సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతంలో రూ.19,761.8 కోట్లతో పలు జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రతిపాదించిన ఈ జాతీయ రహదారి ప్రాజెక్టుల్లో 9 నిర్మాణదశలో ఉండగా, 3 అవార్డు అయినప్పటికీ ఇంకా ప్రారంభం కాలేదని, మరో 11 ప్రాజెక్టులు మంజూరైనప్పటికీ కాంట్రాక్ట్ అవార్డు కాలేదని వివరించారు.
రాజ్యసభలో బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు. మొత్తంగా రూ.12,951.68 కోట్లతో చేపట్టిన వివిధ జాతీయ రహదారి అభివృద్ధి పనులు గ్రౌండ్ అయి వివిధదశల్లో పురోగతిలో ఉన్నట్లు తెలిపారు. రూ.1,989.4 కోట్లతో చేపట్టాల్సిన మూడు జాతీయ రహదారి పనులకు కాంట్రాక్ట్‌లు అవార్డు పూర్తయి పనులు ప్రారంభం కావాల్సి ఉందన్నారు. రూ.4,820.72 కోట్లతో చేపట్టాల్సిన 11 హైవే పనులు మంజూరై అవార్డు కోసం ఎదురుచూస్తున్నట్టు మంత్రి వివరించారు.
ఎన్‌డీఆర్‌ఎఫ్‌కు రూ.1,60,153 కోట్లు
ప్రకృతి వైపరీత్యాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు 2021–26 మధ్య కాలంలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌కు రూ.1,60,153 కోట్లు కేటాయించినట్లు హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ తెలిపారు. విజయసాయిరెడ్డి మరో ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. గత కేటాయిపులతో పోలిస్తే ఇది రెండున్నర రెట్లు అధికమని చెప్పారు. దీనికి అదనంగా మరో రూ.68 వేల కోట్ల తక్షణ సహాయనిధిని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కోస్తా రాష్ట్రాల్లో తుపాన్లు వచ్చినప్పుడు భారత వాతావరణ విభాగం (ఐఎండీ), కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)తోపాటు వివిధ ప్రభుత్వ విభాగాల సమన్వయంతో ఎన్‌డీఆర్‌ఎఫ్ ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తూ విపత్తు సహాయ చర్యలను చేపడుతోందని చెప్పారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ నుంచి ఎస్‌డీఆర్‌ఎఫ్‌కు కేటాయించే నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగించుకోవచ్చని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment