మార్కులు అలా.. ర్యాంకులు ఇలా... | EAMCET Engineering Medical department of the Bachelor courses Examination | Sakshi
Sakshi News home page

మార్కులు అలా.. ర్యాంకులు ఇలా...

Published Thu, May 22 2014 2:03 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

మార్కులు అలా.. ర్యాంకులు ఇలా... - Sakshi

మార్కులు అలా.. ర్యాంకులు ఇలా...

ఎంసెట్.. ఇంజనీరింగ్, మెడికల్ విభాగాల్లో బ్యాచిలర్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష. రాష్ట్రంలో లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షలో ఉత్తీర్ణత, మెరుగైన ర్యాంకు కోసం ఇంటర్మీడియెట్‌లో చేరిన తొలి రోజు నుంచే శ్రమిస్తుంటారు. నేడు (మే 22) ఎంసెట్ - 2014 పరీక్ష జరుగనుంది. పరీక్ష పూర్తికాగానే ఎన్ని మార్కులు వస్తే ఎంత ర్యాంకు వస్తుంది? అనే చర్చ మొదలవుతుంది. ఈ నేపథ్యంలో గత ఏడాది ఎన్ని మార్కులకు ఎంత ర్యాంకు వచ్చింది? పరీక్ష క్లిష్టత స్థాయి ఎలా ఉంది? ప్రస్తుతం ఎంత మంది పోటీ పడుతున్నారు? తదితర అంశాలపై విశ్లేషణ..
 
 ఎంసెట్-2013 ఇలా..
 ఇంజనీరింగ్ విభాగంలో దరఖాస్తుల సంఖ్య 2,91,805. హాజరైన వారి సంఖ్య 2, 76, 995. ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు 2,01,308.
 మెడికల్ విభాగంలో అందిన దరఖాస్తులు 1,05,065. హాజరైన విద్యార్థులు 99,983. ర్యాంకుల తుది జాబితాలో నిలిచిన అభ్యర్థులు 80,778. ఇంటర్మీడియెట్ మార్కులకు వెయిటేజీ కల్పించి ర్యాంకులను ప్రకటించే విధానాన్ని అనుసరించిన నేపథ్యంలో.. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి ఇంటర్మీడియెట్ వివరాలు అందించని, ఫెయిలైన విద్యార్థులు మొత్తం 29,194 మంది ఎంసెట్‌లో ఉత్తీర్ణత సాధించినా ర్యాంకులు కేటాయించలేదు. ఇదే విధంగా మెడికల్ విభాగంలో 8,533 మందికి ర్యాంకులు కేటాయించలేదు.
 
 ఎంసెట్-2012 ఫలితాలు ఇలా:
 ఇంజనీరింగ్ విభాగం:
 మొత్తం దరఖాస్తులు 2,94,150. హాజరైన వారి సంఖ్య 2,83,477. ఎంసెట్‌లో ఉత్తీర్ణత సాధించి ర్యాంకుల జాబితాలో నిలిచిన వారు 2,23,886.


 మెడికల్ విభాగం:
 దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సంఖ్య 95,518. హాజరైన విద్యార్థుల సంఖ్య 90,197. ఉత్తీర్ణత సాధించి తుది ర్యాంకుల జాబితాలో చోటు సాధించిన విద్యార్థులు 83,686. ఎంసెట్-2012 ఫలితాల క్రమంలో ఇంటర్మీడియెట్ వివరాలు లేని, ఫెయిలైన విద్యార్థులు ఇంజనీరింగ్‌లో 16,413; మెడికల్ విభాగంలో 5,886 మందికి ర్యాంకుల జాబితాలో చోటు లభించలేదు. వీటి ప్రకారం.. ఎంసెట్-2012, 2013 గణాంకాలను విశ్లేషిస్తే.. ఇంజనీరింగ్ విభాగంలో 2012తో పోల్చితే 2013లో దరఖాస్తు సంఖ్య, హాజరైన అభ్యర్థుల సంఖ్య కొంత తగ్గింది. కానీ.. మెడికల్ విభాగంలో ప్రతి ఏటా పోటీ పెరుగుతోందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

2012తో పోల్చితే 2013లో పెరిగిన దరఖాస్తుల సంఖ్య సుమారు పదివేలుగా నమోదైంది. ఇదే క్రమంలో హాజరైన వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. 2012లో 90,197 మంది మెడికల్ స్ట్రీమ్‌కు హాజరు కాగా.. 2013 ఆ సంఖ్య 99,983కు పెరిగింది. ఇక.. తాజా ఎంసెట్-2014 దరఖాస్తుల తీరును పరిశీలిస్తే దరఖాస్తుల చివరి తేదీ నాటికి (అపరాధ రుసుము లేకుండా) ఇంజనీరింగ్ విభాగానికి 2.73 లక్షల మంది, మెడికల్ విభాగానికి 1.08 లక్షల మంది పోటీలో నిలిచారు. తాజా దరఖాస్తుల సరళిని గత రెండేళ్ల ఎంసెట్ దరఖాస్తుల సరళితో పోల్చితే ఇంజనీరింగ్ విభాగంలో దరఖాస్తుల సంఖ్య కొంత తగ్గుతోంది. కానీ మెడికల్ విభాగంలో మాత్రం పెరుగుతోంది.
 
 దరఖాస్తుల తీరులో మార్పు.. కారణాలు:
 ఇంజనీరింగ్ విభాగంలో దరఖాస్తుల సంఖ్య తగ్గడానికి.. ప్రధాన కారణంగా నిపుణులు పేర్కొంటున్న అభిప్రాయాలు.. చాలా మంది విద్యార్థులు జేఈఈ-మెయిన్స్, అడ్వాన్స్‌డ్ ద్వారా ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఐఐటీలు.. అదే విధంగా ప్రైవేటు విద్యా సంస్థల పరంగా బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అడ్మిషన్ టెస్ట్ (బిట్‌శాట్) వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ టెస్ట్(వీఐటీఈఈ) వంటి పోటీ పరీక్షలవైపు ఎక్కువ దృష్టి సారించడమే. ఇందుకు ప్రధాన కారణం.. రాష్ట్రంలో ఎంసెట్‌లో అర్హులైన ప్రతి ఒక్కరికీ సీటు లభించడం ఖాయం. కానీ విద్యార్థులు, తల్లిదండ్రుల ఆలోచనలో మార్పు వచ్చింది. మంచి కళాశాలలో చేరడానికి మొగ్గు చూపుతున్నారు. మెడికల్ విభాగంలో మాత్రం మన రాష్ట్రం సెంట్రల్ పూల్‌లో లేకపోవడం, ఇతర రాష్ట్రాల్లోనూ సీట్ల సంఖ్య పరిమితంగా ఉండటంతో ఈ విభాగంలో దరఖాస్తుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది.
 
 కీలకంగా నిలుస్తున్న వెయిటేజీ:
 ఎంసెట్ ర్యాంకుల నిర్ధారణలో ఎంసెట్ మార్కులకు, ఇంటర్మీడియెట్ గ్రూప్ సబ్జెక్ట్స్‌లో పొందిన మార్కులకు కల్పించిన వెయిటేజీ కీలకంగా మారింది. 160 మార్కులకు నిర్వహించే ఎంసెట్‌లో పొందిన మార్కులకు 75 శాతం వెయిటేజీ, ఇంటర్మీడియెట్‌లో 600 మార్కులకు ఉండే గ్రూప్ సబ్జెక్ట్స్‌లో పొందిన మార్కులకు కల్పించే 25 శాతం వెయిటేజీల కారణంగా.. ఈ రెండు పరీక్షల్లో ఒక్క మార్కు తగ్గినా ర్యాంకుల జాబితాలో వందల సంఖ్యలో తేడా కనిపిస్తోంది. ఎంసెట్‌కు 75 శాతం వెయిటేజీ ప్రకారం ఎంసెట్‌లో పొందే ప్రతి ఒక మార్కుకు 0.46875 వెయిటేజీతో తుది ర్యాంకును గణిస్తారు. ఈ క్రమంలో ఎంసెట్‌లో పొందే ప్రతి రెండు మార్కులు ఫైనల్ ర్యాంకులో ఒక మార్కుకు సమానం. అదే విధంగా ఇంటర్మీడియెట్ మార్కుల వెయిటేజిని ఎంసెట్ మార్కుల వెయిటేజితో పోల్చితే.. ఇంటర్మీడియెట్‌లోని ప్రతి 24 మార్కులు తుది ర్యాంకుల జాబితా నిర్ధారణలో ఒక మార్కుకు సమానం. అదే విధంగా ఇంటర్మీడియెట్‌లో ఒక మార్కు తేడాతో పది నుంచి 50 ర్యాంకుల మధ్యలో వ్యత్యాసం ఏర్పడుతుంది.
 
 గత రెండేళ్ల ర్యాంకుల సరళి:
 గత రెండేళ్ల ర్యాంకుల సరళిని పరిశీలిస్తే మొదటి 10 ర్యాంకుల్లో నిలవాలంటే ఎంసెట్ మార్కులు 150 నుంచి 155 మధ్యలో.. ఇంటర్మీడియెట్ మార్కులు 595పైగా పొందితేనే సాధ్యం. అదే విధంగా ఎంసెట్‌లో టాప్-50 లో ర్యాంకులు సాధించాలంటే ఎంసెట్‌లో 140 నుంచి 150 మధ్యలో మార్కులు సాధించాలి. 100లోపు లక్ష్యంగా పెట్టుకుంటే 136 నుంచి 140 మార్కులు తప్పనిసరి. 500లోపు ర్యాంకు సాధించాలంటే 120 మార్కులు; 1,000 లోపు ర్యాంకు కోసం 110 మార్కులు; 5,000 లోపు ర్యాంకు పొందాలంటే 90 మార్కులపైనా పొందాలి. రాష్ట్రంలోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలు అందుబాటులోని సీట్ల ఆధారంగా.. ప్రభుత్వ కళాశాలల్లో కోర్ బ్రాంచ్‌లలో సీటు పొందాలంటే 1,000 నుంచి 1,500లోపు ర్యాంకుతోనే సాధ్యం. ఈ ర్యాంకులు పొందాలంటే అభ్యర్థులు ఎంసెట్‌లో 110 నుంచి 120 మార్కులు అవసరం.
 
 ఇక.. మెడికల్ విభాగానికి సంబంధించి.. అందుబాటులోని సీట్లను దృష్టిలో పెట్టుకుంటే అటు ఎంసెట్‌లో అత్యధిక మార్కులు, ఇటు ఇంటర్మీడియెట్‌లోనూ మంచి మార్కులతోనే తుది ర్యాంకులు ఆశాజనకంగా ఉంటాయి. మెడికల్ ర్యాంకుల పరంగా.. ఇంటర్మీడియెట్‌లో 24.5కు పైగా వెయిటేజీ, ఎంసెట్‌లో దాదాపు 70 శాతం వెయిటేజీ ఉంటేనే మొదటి 50 ర్యాంకులు లభించాయి. ఇక్కడ విద్యార్థులు గమనించాల్సిన ప్రధాన అంశం.. ఇంటర్మీడియెట్ వెయిటేజీ 24కు పైగా ఉన్నప్పటికీ.. ఎంసెట్‌లో మార్కులు తగ్గే కొద్దీ ర్యాంకుల్లో భారీ వ్యత్యాసం కనిపించింది. 500 లోపు ర్యాంకులను పరిశీలిస్తే రెండు మార్కుల తేడాతో ర్యాంకుల నిర్ధారణలో వందకుపైగా ర్యాంకుల వ్యత్యాసం కనిపించింది. ఎంసెట్‌లో 100 నుంచి 130 మార్కులు పొందిన అభ్యర్థుల ర్యాంకులను పరిశీలిస్తే 130 మార్కులకు, 100 మార్కులకు మధ్యలో 4,000కు పైగా ర్యాంకులు తగ్గాయి. 100లోపు పొందిన మార్కులను పరిశీలిస్తే ఒక్కో మార్కు తగ్గేకొద్దీ ర్యాంకుల్లో వ్యత్యాసం దాదాపు 1,000గా తేలింది. వీటిని గమనిస్తే.. విద్యార్థులు.. ముఖ్యంగా మెడికల్ స్ట్రీమ్ ఔత్సాహికులు ఎంసెట్‌లో అత్యధిక మార్కులను సాధించాలి.
 
 ఎంసెట్-2013..
 వెయిటేజీ, ర్యాంకుల గణాంకాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement