ఇంకా ‘సెట్‌’ కాలేదు! | Exercise does not begin with entrance examinations of various courses | Sakshi
Sakshi News home page

ఇంకా ‘సెట్‌’ కాలేదు!

Published Thu, Jan 18 2024 5:08 AM | Last Updated on Thu, Jan 18 2024 5:08 AM

Exercise does not begin with entrance examinations of various courses - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి పరీక్షల (సెట్‌ల)పై ఇంకా కసరత్తు మొదలుకాలేదు. ఎంసెట్‌ సహా పాలిసెట్, ఈసెట్, ఎడ్‌సెట్, లాసెట్‌ పరీక్షల షెడ్యూల్‌పై అయోమయం నెలకొంది. ఏ ప్రవేశపరీక్షను ఏ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించాలి? ఏ పరీక్షకు కన్వీనర్‌ ఎవరనే సందిగ్ధత కొనసాగుతోంది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలిలో నెలకొన్న గందరగోళమే దీనికి కారణమని.. దీంతో ఈసారి ప్రవేశపరీక్షల నిర్వహణ ఆలస్యం కావొచ్చని అభిప్రాయాలు వెలువడుతున్నాయి. 

ఇప్పటికే మొదలుకావాల్సి ఉన్నా.. 
ఏటా జనవరిలో ఎంసెట్‌ సహా ఇతర ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటిస్తారు. ఆయా పరీక్షలను నిర్వహించే యూనివర్సిటీలను, కన్వీనర్లను ఖరారు చేస్తారు. ఆ వెంటనే ఆయా కన్వీనర్లు, యూనివర్సిటీల ఆధ్వర్యంలో పరీక్షలకు సంబంధించిన కసరత్తు, ఏర్పాట్లు మొదలవుతాయి. కానీ ఈసారి జనవరి మూడోవారం ముగుస్తున్నా.. షెడ్యూల్‌ విడుదలకు సంబంధించిన ఎలాంటి కసరత్తు మొదలుకాలేదు. 

ఎంసెట్‌పై కసరత్తు ఏదీ? 
జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష అయిన జేఈఈ మెయిన్స్‌ను ఈ నెల 24 నుంచి నిర్వహిస్తున్నారు. ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశాల కోసం జూన్‌ నుంచి జోసా కౌన్సెలింగ్‌ చేపట్టేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. సాధారణంగా జేఈఈ తేదీలకు అనుగుణంగా రాష్ట్ర ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ తేదీలను ఖరారు చేస్తారు. షెడ్యూల్‌ ప్రకటన తర్వాత.. ఎంసెట్‌ జరిగి, ఫలితాలు వచ్చి, కౌన్సెలింగ్‌ మొదలయ్యే నాటికి విశ్వవిద్యాలయాలు ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో తనిఖీలు చేసి.. అర్హత ఉన్నవాటికి అనుబంధ గుర్తింపు ఇస్తాయి. సాధారణంగా మేలో ఎంసెట్‌ నిర్వహించి, అదే నెలలో ఫలితాలు వెల్లడిస్తున్నారు. ఈసారి గందరగోళంతో ఎంసెట్‌ సహా ఇతర ప్రవేశ పరీక్షలు కూడా ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోందని విద్యావేత్తలు చెప్తున్నారు. 
 
హడావుడిగా జరిగితే ఇబ్బందులే.. 

సాధారణంగా ఉమ్మడి ప్రవేశపరీక్షల ప్రక్రియ ఏటా నవంబర్‌ నుంచే మొదలవుతుంది. వర్సిటీల వీసీలతో ఉన్నత విద్యా మండలి సమావేశం ఏర్పాటు చేసి.. సెట్స్‌కు కన్వీనర్లను ఎంపిక చేయాలి. వారు ప్రశ్నపత్రాల తయారీపై దృష్టి పెడతారు. ప్రశ్నల రూపకల్పనకు సంబంధించి నిపుణులను పిలిపిస్తారు. కంప్యూటర్‌ బేస్డ్‌గా దాదాపు పది రకాల ప్రశ్నపత్రాలను రూపొందిస్తారు. ఇందులో కఠినమైనవి, తేలికైనవి అత్యంత గోప్యంగా తయారు చేయాలి. తర్వాత వాటన్నింటినీ కలిపి కంప్యూటర్‌ సాయంతో ఫైనల్‌ పేపర్‌ను సిద్ధం చేస్తారు. ఈ ప్రక్రియ కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తారు.

తర్వాత పరీక్ష కేంద్రాల ఎంపిక, ప్రశ్నపత్రాల సగటు పరిశీలన ఉంటాయి. పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి, ర్యాంకుల క్రోడీకరణకు ఎక్కువ సమయం పడుతుంది. పలు దఫాలుగా వీసీలు, ప్రొఫెసర్లు సమావేశాలు జరుపుతూ ఉంటే.. ఇవన్నీ సాఫీగా సాగుతాయి. ఈసారి ఇప్పటికీ విద్యా మండలి సమావేశమే జరగలేదు. ఆలస్యంగా ప్రక్రియ మొదలుపెట్టి హడావుడిగా చేస్తే.. ఎక్కడైనా లోపం జరిగితే.. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌ ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
విద్యార్థుల సన్నద్ధతకూ ఇబ్బంది 

ఎంసెట్‌ ఆలస్యం వల్ల విద్యార్థుల సన్నద్ధతకు, జాతీయ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు ఇబ్బంది రావొచ్చని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంసెట్‌ రాసే విద్యార్థుల్లో చాలా వరకు జేఈఈ మెయిన్స్‌కు కూడా సిద్ధమవుతారు. మెయిన్స్‌ రెండో దశ ఏప్రిల్‌లో జరుగుతుంది. అది పూర్తయ్యాక మేలో ఎంసెట్‌ రాస్తుంటారు.

గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎంసెట్‌ కోసం ప్రత్యేక కోచింగ్‌ తీసుకుంటారు. ఎంసెట్‌ ఆలస్యమైతే ఇబ్బందులు వస్తాయని, కోచింగ్‌ కేంద్రాల వారు అదనపు ఫీజులు వసూలు చేస్తారని విద్యార్థులు వాపోతున్నారు. ఎన్‌ఐటీల్లో సీట్ల కౌన్సెలింగ్‌ నాటికి ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ మొదలవకపోతే.. కోరుకున్న కాలేజీలో సీట్లు వస్తాయా? రావా? అన్న ఆందోళన కూడా ఉంటుందని పేర్కొంటున్నారు. 
 
ఉన్నత విద్యా మండలిలో గందరగోళం! 
రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశపరీక్షలకు సంబంధించి డిసెంబర్‌లోనే యూనివర్సిటీల వీసీలతో ఉన్నత విద్యా మండలి అధికారులు సమావేశం కావాలని నిర్ణయించారు. తేదీ కూడా ఖరారు చేశారు. సెట్‌ కన్వీనర్ల ఎంపికకూ రంగం సిద్ధమైంది. ఈలోగా కొత్త ప్రభుత్వం మండలి చైర్మన్‌తోపాటు, వైస్‌ చైర్మన్‌ను తొలగిస్తున్నట్టు ప్రకటించడంతో.. వీసీలతో సమావేశం వాయిదా పడింది.

అయితే ప్రభుత్వం కొత్తవారిని నియమించలేదు. తొలగిస్తున్నట్టు ప్రకటించిన చైర్మన్, వైస్‌ చైర్మన్‌ ఇంకా అదే స్థానాల్లో కొనసాగుతున్నారు. ఉన్నత విద్యకు సంబంధించి సీఎం సమీక్షల్లో సరైన సమాచారం ఇవ్వడానికి మండలిలో ఎవరూ లేకపోవడంతో.. వారిని కొనసాగిస్తున్నట్టు ఉన్నతాధికారులు చెప్తున్నారు. వీరినే తిరిగి నియమించే అవకాశం ఉందనీ అంటున్నారు. 
 
సమావేశాలకు వీసీల విముఖత 
ఉన్నత విద్యా మండలి చైర్మన్, వైస్‌ చైర్మన్లను తొలగించిన నేపథ్యంలో.. అధికారికంగా సమావేశాలు నిర్వహించేందుకు వీలుకావడం లేదని మండలి వర్గాలు చెప్తున్నాయి. దీనికితోడు ఉమ్మడి ప్రవేశపరీక్షలపై చర్చించేందుకు వెళ్లడానికి వర్సిటీల వీసీలూ సుముఖత వ్యక్తం చేయడం లేదని అంటున్నాయి. సెట్స్‌ కోసం కన్వీనర్లను సూచించాలని మండలి నుంచి లేఖలు వచ్చినా.. యూనివర్సిటీల వీసీలు నిర్లిప్తంగా ఉంటున్నారు. ‘‘ముందు చైర్మన్, వైస్‌ చైర్మన్లను కొనసాగిస్తారా? కొత్తవారిని తెస్తారా? అనే దానిపై స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మేం సెట్స్‌ కన్వీనర్ల పేర్లు ఇచ్చినా.. కొత్త చైర్మన్‌ వస్తే మార్పులు ఉంటాయి..’’ అని ఓ వర్సిటీ వీసీ అభిప్రాయం వ్యక్తం చేశారు. 
 
ఆదరణ పెరుగుతున్నా..! 
కొన్నేళ్లుగా ఎంసెట్‌ రాసే వారి సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రస్థాయిలో సీట్లు ఎక్కువగా ఉండటం, ఉపాధి కోసం, విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్లడానికి అవకాశం ఉండటంతో చాలా మంది ఇంజనీరింగ్‌లో చేరుతున్నారు. 2018లో 2.20 లక్షల మంది ఎంసెట్‌ రాస్తే.. 2023 నాటికి ఈ సంఖ్య 3 లక్షలు దాటింది. పరీక్ష రాసేవారి సంఖ్య ఏటా 20శాతం దాకా పెరుగుతోంది. నర్సింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి కూడా ఎంసెట్‌ (మెడికల్‌ అండ్‌ అగ్రికల్చర్‌) తప్పనిసరి చేయడంతోనూ అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. 
 
ఎంసెట్‌కు హాజరవుతున్న విద్యార్థుల సంఖ్య ఇదీ.. 
ఏడాది    ఇంజనీరింగ్‌    అగ్రికల్చర్‌ 
2018    1,47,912        73,078 
2019    1,42,218    74,981 
2020    1,43,326    78,981 
2021    1,64,963    86,641 
2022    1,61,552    88,156 
2023    1,95,275    1,06,514 

త్వరలో నిర్ణయం.. 
నా కొనసాగింపుపై ప్రభుత్వం త్వరలో స్పష్టత ఇస్తుందని విశ్వసిస్తున్నాను. ఉమ్మడి ప్రవేశ పరీక్షలు సకాలంలోనే నిర్వహించాలనే పట్టుదలతో ఉన్నాం. ఆ దిశగా త్వరలో షెడ్యూల్‌ ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. 
– ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి, ఉన్నత విద్యా మండలి చైర్మన్‌   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement