గప్‌చిప్‌! | save power project delay in prakasam district | Sakshi
Sakshi News home page

గప్‌చిప్‌!

Published Fri, Feb 2 2018 12:10 PM | Last Updated on Wed, Sep 5 2018 2:25 PM

save power project delay in prakasam district - Sakshi

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన విద్యుత్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ స్కీమ్‌ (విద్యుత్‌ ఆదా పథకం) నత్తనడకన సాగుతోంది. 2017 జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ప్రకటించి ఆరు నెలలు దాటుతున్నా పథకం అమలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. జిల్లాలో ఈ పథకం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదనేందుకు ఏపీఎస్‌పీడీసీఎల్‌ అధికారులు చెబుతున్న లెక్కలే ఇందుకు నిదర్శనం.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వ్యవసాయ రంగంలో విద్యుత్‌ నిర్వహణను మెరుగు పరిచేందుకు కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ), రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని డిమాండ్‌ సైడ్‌ మేనేజ్‌మెంట్‌ (డీఎస్‌ఎం)ల ఆధ్వర్యంలో నూతనంగా ప్రాజెక్టులు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా రాష్ట్ర రైతులకు లాభం చేకూరే విధంగా ఏపీఎస్‌పీడీసీఎల్, ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఈఈఎస్‌ఎల్‌)లు సంయుక్తంగా ఈ వ్యవసాయ రంగంలో విద్యుత్‌ ఆదా చేసుకునే విధంగా సరికొత్త టెక్నాలజీతో కూడిన విద్యుత్‌ మోటార్లను అమర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వ్యవసాయ పంప్‌ సెట్లలో విద్యుత్‌ ఆదా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జిల్లాలో శ్రీకారం చుట్టారు. వ్యవసాయ రంగంలో ఎలక్ట్రికల్‌ స్మార్ట్‌ కంట్రోల్‌ పేనల్స్‌తో అమర్చిన 5 హెచ్‌పీ సామర్థ్యం ఉన్న సబ్‌మెర్సిబుల్‌ పంప్‌సెట్లను అమర్చి పాత మోటార్లను స్వాధీనం చేసుకునే కార్యక్రమాన్ని చేపట్టేలా అధికారులు రూపకల్పన చేశారు. నూతన పంప్‌సెట్లు రైతులకు ఉచితంగానే అందించే విధంగా ఏర్పాటు చేశారు. అనంతరం ఐదేళ్లు పంప్‌సెట్లు తయారీ సంస్థలు ఈఈఎస్‌ఎల్‌ల ఆధ్వర్యంలో ఉచితంగా మరమ్మతులు చేపట్టే విధంగా చేశారు. ఈ మేరకు ఏపీఎస్‌పీడీసీఎల్‌ తయారీ సంస్థలతో ఈఈఎస్‌ఎల్‌తో ఒప్పందం కూడా చేసుకుంది.

అవగాహన శూన్యం
పథకాన్ని ప్రవేశపెట్టామని ఆర్భాటంగా అధికారులు ప్రకటనలు గుప్పించారు. ఆ పథకాన్ని రైతుల వద్దకు తీసుకెళ్లడంలో మాత్రం విఫలమయ్యారని చెప్పాలి. జిల్లాలో మొత్తం 97,768 వ్యవసాయ పంప్‌సెట్లు ఉన్నాయి. అందులో భాగంగా మొదటి విడతగా 9,539 పంప్‌సెట్లను మార్చాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఆ లక్ష్యం నెరవేర్చడంలో అధికారుల్లో ముందుచూపు కొరవడిందనే చెప్పాలి. పథకాన్ని ప్రారంభించి ఆరు నెలలు దాటిన ఇప్పటికీ కేవలం 96 పంప్‌సెట్లు మాత్రమే మార్చారు. రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించకపోవడంతో తక్కువ మొత్తంలో రైతుల నుంచి కొత్త పంప్‌సెట్లు అమర్చుకునేందుకు దరఖాస్తు చేయడంలో ముందుకు రావడం లేదు. అందువల్లే జిల్లా మొత్తం మీద కేవలం 1348 మంది రైతులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఈ పథకంలో రైతుల వద్ద ఉన్న పాత పంప్‌సెట్లను తీసుకొని ఏపీఎస్‌పీడీసీఎల్, ఈఈఎస్‌ఎల్‌ సంయుక్తంగా విద్యుత్‌ ఆదాతో కూడిన ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పంప్‌సెట్లను అమరుస్తారు.

ఇవీ..ప్రయోజనాలు
సమాన స్థాయి లేక మించిన స్థాయిలో సమర్థంగా నీటిని తోడే విధంగా ఈ పంప్‌సెట్లలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించారు.
వోల్టేజీ హెచ్చుతగ్గులను తట్టుకొని సమర్థంగా పని చేస్తాయి.
విద్యుత్‌ ఆదా కూడా గణనీయంగా పెరుగుతుంది.

ఎలక్ట్రిక్‌ స్మార్ట్‌ కంట్రోల్‌ పేనల్స్‌ లక్షణముణాలు
ఇందులోని కంట్రోల్‌ పేనల్స్‌తో విద్యుత్‌ మోటార్‌ను రిమోటు పద్ధతిలో (ఎస్‌ఎంఎస్‌తో) ఆన్‌/ఆఫ్‌ చేయవచ్చు. ఈ ఎస్‌ఎంఎస్‌లకు అయ్యే ఖర్చును రైతులు తమ ఫోన్‌ ద్వారా వారే భరించాలి.
ఓల్టేజ్, కరెంట్‌ డిజిటల్‌ డిస్‌ప్లే అవుతాయి.
పంప్‌సెట్‌ను ఎంత సమయం ఉపయోగించినది సరిగ్గా తెలుసుకోవచ్చు.
ఓల్టేజ్‌ హెచ్చు/తగ్గుదల సమయంలో, బావిలో నీరు లేనప్పుడు, సింగిల్‌ ఫేజింగ్‌ నుండి మోటార్‌కు రక్షణ ఏర్పాటు ఉంది. పంప్‌సెట్‌ సామర్థ్యానికి తగిన కెపాసిటరు అమర్చి ఉంటాయి.

ఎలక్ట్రిక్‌ స్మార్ట్‌ కంట్రోల్‌ పేనల్స్‌ ఉపయోగాలు
విద్యుత్, నీరు, రైతులు సమయం ఆదా అవుతుంది.  
రిమోట్‌ ఉన్నందున పొలానికి వెళ్లకుండానే ఆన్‌/ఆఫ్‌ చేయవచ్చు పాములు/క్రిమికీటకాలతో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉండదు.
నైపుణ్యంతో కూడిన ఈ పంప్‌సెట్‌ వినియోగించడంతో ట్రాన్స్‌ఫార్మర్‌పై భారం తగ్గుతుంది. అధిక భారంతో సమస్యలుండవు.

దరఖాస్తు ఇలా..
5 హెచ్‌పీ పంప్‌సెట్లు వ్యవసాయ వినియోగదారులు తమ ప్రాంతంలోని సంబంధిత అసిస్టెంట్‌ ఇంజినీరు/ఆపరేషన్‌ కార్యాలయాల వద్ద ఉచితంగా నమోదు చేసుకోవాలి. నమోదు పత్రం ఉచితంగా సెక్షన్‌ ఆఫీస్‌ వద్ద ఇస్తారు. నమోదు పత్రంతో ఈ క్రింది ధ్రువీకరణ పత్రాల కాపీలు పొందుపరచాలి.
ఆధార్‌ కార్డు, ఓటరు కార్డు మొదలైన (ప్రభుత్వంచే జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డు) కాపీని జత చేయాలి.
వ్యవసాయ పంప్‌ సెట్లకు సంబంధించిన విద్యుత్‌ బిల్లు
మొబైల్‌ ఫోన్‌ నంబర్‌తో పాటు ఎస్‌ఎంఎస్‌ ప్యాకేజ్‌ 6 నెలలు పాటు వర్తించినట్లు ధ్రువపత్రాలు అధికారులకు అందజేయాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement