save power
-
ఇక దేశమంతా ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2019, ఏప్రిల్ 1 నుంచి మూడేళ్లలోపు దేశమంతటా స్మార్ట్ ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లను అమర్చాలని యోచిస్తోంది. ప్రీపెయిడ్ మీటర్లతో పేదలకు లబ్ధి కలుగుతుందని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ప్రస్తుతం వినియోగదారులు వాడకంతో సంబంధం లేకుండా ప్రతీ నెలా బిల్లును చెల్లించాల్సి వస్తోందన్నారు. కొత్త విధానంలో విద్యుత్ మీటర్లను మొబైల్ ఫోన్ల తరహాలో రీచార్జ్ చేయొచ్చు. దీంతో విద్యుత్ ఆదా అవుతుందనీ, సామాన్యులకు అదనపు భారం తప్పుతుందని చెప్పారు. విద్యుత్ సరఫరా నష్టాలు, బిల్లుల ఎగవేతలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. అలాగే స్మార్ట్ మీటర్ల కారణంగా నైపుణ్యమున్న యువతకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. -
దేశం 1 టైమ్ జోన్లు 2
భారత్‌లో రెండు టైమ్ జోన్లను ప్రవేశపెట్టాలన్న అంశం మరోసారి చర్చకు వచ్చింది. సాధారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో సూర్యుడు ఉదయం 4 గంటలకే ఉదయించి, సాయంత్రం నాలుగు గంటలకు అస్తమిస్తాడు. ఈ నేపథ్యంలో విలువైన పగటి సమయాన్ని వాడుకోవడానికి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక టైమ్ జోన్ రూపొందించాలని ఢిల్లీలోని సీఎస్ఐఆర్–నేషనల్ ఫిజికల్ లాబోరేటరీ (ఎన్పీఎల్) శాస్త్రవేత్తలు సూచించారు. ఈ విషయమై పరిశోధనలు జరిపిన నిపుణులు.. అస్సాం, మేఘాలయ , నాగాలాండ్, అరుణాచల్, మణిపూర్, మిజోరం, త్రిపురతో పాటు అండమాన్, నికోబార్ ద్వీపాలకు ఓ టైమ్ జోన్, మిగతా దేశమంతటికీ మరో టైమ్ జోన్ ఏర్పాటు చేయాలన్నారు. తద్వారా భారీగా విద్యుత్‌ను ఆదా చేయవచ్చని కనుగొన్నారు. పగటి సమయంలో వ్యత్యాసం సాధారణంగా దేశంలోని ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే ఈశాన్య రాష్ట్రాల్లో సూర్యోదయం రెండు గంటలు ముందుగానే జరుగుతుంది. దేశమంతా ఒకే భారత కాలమానం (ఐఎస్టీ) లేదా టైమ్ జోన్ పాటిస్తూ ఉండటంతో ఈశాన్య రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు ఆలస్యంగా మొదలవుతున్నాయి. సాయంత్రం 4 గంటలకే చీకటి పడుతుండటంతో రాత్రిపూట ఇంటికి వెళ్లిన భావన ప్రజల్లో కలుగుతోంది. రాత్రిపూట విధులు నిర్వహించేందుకు విపరీతంగా విద్యుత్ ఖర్చవుతోంది. ఈ నేపథ్యంలో ఈశాన్య భారతంలో పగటి సమయాన్ని ముందుకు జరపగలిగితే స్థానిక ప్రజలు ఇబ్బందిపడకుండా పనులు చేసుకోగలుగుతారనీ, విద్యుత్ ఖర్చు గణనీయంగా తగ్గుతుందని సీఎస్ఐఆర్–ఎన్పీఎల్ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవులకు కలిపి ఓ టైమ్ జోన్, మిగతా దేశమంతటికీ మరో టైమ్ జోన్ ఏర్పాటు చేయాలని సూచించారు. దీని కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉత్పాదకత కూడా గణనీయంగా పెరుగుతుందని వెల్లడించారు. ఇప్పుడున్నది ఒకే ఐఎస్టీ... ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారత ప్రామాణిక కాలమానం (ఐఎస్టీ) ఉదయం 5.30 గంటలుగా అమలవుతోంది. అదే యూకేలోని గ్రీన్విచ్ మీదుగా ప్రయాణించే ఊహాత్మక రేఖాంశం ఆధారంగా కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైం(యూసీటీ) అర్ధరాత్రి 0.00 గంటలకు గ్రీన్విచ్ టైమ్‌గా లెక్కిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈశాన్య రాష్ట్రాల్లో సమయాన్ని ఓ గంట ముందుకు జరిపితే పగటిపూట సమయం ఆదా అవుతుందా? లేదా? ఈ విధానాన్ని అమలు చేయగలమా? అన్న విషయమై పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. అందులో భారత కాలమానాన్ని మరో గంట ముందుకు జరపగలిగితే ఈశాన్య భారతం, పోర్ట్బ్లెయిర్లో ఉత్పాదకత గణనీయంగా పెరుగుతుందని తేలినట్లు ఎన్పీఎల్ డైరెక్టర్ దినేశ్.కె.అస్వల్ తెలిపారు. భారత్‌లో రెండు టైమ్ జోన్లను అమలు చేయొచ్చని తాము శాస్త్రీయంగా నిరూపించామనీ, ఇక ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. కాలంపై కొన్ని సంగతులు ► బ్రిటిష్ పాలనలో ఉన్నపుడు భారత్‌ను బొంబాయి, కోల్‌కతా టైమ్ జోన్లుగా విభజించారు. ► 1947 సెప్టెంబర్ 1న భారత ప్రామాణిక కాలమానం(ఐఎస్టీ) ఏర్పడింది ► 2014లో ఛాయ్‌బగాన్ లేదా బగాన్ టైమ్ (టీ ఎస్టేట్ టైమ్)ను పాటించాలని అసోం(అప్పటి అస్సాం) అనధికారికంగా నిర్ణయించింది. పగటి సమయం ఒక గంట ఎక్కువ ఉండేలా గతంలో తేయాకు తోటలు, గనులు, చమురు పరిశ్రమ కోసం బ్రిటిష్ ప్రభుత్వం దీన్ని ప్రవేశపెట్టారు. ► ఈశాన్య రాష్ట్రాలకు విడిగా టైమ్ జోన్ ఉండాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని గతేడాది గువాహటి హైకోర్టు తోసిపుచ్చింది. ► 2017 జూన్‌లో అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండూ సైతం ఉత్పాదకత పెంచేందుకు ప్రత్యేక టైమ్‌జోన్ కావాలని డిమాండ్ చేశారు. -
విద్యుత్ ఆదా అందరి బాధ్యత
సంగారెడ్డి జోన్: విద్యుత్‌ను ఆదా చేయడం మనందరి బాధ్యత అని, లేకుంటే భవిష్యత్తులో విద్యుత్ సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుందని కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం ఆయన కార్యాలయంలోని వివిధ విభాగాల్లోని అసిస్టెంట్ కలెక్టర్ చాంబర్, పరిపాలన అధికారి చాంబర్లను జిల్లా సంయుక్త కలెక్టర్ నిఖిలతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా విభాగాల్లో కొన్ని చోట్ల ప్యాన్లు, లైట్లు వెలుగుతుండగా, మరికొన్ని విభాగాల్లో ఆఫ్ చేసి ఉండటాన్ని గమనించిన కలెక్టర్ సిబ్బంది తమ సీట్లలో లేనప్పుడు, ప్యాన్లు, లైట్లను నిలిపివేసి విద్యుత్‌ను ఆదా చేయాలని సూచించారు. అసిస్టెంట్ కలెక్టర్ చాంబర్లో ప్యాన్ ఆఫ్ చేసి ఉండటాన్ని గమనించిన కలెక్టర్ ఆయనను అభినందించారు. కారిడార్‌లో, అసిస్టెంట్ కలెక్టర్ చాంబర్ నుంచి జేసీ , కలెక్టర్ చాంబర్ వరకు రెండు వైపులా మొక్కల కుండిలను ఏర్పాటు చేయాలని ఉద్యానశాఖ అధికారి సోమేశ్వర్‌కు సూచించారు. పచ్చదానానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కార్యాలయాలకు వచ్చే వారందరికి ఆహ్లాదం కలిగే విధంగా వంద మొక్కల కుండిలను ఏర్పాటు చేయాలన్నారు. వీరి వెంట కలెక్టర్ ఏఓ కృష్ణారెడ్డి ఉన్నారు. మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్ నిషేధం సంగారెడ్డి టౌన్: సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, జోగిపేట– అందోల్ మున్సిపాలిటీల్లో పరిధిలో ఈ నెల 11 నుంచి ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు , ప్లేట్స్ తదితర వస్తువులను నిషేధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ ఆదేశాలను అమలు చేయాలని సంబందిత అధికారులను ఆయన ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో పురపాలక సంఘాల కమిషనర్లు, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు తదితరులతో సమావేశయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్లాస్టిక్ స్థానంలో పేపర్ గ్లాసులు, ప్లేట్లు, కవర్లు, వినియోగించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ముఖ్యంగా హోటర్లు, తినుబండారాలు అమ్మే తోపుడుబండ్లు, కురగాయాల మార్కెట్లు, ఫంక్షన్‌హాళ్లలో, కిరాణా, ఇతర వాణిజ్య, వ్యాపార సంస్థల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించేలా చూడాలన్నారు. 50 మైక్రాన్స్ కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్‌ను వాడినట్లు తమ దృష్టికి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, జోగిపేట–అందోల్, పురపాలక సంఘాల కమిషనర్లు , శానిటరీ ఇన్స్పెక్టర్లు, మెప్మా పిడి అంబాదాసు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీల్లో పిల్లల సంఖ్యతగ్గకుండా చూడాలి సంగారెడ్డి టౌన్: అంగన్వాడీ కేంద్రాల్లో చేరే పిల్లల సంఖ్య 25కు తగ్గకుండా చూడాలని జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు జిల్లా సంక్షేమాధికారి మోతికి సూచించారు. మంగళవారం సంగారెడ్డి పట్టణంలోని ఇందిరానగర్ కాలనీ, విజయనగర్ కాలనీ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బాలింతలకు ఇచ్చే పాలు, గుడ్లు, ఇతర పౌష్టికాహారాన్ని సరైన సమయంలో అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ తనిఖీలో కలెక్టర్‌తో పాటు తహసీల్దార్ విజయ్‌కుమార్, మహిళ శిశు సంక్షేమ శాఖ జిల్లా ఆర్గనైజర్ లక్ష్మి ఉన్నారు. -
గప్చిప్!
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన విద్యుత్ ఎనర్జీ ఎఫిషియన్సీ స్కీమ్ (విద్యుత్ ఆదా పథకం) నత్తనడకన సాగుతోంది. 2017 జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ప్రకటించి ఆరు నెలలు దాటుతున్నా పథకం అమలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. జిల్లాలో ఈ పథకం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదనేందుకు ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు చెబుతున్న లెక్కలే ఇందుకు నిదర్శనం. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వ్యవసాయ రంగంలో విద్యుత్ నిర్వహణను మెరుగు పరిచేందుకు కేంద్ర ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ), రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్ (డీఎస్ఎం)ల ఆధ్వర్యంలో నూతనంగా ప్రాజెక్టులు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా రాష్ట్ర రైతులకు లాభం చేకూరే విధంగా ఏపీఎస్పీడీసీఎల్, ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్)లు సంయుక్తంగా ఈ వ్యవసాయ రంగంలో విద్యుత్ ఆదా చేసుకునే విధంగా సరికొత్త టెక్నాలజీతో కూడిన విద్యుత్ మోటార్లను అమర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వ్యవసాయ పంప్ సెట్లలో విద్యుత్ ఆదా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జిల్లాలో శ్రీకారం చుట్టారు. వ్యవసాయ రంగంలో ఎలక్ట్రికల్ స్మార్ట్ కంట్రోల్ పేనల్స్‌తో అమర్చిన 5 హెచ్‌పీ సామర్థ్యం ఉన్న సబ్మెర్సిబుల్ పంప్సెట్లను అమర్చి పాత మోటార్లను స్వాధీనం చేసుకునే కార్యక్రమాన్ని చేపట్టేలా అధికారులు రూపకల్పన చేశారు. నూతన పంప్సెట్లు రైతులకు ఉచితంగానే అందించే విధంగా ఏర్పాటు చేశారు. అనంతరం ఐదేళ్లు పంప్సెట్లు తయారీ సంస్థలు ఈఈఎస్ఎల్ల ఆధ్వర్యంలో ఉచితంగా మరమ్మతులు చేపట్టే విధంగా చేశారు. ఈ మేరకు ఏపీఎస్పీడీసీఎల్ తయారీ సంస్థలతో ఈఈఎస్ఎల్తో ఒప్పందం కూడా చేసుకుంది. అవగాహన శూన్యం పథకాన్ని ప్రవేశపెట్టామని ఆర్భాటంగా అధికారులు ప్రకటనలు గుప్పించారు. ఆ పథకాన్ని రైతుల వద్దకు తీసుకెళ్లడంలో మాత్రం విఫలమయ్యారని చెప్పాలి. జిల్లాలో మొత్తం 97,768 వ్యవసాయ పంప్సెట్లు ఉన్నాయి. అందులో భాగంగా మొదటి విడతగా 9,539 పంప్సెట్లను మార్చాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఆ లక్ష్యం నెరవేర్చడంలో అధికారుల్లో ముందుచూపు కొరవడిందనే చెప్పాలి. పథకాన్ని ప్రారంభించి ఆరు నెలలు దాటిన ఇప్పటికీ కేవలం 96 పంప్సెట్లు మాత్రమే మార్చారు. రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించకపోవడంతో తక్కువ మొత్తంలో రైతుల నుంచి కొత్త పంప్సెట్లు అమర్చుకునేందుకు దరఖాస్తు చేయడంలో ముందుకు రావడం లేదు. అందువల్లే జిల్లా మొత్తం మీద కేవలం 1348 మంది రైతులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఈ పథకంలో రైతుల వద్ద ఉన్న పాత పంప్సెట్లను తీసుకొని ఏపీఎస్పీడీసీఎల్, ఈఈఎస్ఎల్ సంయుక్తంగా విద్యుత్ ఆదాతో కూడిన ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పంప్సెట్లను అమరుస్తారు. ఇవీ..ప్రయోజనాలు ♦ సమాన స్థాయి లేక మించిన స్థాయిలో సమర్థంగా నీటిని తోడే విధంగా ఈ పంప్సెట్లలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించారు. ♦ వోల్టేజీ హెచ్చుతగ్గులను తట్టుకొని సమర్థంగా పని చేస్తాయి. ♦ విద్యుత్ ఆదా కూడా గణనీయంగా పెరుగుతుంది. ఎలక్ట్రిక్ స్మార్ట్ కంట్రోల్ పేనల్స్ లక్షణముణాలు ♦ ఇందులోని కంట్రోల్ పేనల్స్‌తో విద్యుత్ మోటార్‌ను రిమోటు పద్ధతిలో (ఎస్ఎంఎస్తో) ఆన్/ఆఫ్ చేయవచ్చు. ఈ ఎస్ఎంఎస్లకు అయ్యే ఖర్చును రైతులు తమ ఫోన్ ద్వారా వారే భరించాలి. ♦ ఓల్టేజ్, కరెంట్ డిజిటల్ డిస్ప్లే అవుతాయి. ♦ పంప్‌సెట్‌ను ఎంత సమయం ఉపయోగించినది సరిగ్గా తెలుసుకోవచ్చు. ♦ ఓల్టేజ్ హెచ్చు/తగ్గుదల సమయంలో, బావిలో నీరు లేనప్పుడు, సింగిల్ ఫేజింగ్ నుండి మోటార్‌కు రక్షణ ఏర్పాటు ఉంది. పంప్‌సెట్ సామర్థ్యానికి తగిన కెపాసిటరు అమర్చి ఉంటాయి. ఎలక్ట్రిక్ స్మార్ట్ కంట్రోల్ పేనల్స్ ఉపయోగాలు ♦ విద్యుత్, నీరు, రైతులు సమయం ఆదా అవుతుంది. ♦ రిమోట్ ఉన్నందున పొలానికి వెళ్లకుండానే ఆన్/ఆఫ్ చేయవచ్చు పాములు/క్రిమికీటకాలతో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉండదు. ♦ నైపుణ్యంతో కూడిన ఈ పంప్‌సెట్ వినియోగించడంతో ట్రాన్స్ఫార్మర్పై భారం తగ్గుతుంది. అధిక భారంతో సమస్యలుండవు. దరఖాస్తు ఇలా.. ♦ 5 హెచ్‌పీ పంప్సెట్లు వ్యవసాయ వినియోగదారులు తమ ప్రాంతంలోని సంబంధిత అసిస్టెంట్ ఇంజినీరు/ఆపరేషన్ కార్యాలయాల వద్ద ఉచితంగా నమోదు చేసుకోవాలి. నమోదు పత్రం ఉచితంగా సెక్షన్ ఆఫీస్ వద్ద ఇస్తారు. నమోదు పత్రంతో ఈ క్రింది ధ్రువీకరణ పత్రాల కాపీలు పొందుపరచాలి. ♦ ఆధార్ కార్డు, ఓటరు కార్డు మొదలైన (ప్రభుత్వంచే జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డు) కాపీని జత చేయాలి. ♦ వ్యవసాయ పంప్ సెట్లకు సంబంధించిన విద్యుత్ బిల్లు ♦ మొబైల్ ఫోన్ నంబర్‌తో పాటు ఎస్ఎంఎస్ ప్యాకేజ్ 6 నెలలు పాటు వర్తించినట్లు ధ్రువపత్రాలు అధికారులకు అందజేయాలి. -
‘సేవ్ ఎనర్జీ’కి ‘షార్ట్ సర్క్యూట్’
‘తక్కువ ఖర్చుతో ఎక్కువ కాంతి’ని నగరానికి ప్రసాదించాలన్న ధ్యేయంతోప్రారంభమైన పథకం రాజమండ్రిలో కొడిగట్టింది. నగర పాలక సంస్థ అధికారుల నిర్వాకమే ఇందుకు కారణమని కాంట్రాక్టు సంస్థ అంటుండగా.. కాంట్రాక్టు సంస్థదే బాధ్యత అని అధికారులు చెపుతున్నారు. మొత్తమ్మీద వెలుగుల పథకం..షార్ట్ సర్క్యూట్‌తో మాడిపోయిన విద్యుద్దీపంలా మిగిలింది. సాక్షి, రాజమండ్రి :‘సేవ్ ఎనర్జీ’ (విద్యుత్‌ను ఆదా చేద్దాం) నినాదంతో దేశంలోనే తొలిసారిగా చారిత్రకనగరం రాజ మండ్రిలో అమలు చేసిన ఎల్ఈడీ వీధిలైట్ల పథకంపై చీకటి కమ్ముకుంది. వెలుగులు విరజిమ్మాల్సిన దీపాలు వెలవెలబోతున్నాయి. ఇందుకు నెపాన్ని నగర పాలకసంస్థ అధికారులు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు ఒకరిపై ఒకరు నెట్టుకుంటున్నారు. ఈ పథకం కింత హైదరాబాద్‌కు చెందిన హైపీరియన్ గ్రీన్ ఎనర్జీ సంస్థతో 2009 నవంబరులో నగరపాలక సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం హైపీరియన్ సొంత ఖర్చుతో ఎల్ఈడీ బల్బులు అమర్చి, ఏడేళ్ల పాటు రూ.3.90 వంతున వీధిలైట్ల కరెంటు బిల్లుకు ఏడాదికి రూ.1.91 కోట్లు కార్పొరేషన్ వెచ్చిస్తోంది. నగరంలో మొత్తం 11 వేల లైట్ల మార్పిడి ద్వారా కనీసం 60 శాతం విద్యుత్ ఆదా సాధించాలన్నది ఈ పథకం లక్ష్యం. కాంట్రాక్టు కాలంలో అలా ఆదా అయిన మొత్తాన్ని హైపీరియన్‌కు కొంత శాతాన్ని నగర పాలక సంస్థ ఇవ్వాలి. ఎవరేం చేయాలి... ఎల్ఈడీ లైట్ల వల్ల కరెంటు ఆదాను చూపించాల్సిన బాధ్యత హైపీరియన్దే. లైటు వరకూ నెట్వర్క్ అంటే స్విచ్చులు, వైరింగ్, విద్యుత్తు సరఫరా, మీటర్లు వంటి వాటిని సక్రమంగా ఉంచే బాధ్యత నగరపాలక సంస్థది. ఆదా అయిన విద్యుత్తు విలువలో మొదటి రెండు సంవత్సరాలు 90:10, మూడు, నాలుగు సంవత్సరాల్లో 85:15, ఐదు నుంచి ఏడేళ్ల వరకు 80:20 నిష్పత్తిలో హైపీరియన్, నగరపాలక సంస్థలు పంచుకోవాలి. ఆ సొమ్మునే హైపీరియన్కి ఇచ్చే లీజు మొత్తంగా పరిగణిస్తారు. అయితే 2009 నుంచి 2012 వరకూ ఎన్నిలైట్లు మార్చారు, ఏ ఏడాది ఎంత ఆదా అయింది, ఆ ప్రకారం హైపీరియన్కి ఎంత చెల్లించాలనే గణాంకాలను అధికారులు నిక్కచ్చిగా నమోదు చేయలేదని, దీనిపై ఆడిట్ అభ్యంతరాలు కూడా వచ్చాయని తెలుస్తోంది. రోజుకు 11 గంటల కాలాన్ని వీధిలైట్లు వెలిగే సమయంగా పరిగణించి వినియోగం, ఆదాపై అంచనాలు వేయాలని, వేసవిలో కరెంటు కోత కాలంలో వినియోగం, ఆదా రెండూ లెక్కించరాదని ఒప్పందం. కానీ కోత సమయాలను పరిగణనలోకి తీసుకోలేదు. లైట్ల చోరీ జరిగినా, ప్రమాదాలు, తుపాన్ల వల్ల లైట్లు పాడైనా నగరపాలక సంస్థ భరించాలి. ఇందుకు మొత్తం లైట్లన్నింటికీ బీమా చేయించాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో 2013లో జల్ తుపానుతో లైట్లకు వాటిల్లిన నష్టం ఎవరు భరించాలన్న వివాదం నేటికీ తేలలేదు. అధికారుల నిర్లక్ష్యంతో రూ.50 లక్షల మేర నగరపాలక సంస్థకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కాగా అధికారులు తాము తప్పించుకునేందుకు బాధ్యత తమదేనంటున్నారని కాంట్రాక్టు సంస్థ చెపుతోంది. తప్పుడు లెక్కలతో లక్షల బొక్కుడు.. విద్యుత్తు ఆదా 74 శాతం వరకూ ఉన్నా 60 శాతం మాత్రమే ఉన్నట్టు చూపుతున్నారని, ఈ విధమైన వ్యత్యాసాల ద్వారా నగర పాలక సంస్థ అధికారులు లక్షలు దిగమింగారని ఆరోపణలున్నాయి. ఏడాదికి రూ.26 లక్షల వరకు పక్కదారి పట్టాయంటున్నారు. అయితే దీనిపై అభ్యంతరాలు వ్యక్తమైనా..‘ఎలాగోలా’ సర్దుబాటు చేసుకున్న అధికారులు.. నగర పాలక సంస్థ చూసుకోవలసిన నెట్ వర్కింగ్ లోపాల నిర్వహణనూ హైపీరియన్ మీదే వేసి, ఆ మేరకు కూడా సొమ్ము చేసుకున్నట్టు చెపుతున్నారు. మొత్తమ్మీద అధికారులకు, కాంట్రాక్టు సంస్థకు మధ్యన విభేదాలు తలెత్తడంతో ఎల్ఈడీ లైట్లు ఆలనాపాలనా ఎరుగని ‘అనాథ’ల్లా మారాయి. ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో 2013 జూన్‌లో నగరపాలక సంస్థ అధికారులు సర్వే చేయించగా 70 శాతం పైగా లైట్లు వెలగడం లేదని తేలింది. ఆ సంస్థ నుంచి కమిషన్లు దండుకున్నట్టు ఆరోపణలున్న అధికారులు వాటి నుంచి గట్టెక్కేందుకు ఇదే అదనుగా లైట్ల అధ్వానస్థితికి పూర్తి బాధ్యతను కాంట్రాక్టు సంస్థపై నెట్టేస్తూ లేఖలు, నోటీసులు జారీ చేస్తూ వచ్చారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టుకెక్కింది. మాకు తీవ్రనష్టం తెచ్చారు.. కార్పొరేషన్ చేయాల్సిన వైరింగ్ వంటి పనులను కూడా మా చేతే చేయించారు. మాకు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టి, ఇప్పుడు తప్పంతా మాదేనంటున్నారు. ఎల్ఈడీ లైట్లతో ఆశించిన 60 శాతం కన్నా ఎక్కువగా 74 శాతం ఆదా అయినా తగ్గించి చూపేందుకు యత్నించారు. ఇప్పుడు అసలు ఆదాయే కావడం లేదని నెపం మాపై వేస్తున్నారు. వెలిగే లైట్ల వద్దే ఎక్కువ కరెంటు ఖర్చయ్యే లైట్లు బిగిస్తున్నారు. ఎల్ఈడీ లైట్ల వరకే మా బాధ్యత. నెట్ వర్కింగ్‌ను మున్సిపల్ సిబ్బంది చేయడం లేదు. - డాక్టర్ కె.విజయ్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్, హైపీరియన్ మరమ్మతుల్ని కార్పొరేషన్ చేయించింది.. లైట్ల నిర్వహణ బాధ్యత అంతా కాంట్రాక్టు సంస్థదే. ఇదే విషయాన్ని సూచిస్తూ గతంలో మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ సలహా మేరకు కంపెనీకి లేఖలు రాశాం. హైపీరియన్ సంస్థ మరమ్మతులు చేయకపోతే వాటిని కార్పొరేషన్ ద్వారా చేయించి ఆ ఖర్చును కంపెనీకి ఇచ్చే నిర్వహణా వ్యయం నుంచి మినహాయించాలని నిర్ణయించాం. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉంది. - రవీంద్రబాబు, కమిషనర్, రాజమండ్రి నగర పాలక సంస్థ