ఎంసెట్-2015..
మీ సందేహాలు.. నిపుణుల సమాధానాలు!!
ఎంసెట్.. ఇంజనీరింగ్, మెడికల్ విభాగాల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష. మెరుగైన ర్యాంకు సాధించాలని,మంచి కళాశాలలో చేరాలని ఇంటర్మీడియెట్ తొలి రోజు నుంచే విద్యార్థులు సన్నద్ధమవుతారనడంలో సందేహం లేదు. ఇలా.. రెండేళ్ల పాటు శ్రమించిన విద్యార్థులు తమ అదృష్టాన్ని ‘పరీక్షించుకునే సమయం వచ్చేసింది. మరికొద్ది రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో ఎంసెట్ జరగనుంది. మంచి ర్యాంకు సాధించడం ఎలా? మొదలు... పరీక్ష హాల్లో ఓఎంఆర్ షీట్ నింపే విషయం వరకూ.. విద్యార్థుల మదిలో ఎన్నో సందేహాలు. మే 14న తెలంగాణలో; మే 8న ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించనున్న ఎంసెట్‌కు సంబంధించి.. విద్యార్థులకు ఎదురయ్యే సందేహాలకు నిపుణుల సమాధానాలు..
మ్యాథ్స్
ప్ర : మ్యాథ్స్‌లో అత్యధిక మార్కుల సాధనకు మార్గం ఏమిటి?
జ : మ్యాథమెటిక్స్‌లో లభిస్తున్న వెయిటేజీ ప్రకారం- మీన్, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్; మీన్ వాల్యూ థీరమ్; వెక్టార్ అల్జీబ్రా; క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్; బైనామియల్ థీరమ్; మ్యాట్రిసెస్; సర్కిల్స్; పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్; ఇంటిగ్రల్ కాలిక్యులస్ అంశాలపై ఎక్కువ దష్టిసారించాలి. మ్యాథమెటిక్స్ సబ్జెక్టులో ఉత్తమంగా రాణించేందుకు కాన్సె ప్ట్స్, ఫార్ములాలపై పట్టు సాధించాలి. ఇప్పటికే ప్రిపరేషన్ పూర్తయితే రివిజన్ మొదలుపెట్టాలి. కాన్సెప్ట్స్, ఫార్ములాలతో రూపొందించుకున్న షార్ట్ నోట్స్‌ల ద్వారా ఆయా చాప్టర్ల రివిజన్ పూర్తి చేసుకోవాలి.
ప్ర: మ్యాథమెటిక్స్ ప్రశ్నల తీరు ఎలా ఉంటోంది?
జ: మొత్తం 160 ప్రశ్నల ఇంజనీరింగ్ విభాగం పరీక్షలో.. 80 ప్రశ్నలు ఉండే మ్యాథమెటిక్స్‌లో దాదాపు 60 ప్రశ్నలు సులభంగా, సగటు విద్యార్థి కూడా సమాధానం ఇచ్చేలా ఉంటాయి. మొత్తం ప్రశ్నల్లో 10 శాతం ప్రశ్నలే అత్యంత క్లిష్టంగా ఉంటాయి. ఈ మార్కులే ర్యాంకులను నిర్దేశించడంలో కీలకంగా మారతాయి. విద్యార్థులు దీన్ని గుర్తించి.. క్లిష్టమైన చాప్టర్లకు సంబంధించి గ్రాండ్ టెస్ట్‌లు, మాక్ టెస్ట్‌లు ఎక్కువగా రాయడం మేలు చేస్తుంది.
ప్ర : మ్యాథమెటిక్స్‌లో అప్లికేషన్స్ స్కిల్స్ మెరుగుపరచుకోవడం తప్పనిసరా?
జ : మ్యాథమెటిక్స్‌లో అప్లికేషన్ స్కిల్స్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఒక సమస్యను పరిష్కరించే క్రమంలో దానికి సంబంధించి అప్లికేషన్ మెథడ్స్ తెలిస్తే సులువుగా సమాధానం గుర్తించడం ద్వారా ఎంతో విలువైన సమయం ఆదా అవుతుంది. అప్లికేషన్ స్కిల్స్ మెరుగుపరచుకో వాలంటే.. ప్రశ్నను క్షుణ్నంగా చదవి అందులో క్లూలను పరిశీలించిన తర్వాత సదరు ప్రాబ్లమ్‌లోని మూల భావనలను, వాటిని అన్వయించే మార్గాలను గుర్తించాలి.
ప్ర: మ్యాథ్‌సలో షార్ట్‌కట్ మెథడ్స్‌ను రూపొందించుకోవడం ఎలా?
జ : షార్ట్‌కట్ మెథడ్స్ అనేవి రివిజన్‌కు ఎంతో ఉపయోగపడతాయి. విద్యార్థులు ప్రతి చాప్టర్ సినాప్సిస్‌ను రూపొందించుకోవడం, తమకు అనుకూలమైన పద్ధతుల్లో తయారుచేసుకున్న షార్ట్ నోట్స్, చార్ట్స్ వంటి విధానాలను సమర్థంగా అమలు చేయడం ఉపయుక్తం.
ప్ర: ప్రస్తుతం మ్యాథ్స్‌కు కేటాయించాల్సిన సమయం?
జ : రోజూ కనీసం మూడు నుంచి నాలుగు గంటల ప్రిపరేషన్ తప్పనిసరి. ఈ ప్రిపరేషన్ సమయంలోనే పాత ప్రశ్నపత్రాలను పరిశీలించే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలి.
ప్ర: మ్యాథమెటిక్స్ సమస్య సాధన క్రమంలో అనుసరించాల్సిన విధానం?
జ : ముందుగా సదరు సమస్యకు సంబంధించి కన్వెన్షనల్ మెథడ్ ద్వారా పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేయాలి. ఇది ఎక్కువ సమయం తీసుకుంటుందని భావిస్తే అందులోని కాన్సెప్ట్‌ను గుర్తించి అప్లికేషన్ ఓరియెంటేషన్ పద్ధతివైపు దష్టి సారించాలి. కొన్ని ప్రశ్నలకు షార్ట్‌కట్ మెథడ్స్ ద్వారా వేగంగా సమాధానం గుర్తించే వీలుంటుంది.
బోటనీ
ప్ర: బోటనీలో ప్రశ్నల తీరు ఎలా ఉంటుంది? ముఖ్యమైన అంశాలేవి?
జ : బోటనీలో ఎంసీక్యూ, ఏఆర్, మ్యాచ్ ద ఫాలోయింగ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. వీటికి అందుబాటులో ఉన్న సమయంలో సమాధానం ఇవ్వాలంటే.. ఇప్పటి నుంచి ప్రాక్టీస్‌ను వేగవంతం చేయాలి. కన్సాలిడేటెడ్ అప్రోచ్ కూడా ప్రిపరేషన్ పరంగా లాభిస్తుంది. ఎంసెట్ శైలిని పరిశీలిస్తే అన్ని అంశాలకు సమ ప్రాధాన్యం ఉంటోంది. కాబట్టి విద్యార్థులు ప్రస్తుత సమయంలో అన్ని అంశాల కాన్సెప్ట్‌లు, ఫార్ములాలను రివిజన్ చేయడంపై దష్టిపెట్టాలి.
ప్ర : తప్పనిసరిగా చదవాల్సిన టాపిక్స్?
జ : సూక్ష్మ జీవ శాస్త్రం; కేంద్రక పూర్వ జీవులు; బ్యాక్టీరియా; వైరస్; మానవ సంక్షేమంలో సూక్ష్మ జీవుల పాత్ర అంశాలను తప్పనిసరిగా చదవాలి. ఖనిజ మూలకాల ఆవశ్యకత, మొక్కల హార్మోన్లు టాపిక్స్‌పై ఎక్కువ ఫోకస్ చేయాలి.
ప్ర : ఇప్పటి నుంచి అనుసరించాల్సిన టైం ప్లాన్?
జ : ఏప్రిల్ నెలాఖరుకు సిలబస్ పరంగా ప్రిపరేషన్ పూర్తి చేసుకోవాలి. చివరి వారం రోజుల్లో రివిజన్, సినాప్సిస్‌లు చదవడం, సొంత నోట్స్ లో రూపొందించుకున్న ఫార్ములాలను చదవడం వంటివి చేయాలి.
ప్ర : స్టేట్‌మెంట్ ఆధారిత ప్రశ్నలకు..?
జ : బోటనీలో స్టేట్‌మెంట్ ఆధారిత ప్రశ్నలు, అసెర్షన్ అండ్ రీజనింగ్ ప్రశ్నలకు ప్రాధాన్యమెక్కువ. ప్రతి స్టేట్‌మెంట్‌ను క్షుణ్నంగా పరిశీలించే నైపుణ్యం సొంతం చేసుకోవాలి. బోటనీకి సంబంధించి ఉపయోగపడే షార్ట్‌కట్ మెథడ్స్ లేవనే చెప్పాలి. దీనికి రెగ్యులర్ రివిజన్ ఒక్కటే మార్గం.
ప్ర: అత్యధికంగా పొందగలిగే మార్కులు?
జ: 40 ప్రశ్నలు ఉండే బోటనీలో గరిష్టంగా 38 మార్కులు పొందే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో 39 మార్కులు కూడా పొందిన అభ్యర్థులున్నారు. అయితే వీటన్నిటికీ మార్గం అభ్యర్థిలోని గ్రాస్పింగ్ పవర్. కాన్సెప్ట్స్‌పై పట్టు సాధిస్తూ వీలైనన్ని ప్రాక్టీస్ పేపర్స్ రాయాలి.
ఎగ్జామ్ ఎఫ్‌ఏక్యూస్
ప్ర : ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించాలంటే ఎన్ని మార్కులు రావాలి?
జ : గత అయిదేళ్ల ర్యాంకుల సరళిని విశ్లేషిస్తే 135 నుంచి 140 మధ్యలో మార్కులు పొందిన వారికి వంద లోపు ర్యాంకులు వచ్చే అవకాశాలున్నాయి. కనిష్టంగా 110 మార్కులు సాధిస్తే వేయి వరకు ర్యాంకు వస్తుంది. అప్పుడు మంచి కళాశాలలో సీటు పొందే అవకాశం ఉంటుంది. ఇక.. మెడికల్ విభాగానికి సంబంధించి 150 నుంచి 155 మార్కులతో టాప్-10లో; 135 నుంచి 140 మార్కులతో టాప్ - 100 జాబితాలో చోటు సాధించేందుకు ఆస్కారం లభిస్తుంది.
ప్ర : పరీక్ష హాల్లో సమాధానాలు ఇచ్చేటప్పుడు ముందుగా ఏ సబ్జెక్టులతో, ఎలాంటి ప్రశ్నలతో ప్రారంభించాలి?
జ : పరీక్ష హాల్లో సమాధానాలు ఇచ్చే విషయంలో విభిన్నంగా వ్యవహరించాలి. ముఖ్యంగా సబ్జెక్ట్‌ల వారీగా దీన్ని అనుసరించాలి. ఎంపీసీ విద్యార్థులు కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్; బైపీసీ విద్యార్థులు బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్.. వరుస క్రమ పద్ధతిని అనుసరించడం ఉపయుక్తంగా ఉంటుంది. ముందు బాగా వచ్చిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. తర్వాత క్రమంలో కాస్త ఆలోచించాల్సిన ప్రశ్నలపై దష్టి పెట్టాలి. ఈ దశ కూడా పూర్తయ్యాకే క్లిష్టమైన ప్రశ్నలవైపు దృష్టి సారించడం మేలు.
ప్ర : పరీక్షకు సన్నద్ధం చేసుకోవాల్సినవి?
జ : ఎంసెట్‌లో మంచి ర్యాంకు కోసం రెండేళ్లపాటు సాగించిన ప్రిపరేషన్ ఒక ఎత్తయితే.. పరీక్ష రాసే మూడు గంటలు ఎంతో ముఖ్యం. ఇందుకోసం విద్యార్థులు ముందుగానే సన్నద్ధం కావాలి. ఒక నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు. కాబట్టి తొలుత తమకు కేటాయించిన సెంటర్‌కు ఒక రోజు ముందే వెళ్లి చిరునామా తెలుసుకోవాలి. పరీక్ష రోజు మాత్రమే సెంటర్ కోసం అన్వేషిస్తే సమయం వథా అవడంతో పాటు అనవసర ఆందోళనకు లోనవుతారు.
ప్ర : హాల్‌టికెట్‌తోపాటు తీసుకెళ్లాల్సినవి?
జ : ఎంసెట్‌కు హాజరయ్యే విద్యార్థులు హాల్‌టికెట్‌తోపాటు తీసుకెళ్లాల్సినవి.-అప్పటికే పూర్తి చేసిన ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్ ప్రింటవుట్‌లో నిర్దేశిత ప్రాంతంలో(కింది భాగంలో ఎడమవైపు) కలర్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో(3ణ5పరిమాణం) అతికించి, దానిపై గెజిటెడ్ అధికారితో సంత కం లేదా విద్యార్థి తాను చదివిన కళాశాల ప్రిన్సిపాల్ సంతకం చేయించాలి. దీన్ని పరీక్ష హాల్లో ఇన్విజిలేటర్‌కు అందజేయాలి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు సమయంలో పూర్తి చేసిన ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్, కుల ధ్రువీకరణ పత్రాన్ని ఇన్విజిలేటర్‌కు సమర్పించాలి.
ప్ర : ఓఎంఆర్ షీట్ నింపడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు?
జ : విద్యార్థులు తమ సమాధానాలు నింపే ఓఎంఆర్ షీట్‌లోని వృత్తాలను నింపేందుకు కేవలం నీలి లేదా నలుపు రంగు బాల్ పాయింట్ పెన్‌ను మాత్రమే వినియోగించాలి. పెన్సిల్‌తో ఆన్సర్స్ ఇస్తే ఆ పేపర్ మూల్యాంకనం జరగదు. విద్యార్థులు అన్ని ప్రశ్నలకు సమాధానాలిచ్చాం అని భావించాక ఇతర ముఖ్యమైన అంశాలపై దష్టి పెట్టాలి. ముఖ్యంగా ఓఎంఆర్ ఆన్సర్ షీట్‌లోని అన్ని అంశాలు సరిగా రాశారా? ఓఎంఆర్ షీట్‌లో ఇన్విజిలేటర్ సంతకం ఉందా? అనేవి చూసుకోవాలి.
ప్ర : రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోతే హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చా?
జ : రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోయిన అభ్యర్థులు ఆయా వెబ్‌సైట్‌లలో (ఏపీ అభ్యర్థులు ఏపీ ఎంసెట్ వెబ్‌సైట్ ఠీఠీఠీ.్చఞ్ఛ్చఝఛ్ఛ్టి.ౌటజ; తెలంగాణ అభ్యర్థులు టీఎస్‌ఎంసెట్ వెబ్‌సైట్ ఠీఠీఠీ.్టట్ఛ్చఝఛ్ఛ్టి.జీ) లలో ఉండే ఫర్‌గెట్ రిజిస్ట్రేషన్ బటన్‌పై క్లిక్ చేసి నిర్దేశించిన వివరాలు పూర్తి చేస్తే రిజిస్ట్రేషన్ నెంబర్ తెలుసుకోవచ్చు. దాని ఆధారంగా హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఫిజిక్స్
ప్ర : ఎంసెట్ ఫిజిక్స్ ప్రశ్నల శైలి ఎలా ఉంటోంది?
జ : ఫిజిక్స్‌కు సంబంధించి ప్రశ్నలు రెండు రకాలుగా ఉంటున్నాయి. అవి-సులువు; ఒక మోస్తరు క్లిష్టం. ఇందులో 80 శాతం ప్రశ్నలు సులువుగా; 20 శాతం ప్రశ్నలు క్లిష్టంగా ఉంటున్నాయి. క్లిష్టంగా ఉండే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే సబ్జెక్ట్‌పై పూర్తి పట్టుసాధించాలి. మొత్తం 40 ప్రశ్నల్లో 90 శాతం ప్రశ్నలు ఫార్ములా బేస్డ్. ఫిజిక్స్‌లో ఇంజనీరింగ్ విభాగంలో 30 నుంచి 35 మార్కులు; మెడికల్ విభాగంలో 25 నుంచి 30 మార్కులు సాధించే అవకాశం ఉంది.
ప్ర : ఫిజిక్స్‌లో అప్లికేషన్ అప్రోచ్‌కు ప్రాధాన్యత ఉందా?
జ: అప్లికేషన్ అప్రోచ్‌కు అత్యంత ప్రాధాన్యత ఉండే సబ్జెక్ట్ ఫిజిక్స్. విద్యార్థులు అన్ని సూత్రాలను ఒక జాబితాగా రూపొందించుకుంటే రివిజన్ సులభంగా ఉంటుంది. అదే విధంగా ఒక సూత్రం ఆధారంగా ఉండే ప్రశ్నను పలు కోణాల్లో సాధించే విధంగా ప్రాక్టీస్ చేయాలి.
ప్ర : ఇంజనీరింగ్, మెడికల్ విభాగం విద్యార్థులు ఫిజిక్స్‌ను భిన్నంగా ప్రిపేర్ అవ్వాలా?
జ : ఇంజనీరింగ్, మెడికల్ రెండు విభాగాల్లో ఉండే ఫిజిక్స్‌కు సంబంధించి ఎంపీసీ విద్యార్థులు న్యూమరికల్ ఓరియెంటేషన్; బైపీసీ విద్యార్థులు థియరిటికల్ అప్రోచ్‌తో ప్రిపరేషన్ కొనసాగించాలి. ఈ క్రమంలో బైపీసీ విద్యార్థులు రీడింగ్‌కు, ఎంపీసీ విద్యార్థులు ప్రాక్టీస్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.
ప్ర : ఫిజిక్స్‌లో బాగా రివిజన్ చేయాల్సిన అంశాలేవి?
జ : ఎలక్ట్రోమ్యాగ్నటిజం; మ్యాగ్నటిజం; వేవ్‌మోషన్; హీట్; న్యూక్లియర్ ఫిజిక్స్; అటామిక్ ఫిజిక్స్; సెమీ కండక్టర్ డివెజైస్ అంశాలకు రివిజన్‌లో ప్రాధాన్యం ఇవ్వాలి. పరీక్షలో లభించే వెయిటేజీ పరంగా ఈ అంశాలకే ప్రాధాన్యం ఉంటుంది. దీన్ని పరిగణనలోకి తీసుకుంటూ రివిజన్‌కు సమయం కేటాయించాలి.
ప్ర : ఫిజిక్స్ కోసం రోజుకు ఎన్ని గంటలు కేటాయించాలి?
జ : ఫిజిక్స్‌కు సంబంధించి బైపీసీ విద్యార్థులు ప్రతి రోజు మూడు గంటలు కేటాయించడం ఉపయుక్తం. ఇందులో ఫార్ములా రీడింగ్, గ్రాండ్‌టెస్ట్‌లు రాయడం వంటివి ఉండేలా చూసుకోవాలి.
కెమిస్ట్రీ
ప్ర : కెమిస్ట్రీకి సంబంధించి ప్రస్తుత సమయంలో అనుసరించాల్సిన వ్యూహం?
జ : ఇంటర్మీడియెట్ రెండు సంవత్సరాల సిలబస్‌లోని పాఠ్యాంశాల సినాప్సిస్‌ను చదవాలి. విద్యార్థులు తమకు అనుకూలమైన పద్ధతుల్లో సంక్షిప్తంగా సొంత నోట్స్ రూపొందించుకుని దానిపై ఎక్కువ దష్టి సారించి ఎక్కువసార్లు చదవాలి.
ప్ర : కెమిస్ట్రీలో మంచి మార్కులు పొందేందుకు దోహదం చేసే టాపిక్స్ ఏవి?
జ : ఇప్పటికే సిలబస్ ప్రిపరేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు మార్కుల సాధనలో ముఖ్య పాత్ర వహించే ఆర్గానిక్ కెమిస్ట్రీ; కెమికల్ బాండింగ్, పీరియాడిక్ టేబుల్స్‌పై పట్టు సాధించాలి. ఫిజికల్ కెమిస్ట్రీలో సొల్యూషన్స్; ఎలక్ట్రో కెమిస్ట్రీ; థర్మోడైనమిక్స్; స్టేట్ ఆఫ్ మ్యాటర్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మూలకాల ధర్మాలను బేరీజు వేస్తూ తులనాత్మక అధ్యయనం చేయాలి.
ప్ర : కెమిస్ట్రీలో ముఖ్యమైన విభాగం?
జ : ప్రస్తుతం కెమిస్ట్రీ మూడు భాగాలుగా ఉంది. అవి.. ఆర్గానిక్, ఇనార్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ. వీటిలో ఎంసెట్ వెయిటేజీ పరంగా ఆర్గానిక్ కెమిస్ట్రీ ముఖ్యమైంది. దీనిలో పట్టు సాధించాలంటే ఇంటర్ కన్వర్షన్ చార్ట్స్ రూపొందించుకోవాలి. మూలకాల రియాక్షన్స్; ఫ్లో చార్ట్స్, మూలకాలు-వాటి తయారీ పద్ధతులు, ధర్మాలను చదవాలి. అలాగే ఇన్-ఆర్గానిక్ కెమిస్ట్రీలో గ్రూప్ ఎలిమెంట్స్ ప్రిపరేషన్ మెథడ్స్, అందుకు అనుసరించే విధానాలపై అవగాహన పెంచుకోవాలి.
ప్ర : క్లిష్టమైన ఫార్ములాలు- గుర్తుంచుకునే మార్గాలు?
జ : క్లిష్టమైన ఫార్ములాలు గుర్తుంచుకునేందుకు ఏకైక మార్గం.. నిరంతర ప్రాక్టీస్. వాస్తవానికి కెమిస్ట్రీలో ఫార్ములా ఆధారిత అంశాలే అధికంగా ఉంటాయి. కాబట్టి క్లిష్టం, సులువు అనే భావన, ఆందోళన వీడాలి. నిజంగానే అభ్యర్థులు తమ వ్యక్తిగత సామర్థ్యం ఆధారంగా క్లిష్టంగా భావించే ఫార్ములాలు ఏవైనా ఉంటే వాటిని విడిగా నోట్స్‌లో పొందుపర్చుకుని పునశ్చరణ చేయాలి.
ప్ర : ఇంటర్ రిలేటెడ్ టాపిక్స్‌లో రాణించాలంటే?
జ : ఫిజిక్స్‌లో మాదిరిగానే కెమిస్ట్రీలోనూ అంతర్గత సంబంధం(ఇంటర్ రిలేటెడ్) గల అంశాలున్నాయి. ముఖ్యంగా మూలకాలు-వాటి తయారీ, ధర్మాల్లో ఎక్కువగా ఉంటాయి. వీటి విషయంలో ప్రిపరేషన్ మెథడ్స్‌ను పట్టిక రూపంలో పొందుపర్చుకుని చదివితే సులువుగా జ్ఞప్తికి వస్తాయి.
ప్ర : ఇంజనీరింగ్, మెడికల్ అభ్యర్థులు అనుసరించాల్సిన ప్రత్యేక వ్యూహాలు?
జ : కెమిస్ట్రీకి సంబంధించి ఇంజనీరింగ్, మెడికల్ విభాగాల్లో వచ్చే ప్రశ్నల్లో వ్యత్యాసం తక్కువగానే ఉంటుంది. కాబట్టి ప్రత్యేక వ్యూహాలు అవసరం లేదు. ఇంజనీరింగ్ విభాగంలోని కెమిస్ట్రీ ప్రశ్నల్లో ప్రాబ్లమ్ బేస్డ్ కొశ్చన్స్ శాతం కొంత ఎక్కువే.
జువాలజీ
ప్ర : జువాలజీలో ప్రశ్నల శైలి ఎలా ఉంటుంది?
జ : మొత్తం 40 ప్రశ్నలు ఉండే జువాలజీలో దాదాపు 35 నేరుగా ఉంటాయి. ఇవి కూడా సులువుగా సగటు విద్యార్థి సమాధానం ఇచ్చే విధంగా ఉంటాయి. ప్రశ్నలోని కీలక పాయింట్స్‌ను అవగాహన చేసుకునే నైపుణ్యం ఉంటే జువాలజీలో 90 శాతం మార్కులు సొంతం చేసుకోవచ్చు.
ప్ర : జువాలజీలో ప్రధానంగా దష్టి సారించాల్సిన అంశాలేవి?
జ : ఇప్పుడున్న సమయంలో జువాలజీకి సంబంధించి బ్యాక్టీరియాలు, వ్యాధులు, వాటి లక్షణాలు, ప్రభావాలపై ఎక్కువ దష్టి సారించాలి. రెండేళ్ల సిలబస్‌లోని అంశాలను సంక్షిప్తంగా ఒకచోట పొందుపర్చుకుంటే ప్రిపరేషన్ పరంగా మేలు చేస్తుంది. ఈ సమయంలో కొత్త అంశాలను చదవడం అనవసరపు ఆందోళనకు గురిచేస్తుంది. ఎంసెట్ వెయిటేజీ ప్రకారం- బాగా ముఖ్యమైన అంశం అని భావిస్తే.. కాంటెక్ట్స్ తెలుసుకోవడం మేలు.
ప్ర : జువాలజీలో విస్మరించకూడని అంశాలు?
జ : కాలేయం; వానపాము; బొద్దింకల జీవ వ్యవస్థ; ప్రొటీన్లు; ఎంజైమ్‌లు, క్షీర గ్రంథులు; నాడీ వ్యవస్థ; నేత్ర పటలం; జీవావరణం-పర్యావరణం; జన్యుశాస్త్రం; జీవ పరిమాణం; అనువర్తిత జీవ శాస్త్రం
చాప్టర్లలోని అంశాలన్నింటినీ అధ్యయనం చేయడం తప్పనిసరి.
ప్ర : షార్ట్‌కట్ మెథడ్స్, మెమొరీ టిప్స్?
జ : షార్ట్‌కట్ మెథడ్స్, మెమొరీకి సరైన మార్గం సొంత నోట్స్ రూపకల్పన. కీలక పదాలు, వాటి నిర్వచనాలు కచ్చితంగా ఉండేలా చూస్తూ ఆయా అంశాల కేంద్రక భావనలు రాసుకుంటూ విభిన్నంగా ఉండేలా చూడాలి.
ప్ర : డయాగ్రమ్స్ విషయంలో వ్యవహరించాల్సిన తీరు?
జ : జువాలజీలో డయాగ్రమ్స్‌ది ముఖ్య పాత్ర. అందులోని భాగాలను కచ్చితంగా గుర్తుంచుకునేలా ప్రాక్టీస్ చేయాలి. యాక్షన్ పొటెన్షియల్ డ్యూరింగ్ ఇంపల్స్ డయాగ్రమ్, ఈసీజీ, ఆక్సీహిమోగ్లోబిన్ డిససోసియేషన్ కర్వ్, ఫ్లయింగ్ లోకోమోషన్ ఆఫ్ కాక్రోచ్ వంటి వాటిని తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయాలి.
ప్ర : ప్రస్తుత సమయంలో ప్రిపరేషన్ వ్యూహం?
జ : ఎక్కువ సమయం థియరీ రివిజన్‌కు కేటాయించాలి. సొంత నోట్స్ రూపొందించుకోవాలి. దాంతోపాటు ఒక అంశం నుంచి ప్రశ్నలు అడిగే అవకాశాలపైనా అవగాహన ఏర్పరచుకుంటే మరింత ఉపయుక్తంగా ఉంటుంది. ప్రతి రోజు కనీసం మూడు గంటలు తగ్గకుండా జువాలజీ ప్రిపరేషన్‌కు కేటాయించాలి. కేవలం రీడింగ్‌కు పరిమితం కాకుండా.. డయాగ్రమ్స్ ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమివ్వాలి.
ముందస్తు జాగ్రత్తతో ఆందోళనకు స్వస్తి
ఇంజనీరింగ్, మెడికల్ విభాగాలకు కలిపి తెలంగాణ ఎంసెట్‌కు ఇప్పటివరకు 2.30 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. హాల్ టికెట్ డౌన్‌లోడ్ ఆప్షన్ మే 8 నుంచి అందుబాటులోకి వస్తుంది. విద్యార్థులు వీలైనంత ముందుగా హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవడం మంచిది. లేదంటే చివర్లో నెట్‌వర్క్ ప్రాబ్లమ్స్ తలెత్తి ఆందోళనకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇక పరీక్ష హాల్లో అభ్యర్థులు ముందుగా తమకు ఇచ్చిన బుక్‌లెట్‌లో అన్ని పేజీలు ఉన్నాయో లేదో పరిశీలించాలి.
లేదంటే వెంటనే ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకెళ్లి మరో బుక్‌లెట్ పొందాలి. పరీక్ష కేంద్రాలకు సంబంధించిన సమాచారం ఆయా అభ్యర్థులకు ఎస్‌ఎంఎస్ ద్వారా పంపడం జరుగుతుంది. కాబట్టి ఒక రోజు ముందుగానే పరీక్ష కేంద్రం చిరునామా తెలుసుకోవడం ద్వారా లాస్ట్ మినిట్ టెన్షన్‌ను తప్పించుకోవచ్చు.
- ప్రొఫెసర్ ఎన్.వి.రమణ రావు, కన్వీనర్ టీఎస్‌ఎంసెట్
లోపాలు సరిదిద్దుకునే అవకాశం
ఏపీ ఎంసెట్ అభ్యర్థులు తమ ఆన్‌లైన్ అప్లికేషన్‌లో లోపాలు ఏమైనా ఉంటే సరిదిద్దుకునే అవకాశం ఏప్రిల్ 21 వరకు అందుబాటులో ఉంటుంది. దీన్ని వినియోగించుకోవాలి. హాల్ టికెట్ డౌన్‌లోడ్ విండో మే 2 నుంచి 6 వరకు అందుబాటులో ఉంటుంది. ఇంటర్నెట్ ప్రాబ్లమ్, నెట్‌వర్క్ ఎర్రర్స్‌ను తప్పించుకోవడానికి వీలైనంత ముందుగా హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవడం మేలు. ఏవైనా సమస్యలు తలెత్తితే వెబ్‌సైట్‌లో పేర్కొన్న హెల్ప్‌లైన్ సెంటర్లను సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ఎంసెట్‌కు దాదాపు 2.5 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందు కు తగిన రీతిలో వెబ్‌సైట్‌లో సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నాం.
- ప్రొఫెసర్ సీహెచ్. సాయిబాబు, కన్వీనర్ - ఏపీఎంసెట్