స్వీయ ప్రిపరేషన్.. అప్లికేషన్ స్కిల్స్ కీలకం | bhavita Academic Guidance-Engineering-22-08-13 | Sakshi
Sakshi News home page

స్వీయ ప్రిపరేషన్.. అప్లికేషన్ స్కిల్స్ కీలకం

Published Thu, Aug 22 2013 3:41 PM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

bhavita Academic Guidance-Engineering-22-08-13

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ మొదలైంది... మరో మూడు వారాల్లో తరగతులు కూడా ప్రారంభమవుతాయి.. భవ్యమైన కెరీర్‌కు తొలి ప్రస్థానం మొదలవుతుంది.. ఫ్యాకల్టీలు, తల్లిదండ్రుల పరిమితుల నుంచి.. ఇంజనీరింగ్ అనే విశాల ప్రపంచంలోకి అడుగుపెడతారు.. నాలుగేళ్ల ఈ కోర్సులో వేసే ప్రతి అడుగు మీ భవిష్యత్ గమనాన్ని నిర్దేశిస్తుంది.. ఉన్నత కెరీర్‌కు బాటలు వేస్తుంది.. ఇందుకోసం కోర్సులో చేరిన మొదటి రోజు నుంచే కృషి చేయాలి.. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ కోర్సులో చేరబోయే విద్యార్థులు సక్సెస్‌ఫుల్ కెరీర్ దిశగా అనుసరించాల్సిన వ్యూహాలు, సూచనలు..
 
 వి. ఉమా మహేశ్వర్, ప్లేస్‌మెంట్ ఆఫీసర్,
 యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఓయూ.
 
 వివిధ పరిమితులు, పర్యవేక్షణల మధ్య ఇంటర్‌లో రెండేళ్లపాటు అహర్నిశలు శ్రమించి.. ఇంజనీరింగ్ కోర్సులో అడుగు పెట్టిన విద్యార్థికి భిన్నమైన వాతావరణం, కొత్త స్నేహితులు, లభించిన స్వేచ్ఛతో.. ప్రారంభంలో అంతా కలలా.. కొత్త ప్రపంచంలో విహరిస్తున్నట్లు ఉంటుంది. అది కొంత వరకే పరిమితం కావాలి. అక్కడి నుంచి ఉన్నత కెరీర్ దిశగా హార్డ్ వర్క్ ప్రారంభించాల్సిందే.
 
 ప్రారంభం ఇక్కడే


 ఇంజనీరింగ్‌లో సీటు లభించగానే చాలా మంది విద్యార్థులు తాము అంతా సాధించామనే ధోరణిలో ఉంటారు. దీంతో అకడమిక్స్ రెండో ప్రాధాన్యతగా మారిపోతాయి. అది సరికాదు. ఇంజనీరింగ్ వరకు రావడానికి ఏవిధంగా శ్రమించారో..దాన్ని ఈ కోర్సులో కూడా కొనసాగించాలి. ‘కడ జ్చిటఛీ ఠీౌటజు ట్ట్చట్టట ౌఠీ’’ అనే భావనను పెంపొందించుకుంటే ఈ నాలుగేళ్ల కోర్సును విజయవంతంగా పూర్తి చేయడంతోపాటు చక్కటి భవిష్యత్‌కు పునాది ఏర్పడుతుంది. ఇక్కడ వేసే ప్రతి అడుగు కీలకమే.
 
 స్వతహాగా


 ఇంజనీరింగ్‌లోకి ప్రవేశించిన విద్యార్థి ప్రధానంగా గమనించాల్సిన అంశాలు.. ఇంటర్మీడియెట్ మాదిరిగా ఈ కోర్సులో స్ఫూన్ ఫీడింగ్ ఉండదు. ఇంజనీరింగ్‌లో పూర్తి భిన్నమైన పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి. స్వీయ ప్రిపరేషన్ (సెల్ఫ్ లెర్నింగ్ మోడ్) దిశగా అడుగులు వేయాలి. ఇంటర్మీడియెట్‌లో ఆయా సబ్జెక్ట్‌లకు ఆయా పుస్తకాలు.. అనే నిర్దేశిత విధానం ఉంటుంది. ఇంజనీరింగ్‌లో అలా ఉండదు. ఒక్కో సబ్జెక్ట్ కోసం పలు రకాల పుస్తకాలను రిఫర్ చేయాల్సి ఉంటుంది.
 
 బాధ్యత ఎక్కువే


 ఇంటర్మీడియెట్ మాదిరిగా అన్ని సిద్ధంగా ఉంటాయని అనుకోవద్దు. లెక్చరర్ అన్ని చెప్పాలి అనే ధోరణి నుంచి బయటికి రావాలి. ఇంజనీరింగ్‌లో లెక్చరర్స్ సిలబస్‌కు సంబంధించి ప్రాథమిక భావనల (ఫండమెంటల్స్ కాన్సెప్ట్స్)ను మాత్రమే బోధిస్తారు. కొంత వరకు అప్లికేషన్స్‌ను వివరిస్తారు. అంటే విద్యార్థి మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది. తదనుగుణంగా తనను తాను సిద్ధం చేసుకోవాలి. ముఖ్యంగా కాన్సెప్ట్స్, అప్లికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి. అప్లికేషన్ పద్ధతిలో ప్రిపరేషన్ సాగించాలి. లెక్చరర్ చెప్పిన అంశాలను ఏవిధంగా అన్వయించవచ్చో స్వతాహాగా తెలుసుకోవాలి. అప్పుడే సబ్జెక్ట్‌పై పట్టు వస్తుంది. దీనికి భిన్నంగా ప్రిపరేషన్ సాగిస్తే.. డిగ్రీ సాధించవచ్చమోగానీ నాలెడ్జ్‌ను మాత్రం పెంపొందించుకోలేరు.

 

అంతేకాకుండా ఎగ్జామ్స్‌లో కూడా విద్యార్థిలోని అప్లికేషన్ స్కిల్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలు వస్తాయి. ఇంటర్మీడియెట్ వరకు ఒక అంశానికి సంబంధించి నిర్వచనం (డెఫినేషన్) వరకు మాత్రమే నేర్చుకునే వారు. కానీ ఇంజనీరింగ్‌లో అలా ఉండదు. ఒక అంశానికి సంబంధించి విస్తృత స్థాయిలో వివరణ ఉంటుంది. ఒక సూత్రాన్ని నేర్చుకుంటే దాన్ని ఏ విధంగా అన్వయించాలి? అనే అంశానికి ప్రాధాన్యత ఉంటుంది. ఉదాహరణకు టర్బో ఇంజిన్, గ్యాస్ కంప్రెసర్‌కు సంబంధించిన కాన్సెప్ట్స్‌ను ఆయా పరికరాల డిజైన్ విధానంలో ఏవిధంగా అన్వయిస్తారు? అనే అంశంపై ఎక్కువగా దృష్టి ఉంటుంది. అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్‌కు ప్రాముఖ్యతనిస్తారు. నిరంతరం ప్రయోగాలు చేస్తూ.. ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచుకోవాలి. దీని వల్ల బేసిక్స్‌పై సులువుగా పట్టు సాధించవచ్చు. అంతేకాకుండా ఇంజనీరింగ్‌లో ప్రాక్టికల్స్‌కు 30 శాతం వెయిటేజీ ఉంటుంది.
 
 కోర్సు ఇలా:ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో సబ్జెక్ట్‌లు అందరికీ కామన్‌గా ఉంటాయి. ఇందులో హ్యుమానిటీస్‌కూ ప్రాధాన్యత ఉంటుంది. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్ అంశాలు ఉంటాయి. ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్‌ను ఈ ఏడాదిలోనే పరిచయం చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఇంటర్మీడియెట్‌కు కొనసాగింపుగా ఇంజనీరింగ్ మొదటి సంవత్సరాన్ని పేర్కొనవచ్చు. ఇంటర్మీడియెట్‌తో పోల్చితే.. ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌లు అడ్వాన్స్‌డ్‌గా ఉంటాయి. ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో కోర్ సబ్జెక్ట్‌లు, ఇంటర్ డిసిప్లినరీ సబ్జెక్ట్‌లు ఉంటాయి. అంటే ఒక బ్రాంచ్ విద్యార్థికి మరో బ్రాంచ్‌కు సంబంధించిన కొన్ని అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఉదాహరణకు మెకానికల్ విద్యార్థికి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అంశాలను బోధిస్తారు. మూడు, నాలుగు సంవత్సరాల్లో పూర్తిగా కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి.
 
 నాలెడ్జ్ షేరింగ్:ఇంజనీరింగ్‌లో సిలబస్ విస్తృత స్థాయిలో ఉంటుంది. కాబట్టి ఇంటర్ మాదిరిగా వ్యక్తిగతంగా నేర్చుకునే పద్ధతి (Individual learning) సరిపోదు. అది కేవలం ర్యాంకులు సాధించడానికి మాత్రమే పరిమితం. కాని ఇంజనీరింగ్‌లో ర్యాంకులకు కాదు నాలెడ్జ్‌కు ప్రాధాన్యతనిస్తారు. ఈ విషయాన్ని గమనించి గ్రూప్ లెర్నింగ్, కంబైండ్ లెర్నింగ్ అలవర్చుకోవాలి. ఉదాహరణకు ప్రోగ్రామ్‌కు సంబంధించి ఒక కోడ్ రాస్తే.. దానిపై తోటి స్నేహితులందరితో చర్చించాలి. ఇలా చేయడం ద్వారా ఎక్కువ విషయాలను నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అవసరమైతే సీనియర్లు, లెక్చరర్ల సలహాలను తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు నాలెడ్జ్ షేరింగ్‌కు ప్రాధాన్యతనివ్వాలి.
 
 ప్రశ్నించే తత్వం:ఇంజనీరింగ్‌లో విద్యార్థి ప్రధానంగా పెంపొందించుకోవాల్సిన లక్షణం.. ప్రశ్నించే తత్వం. ఒక అంశంపై వచ్చిన సందేహాలను ఎప్పటికప్పుడూ లెక్చరర్లు, సీనియర్ల సహాయంతో నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎవరు అడగటం లేదు కదా అని మనం కూడా ముభావంగా ఉండటం సరికాదు. ఒక అంశానికి సంబంధించి.. అది ఏ విధంగా వచ్చింది. దాన్ని ఎలా అన్వయించాలి? అనే ఆసక్తిని పెంపొందించుకోవాలి. అప్పుడే సబ్జెక్ట్‌పై పట్టు సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది.
 
 ఇంగ్లిష్ మస్ట్:ప్రస్తుత గ్లోబలైజేషన్ యుగంలో ఇంజనీరింగ్ విద్యార్థులందరికీ ఇంగ్లిష్ భాషపై పట్టు తప్పనిసరి. కోర్సులో చేరిన మొదటి రోజు నుంచే ఇంగ్లిష్‌లో మాట్లాడటానికి ప్రయత్నించాలి. ఈ దిశగా ఇంగ్లిష్ భాష నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలి. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం, తెలుగు మీడియం విద్యార్థులు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపా లి. ద హిందూ, ఎకనమిక్ టైమ్స్ వంటి దినపత్రికలతోపాటు అవుట్‌లుక్, ఇండియా టుడే వంటి మ్యాగజైన్లు చదవడం, బీబీసీ, సీఎన్‌బీసీ-టీవీ18, వంటి చానల్స్ చూస్తూ వినడం ద్వారా ఇంగ్లిష్ భాషపై పట్టు సాధించవచ్చు.
 
 లక్ష్యాలపై స్పష్టత:ఇంజనీరింగ్ నాలుగేళ్ల కోర్సులో మొదటి సంవత్సరంలోనే సబ్జెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరంలో విద్యార్థులు అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. రెండో సంవత్సరంలో కెరీర్ విషయంలో స్పష్టత తెచ్చుకోవాలి. ఉన్నత విద్య, ఉద్యోగం అనే విషయంలో రెండో సంవత్సరంలో ఒక లక్ష్యాన్ని ఏర్పర్చుకోవాలి. ఈ విషయంలో సీనియర్లు, ఇంటర్నెట్, ఫ్యాకల్టీ, తల్లిదండ్రులు, నిపుణుల సహకారం తీసుకోవాలి. దీనికి సంబంధించిన సన్నాహాలను మూడో సంవత్సరం నుంచే ప్రారంభించాలి. ఉదాహరణకు యూఎస్‌లో ఎంఎస్ చేయాలంటే అందుకు సంబంధించిన పరీక్షలకు హాజరు కావడం, పాస్‌పోర్ట్ తదితర అంశాలను మూడో ఏడాదిలోనే పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే నాలుగో సంవత్సరం ప్రాజెక్ట్ వర్క్, క్యాంపస్ ప్లేస్‌మెంట్ వంటి కార్యకలాపాలు ఉంటాయి. ఇవి తప్పనిసరిగా చేయాల్సినవి. దీంతో కెరీర్‌కు సంబంధించిన సన్నాహాలకు సమయం కేటాయించడం సాధ్యం కాకపోవచ్చు. మూడో సంవత్సరంలోనే కొన్ని రీసెర్చ్ పేపర్లను రాయాలి.
 
 టీమ్ మ్యాన్:ఇంటర్‌లో విద్యార్థులు కొంత వరకు అంతర్ముఖులుగా ఉంటారు. ఇంజనీరింగ్‌లో కూడా అదేవిధంగా ఉంటే కెరీర్‌లో ముందుకెళ్లటం కష్టం. ఎందుకంటే ప్రస్తుతం కార్పొరేట్ కంపెనీలు జట్టుగా పని చేసే తత్వం (టీమ్ మ్యాన్) ఉన్న వారికే నియామకాల్లో ప్రాధాన్యతనిస్తున్నాయి. ఎందుకంటే కంపెనీల్లో పలు విభాగాల మధ్య సమన్వయంతో పనిచేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి కోర్సులో చేరిన మొదటి రోజు నుంచే అందరితో ఇంటరాక్షన్ పెంచుకోవడానికి ప్రయత్నించాలి. గ్రూప్ యాక్టివిటీస్‌లో చురుగ్గా పాల్గొనాలి. బిడియం పోవడానికి గ్రూప్ మూవింగ్ ఓ చక్కటి ప్రత్యామ్నాయం. ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో చురుగ్గా పాల్గొనాలి.
 
 నో బ్యాక్‌లాగ్స్:ఇంజనీరింగ్‌లో చేరే విద్యార్థులు గమనించాల్సిన కీలక అంశం.. బ్యాక్‌లాగ్స్. ప్రస్తుత జాబ్ మార్కెట్‌ను పరిగణనలోకి తీసుకుంటే ఎటువంటి బ్యాక్‌లాగ్స్ లేని విద్యార్థులకు మాత్రమే కంపెనీలు ప్రాధాన్యతనిస్తున్నాయి. అంతేకాకుండా బ్యాక్‌లాగ్స్ ఉంటే.. కనీసం క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో పరిగణనలోకి కూడా తీసుకోరు. ఉదాహరణకు మారుతి సుజుకి కంపెనీని తీసుకుంటే ‘నో బ్యాక్‌లాగ్స్ అప్ టు ఇంజనీరింగ్’ అనే నియమాన్ని పాటిస్తుంది. మైక్రోసాఫ్ట్ తదితర టాప్ కంపెనీలన్నీ కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మొదటి సంవత్సరం నుంచి ఏ సంవత్సరానికి సంబంధించిన పరీక్షలను ఆ సంవత్సరంలోనే మొదటి ప్రయత్నంలో పూర్తి చేయాలి. క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో కూడా డిస్టింక్షన్ అభ్యర్థులకే అవకాశాలు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు కేవలం కనీస ఉత్తీర్ణత ఆలోచనకు స్వస్తి పలికి.. డిస్టింక్షన్‌లో పాస్ కావడానికి ప్రయత్నించాలి. 80 నుంచి 85 శాతం మార్కులు సాధించాలి.
 
 నోట్స్ ప్రిపరేషన్:ఇంటర్మీడియెట్ మాదిరిగా ఇక్కడ స్పూన్ ఫీడింగ్ ఉండదు. కాబట్టి సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అలవర్చుకోవాలి. ఈ విషయంలో లైబ్రరీని ప్రభావవంతంగా వినియోగించుకోవాలి. ఒక సబ్జెక్ట్‌కు సంబంధించి అందుబాటులో ఉన్న అన్ని పుస్తకాలను రిఫర్ చేయడం మంచిది. ఎగ్జామినేషన్స్ కోసమైతే.. ఒక్క పుస్తకం సరిపోతుంది. కానీ నాలెడ్జ్ కోసం మాత్రం ఐదు-ఆరు పుస్తకాలను రిఫర్ చేయడం తప్పనిసరి. ఇక్కడ అందుబాటులో ఉన్న పుస్తకాల్లో దేన్ని ఎంచుకోవాలనే విషయంలో కొంత గందరగోళం సహజం. ఈ సందర్భంలో ఆయా అంశాలకు సంబంధించి కాన్సెప్ట్స్‌ను వర్ణించిన తీరు, భాష సులభంగా ఉన్న ప్రామాణిక పుస్తకాలను చదవాలి. అందులోని అంశాలను పాయింట్స్ రూపంలో నోట్ చేసుకోవాలి. అంతేకాకుండా ఇంటర్నెట్, ఆన్‌లైన్ బ్లాగ్స్‌ను కూడా నోట్స్ ప్రిపరేషన్‌లో ప్రభావవంతంగా వినియోగించుకోవాలి.
 
 ల్యాబ్ పాత్ర:లేబొరేటరీలది కీలకపాత్ర అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంజనీరింగ్ అప్లికేషన్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్. సంబంధిత ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచుకోవడంతోపాటు బేసిక్స్‌ను నేర్చుకోవడానికి ప్రాక్టికల్స్ దోహదం చేస్తాయి. సబ్జెక్ట్‌కు సంబంధించి ఒక ఫార్ములా.. ఏవిధంగా వస్తుంది? దాన్ని ఎలా అన్వయం చేసుకోవాలి? అనే అంశాలను ఆలోచనా, సృజనాత్మకత, ఊహాత్మక శక్తి వంటి స్కిల్స్‌ను ఉపయోగించి.. థియరీ, ప్రాక్టికల్‌ను ల్యాబ్ ద్వారా కో-రిలేట్ చేసుకోవడం జరుగుతుంది. తద్వారా ఇంజనీరింగ్‌లో కీలకమైన బేసిక్స్‌పై పట్టు సాధించడం వీలవుతుంది.
 
 మొదటి రోజు నుంచే:ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రస్తుత జాబ్‌మార్కెట్లో రాణించాలంటే నైపుణ్యాలు ఎంతో కీలకం. కాబట్టి ఇందుకు సంబంధించిన అంశాలను కోర్సులో చేరిన మొదటి రోజు నుంచే మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే స్కిల్స్‌పై పట్టు సాధించడం ఒక్క రోజులోనే సాధ్యమయ్యే పని కాదు. ఇది నిరంతరం సాగే ప్రక్రియ. ఎప్పటికప్పుడు స్కిల్స్‌ను అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలి. ఈ క్రమంలో కమ్యూనికేషన్ స్కిల్స్, ఆర్గనైజింగ్ స్కిల్స్, జట్టుగా పని చేసే నైపుణ్యం, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి. ఇందుకు కాలేజీని చక్కటి వేదికగా వినియోగించుకోవాలి. గ్రూప్ డిస్కషన్, టీమ్ ఈవెంట్స్‌లో పాల్గొనడం ద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పెంచుకోవచ్చు. ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో పాలుపంచుకోవడం కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌కు కూడా ఆస్కారం లభిస్తుంది. వివిధ రకాల ఈవెంట్లు, టెక్నికల్ ఫెస్టివల్స్ నిర్వహించడం ద్వారా ఆర్గనైజింగ్ స్కిల్స్, జట్టుగా పని చేసే నైపుణ్యం అలవడుతుంది. అంతేకాకుండా ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో చురుగ్గా పాలుపంచుకోవాలి. ఇంటర్-కాలేజ్ స్పోర్ట్స్, సెమినార్ల నిర్వహణ, కంపెనీలు నిర్వహించే వివిధ రకాల పోటీ పరీక్షలు, టెక్నికల్ కాంపిటీషన్స్‌కు హాజరుకావాలి. తద్వారా చక్కటి పరిజ్ఞానం అలవడుతుంది. అంతేకాకుండా ఈ అంశాలను రెజ్యుమెలో పొందుపరచడంతో క్యాంపస్ ప్లేస్‌మెంట్ సమయంలో ప్రయోజనకరంగా ఉంటుంది.
 
 
 సక్సెస్‌ఫుల్ కెరీర్‌కు స్కిల్స్:
 టెక్నికల్ స్కిల్స్‌పై పట్టు సాధించాలి.
 కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపరుచుకోవాలి.
 ఇంగ్లిష్ భాషపై పట్టు పెంచుకోవాలి.
 జట్టుగా పని చేసే సామర్థ్యాన్ని (గుడ్ టీమ్ వర్కర్) పెంపొందించుకోవాలి.
 ప్రజెంటేషన్ స్కిల్స్‌ను మెరుగుపరుచుకోవాలి.
 ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అభివృద్ధి చేసుకోవాలి.
 
 ఇంజనీరింగ్ కోర్సులో తప్పక చేయాల్సినవి:
 ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలి.
 క్రమం తప్పకుండా తరగతులకు హాజరు కావాలి
 హాజరు 75 శాతం ఉండాలి
 నాలెడ్జ్ షేరింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.
 రోజుకు కనీసం మూడు గంటలు చదవాలి
 లైబ్రరీ, ఇంటర్నెట్‌ను వినియోగించుకోవాలి.
 ల్యాబ్ సెషన్స్ తప్పకుండా పూర్తి చేయాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement