సాక్షి, అమరావతి: స్కూల్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ సైన్సెస్(ఎస్‌ఏఎస్), వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయం, సీఎస్‌ఐఆర్-ఐఐసీటీల మధ్య విద్య, పరిశోధనా రంగాలలో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లోని ఐఐసీటీలో జరిగింది. ఈ ఒప్పందం కుదుర్చుకున్న తరువాత వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎస్.వి.కోటారెడ్డి మాట్లాడుతూ.. అధ్యాపకులకు, విద్యార్థులకు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలలో పరిశోధనలు చేయడానికి ఈ సహకారం ఉపయోగపడుతుందని తెలిపారు. అధ్యాపకులు, విద్యార్థులు పరస్పరం ఆసక్తి ఉన్న రంగాలలో నిధుల కోసం ప్రాజెక్ట్ ప్రతిపాదనలను వివిధ ఏజెన్సీలకు పంపవచ్చని పేర్కొన్నారు. దీంతో నిర్వహించే ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లు(ఎఫ్‌డిపిలు), జాతీయ, అంతర్జాతీయ సమావేశాలు, సెమినార్లు, సింపోజియం, వర్క్‌షాప్‌లు ద్వారా సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే పరిశోధనలు చేయవచ్చని తెలిపారు.
సీఎస్ఐఆర్-ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ ఎస్.చంద్రశేఖర్ మాట్లాడుతూ.. వీఐటీ-ఏపీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ఆసక్తి ఉన్న యువతీ యువకులు పరిశోధనలో రంగంలో ఎదగడానికి ఎంఎస్సీ, పీహెచ్‌డీ కోర్సుల ఉపయోగపడతాయని పేర్కొన్నారు. దీని ద్వారా విద్యార్థుల ప్రాజెక్ట్, పరిశోధన, ఇంటర్న్‌షిప్, సిఓ-ఓపీ, సీనియర్ డిజైన్ ప్రాజెక్టులకు సహకారం అందించటం జరుగుతుందని చెప్పారు. ఐఐసీటీ సహకారంతో అందించే కోర్సులపై గెస్ట్ లెక్చర్లు, శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, విద్యార్థుల ఎక్స్చేంజి ప్రోగ్రాంలు, ప్రాజెక్టులకు పూర్తి సహకారంతో పాటు ద్వైపాక్షిక కార్యక్రమాలకు దరఖాస్తు చేసుకొనుటకు సహాయపడుతుందని తెలియజేశారు. వీఐటీ-ఏపి విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ సీ.ఎల్.వీ. శివ కుమార్, ఐఐసీటీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ ఎన్.వీ. సత్యనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
చదవండి: గ్రామ, వార్డు వలంటీర్లకు సెల్యూట్: సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment