
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో రూ.1,292.65 కోట్ల విలువైన జాతీయ రహదారి పనులకు కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారు. భారతమాల పరియోజనలో భాగంగా బెంగళూరు–విజయవాడ ఎకనామిక్ కారిడార్‌లో చంద్రశేఖరపురం నుంచి పోలవరం వరకు 32 కిలోమీటర్ల మేర ఆరులేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ హైవే అభివృద్ధి నిమిత్తం నిధులకు ఆమోదం తెలిపినట్లు కేంద్రమంత్రి వరస ట్వీట్లలో పేర్కొన్నారు.
బెంగళూరు–కడప–విజయవాడ ఎకనామిక్ కారిడార్ బెంగళూరు ఎస్‌టీఆర్‌ఆర్ నుంచి ప్రారంభమవుతుందని, ఇప్పటికే ఉన్న బెంగళూరు–విజయవాడ (ఎన్‌హెచ్–44)లోని కొడికొండ చెక్‌పోస్ట్ వరకు రహదారిని వినియోగించుకుంటుందని తెలిపారు.
ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్ ఎకనామిక్ కారిడార్ కొడికొండ చెక్‌పోస్టు నుంచి ఎన్‌హెచ్–16లోని అద్దంకి వద్ద ముప్పవరం గ్రామం వరకు తదనంతరం విజయవాడ వరకు ఉన్న రహదారిని వినియోగించుకుంటుందని పేర్కొన్నారు.
కొడికొండ చెక్‌పోస్టు నుంచి ముప్పవరం వరకు 342.5 కిలోమీటర్లు పూర్తిగా గ్రీన్‌ఫీల్డ్ హైవే అని తెలిపారు. ప్రకాశం జిల్లాలోని ఈ ప్రతిపాదిత అభివృద్ధిని 14 ప్యాకేజీలుగా చేపడతామని కేంద్రమంత్రి గడ్కరీ పేర్కొన్నారు.