Academic Guidance
-
రూల్స్ అన్నారు.. అనుమతులు ఇచ్చేశారు
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత సాంకేతిక విద్యామండలి నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తామని, రూల్స్ పాటించకపోతే అనుబంధ గుర్తింపే ఇవ్వమని జేఎన్టీయూహెచ్ నిన్నటిదాకా ఊదరగొట్టింది. అంతలోనే ఏం జరిగిందో ఏమో! బుధవారం ఒక్కరోజే ఏకంగా 108 ఇంజనీరింగ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్) ఇచ్చేసింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని 11 కాలేజీలు కూడా కలిపితే, రాష్ట్రంలో 119 కాలేజీలకు అనుమతులు వచ్చేశాయ్. ఇది ఏటా జరిగే తంతు.. అనే విమర్శలు వస్తున్నాయి. అయితే, ఈ ఏడాది జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, గతంలోకన్నా భిన్నంగా వ్యవహరిస్తామని తెలిపింది. గత నెల 25వ తేదీన యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ మీడియాకు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రిన్సిపాల్‌కు పీహెచ్డీ, అధ్యాపకులకు ఇతర అవసరమైన అర్హతలు ఉన్నాయా.. లేదా చూస్తామన్నారు. కాలేజీలు గుడ్డిగా అధ్యాపకుల జాబితా పంపితే.. వాళ్లు చదివిన యూనివర్సిటీలకు వెళ్లి మరీ సర్టిఫికెట్లు పరిశీలిస్తామన్నారు. సరైన అర్హతలు లేని అధ్యాపకులతో కాలేజీలు నడిపించే విధానాన్ని మారుస్తామని వీసీ తెలిపారు. అన్ని కాలేజీలను తమ కమిటీ పరిశీలించి, అర్హతలున్నాయని తెలుసుకున్నాకే అఫిలియేషన్ ఇస్తామని ఆయన పదేపదే చెప్పారు. కమిటీ అయితే అన్ని కాలేజీలకు వెళ్లింది. ఈ పరిశీలనలో 90 శాతం కాలేజీల్లో లోపాలున్నాయని, మౌలిక వసతుల్లేవని, అధ్యాకులు నిబంధనల ప్రకారంలేరని గుర్తించినట్టు తెలిసింది. అయితే, కమిటీ పరిశీలించి.. ఇచ్చిన నివేదికను మాత్రం జేఎన్టీయూహెచ్ గోప్యంగా ఉంచింది. దీనిపై యూనివర్సిటీ అధికారులు కనీసం పెదవి విప్పేందుకు కూడా సాహసించడం లేదు. అంతలోనే ఇన్ని కాలేజీలకు అర్హులైన అధ్యాపకులు ఎలా వచ్చారో? మౌలిక సదుపాయాలు ఎలా సమకూరాయో తెలియదు కానీ.. అఫిలియేషన్ అయితే ఇచ్చేసింది. అనుమతులు సరే.. అధ్యాపకుల సంగతేంటి? అధ్యాపకుల సమస్యలు పట్టించుకోకుండా, ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతులివ్వడం దారుణమని తెలంగాణ స్కూల్స్, టెక్నికల్ కాలేజీల ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అయినేని సంతోశ్‌కుమార్ అన్నారు. చాలా కాలేజీల్లో జీతాలే ఇవ్వడం లేదని, వేతన సంఘం సిఫార్సు చేసిన జీతాలు అందడం లేదని పేర్కొన్నారు. కాలేజీల్లో అసలు అధ్యాపకులు ఉన్నారా అనే విషయాన్ని కమిటీ పరిశీలించిందా అని ఆయన ప్రశ్నించారు. అన్ని కాలేజీల్లో బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేయాలని, అప్పుడే వాస్తవాలు తెలుస్తాయని అన్నారు. -
సీఎస్ఐఆర్, ఐఐసీటీల మధ్య పరిశోధన ఒప్పందం
సాక్షి, అమరావతి: స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ సైన్సెస్(ఎస్ఏఎస్), వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయం, సీఎస్ఐఆర్-ఐఐసీటీల మధ్య విద్య, పరిశోధనా రంగాలలో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లోని ఐఐసీటీలో జరిగింది. ఈ ఒప్పందం కుదుర్చుకున్న తరువాత వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎస్.వి.కోటారెడ్డి మాట్లాడుతూ.. అధ్యాపకులకు, విద్యార్థులకు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలలో పరిశోధనలు చేయడానికి ఈ సహకారం ఉపయోగపడుతుందని తెలిపారు. అధ్యాపకులు, విద్యార్థులు పరస్పరం ఆసక్తి ఉన్న రంగాలలో నిధుల కోసం ప్రాజెక్ట్ ప్రతిపాదనలను వివిధ ఏజెన్సీలకు పంపవచ్చని పేర్కొన్నారు. దీంతో నిర్వహించే ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లు(ఎఫ్‌డిపిలు), జాతీయ, అంతర్జాతీయ సమావేశాలు, సెమినార్లు, సింపోజియం, వర్క్‌షాప్‌లు ద్వారా సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే పరిశోధనలు చేయవచ్చని తెలిపారు. సీఎస్ఐఆర్-ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ ఎస్.చంద్రశేఖర్ మాట్లాడుతూ.. వీఐటీ-ఏపీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ఆసక్తి ఉన్న యువతీ యువకులు పరిశోధనలో రంగంలో ఎదగడానికి ఎంఎస్సీ, పీహెచ్డీ కోర్సుల ఉపయోగపడతాయని పేర్కొన్నారు. దీని ద్వారా విద్యార్థుల ప్రాజెక్ట్, పరిశోధన, ఇంటర్న్‌షిప్, సిఓ-ఓపీ, సీనియర్ డిజైన్ ప్రాజెక్టులకు సహకారం అందించటం జరుగుతుందని చెప్పారు. ఐఐసీటీ సహకారంతో అందించే కోర్సులపై గెస్ట్ లెక్చర్లు, శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, విద్యార్థుల ఎక్స్చేంజి ప్రోగ్రాంలు, ప్రాజెక్టులకు పూర్తి సహకారంతో పాటు ద్వైపాక్షిక కార్యక్రమాలకు దరఖాస్తు చేసుకొనుటకు సహాయపడుతుందని తెలియజేశారు. వీఐటీ-ఏపి విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ సీ.ఎల్.వీ. శివ కుమార్, ఐఐసీటీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ ఎన్.వీ. సత్యనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చదవండి: గ్రామ, వార్డు వలంటీర్లకు సెల్యూట్: సీఎం జగన్ -
విజ్ఞానం పంచుకునే ‘ట్విన్నింగ్’
సాక్షి, అమరావతి: పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య పరిజ్ఞానాన్ని పరస్పరం పంచుకునేలా కేంద్రం తలపెట్టిన ‘ట్విన్నింగ్’ కార్యక్రమాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని ఏపీ సమగ్ర శిక్ష నిర్ణయించింది. పార్ట్నర్షిప్, టీచర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం కింద ఎంపిక చేసిన 50 పాఠశాలల్లో దీన్ని అమలు చేయనున్నారు. ► ట్విన్నింగ్ ద్వారా గ్రామీణ, గిరిజన ప్రాంతాల పాఠశాలలను పట్టణ, సెమీ అర్బన్ పాఠశాలలతో పరస్పరం అనుసంధానిస్తారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య విజ్ఞానాన్ని పంచుకోవడం అనుసంధానం లక్ష్యం. ► విద్యార్థులు ఇతర పాఠశాలల్లో వారం రోజులు గడపడం ద్వారా అక్కడ అనుసరిస్తున్న విధానాలను పరిశీలించేందుకు అవకాశం కల్పిస్తారు. ► సెకండరీ, సీనియర్ సెకండరీ విద్యార్థులు, టీచర్లకు మాత్రమే ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు. ఇందుకోసం ఏర్పాట్లు చేయాలని సమగ్ర శిక్షా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లను ఆదేశించారు. కార్యక్రమం అమలు తేదీ తర్వాత ప్రకటిస్తారు. ► ఇతర పాఠశాలలను సందర్శించడం ద్వారా విద్యార్థులకు బోధనా ప్రక్రియ, నాణ్యత, సమస్యలు, స్పెషల్ ఇన్నోవేటివ్ ప్రాజెక్టులు, సైన్స్ ఫెయిర్ లాంటివి పరిశీలించే అవకాశం కలుగుతుంది. ► కళలు, చేతివృత్తులు, సాంస్కృతిక, సాహిత్య, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు (ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్) లైఫ్ స్కిల్స్ లాంటివి పెంపొందించుకునే అవకాశం కలుగుతుంది. ► పాఠశాల నిర్వహణలో సమాచార వ్యవస్థ, కమిటీల పాత్ర, పనితీరు గురించి తెలుస్తుంది. -
ఇంగ్లిష్, మ్యాథ్స్.. చాలా ఈజీ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విద్యా రంగంలో స్టార్టప్స్ అంటే? స్కూల్ సిలబస్‌ను స్మార్ట్ఫోన్లలోకి తీసుకొచ్చినవి.. ఆన్లైన్లో ఫీజులు, పాఠశాల నిర్వహణ చేసేవి.. లంచ్ బాక్స్‌లు అందించేవి..., స్కూల్ బిల్డింగ్స్ నిర్మాణం కోసం రుణాలిచ్చేవి... ఇలా చాలా ఉన్నాయి. కానీ, దేశంలో తొలిసారిగా వ్యక్తిగత విద్యార్థుల అభ్యసన ప్రక్రియలను అందుబాటులోకి తెచ్చింది మాత్రం హైదరాబాద్‌కు చెందిన ‘360 లెర్నింగే!’. అందులోనూ ఇంగ్లిష్, గణితం వంటి కీలక సబ్జెక్ట్స్ వర్క్‌షీట్స్‌ను కూడా అభివృద్ధి చేసింది. మరిన్ని వివరాలు సంస్థ కో–ఫౌండర్ జితేంద్ర మాచిరాజు ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ‘‘మాది తూర్పు గోదావరి జిల్లా. బీటెక్ పూర్తయ్యాక ఎక్స్‌సీడ్ ఎడ్యుకేషన్‌లో ఎనిమిదేళ్లు పనిచేశా. తర్వాత హయత్‌నగర్, చంపాపేట్‌లో సొంతంగా స్కూల్స్ పెట్టా. ఎక్స్సీడ్లో, స్కూల్స్‌లో ఉన్న సమయంలో గమనించిందేమిటంటే? విదేశాల్లో మాదిరిగా ఇక్కడి పాఠశాలల్లో వ్యక్తిగత అభ్యసన ప్రక్రియలు లేవు. దీనివల్లే విద్యార్థుల విద్యా విధానంలో తేడాలొస్తున్నాయని గమనించా! దీన్ని అధిగమించాలంటే స్టూడెంట్స్‌కు పర్సనల్ లెర్నింగ్ కావాలి. అందుకే మిత్రుడు కర్నాటి ప్రమోద్ కుమార్‌తో కలిసి 2015 నవంబర్ 14న రూ.10 లక్షల పెట్టుబడితో హైదరాబాద్ కేంద్రంగా 360 లెర్నింగ్ఎడ్యుటెక్.కామ్‌ను ప్రారంభించాం. ఇంటికే వర్క్‌షీట్స్.. ప్రస్తుతం 3 నుంచి 13 ఏళ్ల వయస్సు విద్యార్థులు లేదా 8వ తరగతి లోపు విద్యార్థులకు గణితం, ఇంగ్లిష్ సబ్జెక్ట్స్ వర్క్‌షీట్స్ అందిస్తున్నాం. పోటీ పరీక్షలతో సహా దేనికైనా మ్యాథ్స్, ఇంగ్లిష్‌పై పట్టుండాలి. అందుకే ఈ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేశాం. విద్యార్థి పరిజ్ఞానం, అభ్యసన తీరును బట్టి ఒక్కొక్క విద్యార్థికి ప్రత్యేకంగా వర్క్‌షీట్స్‌ను రూపొందిస్తాం. ఇందుకోసం 8 మంది నిపుణుల బృందం ఉంది. ఇందులో సబ్జెక్ట్స్ నిపుణులతో పాటూ పిల్లల మానసిక వేత్తలూ ఉంటారు. వర్క్‌షీట్స్‌ను పరిష్కరించేటపుడు ఏమైనా సందేహాలొస్తే... వీడియోకాల్ ద్వారా నిపుణులు అందుబాటులోకి వస్తారు. ప్రతి వారం విద్యార్థికి వ్యక్తిగత వర్క్‌షీట్స్‌ను ఇంటికి తీసుకెళ్లి ఇస్తాం. వాటి ని పరిష్కరించాక నిపుణుల బృందం పరిశీలిస్తుంది. తర్వాత విద్యార్థి అభ్యసన శక్తిని అంచనా వేసి వేరే వర్క్‌షీట్స్ అందిస్తుంటాం. 5 నెలలకు రూ.5 వేలు.. ప్రస్తుతం 360 లెర్నింగ్‌లో 3,500 మంది విద్యార్థులున్నారు. ఒక్క విద్యార్థికి ఒక్క సబ్జెక్ట్ వర్క్షీట్స్కు గాను 5 నెలలకు రూ.5 వేలు చార్జీ ఉంటుంది. త్వరలో ఐఐటీ ఫౌండేషన్ వర్క్‌షీట్స్‌ను విద్యార్థులకు అందిస్తాం. ఏడాదిలో మరో 2 వేల మంది విద్యార్థులను చేరుకోవటంతో పాటూ 10, 12వ తరగతుల గణితం, ఇంగ్లిష్ సిలబస్‌లను అందుబాటులోకి తేవాలని లకి‡్ష్యంచాం. ప్రస్తుతం ఆయా సిలబస్‌ల వర్క్‌షీట్స్ రూపొందిస్తున్నాం. త్వరలోనే పాఠశాలలతో ఒప్పందం చేసుకుంటాం. ఏడాదిలో సుమారు 15 పాఠశాలలతో ఒప్పందంతో సుమారు రూ.కోటి వ్యాపారాన్ని లకి‡్ష్యంచాం. రూ.5 కోట్ల నిధుల సమీకరణ.. గతేడాది రూ.75 లక్షల ఆదాయాన్ని ఆర్జించాం. ఈ ఏడాది రూ.2 కోట్లు వ్యాపారాన్ని చేరుకుంటాం. త్వరలో బెంగళూరు, చెన్నై, విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాల్లో సేవలను ప్రారంభించనున్నాం. ప్రస్తుతం మా సంస్థలో 40 మంది ఉద్యోగులున్నా రు. అజయ్ ఈడూరి, రవి మంథా ఇద్దరు కలిసి సీడ్ రౌండ్లో రూ.1.2 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఏంజిల్ రౌండ్లో రూ.5 కోట్లు సమీకరించనున్నాం. ఇన్వెస్టర్లతో చర్చలు జరుగుతున్నాయి. 6 నెలల్లో డీల్ క్లోజ్ చేస్తాం’’ అని జితేంద్ర వివరించారు. -
ఇంటర్మీడియెట్ Academic Guidance
ఇంటర్మీడియెట్ ఎంపీసీ:ఇంజనీర్‌గా కెరీర్లో స్థిరపడాలనుకునే వారు ఇంటర్మీడియెట్‌లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ (ఎంపీసీ) గ్రూపులో చేరొచ్చు. గణితంపై ఆసక్తి ఉండి, వివిధ సూత్రాలను వేగంగా అన్వయించే నైపుణ్యాలు ఉన్న విద్యార్థులకు ఎంపీసీ సరైన గ్రూప్. ఐఐటీ, నిట్లు, టాప్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఇంజనీరింగ్ సీటు సంపాదించాలంటే ఇంటర్లో చేరిన మొదటి రోజు నుంచి ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషిచేయాలి. ఎంసెట్, జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్, బిట్‌శాట్ తదితర పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకు కోసం కృషిచేయాలి. ఇంజనీరింగ్ కెరీర్‌పై ఆలోచన లేని వారు, ఎంపీసీ తర్వాత బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో బీఎస్సీలో అడుగుపెట్టి, తర్వాత ఎమ్మెస్సీ, పీహెచ్డీ వంటి ఉన్నత విద్యను అభ్యసించి పరిశోధనలు దిశగా వృత్తి జీవితాన్ని సుస్థిరం చేసుకోవచ్చు. బైపీసీతో వైద్యం: మొక్కలు, జంతువులపై ఆసక్తి ఉండి, విశ్లేషణాత్మక నైపుణ్యాలున్న వారికి సరిపడే గ్రూప్ బైపీసీ (బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ). వైద్య వృత్తిలో స్థిరపడాలనుకునే వారు తొలుత పూర్తిచేయాల్సిన గ్రూప్ ఇది. దీని సిలబస్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కష్టపడి చదివే తత్వం ప్రధానం. ఈ గ్రూప్‌లో ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం ఉంటుంది. అందువల్ల తరగతి గదిలో నేర్చుకున్న అంశాలను, ప్రయోగశాలలో పరిశీలించే విధంగా సన్నద్ధత అవసరం. బైపీసీ తర్వాత ఎంసెట్, ఎయిమ్స్, జిప్మర్, సీఎంసీ తదితర పరీక్షల ద్వారా ఎంబీబీఎస్‌లో చేరి డాక్టర్‌గా జీవితంలో స్థిరపడటం సుదీర్ఘ ప్రక్రియనే చెప్పాలి. రెండేళ్ల పాటు ఇంటర్ చదివిన తర్వాత ఎంబీబీఎస్, ఆ తర్వాత పీజీ కోర్సు చేయాలి. అందువల్ల ఆసక్తి, కుటుంబ ఆర్థిక పరిస్థితి ఆధారంగా బైపీసీలో చేరడంపై నిర్ణయం తీసుకోవాలి. సీఈసీ, ఎంఈసీ వ్యాపార వ్యవహారాలు, గణాంకాల విశ్లేషణపై ఆసక్తి ఉన్నవారికి సరైన గ్రూపులు సీఈసీ, ఎంఈసీ. ప్రస్తుత కార్పొరేట్ యుగంలో వ్యాపార, పారిశ్రామిక రంగం శరవేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో కామర్స్‌లో నైపుణ్యాలున్న వారికి అవకాశాలు పలకరిస్తున్నాయి. వీటిని అందిపుచ్చుకునేందుకు సరైన కోర్సులు సీఈసీ, ఎంఈసీ అని చెప్పొచ్చు. చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ వంటి ప్రొఫెనల్ కోర్సుల్లో రాణించేందుకు అనుకూలమైన గ్రూప్‌లు సీఈసీ, ఎంఈసీ. ఏ కోణంలో చూసినా ఇవి అవకాశాలకు వేదికగా నిలుస్తున్నవే. ఈ గ్రూప్‌లను ఎంపిక చేసుకునే విద్యార్థులకు సహనం ముఖ్యం. చిట్టాపద్దుల సమస్యలను సాధించే క్రమంలో ఒక్కోసారి చాలా సమయం వెచ్చించాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో సహనం కోల్పోతే నిర్దిష్ట అంశంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. సీఈసీ, ఎంఈసీ తర్వాత చాలా మంది బీకాంలో చేరతారు. ఇప్పుడు బీకాంలో కూడా పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా ప్రత్యేక స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. (ఉదా: బీకాం అడ్వర్టయిజింగ్, సేల్స్ అండ్ సేల్స్ ప్రమోషన్, ఫారిన్ ట్రేడ్ ప్రాక్టీసెస్, ట్యాక్స్ ప్రొసీజర్స్ అండ్ ప్రాక్టీసెస్). బ్యాచిలర్ డిగ్రీలో ఇలాంటి విభిన్న స్పెషలైజేషన్లను ఎంచుకోవడం ద్వారా త్వరగా స్థిరపడొచ్చు. హెచ్ఈసీ: సామాజిక అంశాలపై అవగాహన, సమాజంలో ఎప్పటికప్పుడు చోటుచేసుకునే పరిణామాలను అన్వేషించే నైపుణ్యం ఉన్నవారికి సరైన గ్రూప్ హెచ్ఈసీ. ఇంటర్ హెచ్ఈసీ పూర్తిచేసిన తర్వాత ఉన్నత విద్యాపరంగా ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. సర్టిఫికెట్ కోర్సుల నుంచి డిగ్రీ స్థాయి వరకు వివిధ కోర్సులను వీరు అభ్యసించవచ్చు. సంప్రదాయ డిగ్రీ కోర్సులతోపాటు జాబ్‌ఓరియెంటెడ్ డిప్లొమా కోర్సులు విద్యార్థులకు అందుబాటు లో ఉన్నాయి. ఉన్నతవిద్య మాత్రమే కాకుండా ఉన్నతోద్యోగాల దిశగా కూడా అనేక అవకాశాలున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే వివిధ ఉద్యోగ నియామక పరీక్షల్లో విజయం సాధించి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఖాయం చేసుకుని ఉన్నత కెరీర్‌కు బాటలు వేసుకోవచ్చు. ఉన్నత విద్య పరంగానూ హెచ్ఈసీ తర్వాత అనేక అవకాశాలున్నాయి. గ్రూప్ ఎంపికకు ఆసక్తి ప్రధానం ఇంటర్లో గ్రూపు ఎంపిక అనేది విద్యార్థి జీవితంలో చాలా కీలకమైనది. భవిష్యత్తు కెరీర్ మొత్తం దీనిపైనే ఆధారపడి ఉంటుంది. పాఠశాల స్థాయిలో తమకు ఏ సబ్జెక్టులపై ఎక్కువ ఆసక్తి ఉందో చూసుకొని, వాటి ఆధారంగా గ్రూపును ఎంపిక చేసుకోవాలి. రెండేళ్ల తర్వాత భవిష్యత్తు ఏమిటి? అనేదానిపై ఆలోచించి విద్యార్థులు, తల్లిదండ్రులు నిర్ణయం తీసుకోవాలి. - ఎం.ఎన్.రావు, శ్రీచైతన్య విద్యాసంస్థలు. వొకేషనల్ కోర్సులు అర్హత: పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు ఇంటర్మీడియెట్‌లో రెండేళ్ల కాల వ్యవధిగల ఒకేషనల్ కోర్సుల్లో ప్రవేశించవచ్చు. ఆరు కేటగిరీల్లో మొత్తం 27 కోర్సులు అందుబాటులో ఉన్నాయి.కోర్సులు: క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్, అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆఫీస్ అసిస్టెన్స్‌షిప్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ వంటి గ్రూపులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో టెక్నికల్ గ్రూపుల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు నేరుగా పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశించొచ్చు. అంతేకాకుండా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఐటీఐ విద్యార్థులకు నిర్వహించే అప్రెంటీస్ పరీక్ష రాసే అవకాశం కూడా ఇంటర్ వొకేషనల్ గ్రూపుల్లో టెక్నికల్ గ్రూప్ ఉత్తీర్ణులకు లభిస్తుంది.కెరీర్: బ్రాంచ్కనుగుణంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో అవకాశాలుంార. ప్రభుత్వ రంగంలో రైల్వేలు, గెయిల్, సెయిల్ వంటి భారీ కంపెనీల్లోనూ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. స్వయం ఉపాధి దిశగా వెళ్లొచ్చు. టీఎస్ఆర్జేసీ ఆహ్లాదకర వాతావరణంలో ఇంటర్ విద్యను అందిస్తున్నాయి తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు. ఇవి ము ఖ్యంగా గ్రామీణ, పేద, ప్రతిభావంతులైన విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని వారికి తోడ్పాటునందించేందుకు ఏర్పాటయ్యాయి. ఈ కళాశాలలను రాష్ట్రంలోని రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ సొసైటీ నిర్వహిస్తోంది. ప్రవేశాలు: రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే టీఎస్ఆర్జేసీ సెట్ ద్వారా అడ్మిషన్లు కల్పిస్తారు. ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. పదో తరగతి సిలబస్ ఆధారంగా ప్రశ్నలు వస్తాయి. ఎంచుకున్న గ్రూపును బట్టి మూడు సబ్జెక్ట్‌లలో పరీక్షను నిర్వహిస్తారు. మొత్తం 150 ప్రశ్నలు ఇస్తారు. తెలుగు/ఇంగ్లిష్, ఉర్దూ/ఇంగ్లిష్ భాషల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. నాణ్యమైన విద్య: మొత్తం నాలుగు కాలేజీలున్నాయి. జనరల్ జూనియర్ కళాశాలల్లో (ఇంగ్లిష్ మీడియం) ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూపులున్నాయి. మైనారిటీ జూనియర్ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపులున్నాయి. గురుకుల కళాశాలల్లో లేబొరేటరీలు, లైబ్రరీలు, ఆటస్థలాలు.. ఇలా విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులుంటాయి. అభ్యసనకు అనువైన వాతావరణం ఉంటుంది. అన్ని కళాశాలల్లో ఎంసెట్, సీఏ సీపీటీ పరీక్షలకు లాంగ్‌టర్మ్ ఇంటెన్సివ్ కోచింగ్ కూడా ఇస్తారు. వ్యవసాయ పాలిటెక్నిక్‌లు గ్రామీణ యువత స్వయం ఉపాధి కల్పించుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో వ్యవసాయ పాలిటెక్నిక్‌లు ఏర్పాటు చేశారు. పాలిటెక్నిక్‌లలో మూడు రకాల కోర్సులున్నాయి. అవి.. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ డిప్లొమా. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ కోర్సుల కాల పరిమితి రెండేళ్లు. ఇంజనీరింగ్ కోర్సు కాల పరిమితి మూడేళ్లు. అర్హత, ప్రవేశాలు: పదేళ్ల చదువు కాలంలో కనీసం నాలుగేళ్లు గ్రామీణ ప్రాంత పాఠశాలలో చదివి ఉండాలి. పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. ఇంటర్, ఆపై కోర్సులు పూర్తిచేసిన వారు అర్హులు కారు. అర్హత పరీక్షలో సాధించిన గ్రేడ్ పాయింట్ యావరేజ్(జీపీఏ) ప్రకారం కోర్సులలో ప్రవేశాలు కల్పిస్తారు.అవకాశాలు: వ్యవసాయ డిప్లొమా కోర్సులు పూర్తిచేసిన వారికి ఎరువులు, పురుగు మందులు, విత్తనాల సంస్థలు వంటివాటిలో ఉద్యోగాలు లభిస్తాయి. సొంత ప్రాజెక్టులతో స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయొచ్చు. ప్రారంభంలో రూ.15వేల వరకు వేతనం లభిస్తుంది. ఐటీఐ/ఐటీసీ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (ప్రభుత్వ), ఇండస్ట్రియ ల్ ట్రైనింగ్ సెంటర్ (ప్రైవేటు)లు సాంకేతిక రంగంలో శిక్షణ ఇచ్చే సంస్థలు. ఇవి కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ (డీజీఈటీ) పర్యవేక్షణలో పనిచేస్తున్నాయి. అర్హత: ఐటీఐ/ఐటీసీలలోని ట్రేడ్లలో పదో తరగతి లేదా తత్సమాన అర్హతతో చేరవచ్చు. కోర్సులు: ఐటీఐ/ఐటీసీలలో మూడు నెలలు మొదలుకొని మూడేళ్ల కాల పరిమితి గల ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, టర్నర్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్ తదితర కోర్సులున్నాయి. కెరీర్: కోర్సు పూర్తయ్యాక అప్రెంటీస్ చేయొచ్చు. ఈ సమయంలో విద్యార్థి వేతనం(స్టైఫండ్) లభిస్తుంది. వివిధ కో ర్సులను పూర్తిచేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో ఉద్యోగావకాశాలుంటాయి. రైల్వే, ఆర్మీ, పోలీసు, పారా మిలిటరీ తదితర విభాగాల్లో అవకాశాలుంటాయి. స్వ యం ఉపాధి దిశగా కూడా అడుగులు వేయొచ్చు. ఉన్నత చదువులకు వెళ్లాలనుకునే వారు ప్రవేశ పరీక్ష ద్వారా ఆ లక్ష్యాన్ని చేరుకోవచ్చు. వేతనాలు: ప్రారంభంలో నెలకు రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు వేతనం పొందొచ్చు. స్వయం ఉపాధికి ఊతం పదో తరగతి తర్వాత స్వల్ప వ్యవధిలోనే స్వయం ఉపాధి, ఆదాయం దిశగా ఉపయోగపడే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కోర్సుల్లో కొత్తవాటిని ప్రారంభించాలని, ఐటీఐ ఉత్తీర్ణులకు పాలిటెక్నిక్‌లలో లేటరల్ ఎంట్రీ పేరిట నేరుగా రెండో సంవత్సరంలో ప్రవేశం కల్పించే దిశగా కేంద్ర ప్రభు త్వం యోచిస్తోంది. ఇది కార్యరూపం దాల్చితే ఉన్నత విద్య, ఉద్యోగాల పరంగా మంచి అవకాశం లభించినట్లే. - ఎస్.పి.లక్ష్మణ స్వామి, ట్రైనింగ్ ఆఫీసర్, ఆర్ఐటీఐ, మహబూబ్‌నగర్. పాలిటెక్నిక్ కోర్సులు తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులు యువత సత్వర ఉపాధి పొందేందుకు వీలుకల్పిస్తున్నాయి. చిన్న వయసులోనే ఉన్నత ఉద్యోగాలు, అత్యున్నత సాంకేతిక విద్య దిశగా ప్రయాణించేందుకు పునాదులు వేస్తున్నాయి. అర్హత: పదో తరగతి లేదా తత్సమాన అర్హతతో పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాయొచ్చు. ఈ పరీక్షను స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎస్బీటీఈటీ) నిర్వహిస్తోంది. ఇందులో సాధించిన ర్యాంకు ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు.మూడేళ్ల కోర్సులు: సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్కండీషనింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వంటి బ్రాంచ్‌లున్నాయి. మూడున్నరేళ్ల కోర్సులు: కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వంటివి. కెరీర్: పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు పూర్తిచేసిన వారు ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ (బీటెక్/బీఈ) కోర్సుల్లో నేరుగా రెండో సంవత్సరంలో లేటరల్ ఎంట్రీ స్కీం ద్వారా ప్రవేశించవచ్చు. దీనికి ఈ-సెట్ రాయాల్సి ఉంటుంది. ఉద్యోగాల పరంగా చూస్తే ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలలో అవకాశాలు లభిస్తాయి. వీటికి సంబంధించి ఎంప్లాయ్మెంట్ న్యూస్, ప్రముఖ దినపత్రికలలో ప్రకటనలు వెలువడుతుంటాయి. డిప్లొమా కోర్సులు పూర్తిచేసిన వారు స్వయం ఉపాధిని కూడా పొందొచ్చు. వేతనాలు: చేరిన సంస్థనుబట్టి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ప్రారంభ వేతనం ఉంటుంది. పాలిటెక్నిక్‌తో బహుళ అవకాశాలు అనేక రంగాలు విస్తరిస్తూ ఉండడంతో పాలిటెక్నిక్ అర్హతతో విధులు నిర్వర్తించే సూపర్వైజరీ పోస్టుల సంఖ్య పెరుగుతున్నా... విద్యార్థులు అవగాహన లేమితో వదులుకుంటున్నారు. ప్రస్తుతం ఎన్నో ఆధునిక కోర్సులు వస్తున్నాయి. వాటిని పూర్తిచేస్తే ఎన్నో అవకాశాలుంటాయి. మూడేళ్ల కోర్సులో థియరీ నాలెడ్జ్‌తోపాటు ప్రాక్టికల్ నైపుణ్యాలను పెంచుకుంటే బీటెక్ అభ్యర్థులతో దీటుగా పోటీ పడే సామర్థ్యం కూడా లభిస్తుంది. - కె. కుమార స్వామి, ప్రిన్సిపాల్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ, హైదరాబాద్. -
టెన్త్ ఇంగ్లిష్‌లో మాయాబజార్!!
చిలుకూరు : టెన్త్ ఇంగ్లిష్ పాఠ్యాంశాల్లో ఈసారి సినిమాకు చోటు కల్పించారు. ఈ విద్యాసంవత్సరం నుంచి పదోతరగతి చదివే విద్యార్థులకు మారిన సిలబస్‌తో కొత్త పుస్తకాలు అందుబాటులో వచ్చాయి. ఇంగ్లిష్ సబ్జెక్ట్ లో నాలుగో పాఠం (టాపిక్: ఫిలిమ్స్ అండ్ థియేటర్) పూర్తిగా సిని మాలకు సంబంధించి ఉంది. మూడు భాగాలుగా ఉన్న ఈ పాఠ్యాంశంలో మొదటి అంశం(ఏ)గా బెంగాలీ ప్రముఖ డెరైక్టర్ సత్యజిత్‌రే, రెండవ అంశం(బీ) మాయాబజార్ తెలుగు సినిమా, మూడో అంశం(సీ) మహానటి సావిత్రి గురించి వివరించారు. చదువుతో పాటు విద్యార్థులకు సినిమాలపై అవగాహన ఉండేం దుకు ఇలా చేసి ఉండవచ్చని ఉపాధ్యాయులు అంటున్నారు. -
మ్యాథ్స్ లో మెరుగైన మార్కులు ఇలా..
కట్టా కవిత, స్కూల్ అసిస్టెంట్, కోదండపూర్, మహబూబ్ నగర్ పదో తరగతిలోని ఆరు సబ్జెక్టుల్లో విద్యార్థులు అత్యంత కష్టంగా భావించేది.. గణితం. ఇందులో ఎక్కువ మార్కులు పొందాలంటే మొదటి నుంచీ అన్ని అధ్యాయాలపై పట్టు తప్పనిసరి. గత ప్రశ్నపత్రాలను సాధన చేస్తూ, ఫ్యాకల్టీతో సందేహాలు నివృత్తి చేసుకోవాలి. మరో నాలుగు నెలల్లో పబ్లిక్ పరీక్ష లు జరగనున్న నేపథ్యంలో మ్యాథ్స్‌లో ‘ఏ’ గ్రేడ్ సాధించడానికి మార్గాలు.. విద్యార్థులు అందుబాటులో ఉన్న మూడు నెలల్లో గణితం పాఠ్యపుస్తకంలోని అన్ని అధ్యాయాలను సాధన చేయాలి. మిగిలిన నెల రోజులను పునశ్చరణ (రివిజన్)కు కేటాయించాలి. ఇప్పటి నుంచి ప్రణాళికాబద్ధంగా చదివినా ‘ఏ’ గ్రేడ్ సాధించొచ్చు. ఇప్పటికే పాఠశాలల్లో సిలబస్ పూర్తైఉంటుంది. మరికొద్ది రోజుల్లో జరగబోయే అర్ధ సంవత్సర పరీక్షలనే పబ్లిక్ పరీక్షలుగా భావించి సిద్ధం కావాలి. ఇంత తక్కువ సమయంలో అన్నింటినీ ప్రాక్టీస్ చేయాలంటే కొన్ని టెక్నిక్స్‌ను ఉపయోగించాలి. సాధారణ విద్యార్థి అయినా, ప్రతిభావంతుడైనా వీటిని ఉపయోగిస్తే అత్యధిక మార్కులు తెచ్చుకోవచ్చు. అధ్యాయాలవారీ విశ్లేషణ విద్యార్థులు మొదట గణితంలోని అధ్యాయాలను విశ్లేషించుకోవాలి. ఏయే చాప్టర్లు ఏ పేపర్, ఏ గ్రూప్ కిందకు వస్తాయో తెలుసుకోవాలి. ఆ గ్రూప్‌లో వేటిని ప్రిపేర్ అయితే ఎక్కువ మార్కులు సాధించవచ్చో పరిశీలించాలి. అంతేకాకుండా సులువైన, ఎక్కువ మార్కులు వచ్చేవాటిని గుర్తించాలి. కొందరికి కొన్ని చాప్టర్లు బాగా అర్థమై ఉంటాయి. వాటిని కూడా దృష్టిలో ఉంచుకుని సిద్ధమవ్వాలి. పేపర్-1 విశ్లేషణ ్జ్జకింది పట్టికను పరిశీలిస్తే గ్రూప్-ఏలో ప్రమేయాలు, బహుపదులు, గ్రూప్-బిలో ఏకఘాత ప్రణాళిక, శ్రేఢులకు ఎక్కువ మార్కులు కేటాయించారు. వాస్తవంగా సాధారణ విద్యార్థులకు ప్రవచనాలు-సమితులు, బహుపదులు, వాస్తవ సంఖ్యలు కొంతవరకు సులువుగా ఉంటాయి. మొత్తం మీద బహుపదులు, ఏకఘాత ప్రణాళికలోని గ్రాఫ్ ప్రశ్నలు, ప్రమేయాలు, శ్రేఢులలోని వ్యాసరూప ప్రశ్నలు, సమితులు, బహుపదులు, వాస్తవ సంఖ్యలలోని ముఖ్యమైన వ్యాసరూప ప్రశ్నలను నేర్చుకుంటే సరిపోతుంది. పేపర్-2 విశ్లేషణ పట్టికను పరిశీలిస్తే గ్రూప్-ఎలో రేఖాగణితం, వైశ్లేషిక రేఖాగణితం, గ్రూప్-బిలో త్రికోణమితి, మాత్రికలకు ఎక్కువ మార్కులు కేటాయించారు. వాస్తవంగా సాధారణ విద్యార్థులకు సాంఖ్యక శాస్త్రం, మాత్రికలు, గణన చాలా సులువుగా ఉంటాయి. వీటిలో అన్ని అభ్యాసాలను పూర్తి స్థాయిలో సాధన చేయాలి. మొత్తం మీద రేఖాగణితంలోని అన్ని నిర్మాణాలు, త్రికోణమితిలోని ఎత్తులు - దూరాలు (వీలైతే చాయిస్ కింద వదిలేయొచ్చు) ప్రశ్నలు ముఖ్యమైనవి. వీటితోపాటు వైశ్లేషిక రేఖాగణితంలో ముఖ్యమైన వ్యాసరూప ప్రశ్నలను నేర్చుకోవాలి. గత ప్రశ్నపత్రాల పరిశీలన మ్యాథ్స్‌లో అత్యధిక మార్కులు సాధించడానికి చక్కటి మార్గం.. గత ప్రశ్నపత్రాల సాధన. ముందుగా గత పదేళ్ల గణితం ప్రశ్నపత్రాలను సేకరించి, వాటిలోని ప్రశ్నలన్నింటినీ ప్రాక్టీస్ చేయాలి. ప్రతి అధ్యాయంలో ఇచ్చే ప్రశ్నల స్థాయి (సులభం, కఠినం) గమనించాలి. ఏయే ప్రశ్నలు వ్యాసరూప ప్రశ్నలుగా, స్వల్ప సమాధాన ప్రశ్నలుగా వస్తున్నాయో తెలుసుకోవాలి. అంతేకాకుండా ఏయే ప్రశ్నలు తరచుగా పునరావృతమవుతున్నాయో పరిశీలించాలి. ఏ చాప్టర్ల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయో, వేటి నుంచి తక్కువ ప్రశ్నలు అడుగుతున్నారో గుర్తించాలి. అతి ముఖ్యమైన ప్రశ్నలను వీలైనన్నిసార్లు ప్రాక్టీస్ చేయాలి. ఇలా చేస్తే ఏ ప్రశ్నలను చాయిస్ కింద వదిలేయాలనే అంశంపై అవగాహన ఏర్పడుతుంది. పోటీ పరీక్షల్లో మ్యాథ్స్ పదోతరగతి తర్వాత పాలిటెక్నిక్‌లో చేరడానికి రాసే పాలిసెట్‌లో సగానికి సగం ప్రశ్నలు మ్యాథ్స్ నుంచే ఉంటాయి. అదేవిధంగా ఏపీఆర్జేసీ ప్రవేశ పరీక్షల్లో, వివిధ ఒలింపియాడ్స్, నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ పరీక్షల్లో మ్యాథ్స్ ప్రాధాన్యం ఎంతో. ఈ అన్ని పరీక్షల్లోనూ విజయం సాధించాలంటే మ్యాథ్స్‌కు సంబంధించి ముఖ్య భావనలు, సూత్రాలు, సిద్ధాంతాలను బాగా చదవాలి. అదే విధంగా ప్రీవియస్ ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. ప్రిపరేషన్ విధానం ఎంసెట్ విద్యార్థులు ముందుగా పేపర్-1, 2లలో అధ్యాయాలవారీగా మార్కుల వెయిటేజి తెలుసుకోవాలి. తర్వాత గత పదేళ్ల ప్రశ్నపత్రాలను పరిశీలించాలి. కష్టమైన సబ్జెక్టు కాబట్టి ప్రతిరోజూ క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి. రోజూ మూడు లేదా నాలుగు గంటలు గణితానికి కేటాయించాలి. ఉదయం లేదా సాయంత్రం ప్రిపరేషన్‌కు సిద్ధం కావాలి. నిర్మాణాలు నేర్చుకోవడం సాధారణ విద్యార్థులకు సులభం. నిర్మాణ పటాలు గీయడం, నిర్మాణ క్రమం రాయడమే కాకుండా చిత్తు పటం వేయాలి. ఉపపత్తి ఉన్న నిర్మాణాలకు ఉపపత్తి రాయాలి. ఎందుకంటే నిర్మాణ పటానికి రెండు మార్కులు, నిర్మాణ క్రమానికి 12 మార్కులు, చిత్తు పటానికి 2 మార్కు, ఉపపత్తికి 1 మార్కు కేటాయిస్తారు. ఎత్తులు - దూరాలలోని ముఖ్యమైన ప్రశ్నలను బాగా సాధన చేయాలి. వ్యాసరూప ప్రశ్నలకు ఇలా పేపర్-1లో ప్రమేయాలు, శ్రేఢుల నుంచి, పేపర్-2లో వైశ్లేషిక రేఖాగణితం, మాత్రికల నుంచి నాలుగు మార్కుల ప్రశ్నలను రెండేసి చొప్పున ఇస్తారు. కాబట్టి విద్యార్థులు ఈ అధ్యాయాలలోని వ్యాసరూప ప్రశ్నలన్నింటిని తప్పకుండా నేర్చుకోవాలి. ఇవేకాకుండా పేపర్-1లో సమితులలోని మూలకోపపత్తి ప్రశ్నలు, బహుపదులలోని శేష సిద్ధాంతానికి సంబంధించిన వ్యాసరూప ప్రశ్నలు, ఏకఘాత ప్రణాళికలో (అభ్యాసం-3) , వాస్తవ సంఖ్యలు (అభ్యాసం-2)లోని ముఖ్యమైన వ్యాసరూప ప్రశ్నలను బాగా సాధన చేయాలి. పేపర్-2లోని రేఖాగణితంలోని ముఖ్యమైన ఆరు సిద్ధాంతాలు, సాంఖ్యక శాస్త్రం, త్రికోణమితిలోని(అభ్యాసం-4) వ్యాసరూప ప్రశ్నలు, గణనలోని క్రమ చిత్రాలు ప్రాక్టీస్ చేయాలి. తర్వాత వాటిని సరిచూసుకోవాలి. స్వల్ప సమాధాన ప్రశ్నలకు ఇలా విద్యార్థులు 10 గ్రేడ్ పాయింట్లు సాధించాలంటే వ్యాసరూప ప్రశ్నలతోపాటు ఒక మార్కు, రెండు మార్కుల ప్రశ్నలను కూడా బాగా సాధన చేయాలి. గత ప్రశ్నపత్రాల ఆధారంగా ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్లకు అధిక సమయం కేటాయించాలి. ఈ క్రమంలో చాలాసేపు రాత్రి పూట మేల్కొని ఉండకూడదు. మనసు ప్రశాంతంగా లేనప్పుడు ప్రిపరేషన్ చేయకూడదు. సూత్రాలను గుర్తుంచుకోవాలంటే ప్రతి అధ్యాయంలో వచ్చే సూత్రాలన్నింటినీ చాప్టర్లవారీగా ఒకచోట రాసుకుని, వాటిని పదేపదే చదవాలి. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా మననం చేసుకోవాలి. ఎందుకంటే గణితం అనేది సూత్రాలపై ఆధారపడిన సబ్జెక్టు. రాసేటప్పుడు సూత్రాలు గుర్తుకు రాకపోతే సమాధానాన్ని అసలు మొదలు పెట్టలేం. కాబట్టి సూత్రాలను, అందులోని పదాలను క్షుణ్నంగా నేర్చుకోవాలి. సిద్ధాంతాలు చదవాలిలా సిద్ధాంతాలు ఎక్కువగా రేఖాగణితంలో వస్తాయి. వీటిని గుడ్డిగా కంఠస్తం చేయకుండా పటం ఆధారంగా నేర్చుకోవాలి. సిద్ధాంతాల నిర్వచనాలను, వాటి ఉపపత్తులను చూడకుండా రాసి సరి చూసుకోవాలి. నిర్మాణాలు, గ్రాఫ్‌లు ప్రిపరేషన్ పేపర్-1లోని బహుపదులలోని పరావలయం గ్రాఫ్, ఏకఘాత ప్రణాళిక గ్రాఫ్ ముఖ్యమైనవి. వీటిలో ఏదో ఒకటి ఐదు మార్కుల ప్రశ్నగా రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఏదో ఒక అధ్యాయంలోని గ్రాఫ్‌లను క్షుణ్నంగా నేర్చుకోవాలి. వీటిని తప్పుల్లేకుండా గీయాలి. అదేవిధంగా స్కేలు గుర్తించాలి. పేపర్-2లో రేఖాగణితంలోని నిర్మాణాలు లేదా ఎత్తులు-దూరాలలోని ప్రశ్నల్లో ఐదు మార్కుల ప్రశ్నలను ఒక చోట రాసి ఉంచుకుని, వాటిని బాగా ప్రాక్టీస్ చేయాలి. పేపర్-1లో ప్రమేయాలు, వాస్తవ సంఖ్యలు, పేపర్-2లో వైశ్లేషిక రేఖాగణితం, గణన అధ్యాయాల నుంచి రెండు మార్కుల ప్రశ్నలను రెండేసి చొప్పున ఇస్తారు. కాబట్టి ఈ చాప్టర్లలోని అన్ని రెండు మార్కుల ప్రశ్నలను నేర్చుకుంటే ఒక మార్కు ప్రశ్నలను సాధన చేయాల్సిన అవసరం ఉండదు. ఇవేకాకుండా పేపర్-1లో ప్రవచనాలలోని విపర్యయ, విలోమ ప్రతివర్తిత ప్రశ్న, సత్యపట్టికలు మొదలైనవి ముఖ్యమైనవి. సమితుల లో రెండు మార్కులకు ఇచ్చే మూలకోపపత్తి ప్రశ్నలు, బహుపదులలోని వర్గ సమీకరణం (అభ్యాసం-1), శేష సిద్ధాంతం, అసమీకరణాలు సాధించడం, ద్విపద సిద్ధాంతంలోని స్వల్ప సమాధాన ప్రశ్నలు, ఏకఘాత ప్రణాళికలోని ముఖ్యమైన స్వల్ప సమాధాన ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. పేపర్-2లో రేఖాగణితం, సాంఖ్యక శాస్త్రం, త్రికోణమితి, గణనలలోని స్వల్ప సమాధాన ప్రశ్నలను క్షుణ్నంగా నేర్చుకోవాలి. ఈ అధ్యాయాల్లో ఒక్కో చాప్టర్ నుంచి రెండు మార్కుల ప్రశ్న ఒకటి మాత్రమే వస్తోంది. బిట్స్‌కు ఇలా సిద్ధమవ్వండి: బిట్స్‌కు చాయిస్ ఉండదు. కాబట్టి పాఠ్యపుస్తకంలో ప్రతి అధ్యాయంలోని బిట్స్‌ను బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రతి పాఠ్యాంశం చివర ఉన్నవాటిని చదవాలి. గత ప్రశ్నపత్రాలు, ఏపీఆర్జేసీ, పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నల సాధన కూడా తప్పనిసరి. ఇలా చేస్తే బిట్ పేపర్లలో 30కు 30 మార్కులు సాధించవచ్చు. సాధారణ విద్యార్థులు: పేపర్-1లో ప్రవచనాలు-సమితులు, ప్రమేయాలు, బహుపదులలోని గ్రాఫ్ ప్రశ్నలు, ఏకఘాత ప్రణాళికలోని (అభ్యాసం-3) వ్యాసరూప ప్రశ్నలు, శ్రేఢుల్లోని హరాత్మక శ్రేఢి, పేపర్-2లో రేఖాగణితంలోని ఆరు ముఖ్యమైన సిద్ధాంతాలు, వైశ్లేషిక రేఖాగణితంలోని త్రిభుజ వైశాల్యంపై ప్రశ్నలను బాగా సాధన చేయాలి. వీటితోపాటు సాంఖ్యక శాస్త్రం, మాత్రికలు, గణన నేర్చుకోవాలి. పదికి పది గ్రేడ్ పాయింట్లు సాధించడం: గణితం ప్రశ్నపత్రం పేపర్-1, పేపర్-2 కలిపి 158 మార్కులకు (పేపర్-1, 79 మార్కులు, పేపర్-2, 79 మార్కులు) ఉంటుంది. ఇందులో 58 మార్కులు చాయిస్ కింద వదిలివేసినప్పటికి వంద శాతం మార్కులు సాధించవచ్చు. బిట్స్‌లో చాయిస్ ఉండదు కాబట్టి కొన్నింటిలో తప్పులు దొర్లినా 92-100 మధ్య మార్కులు సాధిస్తే 10 గ్రేడ్ పాయింట్లు సాధించినట్లే. ఇదే ప్రిపరేషన్ విధానాన్ని మిగతా సబ్జెక్టులకు అన్వయించుకోవచ్చు. -
స్వీయ ప్రిపరేషన్.. అప్లికేషన్ స్కిల్స్ కీలకం
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ మొదలైంది... మరో మూడు వారాల్లో తరగతులు కూడా ప్రారంభమవుతాయి.. భవ్యమైన కెరీర్‌కు తొలి ప్రస్థానం మొదలవుతుంది.. ఫ్యాకల్టీలు, తల్లిదండ్రుల పరిమితుల నుంచి.. ఇంజనీరింగ్ అనే విశాల ప్రపంచంలోకి అడుగుపెడతారు.. నాలుగేళ్ల ఈ కోర్సులో వేసే ప్రతి అడుగు మీ భవిష్యత్ గమనాన్ని నిర్దేశిస్తుంది.. ఉన్నత కెరీర్‌కు బాటలు వేస్తుంది.. ఇందుకోసం కోర్సులో చేరిన మొదటి రోజు నుంచే కృషి చేయాలి.. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ కోర్సులో చేరబోయే విద్యార్థులు సక్సెస్ఫుల్ కెరీర్ దిశగా అనుసరించాల్సిన వ్యూహాలు, సూచనలు.. వి. ఉమా మహేశ్వర్, ప్లేస్మెంట్ ఆఫీసర్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఓయూ. వివిధ పరిమితులు, పర్యవేక్షణల మధ్య ఇంటర్లో రెండేళ్లపాటు అహర్నిశలు శ్రమించి.. ఇంజనీరింగ్ కోర్సులో అడుగు పెట్టిన విద్యార్థికి భిన్నమైన వాతావరణం, కొత్త స్నేహితులు, లభించిన స్వేచ్ఛతో.. ప్రారంభంలో అంతా కలలా.. కొత్త ప్రపంచంలో విహరిస్తున్నట్లు ఉంటుంది. అది కొంత వరకే పరిమితం కావాలి. అక్కడి నుంచి ఉన్నత కెరీర్ దిశగా హార్డ్ వర్క్ ప్రారంభించాల్సిందే. ప్రారంభం ఇక్కడే ఇంజనీరింగ్‌లో సీటు లభించగానే చాలా మంది విద్యార్థులు తాము అంతా సాధించామనే ధోరణిలో ఉంటారు. దీంతో అకడమిక్స్ రెండో ప్రాధాన్యతగా మారిపోతాయి. అది సరికాదు. ఇంజనీరింగ్ వరకు రావడానికి ఏవిధంగా శ్రమించారో..దాన్ని ఈ కోర్సులో కూడా కొనసాగించాలి. ‘కడ జ్చిటఛీ ఠీౌటజు ట్ట్చట్టట ౌఠీ’’ అనే భావనను పెంపొందించుకుంటే ఈ నాలుగేళ్ల కోర్సును విజయవంతంగా పూర్తి చేయడంతోపాటు చక్కటి భవిష్యత్‌కు పునాది ఏర్పడుతుంది. ఇక్కడ వేసే ప్రతి అడుగు కీలకమే. స్వతహాగా ఇంజనీరింగ్‌లోకి ప్రవేశించిన విద్యార్థి ప్రధానంగా గమనించాల్సిన అంశాలు.. ఇంటర్మీడియెట్ మాదిరిగా ఈ కోర్సులో స్ఫూన్ ఫీడింగ్ ఉండదు. ఇంజనీరింగ్‌లో పూర్తి భిన్నమైన పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి. స్వీయ ప్రిపరేషన్ (సెల్ఫ్ లెర్నింగ్ మోడ్) దిశగా అడుగులు వేయాలి. ఇంటర్మీడియెట్‌లో ఆయా సబ్జెక్ట్‌లకు ఆయా పుస్తకాలు.. అనే నిర్దేశిత విధానం ఉంటుంది. ఇంజనీరింగ్‌లో అలా ఉండదు. ఒక్కో సబ్జెక్ట్ కోసం పలు రకాల పుస్తకాలను రిఫర్ చేయాల్సి ఉంటుంది. బాధ్యత ఎక్కువే ఇంటర్మీడియెట్ మాదిరిగా అన్ని సిద్ధంగా ఉంటాయని అనుకోవద్దు. లెక్చరర్ అన్ని చెప్పాలి అనే ధోరణి నుంచి బయటికి రావాలి. ఇంజనీరింగ్‌లో లెక్చరర్స్ సిలబస్‌కు సంబంధించి ప్రాథమిక భావనల (ఫండమెంటల్స్ కాన్సెప్ట్స్)ను మాత్రమే బోధిస్తారు. కొంత వరకు అప్లికేషన్స్‌ను వివరిస్తారు. అంటే విద్యార్థి మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది. తదనుగుణంగా తనను తాను సిద్ధం చేసుకోవాలి. ముఖ్యంగా కాన్సెప్ట్స్, అప్లికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి. అప్లికేషన్ పద్ధతిలో ప్రిపరేషన్ సాగించాలి. లెక్చరర్ చెప్పిన అంశాలను ఏవిధంగా అన్వయించవచ్చో స్వతాహాగా తెలుసుకోవాలి. అప్పుడే సబ్జెక్ట్‌పై పట్టు వస్తుంది. దీనికి భిన్నంగా ప్రిపరేషన్ సాగిస్తే.. డిగ్రీ సాధించవచ్చమోగానీ నాలెడ్జ్‌ను మాత్రం పెంపొందించుకోలేరు. అంతేకాకుండా ఎగ్జామ్స్‌లో కూడా విద్యార్థిలోని అప్లికేషన్ స్కిల్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలు వస్తాయి. ఇంటర్మీడియెట్ వరకు ఒక అంశానికి సంబంధించి నిర్వచనం (డెఫినేషన్) వరకు మాత్రమే నేర్చుకునే వారు. కానీ ఇంజనీరింగ్‌లో అలా ఉండదు. ఒక అంశానికి సంబంధించి విస్తృత స్థాయిలో వివరణ ఉంటుంది. ఒక సూత్రాన్ని నేర్చుకుంటే దాన్ని ఏ విధంగా అన్వయించాలి? అనే అంశానికి ప్రాధాన్యత ఉంటుంది. ఉదాహరణకు టర్బో ఇంజిన్, గ్యాస్ కంప్రెసర్కు సంబంధించిన కాన్సెప్ట్స్‌ను ఆయా పరికరాల డిజైన్ విధానంలో ఏవిధంగా అన్వయిస్తారు? అనే అంశంపై ఎక్కువగా దృష్టి ఉంటుంది. అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్‌కు ప్రాముఖ్యతనిస్తారు. నిరంతరం ప్రయోగాలు చేస్తూ.. ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచుకోవాలి. దీని వల్ల బేసిక్స్‌పై సులువుగా పట్టు సాధించవచ్చు. అంతేకాకుండా ఇంజనీరింగ్‌లో ప్రాక్టికల్స్‌కు 30 శాతం వెయిటేజీ ఉంటుంది. కోర్సు ఇలా:ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో సబ్జెక్ట్‌లు అందరికీ కామన్‌గా ఉంటాయి. ఇందులో హ్యుమానిటీస్కూ ప్రాధాన్యత ఉంటుంది. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్ అంశాలు ఉంటాయి. ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్‌ను ఈ ఏడాదిలోనే పరిచయం చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఇంటర్మీడియెట్‌కు కొనసాగింపుగా ఇంజనీరింగ్ మొదటి సంవత్సరాన్ని పేర్కొనవచ్చు. ఇంటర్మీడియెట్‌తో పోల్చితే.. ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌లు అడ్వాన్స్డ్గా ఉంటాయి. ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో కోర్ సబ్జెక్ట్‌లు, ఇంటర్ డిసిప్లినరీ సబ్జెక్ట్‌లు ఉంటాయి. అంటే ఒక బ్రాంచ్ విద్యార్థికి మరో బ్రాంచ్‌కు సంబంధించిన కొన్ని అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఉదాహరణకు మెకానికల్ విద్యార్థికి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అంశాలను బోధిస్తారు. మూడు, నాలుగు సంవత్సరాల్లో పూర్తిగా కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. నాలెడ్జ్ షేరింగ్:ఇంజనీరింగ్‌లో సిలబస్ విస్తృత స్థాయిలో ఉంటుంది. కాబట్టి ఇంటర్ మాదిరిగా వ్యక్తిగతంగా నేర్చుకునే పద్ధతి (Individual learning) సరిపోదు. అది కేవలం ర్యాంకులు సాధించడానికి మాత్రమే పరిమితం. కాని ఇంజనీరింగ్‌లో ర్యాంకులకు కాదు నాలెడ్జ్‌కు ప్రాధాన్యతనిస్తారు. ఈ విషయాన్ని గమనించి గ్రూప్ లెర్నింగ్, కంబైండ్ లెర్నింగ్ అలవర్చుకోవాలి. ఉదాహరణకు ప్రోగ్రామ్‌కు సంబంధించి ఒక కోడ్ రాస్తే.. దానిపై తోటి స్నేహితులందరితో చర్చించాలి. ఇలా చేయడం ద్వారా ఎక్కువ విషయాలను నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అవసరమైతే సీనియర్లు, లెక్చరర్ల సలహాలను తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు నాలెడ్జ్ షేరింగ్‌కు ప్రాధాన్యతనివ్వాలి. ప్రశ్నించే తత్వం:ఇంజనీరింగ్‌లో విద్యార్థి ప్రధానంగా పెంపొందించుకోవాల్సిన లక్షణం.. ప్రశ్నించే తత్వం. ఒక అంశంపై వచ్చిన సందేహాలను ఎప్పటికప్పుడూ లెక్చరర్లు, సీనియర్ల సహాయంతో నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎవరు అడగటం లేదు కదా అని మనం కూడా ముభావంగా ఉండటం సరికాదు. ఒక అంశానికి సంబంధించి.. అది ఏ విధంగా వచ్చింది. దాన్ని ఎలా అన్వయించాలి? అనే ఆసక్తిని పెంపొందించుకోవాలి. అప్పుడే సబ్జెక్ట్‌పై పట్టు సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇంగ్లిష్ మస్ట్:ప్రస్తుత గ్లోబలైజేషన్ యుగంలో ఇంజనీరింగ్ విద్యార్థులందరికీ ఇంగ్లిష్ భాషపై పట్టు తప్పనిసరి. కోర్సులో చేరిన మొదటి రోజు నుంచే ఇంగ్లిష్‌లో మాట్లాడటానికి ప్రయత్నించాలి. ఈ దిశగా ఇంగ్లిష్ భాష నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలి. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం, తెలుగు మీడియం విద్యార్థులు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపా లి. ద హిందూ, ఎకనమిక్ టైమ్స్ వంటి దినపత్రికలతోపాటు అవుట్‌లుక్, ఇండియా టుడే వంటి మ్యాగజైన్లు చదవడం, బీబీసీ, సీఎన్‌బీసీ-టీవీ18, వంటి చానల్స్ చూస్తూ వినడం ద్వారా ఇంగ్లిష్ భాషపై పట్టు సాధించవచ్చు. లక్ష్యాలపై స్పష్టత:ఇంజనీరింగ్ నాలుగేళ్ల కోర్సులో మొదటి సంవత్సరంలోనే సబ్జెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరంలో విద్యార్థులు అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. రెండో సంవత్సరంలో కెరీర్ విషయంలో స్పష్టత తెచ్చుకోవాలి. ఉన్నత విద్య, ఉద్యోగం అనే విషయంలో రెండో సంవత్సరంలో ఒక లక్ష్యాన్ని ఏర్పర్చుకోవాలి. ఈ విషయంలో సీనియర్లు, ఇంటర్నెట్, ఫ్యాకల్టీ, తల్లిదండ్రులు, నిపుణుల సహకారం తీసుకోవాలి. దీనికి సంబంధించిన సన్నాహాలను మూడో సంవత్సరం నుంచే ప్రారంభించాలి. ఉదాహరణకు యూఎస్‌లో ఎంఎస్ చేయాలంటే అందుకు సంబంధించిన పరీక్షలకు హాజరు కావడం, పాస్‌పోర్ట్ తదితర అంశాలను మూడో ఏడాదిలోనే పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే నాలుగో సంవత్సరం ప్రాజెక్ట్ వర్క్, క్యాంపస్ ప్లేస్మెంట్ వంటి కార్యకలాపాలు ఉంటాయి. ఇవి తప్పనిసరిగా చేయాల్సినవి. దీంతో కెరీర్‌కు సంబంధించిన సన్నాహాలకు సమయం కేటాయించడం సాధ్యం కాకపోవచ్చు. మూడో సంవత్సరంలోనే కొన్ని రీసెర్చ్ పేపర్లను రాయాలి. టీమ్ మ్యాన్:ఇంటర్లో విద్యార్థులు కొంత వరకు అంతర్ముఖులుగా ఉంటారు. ఇంజనీరింగ్‌లో కూడా అదేవిధంగా ఉంటే కెరీర్లో ముందుకెళ్లటం కష్టం. ఎందుకంటే ప్రస్తుతం కార్పొరేట్ కంపెనీలు జట్టుగా పని చేసే తత్వం (టీమ్ మ్యాన్) ఉన్న వారికే నియామకాల్లో ప్రాధాన్యతనిస్తున్నాయి. ఎందుకంటే కంపెనీల్లో పలు విభాగాల మధ్య సమన్వయంతో పనిచేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి కోర్సులో చేరిన మొదటి రోజు నుంచే అందరితో ఇంటరాక్షన్ పెంచుకోవడానికి ప్రయత్నించాలి. గ్రూప్ యాక్టివిటీస్‌లో చురుగ్గా పాల్గొనాలి. బిడియం పోవడానికి గ్రూప్ మూవింగ్ ఓ చక్కటి ప్రత్యామ్నాయం. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో చురుగ్గా పాల్గొనాలి. నో బ్యాక్‌లాగ్స్:ఇంజనీరింగ్‌లో చేరే విద్యార్థులు గమనించాల్సిన కీలక అంశం.. బ్యాక్‌లాగ్స్. ప్రస్తుత జాబ్ మార్కెట్‌ను పరిగణనలోకి తీసుకుంటే ఎటువంటి బ్యాక్‌లాగ్స్ లేని విద్యార్థులకు మాత్రమే కంపెనీలు ప్రాధాన్యతనిస్తున్నాయి. అంతేకాకుండా బ్యాక్‌లాగ్స్ ఉంటే.. కనీసం క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో పరిగణనలోకి కూడా తీసుకోరు. ఉదాహరణకు మారుతి సుజుకి కంపెనీని తీసుకుంటే ‘నో బ్యాక్‌లాగ్స్ అప్ టు ఇంజనీరింగ్’ అనే నియమాన్ని పాటిస్తుంది. మైక్రోసాఫ్ట్ తదితర టాప్ కంపెనీలన్నీ కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మొదటి సంవత్సరం నుంచి ఏ సంవత్సరానికి సంబంధించిన పరీక్షలను ఆ సంవత్సరంలోనే మొదటి ప్రయత్నంలో పూర్తి చేయాలి. క్యాంపస్ ప్లేస్మెంట్లలో కూడా డిస్టింక్షన్ అభ్యర్థులకే అవకాశాలు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు కేవలం కనీస ఉత్తీర్ణత ఆలోచనకు స్వస్తి పలికి.. డిస్టింక్షన్లో పాస్ కావడానికి ప్రయత్నించాలి. 80 నుంచి 85 శాతం మార్కులు సాధించాలి. నోట్స్ ప్రిపరేషన్:ఇంటర్మీడియెట్ మాదిరిగా ఇక్కడ స్పూన్ ఫీడింగ్ ఉండదు. కాబట్టి సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అలవర్చుకోవాలి. ఈ విషయంలో లైబ్రరీని ప్రభావవంతంగా వినియోగించుకోవాలి. ఒక సబ్జెక్ట్‌కు సంబంధించి అందుబాటులో ఉన్న అన్ని పుస్తకాలను రిఫర్ చేయడం మంచిది. ఎగ్జామినేషన్స్ కోసమైతే.. ఒక్క పుస్తకం సరిపోతుంది. కానీ నాలెడ్జ్ కోసం మాత్రం ఐదు-ఆరు పుస్తకాలను రిఫర్ చేయడం తప్పనిసరి. ఇక్కడ అందుబాటులో ఉన్న పుస్తకాల్లో దేన్ని ఎంచుకోవాలనే విషయంలో కొంత గందరగోళం సహజం. ఈ సందర్భంలో ఆయా అంశాలకు సంబంధించి కాన్సెప్ట్స్‌ను వర్ణించిన తీరు, భాష సులభంగా ఉన్న ప్రామాణిక పుస్తకాలను చదవాలి. అందులోని అంశాలను పాయింట్స్ రూపంలో నోట్ చేసుకోవాలి. అంతేకాకుండా ఇంటర్నెట్, ఆన్లైన్ బ్లాగ్స్‌ను కూడా నోట్స్ ప్రిపరేషన్లో ప్రభావవంతంగా వినియోగించుకోవాలి. ల్యాబ్ పాత్ర:లేబొరేటరీలది కీలకపాత్ర అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంజనీరింగ్ అప్లికేషన్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్. సంబంధిత ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచుకోవడంతోపాటు బేసిక్స్‌ను నేర్చుకోవడానికి ప్రాక్టికల్స్ దోహదం చేస్తాయి. సబ్జెక్ట్‌కు సంబంధించి ఒక ఫార్ములా.. ఏవిధంగా వస్తుంది? దాన్ని ఎలా అన్వయం చేసుకోవాలి? అనే అంశాలను ఆలోచనా, సృజనాత్మకత, ఊహాత్మక శక్తి వంటి స్కిల్స్‌ను ఉపయోగించి.. థియరీ, ప్రాక్టికల్‌ను ల్యాబ్ ద్వారా కో-రిలేట్ చేసుకోవడం జరుగుతుంది. తద్వారా ఇంజనీరింగ్‌లో కీలకమైన బేసిక్స్‌పై పట్టు సాధించడం వీలవుతుంది. మొదటి రోజు నుంచే:ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రస్తుత జాబ్మార్కెట్లో రాణించాలంటే నైపుణ్యాలు ఎంతో కీలకం. కాబట్టి ఇందుకు సంబంధించిన అంశాలను కోర్సులో చేరిన మొదటి రోజు నుంచే మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే స్కిల్స్‌పై పట్టు సాధించడం ఒక్క రోజులోనే సాధ్యమయ్యే పని కాదు. ఇది నిరంతరం సాగే ప్రక్రియ. ఎప్పటికప్పుడు స్కిల్స్‌ను అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఈ క్రమంలో కమ్యూనికేషన్ స్కిల్స్, ఆర్గనైజింగ్ స్కిల్స్, జట్టుగా పని చేసే నైపుణ్యం, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి. ఇందుకు కాలేజీని చక్కటి వేదికగా వినియోగించుకోవాలి. గ్రూప్ డిస్కషన్, టీమ్ ఈవెంట్స్‌లో పాల్గొనడం ద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పెంచుకోవచ్చు. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో పాలుపంచుకోవడం కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్కు కూడా ఆస్కారం లభిస్తుంది. వివిధ రకాల ఈవెంట్లు, టెక్నికల్ ఫెస్టివల్స్ నిర్వహించడం ద్వారా ఆర్గనైజింగ్ స్కిల్స్, జట్టుగా పని చేసే నైపుణ్యం అలవడుతుంది. అంతేకాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో చురుగ్గా పాలుపంచుకోవాలి. ఇంటర్-కాలేజ్ స్పోర్ట్స్, సెమినార్ల నిర్వహణ, కంపెనీలు నిర్వహించే వివిధ రకాల పోటీ పరీక్షలు, టెక్నికల్ కాంపిటీషన్స్‌కు హాజరుకావాలి. తద్వారా చక్కటి పరిజ్ఞానం అలవడుతుంది. అంతేకాకుండా ఈ అంశాలను రెజ్యుమెలో పొందుపరచడంతో క్యాంపస్ ప్లేస్మెంట్ సమయంలో ప్రయోజనకరంగా ఉంటుంది. సక్సెస్ఫుల్ కెరీర్‌కు స్కిల్స్: టెక్నికల్ స్కిల్స్‌పై పట్టు సాధించాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపరుచుకోవాలి. ఇంగ్లిష్ భాషపై పట్టు పెంచుకోవాలి. జట్టుగా పని చేసే సామర్థ్యాన్ని (గుడ్ టీమ్ వర్కర్) పెంపొందించుకోవాలి. ప్రజెంటేషన్ స్కిల్స్‌ను మెరుగుపరుచుకోవాలి. ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అభివృద్ధి చేసుకోవాలి. ఇంజనీరింగ్ కోర్సులో తప్పక చేయాల్సినవి: ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలి. క్రమం తప్పకుండా తరగతులకు హాజరు కావాలి హాజరు 75 శాతం ఉండాలి నాలెడ్జ్ షేరింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. రోజుకు కనీసం మూడు గంటలు చదవాలి లైబ్రరీ, ఇంటర్నెట్ను వినియోగించుకోవాలి. ల్యాబ్ సెషన్స్ తప్పకుండా పూర్తి చేయాలి. -
గణితాన్ని గెలవండిలా..
కట్టా కవిత, స్కూల్ అసిస్టెంట్ కోదండాపూర్, మహబూబ్‌నగర్. విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైంది పదో తరగతి. ఇందులోని ఆరు సబ్జెక్టుల్లోవిద్యార్థులు ఎక్కువ కష్టంగా భావించేది, భయపడేది మ్యాథ్స్ సబ్జెక్టుకే. అదేవిధంగా నూటికి నూరు మార్కులు తెచ్చిపెట్టగల సబ్జెక్టు కూడా ఇదే. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా.. ప్రణాళిక బద్ధంగా సిద్ధమైతే మ్యాథ్స్‌లో వంద మార్కులు సాధించొచ్చు. పదో తరగతి మ్యాథ్స్‌లో అత్యధిక మార్కుల సాధనకు విలువైన టిప్స్ మీ కోసం.. పదో తరగతిలో ప్రతిభ ఉన్న విద్యార్థి అయినా, సాధారణ విద్యార్థి అయినా సరైన ప్రణాళిక లేకుండా ప్రిపరేషన్ కొనసాగిస్తే వార్షిక పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు గణితంతోపాటు మిగతా సబ్జెక్టులను కూడా చదవాలి. కాబట్టి అందుబాటులో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వార్షిక పరీక్షలు దగ్గర పడేంతవరకు నిర్లక్ష్యం వ హించకుండా నేటి నుంచే ప్రిపరేషన్ మొదలుపెడితే గణితంతోపాటు అన్ని సబ్జెక్టుల్లోనూ సులువుగా 10 గ్రేడ్ పాయింట్లు సాధించవచ్చు. గణిత అధ్యాయాల విశ్లేషణ: విద్యార్థులు ముందుగా గణిత పాఠ్యపుస్తకంలోని అధ్యాయాల గురించి, ఏ అధ్యాయాలు..ఏ పేపర్ కింద వస్తాయో తెలుసుకోవాలి. పదో తరగతి గణిత పాఠ్యపుస్తకంలో ఉన్న మొత్తం 12 అధ్యాయాల్లో మొదటి ఆరు అధ్యాయాలు ప్రవచనాలు-సమితులు, ప్రమేయాలు, బహుపదులు, ఏకఘాత ప్రణాళిక, వాస్తవ సంఖ్యలు, శ్రేఢులు పేపర్-1లో ఉంటాయి. తర్వాత ఆరు అధ్యాయాలు.. రేఖా గణితం, వైశ్లేషిక రేఖా గణితం, త్రికోణమితి, సాంఖ్యక శాస్త్రం, మాత్రికలు, గణన పేపర్-2లో ఉంటాయి. పేపర్-1, పేపర్-2 లో మళ్లీ రెండు చొప్పున గ్రూపులు ఉంటాయి. అవి.. పేపర్-1: గ్రూప్ - ఏ: ప్రవచనాలు - సమితులు, ప్రమేయాలు, బహుపదులు గ్రూప్ - బి: ఏకఘాత ప్రణాళిక, వాస్తవ సంఖ్యలు, శ్రేఢులు పేపర్-2 గ్రూప్- ఏ: రేఖా గణితం, వైశ్లేషిక రేఖా గణితం, సాంఖ్యక శాస్త్రం గ్రూప్- బి: త్రికోణమితి, మాత్రికలు, గణన ప్రవచనాలు - సమితులు, సాంఖ్యక శాస్త్రం, మాత్రికలు, గణన సాధారణ విద్యార్థికి అర్థమయ్యే అధ్యాయాలు. శ్రేఢులు, రేఖా గణితం, త్రికోణమితి అధ్యాయాలు కష్టంగా ఉంటాయి. సమితులు, ప్రమేయాలు, ఏకఘాత ప్రణాళిక, సాంఖ్యక శాస్త్రం అధ్యాయాల్లో విషయం(కంటెంట్), ప్రశ్నల సంఖ్య తక్కువ. అంతేకాకుండా ఎక్కువ మార్కులు వచ్చే అధ్యాయాలు కూడా ఇవే. బహుపదులు, శ్రేఢులు, రేఖా గణితం, వైశ్లేషిక రేఖా గణితం, త్రికోణమితి అధ్యాయాల్లో విషయం (కంటెంట్) ఎక్కువ. పేపర్-1లో బహుపదులు, ఏకఘాత ప్రణాళిక నుంచి గ్రాఫ్ ప్రశ్నలు అడుగుతారు. పేపర్-2లో రేఖా గణితం నుంచి నిర్మాణాలు, త్రికోణమితి నుంచి ఎత్తులు - దూరాలపై 5 మార్కుల ప్రశ్నలు ఇస్తారు. పేపర్-1లో ప్రమేయాలు, శ్రేఢులు; పేపర్-2లో వైశ్లేషిక రేఖా గణితం, మాత్రికలలో ఒక్కొక్క చాప్టర్ నుంచి రెండు నాలుగు మార్కుల ప్రశ్నలు ఇస్తారు. మిగిలిన ఒక్కొక్క అధ్యాయం నుంచి నాలుగు మార్కుల ప్రశ్న ఒకటి మాత్రమే అడుగుతారు. పేపర్-1లో ప్రవచనాలు-సమితులు,వాస్తవ సంఖ్యలు; పేపర్-2లో వైశ్లేషిక రేఖా గణితం, గణనలలో ప్రతి చాప్టర్ నుంచి రెండు రెండు మార్కుల ప్రశ్నలు ఇస్తారు. మిగిలిన చాప్టర్ల నుంచి ఒక ప్రశ్న మాత్రమే ఇస్తారు. ప్రతి అధ్యాయం నుంచి 1 మార్కు ప్రశ్న ఒకటి, 5 బిట్స్ ఇస్తారు. పై విశ్లేషణను బట్టి ఏయే అధ్యాయాల నుంచి ఎక్కువ మార్కులు స్కోర్ చేయవచ్చో వాటిని సాధన చేయాలి. పేపర్-1లో సాధారణ విద్యార్థులకు సైతం సులువుగా అర్థమయ్యే అధ్యాయాలు.. ప్రవచనాలు - సమితులు, ప్రమేయాలు, ఏకఘాత ప్రణాళిక. పేపర్-2లో సాంఖ్యక శాస్త్రం, మాత్రికలు, గణన. వీటిని బాగా అధ్యయనం చేస్తే 60 మార్కులు సాధించవచ్చు.పేపర్-1లో బహుపదులు, వాస్తవ సంఖ్యలు; పేపర్-2లో రేఖా గణితం, త్రికోణమితిలాంటి కష్టమైన అధ్యాయాలు చాయిస్ కింద (ఐదు మార్కులు, బిట్స్ మినహా) వదిలివేసినప్పటికీ 10 గ్రేడ్ పాయింట్లు సాధించడానికి అవకాశం ఉంది. ప్రశ్నపత్రం విశ్లేషణ గణితం ప్రశ్నపత్రంలో పేపర్-1 (50 మార్కులు), పేపర్-2 (50 మార్కులు) లకు కలిపి మొత్తం 100 మార్కులుంటాయి. ఒక్కొక్క పేపర్లో మళ్లీ పార్ట్-ఏ (మెయిన్ పేపర్) 35 మార్కులకు, పార్ట్-బి (బిట్ పేపర్) 15 మార్కులకు ఉంటుంది. పార్ట్-ఏ: ఇందులో మళ్లీ నాలుగు సెక్షన్లు ఉంటాయి. ప్రతి సెక్షన్లో గ్రూప్-ఏ, గ్రూప్-బి అధ్యాయాల నుంచి సమాన సంఖ్యలో ప్రశ్నలు ఇస్తారు. సెక్షన్-1 (ప్రశ్న నంబర్ 1-8)లో రెండు మార్కుల ప్రశ్నలు ఎనిమిది ఇస్తారు. మొత్తం ఐదు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. వీటికి ఒక్కో ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున మొత్తం పది మార్కులుంటాయి. సెక్షన్ - 2 (ప్రశ్న నంబర్ 9-14): ఒక మార్కు ప్రశ్నలు ఆరు ఇస్తారు. ఇందులో ఏవైనా నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున మొత్తం నాలుగు మార్కులుంటాయి. సెక్షన్-3 (ప్రశ్న నంబర్ 15-22): ఇందులో నాలుగు మార్కుల ప్రశ్నలు ఎనిమిది ఇస్తారు. ఇందులో నాలుగు రాయాలి. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కుల చొప్పున నాలుగు ప్రశ్నలకు 16 మార్కులుంటాయి. సెక్షన్-4 (ప్రశ్న నంబర్ 23-24): ఇందులో 5 మార్కుల ప్రశ్నలు రెండు ఇస్తారు. ఒకటి రాయాలి. పార్ట్-బి: బిట్ పేపర్లో మొత్తం 30 బిట్స్ ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు అర మార్కు చొప్పున మొత్తం 30 ప్రశ్నలకు 15 మార్కులుంటాయి. వీటిలో 10 బహుళైచ్ఛిక ప్రశ్నలు (ఆబ్జెక్టివ్ టైప్), 10 ఖాళీలు (ఫిల్ ఇన్ ది బ్లాంక్స్), 10 జతపరచడం (మ్యాచింగ్) ఇస్తారు. వీటికి చాయిస్ ఉండదు. ఇదేవిధంగా పేపర్ - 2 ప్రశ్నపత్రం కూడా ఉంటుంది. గత ప్రశ్నపత్రాల పరిశీలన :విద్యార్థులు ప్రిపరేషన్ మొదలుపెట్టకముందే గత ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రాలను పరిశీలించాలి. కనీసం మూడేళ్ల మార్చి, జూన్ ప్రశ్నపత్రాలను అధ్యయనం చేసి ఈ కింది విషయాలను తెలుసుకోవాలి. ముఖ్యమైన అధ్యాయాలు, ప్రశ్నలు ప్రశ్నల, మార్కుల పరంగా అధ్యాయాల వెయిటేజ్ ప్రశ్నలస్థాయి (సులువు, కఠినం) ఏ ప్రశ్నలు వ్యాసరూప ప్రశ్నలు?, ఏవి స్వల్ప సమాధాన ప్రశ్నలు? చాయిస్ కింద వదిలేసిన అధ్యాయాలు విద్యార్థులు ముందు సిలబస్‌లోని పాఠ్యాంశాలను సిద్ధమైన తర్వాత మాత్రమే గత ప్రశ్నపత్రాల్లోని ప్రశ్నలను సాధన చేయాలి. సాధారణ విద్యార్థులు గత ప్రశ్నపత్రాల్లో ని ముఖ్యమైన ప్రశ్నలను బాగా సాధన చేస్తే సరిపోతుంది. ప్రిపరేషన్ ఇలా విద్యార్థులు గత ప్రశ్నపత్రాలను పరిశీలించి, వెయిటేజ్ తెలుసుకుని ప్రిపరేషన్ మొదలుపెట్టాలి. ప్రతిరోజూ ఆహ్లాదకరమైన వాతావరణంలో కనీసం 3 లేదా 4 గంటలు సాధన చేయాలి. ఉదయం 6-8 గంటల మధ్య, రాత్రి 7-9 గంటల మధ్య ప్రిపేర్ అయితే మంచిది. మనసు ప్రశాంతంగా లేనప్పుడు, చాలాసేపు రాత్రి మేల్కొని సాధన చేయడం మంచిది కాదు. గణితంలో క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంటుంది. కాబట్టి గుడ్డిగా కంఠస్తం చేయరాదు. సమస్యలను పదేపదే ప్రాక్టీస్ చేసి పట్టు సాధించాలి. వ్యాసరూప ప్రశ్నలకు ఇలా విద్యార్థులు ప్రిపరేషన్ మొదలు పెట్టేటప్పుడు ఎక్కువ మార్కులు వచ్చే 5 మార్కులు, 4 మార్కుల ప్రశ్నలను మొదట సాధన చేయాలి. గత ప్రశ్నపత్రాలను పరిశీలించి లేదా ఉపాధ్యాయుడి సలహా తీసుకొని ముఖ్యమైన 5 , 4 మార్కుల ప్రశ్నలన్నింటినీ గుర్తించాలి. ఆ తర్వాత వాటిని అధ్యాయాలవారీగా ఒక పుస్తకంలో రాసుకోవాలి. ముఖ్యమైనవి నేర్చుకున్న తర్వాతనే మిగిలినవాటిని సాధన చేయాలి. ఇలా వీలు దొరికినప్పుడల్లా పదేపదే మాదిరి సమస్యలను చేస్తుండాలి. పేపర్-1లో బహుపదులు, ఏకఘాత ప్రణాళికలలోని గ్రాఫ్ (రేఖా చిత్రాలు) సమస్యలు; పేపర్-2లో రేఖా గణితంలో నిర్మాణాలు, త్రికోణమితిలో ఎత్తులు - దూరాలు 5 మార్కుల ప్రశ్నల కింద ఇస్తారు. వీటిని బాగా ప్రాక్టీస్ చేయాలి. సమితులలోని మూలకోపపత్తి, సమస్యలు; బహుపదులలోని శేష సిద్ధాంతం, ద్విపద సిద్ధాంతం, సమస్యలు; ఏకఘాత ప్రణాళికలోని అభ్యాసం-3లో ఉన్న ప్రశ్నలు వ్యాసరూప ప్రశ్నల్లో ముఖ్యమైనవి. ఇవేకాకుండా వాస్తవ సంఖ్యల్లో అభ్యాసం - 2లో ఉన్న ప్రశ్నలు, రేఖా గణితంలోని ముఖ్య సిద్ధాంతాలు, వైశ్లేషిక రేఖా గణితంలోని త్రిభుజ వైశాల్యంపై ప్రశ్నలు చివరి అభ్యాసంలోని ప్రశ్నలపై ప్రధానంగా దృష్టి సారించాలి. వీటితోపాటు గణనలోని క్రమ చిత్రాలు, సాంఖ్యక శాస్త్రం, ప్రమేయాలు, మాత్రికలు అధ్యాయాలలోని అన్ని సమస్యలు వ్యాసరూప ప్రశ్నల్లో ప్రధానమైనవి. స్వల్ప సమాధాన ప్రశ్నలు, బిట్స్‌కు ఇలా విద్యార్థులు మ్యాథ్స్‌లో 10 గ్రేడ్ పాయింట్లు సాధించాలంటే వ్యాసరూప ప్రశ్నలతోపాటు స్వల్ప సమాధాన ప్రశ్నలు (2, 1 మార్కు ప్రశ్నలు), బిట్స్ కూడా ముఖ్యమే. ముఖ్యమైన స్వల్ప సమాధాన ప్రశ్నలను అధ్యాయాలవారీగా గుర్తించి, వాటిని నేర్చుకోవాలి. వీటిని సాధన చేస్తే బిట్స్పై కూడా పట్టు లభిస్తుంది. బిట్స్ కోసం పాఠ్యపుస్తకంలోని ప్రతి అధ్యాయం మొదట లేదా చివర ఉండే అన్ని ముఖ్యాంశాలను, సారాంశాన్ని చదవాలి. ఇప్పటి నుంచే పాలిటెక్నిక్, ఏపీఆర్జేసీ వంటి పోటీ పరీక్షల గత ప్రశ్నపత్రాలను సాధన చేస్తే అత్యధిక మార్కులు సాధించొచ్చు. సిద్ధాంతాలు: రేఖాగణితంలో ప్రాథమిక అనుపాత, పైథాగరస్, ఏకాంతర వృత్త ఖండ సిద్ధాంతాలు- వాటి విపర్యయాలను బాగా చదవాలి. వీటిని గుడ్డిగా కంఠస్థం చేయకుండా పటాల ఆధారంగా నేర్చుకోవాలి. సూత్రాలు గుర్తుంచుకోవాలంటే గణితం పూర్తిగా సూత్రాలపై ఆధారపడ్డ సబ్జెక్టు. సూత్రాలు ఏ మాత్రం గుర్తులేకపోయినా, గుర్తుకు రాకపోయినా చేయాల్సిన సమస్యను సాధించలేం. కాబట్టి సూత్రాలన్నింటినీ అధ్యాయాలవారీగా ఒకచోట రాసుకుని, వాటిని పదేపదే మననం చేసుకోవాలి. ఏ సమస్యకు ఏ సూత్రాన్ని ఉపయోగించాలో తెలుసుకోవాలి. సూత్రాలను నేర్చుకోవడమే కాకుండా అందులోని పదాలను విశదీకరించాలి. బహుపదులు, వాస్తవ సంఖ్యలు, శ్రేఢులు, వైశ్లేషిక రేఖాగణితం, సాంఖ్యక శాస్త్రం, త్రికోణమితి అధ్యాయాలలో ఎక్కువ సూత్రాలు ఉన్నాయి. 10 గ్రేడ్ పాయింట్లు సాధించాలంటే అన్ని అధ్యాయాలలోని వ్యాసరూప, స్వల్ప సమాధాన ప్రశ్నలను, బిట్స్‌ను క్షుణ్నంగా ప్రిపేర్ కావాలి. వీలైనన్నిసార్లు (కనీసం 2 లేదా 3సార్లు) రివిజన్ చేయాలి. నేర్చుకున్న అంశాలను పదేపదే రాసి చూసుకోవాలి. వీలైనంత త్వరగా ప్రిపరేషన్ పూర్తిచేసి, వారానికి కనీసం రెండు మోడల్ పేపర్లు లేదా గత ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. పరీక్షలో రాయాల్సిన ప్రశ్నలతోపాటు ప్రతి సెక్షన్లో అదనపు సమస్యలకు సమాధానాలు రాయాలి. పాలిటెక్నిక్, ఏపీఆర్జేసీ స్థాయిలో బిట్స్‌ను ప్రాక్టీస్ చేయాలి. అనవసరమైన మెటీరియల్‌ను చదవకూడదు. సూత్రాలను మరిచిపోకుండా పదేపదే మననం చేసుకోవాలి. పరీక్ష లో సమాధానాలను చక్కగా ప్రజెంట్ చేయాలి. సాధారణ విద్యార్థుల ప్రిపరేషన్: సాధారణ విద్యార్థులు రేఖా గణితం, త్రికోణమితి వంటి కష్టంగా ఉండే అధ్యాయాలను అవగాహన చేసుకోలేరు. వీరు వెయిటేజ్ ఆధారంగా ఏ అధ్యాయాలు సులువుగా ఉంటాయో వాటినే నేర్చుకోవాలి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఎక్కువ సమయం గణితానికి కేటాయించి మొదట ముఖ్యమైన వ్యాసరూప ప్రశ్నలను సాధన చేయాలి. సాంఖ్యక శాస్త్రం, మాత్రికలు, గణన వంటి సులువైన అధ్యాయాలను పూర్తిగా ప్రాక్టీస్ చేయాలి. ఇంకా సమితులలోని మూలకోపపత్తి సమస్యలు, ప్రమేయాలని సంయుక్త ప్రమేయం, విలోమ ప్రమేయ సమస్యలపై దృష్టి పెట్టాలి. వీటితోపాటు ఏకఘాత ప్రణాళికలోని నిర్వచనాలు, అభ్యాసం-3లోని మూడు ప్రశ్నలు, రేఖా గణితంలోని ముఖ్యమైన సిద్ధాంతాలు, 5 మార్కులకు ఇచ్చే నిర్మాణాలను సాధన చేయాలి. బహుపదుల లోని 5 మార్కుల గ్రాఫ్ ప్రశ్నలను సాధన చేస్తే ఎక్కువ మార్కులు సాధించవచ్చు. రాసే విధానం: ఏడాదిపాటు నేర్చుకున్న అంశాలను పరీక్షలో నిర్ణీత సమయంలో చక్కగా ప్రజెంట్ చేయగలిగితే సులువుగా 10 గ్రేడ్ పాయింట్లు సాధించవచ్చు. అందుకోసం విద్యార్థులు.. ఉపాధ్యాయుడి ద్వారా త్రైమాసిక పరీక్షల నుంచే చక్కగా రాసే విధానాలను తెలుసుకోవాలి. బాగా నేర్చుకున్న ప్రశ్నలకు ముందు సమాధానాలు రాయాలి. సమాధాన పత్రంలో ఎటువంటి కొట్టివేతలు ఉండకూడదు. మొదటి ప్రశ్నలోనే కొట్టివేతలు ఉంటే పేపర్ దిద్దే ఉపాధ్యాయుడికి మంచి అభిప్రాయం కలగదు. ముఖ్యమైన అంశాలు, నిర్వచనాలను అండర్లైన్ చేయాలి. ప్రశ్నల సంఖ్యను సరిగా గుర్తించాలి. చిత్తు పనిని (రఫ్ వర్క్) మార్జిన్‌లోనే చేయాలి. రెడ్, గ్రీన్ మినహా మిగతా స్కెచ్ పెన్నులు అవసరమున్న చోట ఉపయోగించాలి. సమాధానానికి, సమాధానానికి కొంత ఖాళీ వదలాలి. మొదట రాయాల్సిన ప్రశ్నలు అన్నింటినీ రాసిన తర్వాత చివరలో అదనపు ప్రశ్నలు రాయాలి. బిట్స్ రాసేటప్పుడు తప్పుగా గుర్తించినవాటిని దిద్దకుండా, పూర్తిగా కొట్టివేసి పక్కన సమాధానాన్ని రాయాలి.