సాక్షి ప్రతినిధి, వరంగల్: జాతీయ రహదారుల మణిహారంగా తెలంగాణ మారుతోందని కేంద్ర ఉపరితల రవాణా, రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తోందని, గతిశక్తి పథకంలో భాగంగా రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో రహదారుల నిర్మాణానికి కేంద్రం పెద్దపీట వేయాలని నిర్ణయం తీసుకుందని, ఇప్పటివరకు రూ.లక్షా పదివేల కోట్లతో ప్రాజెక్టులు చేపట్టినట్లు తెలిపారు.
వరంగల్–ఖమ్మం జిల్లాల పరిధిలో నాలుగు లైన్ల రహదారుల నిర్మాణానికి రూ.2,235 కోట్ల నిధులు కేటాయించామన్నారు. వరంగల్ –ఖమ్మం (ఎన్‌హెచ్–163) రహదారిపై వరంగల్ జిల్లా వెంకటాపూర్ గ్రామం నుంచి మహబూబాబాద్ జిల్లాలోని తాళ్లసేనకేశ గ్రామం వరకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి రూ. 1,111.76 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.
ఈ రహదారికి కొనసాగింపుగా తాళ్లసేనకేశ గ్రామం నుంచి ఖమ్మం జిల్లాలోని వెంకటాయపాలెం వరకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి మరో రూ.1,123.32 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఈరెండు రహదారులను కలిపి 70 కిలోమీటర్ల రహదారిని ‘హైబ్రిడ్ అన్యుటీ మోడ్’లో నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. మంచిర్యాల–వరంగల్–విజయవాడ, కరీంనగర్–వరంగల్‌తో పాటు హైదరాబాద్, నాగపూర్, విజయవాడ, విశాఖపట్నంను కలిపేలా పలు జాతీయ రహదారులు నిర్మిస్తున్నట్లు తెలిపారు.
ఆరునూరైనా బీజేపీ గెలుస్తుంది: ఈటల
‘సీఎం కేసీఆర్‌ను గద్దె దింపాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో ఆరు నూరైనా బీజేపీ గెలుస్తుంది’ అని ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ జోస్యం చెప్పారు. హామీలు ఇచ్చి ప్రజల కళ్లలో మట్టికొట్టిన సీఎం కేసీ ఆర్ ఓటమే లక్ష్యంగా.. బీజేపీ శ్రేణులు కంకణబద్ధులుగా పని చేస్తారన్నారు.
కొన్ని మీడియా సంస్థలు బీఆర్‌ఎస్, బీజేపీ ఒకటేనని విష ప్రచారం చేస్తున్నాయని, కాంగ్రెస్,బీఆర్‌ఎస్ ఒక్కటై బీజేపీపై ఇలాంటి కుట్రలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. వరంగల్‌లో రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌కు శ్రీకారం చుట్టడం ఉత్తర తెలంగాణ జిల్లాలకు శుభ సూచకమని ఈటల పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment