ఇన్‌ఫ్రాకు పెద్దపీట.. | 'Scrap service tax, spend on infra' | Sakshi
Sakshi News home page

ఇన్‌ఫ్రాకు పెద్దపీట..

Published Sun, Mar 1 2015 2:21 AM | Last Updated on Sat, Apr 6 2019 9:38 PM

ఇన్‌ఫ్రాకు పెద్దపీట.. - Sakshi

ఇన్‌ఫ్రాకు పెద్దపీట..

- అదనంగా రూ. 70,000 కోట్ల కేటాయింపులు
- ఎన్‌ఐఐఎఫ్ ఏర్పాటు

 
‘పీపీపీ’ ప్రాజెక్టులకు ఊతం
న్యూఢిల్లీ: వృద్ధి ఆశలతో పొంతన లేకుండా ఉన్న మౌలిక సదుపాయాలను మెరుగుపర్చే చర్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దృష్టి పెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2015-16లో అదనంగా రూ. 70,000 కోట్లు కేటాయిస్తున్నట్లు బడ్జెట్‌లో పేర్కొన్నారు.

ప్రభుత్వం ముందున్న అయిదు ప్రధాన సవాళ్లలో.. ఇన్‌ఫ్రా రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం కూడా ఒకటని ఆయన చెప్పారు. ఈ రంగ వృద్ధికి ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) ప్రాతిపదికన ప్రాజెక్టులకు ఊతమివ్వాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. రహదారుల నిర్మాణానికి రూ. 14,031 కోట్ల మేర, రైల్వేలకు రూ. 10,050 కోట్ల మేర స్థూలంగా బడ్జెట్‌లో కేటాయింపులు పెంచినట్లు జైట్లీ చెప్పారు. మొత్తం మీద ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడులు రూ. 3,17,889 కోట్ల స్థాయిలో ఉంటాయని... 2014-15తో పోలిస్తే ఇది సుమారు రూ. 80,844 కోట్ల పెరుగుదలని  వివరించారు.
 
జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ ..: మౌలిక రంగానికి ఊతం ఇచ్చే దిశగా జాతీయ పెట్టుబడి, మౌలిక సదుపాయాల నిధి(ఎన్‌ఐఐఎఫ్)ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు జైట్లీ చెప్పారు. దీనికి ఏటా రూ. 20,000 కోట్ల మేర నిధులు దక్కేలా చూడనున్నట్లు వివరించారు. ఇది ఐఆర్‌ఎఫ్‌సీ, ఎన్‌హెచ్‌బీ వంటి మౌలిక సదుపాయాల ఫైనాన్స్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయగలదని తద్వారా ఇన్‌ఫ్రా సంస్థలకు నిధులు లభించగలవని పేర్కొన్నారు. రైలు, రహదారులు, నీటి పారుదల రంగ ప్రాజెక్టులకు సంబంధించి పన్నురహిత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్ల జారీని కూడా అనుమతించే ప్రతిపాదన పరిశీలనలో ఉందని జైట్లీ చెప్పారు. పీపీపీ విధానాన్ని సమీక్షించి, పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు రూ. 1 లక్ష కోట్ల పెట్టుబడితో కొత్తగా మరో 5 అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు తెలిపారు.
 
గ్రామగ్రామానికీ రహదారులు..: ప్రస్తుతం రహదారి సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉన్న 1,78,000 పైచిలుకు ప్రాంతాలకు రోడ్ల నిర్మాణంపై దృష్టి పెడుతున్నట్లు జైట్లీ తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే నిర్మాణంలో ఉన్న లక్ష కిలోమీటర్ల రహదారులతో పాటు మరో లక్ష కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందన్నారు. ఇక పెట్రోలు, డీజిల్‌పై ప్రస్తుతం విధిస్తున్న ఎక్సైజ్ సుంకంలో కొంత భాగాన్ని రోడ్డు సెస్సు కింద మార్చాలని, ఈ నిధులను రహదారులు ఇతర ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల నిర్మాణానికి ఉపయోగించాలని యోచిస్తున్నట్లు జైట్లీ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement