కార్యాలయంలో విభాగాలను తనిఖీ చేస్తున్న కలెక్టర్
సంగారెడ్డి జోన్: విద్యుత్‌ను ఆదా చేయడం మనందరి బాధ్యత అని, లేకుంటే భవిష్యత్తులో విద్యుత్ సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుందని కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం ఆయన కార్యాలయంలోని వివిధ విభాగాల్లోని అసిస్టెంట్ కలెక్టర్ చాంబర్, పరిపాలన అధికారి చాంబర్లను జిల్లా సంయుక్త కలెక్టర్ నిఖిలతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా విభాగాల్లో కొన్ని చోట్ల ప్యాన్లు, లైట్లు వెలుగుతుండగా, మరికొన్ని విభాగాల్లో ఆఫ్ చేసి ఉండటాన్ని గమనించిన కలెక్టర్ సిబ్బంది తమ సీట్లలో లేనప్పుడు, ప్యాన్లు, లైట్లను నిలిపివేసి విద్యుత్‌ను ఆదా చేయాలని సూచించారు. అసిస్టెంట్ కలెక్టర్ చాంబర్‌లో ప్యాన్ ఆఫ్ చేసి ఉండటాన్ని గమనించిన కలెక్టర్ ఆయనను అభినందించారు. కారిడార్‌లో, అసిస్టెంట్ కలెక్టర్ చాంబర్ నుంచి జేసీ , కలెక్టర్ చాంబర్ వరకు రెండు వైపులా మొక్కల కుండిలను ఏర్పాటు చేయాలని ఉద్యానశాఖ అధికారి సోమేశ్వర్‌కు సూచించారు. పచ్చదానానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కార్యాలయాలకు వచ్చే వారందరికి ఆహ్లాదం కలిగే విధంగా వంద మొక్కల కుండిలను ఏర్పాటు చేయాలన్నారు. వీరి వెంట కలెక్టర్ ఏఓ కృష్ణారెడ్డి ఉన్నారు.
మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్ నిషేధం
సంగారెడ్డి టౌన్: సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, జోగిపేట– అందోల్ మున్సిపాలిటీల్లో పరిధిలో ఈ నెల 11 నుంచి ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు , ప్లేట్స్ తదితర వస్తువులను నిషేధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ ఆదేశాలను అమలు చేయాలని సంబందిత అధికారులను ఆయన ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో పురపాలక సంఘాల కమిషనర్లు, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్లు తదితరులతో సమావేశయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్లాస్టిక్ స్థానంలో పేపర్ గ్లాసులు, ప్లేట్లు, కవర్లు, వినియోగించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ముఖ్యంగా హోటర్లు, తినుబండారాలు అమ్మే తోపుడుబండ్లు, కురగాయాల మార్కెట్లు, ఫంక్షన్‌హాళ్లలో, కిరాణా, ఇతర వాణిజ్య, వ్యాపార సంస్థల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించేలా చూడాలన్నారు. 50 మైక్రాన్స్ కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్‌ను వాడినట్లు తమ దృష్టికి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, జోగిపేట–అందోల్, పురపాలక సంఘాల కమిషనర్లు , శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, మెప్మా పిడి అంబాదాసు తదితరులు పాల్గొన్నారు.
అంగన్‌వాడీల్లో పిల్లల సంఖ్యతగ్గకుండా చూడాలి
సంగారెడ్డి టౌన్: అంగన్‌వాడీ కేంద్రాల్లో చేరే పిల్లల సంఖ్య 25కు తగ్గకుండా చూడాలని జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు జిల్లా సంక్షేమాధికారి మోతికి సూచించారు. మంగళవారం సంగారెడ్డి పట్టణంలోని ఇందిరానగర్ కాలనీ, విజయనగర్ కాలనీ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బాలింతలకు ఇచ్చే పాలు, గుడ్లు, ఇతర పౌష్టికాహారాన్ని సరైన సమయంలో అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ తనిఖీలో కలెక్టర్‌తో పాటు తహసీల్దార్ విజయ్‌కుమార్, మహిళ శిశు సంక్షేమ శాఖ జిల్లా ఆర్గనైజర్ లక్ష్మి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment