సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కొత్తగా ప్రాజెక్టులు దక్కకపోగా మళ్లీ టికెట్ చార్జీల పెంపు ఉండవచ్చంటూ రైల్వే మంత్రి సదానంద గౌడ చేసిన ప్రకటన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
జిల్లాకు సంబంధించిన కొత్త రైల్వే లైనులు, రైళ్ల స్టాపింగ్‌లు, కొత్త రైళ్లు, రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులకు సంబంధించి ఎటువంటి హామీ లభించలేదు.
రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రాకు పూర్తి అన్యాయం ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు పూర్తిగా అన్యాయం జరిగిందని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. ఎప్పటి నుంచో ఈ ప్రాంతానికి రావాల్సిన నడికుడి - కాళహస్తి రైల్వేలైన్ ప్రస్తావన చేయకపోవడం బాధాకరమన్నారు. కడప - ఎర్రగుంట్ల రైల్వేలైన్‌తో పాటు ఏ ప్రాజెక్టుకు కూడా కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఆమోదం తెలపకపోవడం దురదృష్టకరమన్నారు. ఆయన కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్రకు మాత్రమే మంత్రిలా బడ్జెట్ రూపొందించారని వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. విజయవాడ - ఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం - చెన్నై వీక్లీ ఎక్స్‌ప్రెస్ మినహా ఏ రైళ్లు ప్రకటించకపోవడం దారుణమన్నారు.
ఏపీ పునర్‌వ్యవస్థీకరణ బిల్లులో ప్రస్తావించిన అంశాలను కూడా కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ఆ చట్టంలోని షెడ్యూల్ 13 ప్రకారం కొత్తగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. విశాఖపట్నం మెట్రోరైలు, విజయవాడ - తెనాలి - గుంటూరుకు మెట్రోరైలు, రాష్ట్రంలో కొత్తగా ఏర్పడే రాజధాని నుంచి హైదరాబాద్‌కు రాపిడ్ ఎక్స్‌ప్రెస్‌లైన్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఈ అంశాలను కనీసం బడ్జెట్‌లో పరిగణనలోకి తీసుకోకపోవడం దుర్మార్గమన్నారు.
ఇంత ఘోరమైన రైల్వే బడ్జెట్‌ను చూడలేదని చెప్పారు. రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగిందని, రైల్వే మంత్రి సదానంద గౌడ పూర్తి నిరాశ మిగిల్చారన్నారు. తాము రైల్వే మంత్రిని నెలరోజుల క్రితమే కలిసి ఈ ప్రాంతానికి కావాల్సిన ప్రతిపాదనలను వివరించినట్లు చెప్పారు. గతంలో యూపీఏ ప్రభుత్వం, ప్రస్తుత ఎన్‌డీఏ ప్రభుత్వం కూడా ఈ ప్రాంత ప్రజల అవసరాలు తీర్చడంలో విఫలమయ్యాయని ఆయన విమర్శించారు.
మళ్లీ అన్యాయమే: కేవీవీ ప్రసాద్, సీపీఐ జిల్లా సహాయక కార్యదర్శి
రైల్వే బడ్జెట్‌లో మళ్లీ జిల్లాకు అన్యాయమే జరిగింది. శ్రీకాళహస్తి-నడికుడి రైల్వే ప్రాజెక్టుకుగానీ, దొనకొండ- ఒంగోలు రైల్వే లైన్‌కు సంబంధించి ఆశించిన ప్రయోజనమేమీ లేదు. జిల్లా నుంచి సరుకు రవాణా ద్వారా అత్యధిక ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నా వసతులు కల్పించడంలో విఫలమవుతున్నారు. రైళ్లల్లో ప్రయాణికులు కిక్కిరిసి ఎక్కుతున్నా అదనపు రైళ్లు ఏర్పాటు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కేవలం బుల్లెట్ రైళ్ల పేరుతో ధనవంతులకు సౌకర్యం కల్పించడం తప్ప పేదల గురించి పట్టించుకోవడం మానేశారు.
రైల్వే బడ్జెట్ భేషుగ్గా ఉంది: తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి
మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైల్వేబడ్జెట్ భేషుగ్గా ఉంది. పారదర్శకతకు, అభివృద్ధికి పెద్దపీట వేసింది. ఈ బడ్జెట్ అన్ని వర్గాల వారికి ఆమోదయోగ్యం. రైల్వేల అభివృద్ధి పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు, యశ్వంతపూర్ - గుంటూరు డైలీ ప్యాసింజర్ రైలు, విశాఖ-చెన్నై వీక్లీ, సికింద్రాబాద్- చెన్నై వీక్లీ ఎక్స్‌ప్రెస్ కొత్త రైళ్ల ఏర్పాటు శుభసూచకం. మహిళా ప్రయాణికులకు అధిక భద్రత, డబ్లింగ్-ట్రిప్లింగ్, కొత్త రైళ్లకు అధిక ప్రాధాన్యత. గ్రామీణ ప్రజల సౌకర్యార్థం పోస్టాఫీసుల ద్వారా కూడా రైలు టికెట్ల విక్రయాలు చేపట్టడం వంటి వాటివల్ల బడ్జెట్ సంతృప్తిగా ఉంది.
జనరంజక బడ్జెట్: బీజేపీ రాష్ట్ర నాయకులు బత్తిన నరశింహారావు
రైల్వే బడ్జెట్ జనరంజకంగా ఉంది. ఒక వైపు ఆదాయం వంద రూపాయలు వస్తుంటే అందులో 90 రూపాయలు వ్యయం అవుతోంది. అందువల్ల కేవలం పదిరూపాయల్లోనే అభివృద్ధి చేపట్టాల్సి వస్తుంది. అయినప్పటికీ మోడీ ప్రభుత్వం సాహసోపేతంగా కొత్త ట్రాక్‌ల నిర్మాణానికి పూనుకోవడం ద్వారా సరుకు రవాణాను వేగవంతం చే సి తద్వారా రైల్వే సేవలను మరింత అభివృద్ధి చేయబోతోంది.
రైల్వే బడ్జెట్ లో జిల్లాకు మళ్లీ మొండిచేయే..
Published Wed, Jul 9 2014 3:08 AM | Last Updated on Sat, Sep 2 2017 10:00 AM
Advertisement