న్యూఢిల్లీ : కూ చిక్ చిక్ అంటు వచ్చిన ఎన్డీయే రైలు బండి దారి మార్చుకుంటోంది. విదేశీ పెట్టుబడులకు రైల్వేశాఖ తలుపులు తెరుస్తోంది. రైల్వేలో వందశాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించే సూచనలు కనిపిస్తున్నాయి. పీపీపీల పేరు (ప్రభుత్వ, ప్రయివేట్ భాగస్వామ్యం)తో ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేసే ప్రయత్నం చేపట్టింది. పదేళ్ల తర్వాత తొలిసారి రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన బీజేపీ రైల్వేల్లో ఎఫ్డీఐలకు అనుమతించాలని కేంద్రాన్ని కోరింది. మౌలిక సదుపాయాల కల్పనకు పీపీపీ పద్దతిలో పనులు చేపడతామని రైల్వే మంత్రి సదానందగౌడ ప్రకటించిన విషయం తెలిసిందే.
భారత దేశ ఆర్థిక వ్యవస్థకు రైల్వే శాఖ ఆత్మ వంటిదన్న సదానంద గౌడ 62 నిమిషాల ప్రసంగంలో ఎక్కువ సార్లు వినిపించిన పదం పీపీపీ. దేశం మొత్తంలో చాలా రంగాలు ప్రైవేటీకరణ చేతికి అప్పగించినాఇప్పటి వరకు రైల్వే శాఖను ప్రైవేటు పరం చేయాలనే ఆలోచనను ధైర్యంగా ప్రభుత్వం చేయలేదు. ఒకవేళ రైల్వే శాఖలో కూడా ప్రైవేటు భాగస్వామ్యం కల్పిస్తే ఇక దేశం మొత్తం కూడా ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టినట్టే అవుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు విపక్షాలు కూడా మోడీ సర్కార్ రైల్వే శాఖను ప్రయివేటీకరణ చేసే దిశగా అడుగులు వేస్తోందని విమర్శిస్తున్నాయి.
నిజానికి కి ప్రధాని మోడీ ఎఫ్డిఐలకు ఇప్పటికే సూత్రప్రాయంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జమ్ము కాశ్మీర్ లో కాత్రా-ఉధంపూర్ రైల్వే లైన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. రైల్వే సంస్థ అభివద్ధి కోసం ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంచాల్సిన అవసరముందని మోడీ వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే ఈ చర్యలు తప్పవని చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.