80% భూమి సేకరించాకే హైవే ప్రాజెక్టులు
న్యూఢిల్లీ: జాతీయ రహదారుల ప్రాజెక్టులకు అవసరమైన భూమిలో కనీసం 80 శాతాన్ని సేకరించకుండా ఆయా ప్రాజెక్టులకు టెండర్లు పిలవబోమని కేంద్ర రహదారి రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన బుధవారం ఇక్కడ జరిగిన ఫిక్కీ సదస్సులో తెలిపారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో కనీసం 10 శాతం భూమిని కూడా సేకరించకుండానే ప్రాజెక్టులు మొదలుపెట్టారనీ, రహదారుల రంగంలో నెలకొన్న సమస్యలకు ఇదే కారణమనీ విమర్శించారు.
వచ్చే 5-10 ఏళ్లలో బిడ్డింగ్ నిర్వహించడానికి 300 ప్రాజెక్టులను అన్ని అనుమతులతో సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ రంగంలో అభివృద్ధి మందగించడానికి ఫైళ్లను త్వరగా క్లియర్ చేయకపోవడమే కారణమని గుర్తించినట్లు చెప్పారు. మౌలిక సౌకర్యాలు, వ్యాపారాల్లో సమయమే అత్యంత కీలకమైనదనీ, ఫైళ్లు మూడు నుంచి ఆరునెలల పాటు పెండింగులో ఉంటున్నాయనీ చెప్పారు. ఇలాంటి జాప్యాల కారణంగా దేశంపై రోజుకు రూ.15 కోట్ల భారం పడుతోందన్నారు. రైల్వేల నుంచి అనుమతులు లేకపోవడంతో 300కు పైగా రైల్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం పెండింగులో ఉందన్నారు.
మౌలికం వృద్ధికి పటిష్ట పీపీపీ నమూనా
మౌలిక రంగం అభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆర్థిక కార్యదర్శి అరవింద్ మయారామ్ సదస్సులో పేర్కొన్నారు. ఈ దిశలో పటిష్టవంతమైన, సంక్లిష్టతలకు తావులేని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధాన నమూనాకు రూపకల్పన చేస్తున్నట్లు కూడా వెల్లడించారు.