స్టడీటూర్‌లో టీ రుచి చూస్తోన్న ఎమ్మెల్యే రాజన్నదొర
సాలూరు: దేశంలోని ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి చెందాయంటే అందుకు కారణం ప్రత్యేక హోదాయేనని ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర అన్నారు. బుధవారం ఆయన సిక్కిం రాష్ట్రం నుంచి విలేకరులతో ఫోన్‌లో మాట్లాడారు. అంచనాల కమిటీ సభ్యులుగా కమిటీ చైర్మన్ ఎం.వేణుగోపాలరెడ్డి ఆద్వర్యంలో స్టడీ టూర్ నిమిత్తం పశ్చిమబెంగాల్, సిక్కిం, త్రిపుర రాష్ట్రాలలో పర్యటిస్తున్నట్టు తెలిపారు.
ఈ టూర్ ద్వారా ఆయా రాష్ట్రాలు అభివృద్ధి నిధుల కేటాయింపు, ఖర్చు చేస్తోన్న తీరుతెన్నులను పరిశీలిస్తున్నామన్నారు. ఈశాన్య రాష్ట్రాలు కేవలం ప్రత్యేక హోదా రాష్ట్రాలు కావడంతోనే అభివృద్ధి సాధ్యమౌతోందన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకహోదాతో ఏం ఒరుగుతుందని ప్రశ్నించారని, ఆయన ఆయా రాష్ట్రాలను చూస్తే ఏం ఒరుగుతుందో తెలుస్తుందన్నారు.
కొండప్రాంతమైనా ఎంతగానో అభివృద్ధి చెందాయని తెలిపారు. పశ్చిమబెంగాల్‌లో గిరిజనుల అభివృద్దికి హిల్ కౌన్సిల్ ఏర్పాటుతో అక్కడి గిరిజనులు అభివృద్ధి చెందుతున్నారని, ఆ తరహాలో మన రాష్ట్రంలో గిరిజన ప్రాంత అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరనున్నామని తెలిపారు. ఈ తరహాలోనే సాలూరు ఏజెన్సీ ప్రాంతలోనున్న కొఠియా గ్రామాల అభివృద్ధికి నిధులు సమకూరాయన్నారు.
దాదాపు 180కోట్ల రూపాయలను ఒడిశా ప్రభుత్వం కేటాయించిందని పేర్కొన్నారు. సిక్కిం రాష్ట్రంలో సాగవుతున్న టీ, కాఫీ తోటలలో 95శాతం విదేశాలకు ఎగుమతులవుతున్నాయని చెప్పారు. తమ టూర్ ద్వారా ఆయా రాష్ట్రాలు అభివృద్ధికి దోహదపడిన అంశాలను రాష్ట్ర ప్రభుత్వానికి కమిటీ ద్వారా నివేదించనున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment