రైల్వే బడ్జెట్‌లో.. ఏపీపై కరుణ ఏది?
► రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి మొండిచేయి
► కొత్త ప్రాజెక్టుల ఊసే లేదు
► పునర్వ్యవస్థీకరణ చట్టంలో చెప్పిన ప్రాజెక్టులకూ దిక్కులేదు
► ప్రత్యేక జోన్, మెట్రో ప్రాజెక్టుల ప్రస్తావనే లేదు
► రాష్ట్రంలో ప్రారంభమయ్యే రైళ్లు మూడే..వీటిలో రెండు పాతవే..
► రాష్ట్రం మీదగా 6 కొత్త రైళ్లు
► కొత్త లైన్ల నిర్మాణం, డబ్లింగ్, ఇతరత్రా పనులకు ఇచ్చింది సుమారు రూ.473.28 కోట్లే..
సాక్షి, హైదరాబాద్/విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే బడ్జెట్‌లో మళ్లీ మొండిచేయే మిగిలింది. రాష్ట్ర ప్రజలు పెట్టుకున్న ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. మంగళవారం పార్లమెంటులో కేంద్ర రైల్వే మంత్రి సదానంద గౌడ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో నామమాత్రంగానే నిధులు విదిలించారు. చెప్పుకోదగ్గ ఒక్క ప్రాజెక్టూ రాష్ట్రానికి రాలేదు. కొత్త ప్రాజెక్టుల ఊసే లేదు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న ప్రాజెక్టులకూ బడ్జెట్‌లో చోటు దక్కలేదు. కొత్త రాష్ట్రం ఆవిర్భావం జరి గిన ఆరు నెలల్లోగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని చట్టంలో పేర్కొన్నారు.
దక్షిణ మధ్య జోన్ పరిధిలోని విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు, తూర్పు కోస్తా జోన్‌లోని వాల్తేరు డివిజన్‌తో కలిపి కొత్త జోన్ ఏర్పాటు ప్రకటన బడ్జెట్‌లో ఉంటుందని ఎదురు చూసిన ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలు అడియాశలయ్యాయి. విశాఖ లేదా విజయవాడ కేంద్రంగా ఈ జోన్ ఏర్పాటు చేస్తామని నేతలు ప్రకటనలు గుప్పించినా, బడ్జెట్‌లో నిరాశే మిగిలింది. రాష్ట్ర విభజన బిల్లు లో పేర్కొన్న విజయవాడ - గుంటూరు - తెనాలి మెట్రో రైల్ ఏర్పాటుపై అపాయింటెడ్ డే (జూన్ 2) నుంచి ఆరు నెలల్లో సర్వే చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించాల్సి వుంది.
బడ్జెట్‌లో ఈ ప్రస్తావనే లేదు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు కూడా నేతల ప్రకటనలకే పరిమితమైంది.తిరుపతి కేంద్రంగా బాలాజీ డివిజన్ ఏర్పాటు చేస్తామని గతంలో అనేక సార్లు ప్రకటించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ డిమాండ్ నెరవేరగలదని అందరూ భావించారు. డివిజన్ ఏర్పాటు అంశం బడ్జెట్‌లో ప్రస్తావించాల్సిన అవసరం లేదనీ, కమిటీ నివేదిక వచ్చాక ఏర్పాటవుతుందని బీజేపీ నేతలు అంటున్నారు. ఎ క్లాస్ రైల్వే స్టేషన్లను ఎయిర్‌పోర్టుల తరహాలో అభివృద్ధి చేస్తామని మంత్రి చేసిన ప్రకటన వల్ల రాష్ట్రంలోని తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం స్టేషన్ల అభివృద్ధి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టే అవకాశాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. విశాఖలో వ్యాగన్ల తయారీ పరిశ్రమ ఏర్పాటునూ కేంద్రం విస్మరించింది. గుంతకల్లులో రూ.100 కోట్లతో విద్యుత్ లోకో షెడ్ నిర్మింప్రతిపాదనకు కూడా ఆమోద ముద్ర పడలేదు.
పెండింగ్ ప్రాజెక్టులపై కమిటీతో సరి..
రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తామన్న హామీ కూడా మంత్రి ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులపై కమిటీ ఏర్పాటు ప్రకటనతో సరిపెట్టారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ రూ. 20,680 కోట్ల విలువైన 29 ప్రాజెక్టులు ఉన్నాయని, వీటికి నిధుల కేటాయింపుపై నివేదిక ఇవ్వడానికి రైల్వే, ఇరు రాష్ట్రాల అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కమిటీ నివేదికను అనుసరించి ఇరు రాష్ట్రాల్లో ఆర్థికాభివృద్ధికి చేయూతనిచ్చేవిధంగా ఈ ప్రాజెక్టులను చేపడతామని హామీ ఇచ్చారు.
పాత రైళ్లే కొత్తవిగా..
రాష్ట్రం నుంచి 3 రైళ్లు కొత్తగా ప్రారంభిస్తున్నట్లు బడ్జెట్‌లో చూపించారు. వాస్తవానికి వీటిలో విజయవాడ - న్యూఢిల్లీ మధ్య రోజూ నడిచే ఏపీ ఎక్స్‌ప్రెస్ మాత్రమే కొత్త రైలు. విశాఖపట్నం - చెన్నై మధ్య వీక్లీ ఎక్స్‌ప్రెస్ వేస్తున్నట్లు బడ్జెట్‌లో చెప్పారు. అయితే, ఈ రైలు ఇప్పటికే విశాఖ - చెన్నైల మధ్య ప్రత్యేక రైలుగా నడుస్తోంది. దానినే వీక్లీ ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు. పారదీప్ - విశాఖపట్నం వీక్లీ ఎక్స్‌ప్రెస్ కూడా ఇటువంటిదే. ఇప్పటికే పారదీప్ - శ్రీకాకుళంల మధ్య నడుస్తున్న రైలును విశాఖపట్నం వరకు పొడిగించి, కొత్త రైలు మంజూరు చేసినట్లు చూపించారు. మరో 6 రైళ్లు ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణించేవి ఉన్నాయి. హైదరాబాద్ - చెన్నై హైస్పీడ్ రైలు, షాలిమార్ - చెన్నై ప్రీమియం ఏసీ ఎక్స్‌ప్రెస్, జైపూర్ - మధురై, కమాఖ్య - బెంగళూరు ప్రీమియం ఎక్స్‌ప్రెస్‌లు, అహ్మదాబాద్ - చెన్నై ఎక్స్‌ప్రెస్ (బైవీక్లీ), టాటానగర్ - బెంగళూరు ఎక్స్‌ప్రెస్ (వీక్లీ)లు రాష్ట్రం మీదుగా వెళ్తాయి. ఇవి మినహా రాష్ట్రానికి ఉపయోగపడే అంశాలు బడ్జెట్‌లో ఒక్కటీ కనిపించలేదు. విజయవాడ నుంచి ముంబై, కోల్‌కతా నగరాలకు ప్రత్యేక రైళ్లు, తిరుపతి- షిరిడి రైలు ఊసే లేదు.