో ప్రారంభమైంది. దీని నిర్మాణానికి 1.9 బిలియన్ డాలర్ల వ్యయం అయ్యింది. ప్రపంచ స్థాయి ఇన్‌ఫ్రాను అభివృద్ధి చేయగలిగే సత్తా భారత్‌కి ఉందని ఇది చాటిచెప్పగలదని కేపీఎంజీ వివరించింది. మరోవైపు, 2.3 బిలియన్ డాలర్ల వ్యయంతో ఏర్పాటైన ఢిల్లీ మెట్రో ఎప్పటికప్పుడు సవాళ్లను అధిగమిస్తూ మరింతగా విస్తరిస్తోందని పేర్కొంది.
4.4 బిలియన్ డాలర్ల ముంద్రా అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు.. భారత విద్యుత్ రంగంలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టుల్లో మైలురాయిలాంటిదని కేపీఎంజీ తెలిపింది. ఇక గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీని 20 బిలియన్ డాలర్ల వ్యయంతో త లపెట్టారు. దాదాపు 400 వైవిధ్యమైన ప్రాజెక్టులను పరి శీలించి కేపీఎంజీ 100 సంస్థలను ఎంపిక చేసింది.
ఎంఈఐఎల్ ప్రాజెక్టు..: 17.9 మిలియన్ డాలర్ల వ్యయంతో కూడిన నర్మదా కెనాల్ సౌర విద్యుత్ ప్రాజెక్టును ఎంఈఐఎల్ చేపట్టింది. కాంట్రాక్టులో భాగంగా దాదాపు 5.5 కిలోమీటర్ల పొడవునా కెనాల్‌పై సోలార్ ఫొటోవోల్టయిక్ గ్రిడ్‌ను ఏర్పాటు చేసి, 25 సంవత్సరాల పాటు నిర్వహించాల్సి ఉంటుంది. ఇది ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టు.