
షిల్లాంగ్: రాజ్యసభలో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి. అస్సాం, త్రిపుర, మేఘాలయలో పెద్ద ఎత్తున చేపట్టిన నిరసనలు పలుచోట్ల హింసాత్మకంగా మారాయి. నిరసనల నేపథ్యంలో మేఘాలయలో ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం తాత్కాలికంగా నిషేధించింది. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం నుంచి 48 గంటల వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇంటర్నెట్ సేవలతో పాటు ఎస్‌ఎంఎస్, వాట్సప్, ఫేస్‌బుక్, ట్విటర్, యూట్యూబ్ సేవలను సైతం నిలిపివేశారు. ఆందోళనలు హింసాత్మకంగా మారుతుండటంతో తూర్పు కాశీ హిల్స్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీసులు గురువారం కర్ఫ్యూ విధించారు. అస్సాంలోని పది జిల్లాల్లో బుధవారం నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేయగా ప్రభుత్వం ఈ నిషేధాన్ని మరో 48 గంటల పాటు పొడిగించింది. గుహవటి, డిబ్రూగర్‌లో కర్ఫ్యూ అమల్లో ఉన్నప్పటికీ ఆందోళనకారులు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. చదవండి: సుప్రీంకోర్టుకు పౌరసత్వ బిల్లు