Department of Highways
-
ఏపీలో రూ.1,292.65 కోట్ల హైవే పనులకు ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో రూ.1,292.65 కోట్ల విలువైన జాతీయ రహదారి పనులకు కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారు. భారతమాల పరియోజనలో భాగంగా బెంగళూరు–విజయవాడ ఎకనామిక్ కారిడార్‌లో చంద్రశేఖరపురం నుంచి పోలవరం వరకు 32 కిలోమీటర్ల మేర ఆరులేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ హైవే అభివృద్ధి నిమిత్తం నిధులకు ఆమోదం తెలిపినట్లు కేంద్రమంత్రి వరస ట్వీట్లలో పేర్కొన్నారు. బెంగళూరు–కడప–విజయవాడ ఎకనామిక్ కారిడార్ బెంగళూరు ఎస్టీఆర్ఆర్ నుంచి ప్రారంభమవుతుందని, ఇప్పటికే ఉన్న బెంగళూరు–విజయవాడ (ఎన్‌హెచ్–44)లోని కొడికొండ చెక్‌పోస్ట్ వరకు రహదారిని వినియోగించుకుంటుందని తెలిపారు. ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్ ఎకనామిక్ కారిడార్ కొడికొండ చెక్‌పోస్టు నుంచి ఎన్‌హెచ్–16లోని అద్దంకి వద్ద ముప్పవరం గ్రామం వరకు తదనంతరం విజయవాడ వరకు ఉన్న రహదారిని వినియోగించుకుంటుందని పేర్కొన్నారు. కొడికొండ చెక్‌పోస్టు నుంచి ముప్పవరం వరకు 342.5 కిలోమీటర్లు పూర్తిగా గ్రీన్‌ఫీల్డ్ హైవే అని తెలిపారు. ప్రకాశం జిల్లాలోని ఈ ప్రతిపాదిత అభివృద్ధిని 14 ప్యాకేజీలుగా చేపడతామని కేంద్రమంత్రి గడ్కరీ పేర్కొన్నారు. -
4.12 లక్షల ప్రమాదాలు.. 1.53 లక్షల మంది బలి
న్యూఢిల్లీ: 2021లో దేశవ్యాప్తంగా 4,12,432 రోడ్డు ప్రమాదాల్లో 1,53,972 మంది మరణించారు. 3,84,448 మంది గాయపడ్డారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ తాజాగా ఒక నివేదికలో ఈ మేరకు వెల్లడించింది. 2019తో పోలిస్తే 2021లో ప్రమాదాలు 8.1 శాతం, బాధితుల సంఖ్య 14.8 శాతం తగ్గినట్టు చెప్పింది. ‘‘మృతుల సంఖ్య మాత్రం 1.9 శాతం పెరిగింది. 2020 కంటే 2021లో రోడ్డు ప్రమాదాలు 12.6 శాతం, మరణాలు 16.9 శాతం, గాయపడినవారి సంఖ్య 10.39 శాతం పెరిగాయి. దేశంలో రోజూ సగటున 1,130 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. 422 మంది మరణిస్తున్నారు’’ అని తెలిపింది. ► 2021లో ప్రమాదాల మృతుల్లో 67.7 శాతం 18–45 ఏళ్లలోపు వారే! 18–60 ఏళ్లలోపు వారు 84.5 శాతం మంది. ► గతేడాది 4,12,432 రోడ్డు ప్రమాదాల్లో 31.2 శాతం జాతీయ రహదారులపై, 23.4 శాతం రాష్ట్ర రహదారులపై, 45.4 శాతం ఇతర రోడ్లపై జరిగాయి. ► 2021లో తమిళనాడులో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువ మంది మరణించారు. ► రోడ్డు ప్రమాద మరణాలకు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, ఓవర్ స్పీడ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ ప్రధాన కారణాలు. ► పమాదాల్లో ద్విచక్ర వాహనాలదే ప్రధాన వాటా. కార్లు, జీపులు తర్వాతి స్థానంలో ఉన్నాయి. -
‘ఎన్‌హెచ్’కు భూములిచ్చిన రైతులకు అధిక పరిహారం
న్యూఢిల్లీ: జాతీయ రహదారుల(ఎన్‌హెచ్) ప్రాజెక్టుల్లో భూమిని కోల్పోయిన రైతులకు శుభవార్త. కొత్త భూసేకరణ చట్టం(రైట్ టు ఫెయిర్ కాంపన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ అక్విజిషన్, రీహాబిలిటేషన్ అండ్ రీ సెటిల్మెంట్ యాక్ట్, 2013) ప్రకారం వారికి అధిక పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాత భూసేకరణ చట్టం(ఎన్‌హెచ్ యాక్ట్ 1956) కింద భూములు కోల్పోయి పరిహారం అందని వారికి పెంపు వర్తిస్తుంది. ఎన్హెచ్ఏఐ, ఎన్హెచ్ఐడీసీఎల్ తదితర సంస్థలకు రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ ఆదేశాలు జారీ చేసిందని ఆ శాఖ అధికారి తెలిపారు. జనవరి 1, 2015లోపు పరిహార మొత్తం విషయంలో నిర్ణయం జరిగి, పరిహార మొత్తం చెల్లించని, లేదా భూసేకరణ జరగని(భూమి స్వాధీనం కాని) కేసులకు సంబంధించిన రైతులకూ ఈ పెంపు వర్తిస్తుందన్నారు. -
రహదారి భద్రత ప్రాజెక్టులకు ఐటీ మినహాయింపు
న్యూఢిల్లీ: రహదారి భద్రతను మెరుగుపర్చేవి, ప్రమాదాలను నివారించేవిగాను ఉండే ప్రాజెక్టులకు ఆదాయ పన్ను (ఐటీ) నుంచి మినహాయింపు లభిస్తుందని రహదారుల శాఖకు కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ తెలిపారు. అయితే, ఇందుకోసం సదరు ప్రాజెక్టు అర్హమైనదిగా ప్రకటించాలంటే ముందుగా సామాజిక, ఆర్థిక సంక్షేమ జాతీయ కమిటీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు. రహదారుల శాఖ కార్యదర్శి విజయ్ చిబ్బర్‌కు రాసిన లేఖలో ఈ అంశాలు తెలిపారు. రహదారుల భద్రతను ప్రోత్సహించేలా, ట్రాఫిక్‌పై అవగాహన పెంచేలా చేపట్టే ప్రాజెక్టులకు పన్ను మినహాయింపులపై స్పష్టతనివ్వాలంటూ రహదారుల శాఖ కోరిన నేపథ్యంలో శక్తికాంత దాస్ తాజా వివరణ ఇచ్చారు.