రేపే ఎంసెట్‌ | EAMCET exam is Tomorrow | Sakshi
Sakshi News home page

రేపే ఎంసెట్‌

Published Thu, May 11 2017 12:19 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

రేపే ఎంసెట్‌ - Sakshi

రేపే ఎంసెట్‌

నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
- గంట ముందు నుంచే పరీక్ష హాల్లోకి అనుమతి
- ఉదయం 10 గంటలకు ఇంజనీరింగ్‌ పరీక్ష
- మధ్యాహ్నం 2:30 గంటలకు అగ్రికల్చర్, ఫార్మసీ
- హాజరుకానున్న 2,20,248 మంది విద్యార్థులు
- ఇంజనీరింగ్‌కు 1,41,187 మంది,అగ్రికల్చర్‌కు 79,061 మంది
- ఈ నెల 22న ర్యాంకుల ప్రకటన


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం శుక్రవారం నిర్వహించనున్న ఎంసెట్‌కు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. తెలంగాణ తోపాటు ఆంధ్రప్రదేశ్‌ నుంచి మొత్తంగా 2,20,248 మంది విద్యార్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ఇంజనీరింగ్‌కు 1,41,187, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు 79,061 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నట్లు ఎంసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ యాదయ్య బుధవారం తెలిపారు. ఇంజనీరింగ్‌ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్ష మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఉంటుందని వెల్లడించారు.

విద్యార్థులను పరీక్ష హాల్లోకి గంట ముందు నుంచే అనుమతిస్తామని తెలిపారు. నిర్ణీత సమయం తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. విద్యార్థులు సాధ్యమైనంత ముందుగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, ఒక రోజు ముందుగానే పరీక్ష కేంద్రాన్ని చూసుకోవాలని సూచించారు. గతేడాది లీకేజీ నేపథ్యంలో ఈసారి ఎంసెట్‌ కమిటీ పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. ఆలస్య రుసుముతో పరీక్ష ఫీజు చెల్లించిన అభ్యర్థులపై, గత ఎంసెట్‌లలో దరఖాస్తు చేసి, ఇప్పుడు కూడా దరఖాస్తు చేసుకున్న వారిపై పోలీసు నిఘా పెట్టింది.

ఏపీ నుంచి 26 వేలకు పైగా..
తెలంగాణ ఎంసెట్‌కు ఏపీ నుంచి 35 వేల మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఏపీలోని ప్రాంతీయ సమన్వయ కేంద్రాలైన తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం కేంద్రాల నుంచి పరీక్షలు రాసేందుకు 26,204 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఎంసెట్‌ అధికారులు లెక్కలు వేశారు. ఏపీకి చెందిన మరో 9 వేల మంది హైదరాబాద్‌లోని ఆరు ప్రాంతీయ కేంద్రాల పరిధిలో పరీక్షలు రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి కర్నూలు ప్రాంతీయ కేంద్రాన్ని ఎత్తివేశారు. దీంతో కొందరు మహబూబ్‌నగర్‌లో పరీక్షలు రాసేందుకు దరఖాస్తు చేసుకోగా, ఇంకొందరు సూర్యాపేట ప్రాంతీయ కేంద్రం పరిధిలోని కేంద్రాలను ఎంచుకున్నారు.

13న ప్రాథమిక కీ
ఎంసెట్‌ ప్రాథమిక కీని ఈ నెల 13న విడుదల చేయనున్నారు. దానిపై ఈ నెల 18 వరకు అభ్యంతరాలను స్వీకరించి 22న ర్యాంకులను ప్రకటిస్తారు.

విద్యార్థులూ... ఇవీ జాగ్రత్తలు..
నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్లోకి అనుమతించరు. హాల్లోకి ఒక్కసారి వెళ్లిన అభ్యర్థిని పరీక్ష పూర్తయ్యే వరకు బయటకు రానివ్వరు. విద్యార్థులు పూర్తి చేసిన ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫారాన్ని ఇన్విజిలేటర్‌కు అందజేయాలి. పరీక్ష రాసిన తర్వాత ఓఎంఆర్‌ జవాబు పత్రాన్ని ఇన్విజిలేటర్‌కు ఇవ్వాలి. లేదంటే వారి ఫలితాలను విత్‌హెల్డ్‌లో పెడతారు. విద్యార్థి బ్లాక్‌/బ్లూ బాల్‌ పాయింట్‌ పెన్, పూర్తి చేసిన ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫారం, హాల్‌ టికెట్‌ మాత్రమే పరీక్ష హాల్లోకి తీసుకెళ్లాలి. ఎలాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలను అనుమతించరు. క్యాలుకులేటర్, మ్యాథమెటికల్‌/లాగ్‌ టేబుల్, పేజర్, సెల్‌ఫోన్లు, వాచీలు వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు, ఖాళీ పేపర్లను అనుమతించరు. మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడితే క్రిమినల్‌ కేసు నమోదు చేస్తారు. ప్రతి విద్యార్థి కచ్చితంగా బయోమెట్రిక్‌ వివరాలు (వేలి ముద్రలు) నమోదు చేయించుకోవాలి. లేకపోతే ఆ విద్యార్థిని రిజెక్టెడ్‌ జాబితాలో చేరుస్తారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement