ప్రశాంతంగా ముగిసిన ఏపీ ఎంసెట్
♦ ఇంజనీరింగ్‌లో 94.84 శాతం
♦ అగ్రికల్చర్, మెడికల్‌లో 95.67 శాతం హాజరు
సాక్షి, హైదరాబాద్/బాలాజీ చెరువు(కాకినాడ): రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్టు(ఏపీ ఎంసెట్-2016) శుక్రవారం ముగిసిందని ఎంసెట్ చైర్మన్ ప్రొఫెసర్ వీఎస్‌ఎస్ కుమార్, కన్వీనర్ ప్రొఫెసర్ సీహెచ్.సాయిబాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంజనీరింగ్‌లో 94.84 శాత ం మంది, అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో 95.67 శాతం మంది హాజరైనట్లు వివరించారు. తెలంగాణలో కూడా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడంతో అనూహ్య స్పం దన లభించింది.
ఇంజనీరింగ్ విభాగానికి 1,89,232 మంది దరఖాస్తు చేయగా 1,79,462 మంది పరీక్షకు హాజరయ్యారు. అగ్రికల్చర్, మెడికల్ విభాగానికి 1,03,222 మంది దరఖాస్తు చేసుకోగా 98,750 మంది హాజరయ్యారు.కాకినాడ జేఎన్‌టీయూలో శుక్రవారం ఉదయం 5.30 గంటలకు మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంజనీరింగ్ పరీక్షకు జీ2 సెట్ కోడ్‌ను విడుదల చేశారు. అగ్రికల్చర్, మెడికల్ విభాగానికి మంత్రి కామినేని శ్రీనివాస్ విడుదల చేశారు.
ఎంసెట్‌లో రెండు తప్పులు దొర్లాయి. ఇంజనీరింగ్ గణితంలో సెట్-బీలోని 31వ ప్రశ్నలో చిన్న తప్పు దొర్లింది. ప్రశ్నలో 2 అంకెకు బదులు ఇంగ్లీషు జెడ్‌ను ముద్రించడంతో ఇబ్బందులు ఎదురయ్యా యి. అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో బోటనీలో ఒక ప్రశ్నకు ఇచ్చిన ఆప్షన్లలో సమాధానం లేదని నిపుణులు చెప్పారు.