రణరంగంగా జామియా వర్సిటీ | Jamia students stage protest against Citizenship Amendment Bill | Sakshi
Sakshi News home page

రణరంగంగా జామియా వర్సిటీ

Published Sat, Dec 14 2019 1:15 AM | Last Updated on Sat, Dec 14 2019 8:45 AM

Jamia students stage protest against Citizenship Amendment Bill - Sakshi

ఢిల్లీలో పోలీసులపైకి రాళ్లు రువ్వుతున్న జామియా వర్శిటీ విద్యార్థులు, నిరసనకారులపై బాష్పవాయువు గోళం ప్రయోగిస్తున్న పోలీసు

న్యూఢిల్లీ/గువాహటి/ఈటానగర్‌: పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలు, పట్టణాల్లో శుక్రవారం నిరసన ప్రదర్శనలు జరిగాయి. అయితే, గత రెండు రోజులతో పోలిస్తే.. అస్సాం సహా ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు కొంత తగ్గుముఖం పట్టాయి. కానీ ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌ల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీలోని జామియా మిలియా విశ్వవిద్యాలయం రణరంగంగా మారింది. పశ్చిమబెంగాల్‌లోని ముర్షీదాబాద్‌ జిల్లాలో ఉన్న బెల్డాంగ రైల్వే స్టేషన్‌ కాంప్లెక్స్‌ను ఆందోళనకారులు తగలబెట్టారు. అస్సాంలోని డిబ్రూగఢ్‌లో, మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌ల్లో శుక్రవారం కొద్దిసేపు కర్ఫ్యూ సడలించారు. అస్సాంలో నిరసనలకు కేంద్రమైన గువాహటిలో శుక్రవారం హింసాత్మక ఘటనలు చోటు చేసుకోలేదు. కానీ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా కనిపిస్తోంది.  

లాఠీచార్జ్‌.. టియర్‌ గ్యాస్‌
పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ పార్లమెంట్‌కు ర్యాలీగా వెళ్లాలనుకున్న జామియా మిలియా వర్సిటీ విద్యార్థులను పోలీసులు వర్సిటీ గేటు వద్దే అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల పైకి విద్యార్థులు రాళ్లు రువ్వడంతో, ప్రతిగా పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. టియర్‌ గ్యాస్‌ కూడా ప్రయోగించారని, రాళ్లు కూడా మొదట పోలీసులే రువ్వారని విద్యార్థులు ఆరోపించారు. విద్యార్థులే బారికేడ్లను ధ్వంసం చేసి తమపైకి దూసుకువచ్చారని పోలీసులు వివరణ ఇచ్చారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యారు. దాదాపు 50 మంది విద్యార్థులను అరెస్ట్‌ చేశారు. ఆ ప్రాంత ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌(ఆప్‌) ఘటనాస్థలికి వెళ్లి విద్యార్థులకు సంఘీభావం తెలిపారు.  

రైల్వే స్టేషన్‌కు నిప్పు
పశ్చిమబెంగాల్‌లోని ముర్షీదాబాద్‌ జిల్లాలో ఉన్న బెల్డాంగ రైల్వే స్టేషన్‌ కాంప్లెక్స్‌ను శుక్రవారం ఆందోళనకారులు తగలబెట్టారు. వేలాదిగా అక్కడికి వచ్చిన నిరసనకారులు రైల్వే కార్యాలయానికి, ఆర్‌పీఎఫ్‌ అవుట్‌పోస్ట్‌కు, ట్రాక్స్‌కు నిప్పంటించారు. అక్కడ రైల్వే పోలీసులపై తిరగబడ్డారు. బెల్డాంగ పోలీస్‌ స్టేషన్‌ను ధ్వంసం చేశారు. రఘునాథ్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌లోని వాహనాలకు నిప్పంటించారు. బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో ఉండే ముర్షీదాబాద్‌ జిల్లాలో ముస్లిం జనాభా ఎక్కువ. అలాగే, ముస్లిం జనాభా అధికంగా ఉన్న గ్రామీణ హౌరా, బిర్భుమ్, బుర్ద్వాన్‌ల్లో కూడా నిరసన ప్రదర్శనలు జరిగాయి.

అరుణాచల్‌లో విద్యార్థుల భారీ ర్యాలీ
అరుణాచల్‌ ప్రదేశ్‌లో శుక్రవారం కూడా నిరసనలు కొనసాగాయి. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు పరీక్షలను బహిష్కరించి, వీ«ధుల్లో ప్రదర్శనలు నిర్వహించారు. ఈటానగర్‌లోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ నుంచి రాజ్‌భవన్‌ వరకు విద్యార్థులు భారీ ర్యాలీ జరిపారు.  30 కి.మీల దూరం సాగిన ఈ ర్యాలీలో పాల్గొని, గవర్నర్‌ బీడీ మిశ్రాకు వినతిపత్రం ఇచ్చారు.

గువాహటిలో ఏఏఎస్‌యూ ర్యాలీ
అస్సాంలోని గువాహటిలో తాత్కాలికంగా  కర్ఫ్యూను తొలగించారన్న సమాచారంతో నిత్యావసర సరుకుల కోసం ప్రజలు వేలాదిగా దుకాణాల ముందు బారులు తీరారు. నగరంలోని దాదాపు అన్ని చోట్ల భద్రతా బలగాలు మోహరించాయి. పలు చోట్ల ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించాయి. నగరంలో శుక్రవారం ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోలేదు. కానీ ఆల్‌ అస్సాం స్టూడెంట్స్‌ యూనియన్‌ నగరంలో శాంతియుత నిరసన ప్రదర్శన నిర్వహించింది.  

అమిత్‌ షా పర్యటన రద్దు
మేఘాలయ, అరుణాచల్‌ ప్రదేశ్‌ల్లో ఆది, సోమవారాల్లో హోంమంత్రి అమిత్‌ షా జరపనున్న పర్యటన రద్దయింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో అమిత్‌ షా తన పర్యటనను రద్దు చేసుకున్నారు.  

జపాన్‌ ప్రధాని పర్యటన రద్దు
జపాన్‌ ప్రధాని షింజో ఆబే భారత పర్యటన రద్దయింది. పౌరసత్వ చట్టంపై ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న హింసాత్మక ఘటనల కారణంగా గువాహటిలో ప్రధాని మోదీతో ఈనెల 15 నుంచి జరగాల్సిన భేటీ రద్దయినట్లు తెలిపింది.

అల్ప సంఖ్యాకుల హక్కులకు రక్షించండి
వాషింగ్టన్‌: పౌరసత్వ చట్ట సవరణ..తదనంతర పరిణామాలపై అమెరికా స్పందించింది. రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి అల్పసంఖ్యాక మతాల వారి హక్కులకు రక్షణ కల్పించాలని భారత్‌ను కోరింది.

పౌరసత్వ చట్టంపై సుప్రీంలో పిటిషన్లు
పౌరసత్వ చట్ట సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలువురు పిటిషన్లు వేశారు. కాంగ్రెస్‌ ఎంపీ జైరాం రమేశ్, తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రాతోపాటు ఆల్‌ అస్సాం స్టూడెంట్స్‌ యూనియన్‌(ఆసు), పీస్‌ పార్టీ, కొన్ని ఎన్జీవోలు, న్యాయవాది ఎంఎల్‌ శర్మ, కొందరు న్యాయ విద్యార్థులు కూడా శుక్రవారం పిటిషన్లు దాఖలు చేశారు. ఈ చట్ట సవరణలపై తక్షణం విచారణ చేపట్టాలని మహువా మొయిత్రా తరఫు న్యాయవాది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనాన్ని కోరారు. అయితే, ధర్మాసనం నిరాకరించింది. రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు ఈ చట్టం ద్వారా భంగం కలుగుతోందని జైరాం రమేశ్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement