మేఘాలయలో ఇరవై ఏడేళ్లనుంచి అమల్లో ఉన్న సాయుధ దళాల (ప్రత్యేకాధికా రాల) చట్టాన్ని ఉపసంహరిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. దాంతోపాటు అరుణాచల్ ప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాలకు ఈ చట్టం నుంచి మిన హాయింపు ఇచ్చినట్టు తెలిపింది. అస్సాంలో కూడా పాక్షికంగా ఉపసంహరించే ప్రతిపాదన ఉన్నట్టు చెబుతున్నారు. త్రిపురలో మూడేళ్లక్రితం అప్పటి వామపక్ష ప్రభుత్వం దీన్ని ఉపసంహరించుకుంది. ఆనాటినుంచీ మా ప్రాంతాల్లో కూడా దీన్ని తొలగించాలని ఇతర ఈశాన్య రాష్ట్రాలనుంచి, జమ్మూ–కశ్మీర్‌నుంచి పలు సంస్థలు డిమాండు చేస్తున్నాయి. ఈ చట్టాన్ని రద్దు చేయాలని మణిపూర్ యువతి ఇరోం షర్మిల దాదాపు పదహారేళ్ల సుదీర్ఘకాలం నిరాహార దీక్ష జరిపారు.
ఇది అమలవు తున్న తీరుపై సర్వోన్నత న్యాయస్థానం పలు సందర్భాల్లో అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చట్టాన్ని సమీక్షించి తగిన సిఫార్సులు చేయాలని యూపీఏ ప్రభుత్వం సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బీపీ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ ఈ చట్టాన్ని రద్దు చేయాలని సిఫార్సు చేసింది. ఆ విషయంలో 2010లో యూపీఏ సర్కారు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయగా అది కూడా చట్టాన్ని పాక్షికంగా ఉపసంహరించాలని సూచించింది. ఇలా వ్యక్తులు, సంస్థలు, వ్యవస్థలు ఏక కంఠంతో అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు... సాక్షాత్తూ కేంద్ర మంత్రివర్గ ఉపసంఘమే పాక్షిక ఉపసంహరణకు మొగ్గు చూపినప్పుడు కూడా ఓ చట్టం ఇన్నాళ్లు మనుగడ సాగించగలగటం ఆశ్చర్యకరమే.
కానీ సైన్యం అభ్యంతరం వ్యక్తం చేయడం వల్లనే ఇవన్నీ నిరర్ధకమయ్యాయని తెలిస్తే అంతకన్నా ఆశ్చర్యం కలుగుతుంది. కల్లోలిత రాష్ట్రాల్లో ఇలాంటి చట్టం ఆసరా లేకుండా శాంతిభద్రతలను కాపాడే బాధ్యత తీసుకోవడం తమకు సాధ్యం కాదని సైన్యం చెప్పిన పర్యవసానంగా యూపీఏ సర్కారు దీని జోలికెళ్లడం మానుకుంది. దేశంలో స్వాతంత్య్రానంతరం రూపొందించిన ఒక చట్టంపై ఇంత పెద్ద యెత్తున నిరసనలు, అభ్యంతరాలు వ్యక్తం కావడం సాయుధ దళాల(ప్రత్యేకాధికా రాల) చట్టం విషయంలో మాత్రమే జరిగింది. అయితే దీని మూలాలు ‘క్విట్ ఇండియా’ ఉద్యమాన్ని అణచడానికి బ్రిటిష్ వలసపాలకులు తీసుకొచ్చిన సాయుధ దళాల విశేషాధికారాల ఆర్డినెన్స్‌లో ఉన్నాయి.
ఈశాన్య రాష్ట్రాలు తిరుగు బాట్లతో అట్టుడుకుతున్నప్పుడు 1958లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అవిభక్త అస్సాంలోని నాగాలాండ్‌లో అమలు చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత క్రమేపీ ఇతరచోట్లకు ఇది విస్తరించింది. 1990లో జమ్మూ–కశ్మీర్‌లో శాంతిభద్రతలు క్షీణిం చడం మొదలయ్యాక అక్కడ కూడా దీన్ని ప్రయోగించడం మొదలుపెట్టారు. కల్లోల పరిస్థితులున్నప్పుడు శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రభుత్వాలు చర్యలు తీసు కోవడం సర్వసాధారణం. కానీ ఆ వంకన ప్రభుత్వాలే జనం బతుకుల్లో కల్లోలం సృష్టిస్తే దాన్నెవరూ చూస్తూ ఊరుకోరు. తిరుగుబాట్లకూ లేదా ఉద్యమాలకూ మూల కారణాలేమిటో, అవి లేవనెత్తుతున్న సమస్యలేమిటో అవగాహన చేసుకుని పరిష్కరించడానికి బదులు ఇలాంటి కఠిన చట్టాలను ఆశ్రయిస్తే ‘సులభంగా’ గట్టె క్కగలమని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. పర్యవసానంగా ఆ కల్లోలిత ప్రాంతాల్లోని జనం ప్రాణభయంతో బతుకీడుస్తున్నారు.
సాయుధ దళాల చట్టం సైన్యానికి విశేషాధికారాలు ఇస్తోంది. శాంతిభద్రతల పరిరక్షణకు నియమితులైన బలగాలు అనుమతి లేకుండా ఎవరి ఇళ్లనైనా తనిఖీ చేయొచ్చు. వారెంటు లేకుండా ఎవరినైనా అరెస్టు చేయొచ్చు. ప్రమాదకారులన్న అనుమానం వచ్చిన వ్యక్తులను కాల్చి చంపొచ్చు. బహిరంగ స్థలాల్లో అయిదుగురు వ్యక్తులు గుమిగూడి ఉంటే, వారి వల్ల ముప్పు వాటిల్లవచ్చునని అనిపిస్తే కాల్పులు జరపొచ్చు. సైన్యం చర్యలను న్యాయస్థానాల్లో సవాలు చేయడం పౌరులకు సాధ్యం కాదు. ఏ సైనికుడైనా అన్యాయంగా, అకారణంగా ప్రాణం తీశాడని ఆరోపణ వస్తే వారిని విచారించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందస్తు అనుమతినీయాలి.
ప్రజా ప్రతినిధులుగానీ, రాష్ట్ర ప్రభుత్వంగానీ నోరెత్తడానికి లేదు. పౌరుల స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు విశేష ప్రాధాన్యమిచ్చే రాజ్యాంగం అమలవుతున్నచోట దానికి విరుద్ధమైన ఇలాంటి క్రూర చట్టం రూపొందడం, ఎందరు కాదన్నా అవిచ్ఛిన్నంగా కొనసాగడం దిగ్భ్రాంతికరమే. శత్రువులన్న అనుమానం కలిగినంతమాత్రాన, ఆరోపణలొచ్చినంతమాత్రాన పౌరులను కాల్చిచంపడమంటే చట్టబద్ధపాలన మాత్రమే కాదు... ప్రజాస్వామ్యం కూడా తీవ్ర ప్రమాదంలో పడినట్టు పరిగణించా ల’ని రెండేళ్లక్రితం సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. మణిపూర్‌లో 2000 సంవత్సరం నుంచి 2012 వరకూ 1528మంది పౌరులను సాయుధ బలగాలు అకారణంగా హతమార్చాయని, వాటిపై విచారణ జరిపించడంతోపాటు సాయుధ దళాల చట్టాన్ని రద్దు చేయాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఇచ్చిన తీర్పులో ధర్మాసనం ఈ వ్యాఖ్య చేసింది.
2004లో తంగజం మనోరమ చాను అనే మహిళను అస్సాం రైఫిల్స్ సిబ్బంది అరెస్టు చేశాక ఆమె శవమై కనబడినప్పుడు పార్లమెంటులో తీవ్ర దుమారం చెలరేగింది. ఆ ఘటనను నిరసిస్తూ కొందరు మణి పురి మహిళా ఉద్యమకారులు సైనికులు బస చేసిన కాంగ్లా భవనం ముందు నగ్న నిరసనకు దిగారు. సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం వంటివి ఉన్న సమస్యను పరిష్క రించకపోగా కొత్త సమస్యలను తీసుకొస్తాయి. ప్రజలకూ, ప్రభుత్వాలకూ మధ్య అగాధాన్ని పెంచుతాయి. అసంతృప్తిని మరింత విస్తరింపజేస్తాయి. జనం ఎదు ర్కొంటున్న సమస్యలపై సకాలంలో స్పందిస్తే, వారి డిమాండ్లలోని సహేతుకతను అవగాహన చేసుకుని తగిన పరిష్కారాన్ని అన్వేషిస్తే ఉద్యమాలు ఉగ్రరూపం దాల్చవు. అమానుష చట్టాల అవసరమే ఉండదు. అంతర్జాతీయంగా మన దేశాన్ని అపఖ్యాతిపాలు చేస్తున్న ఈ చట్టాన్ని మణిపూర్, అస్సాం, నాగాలాండ్ రాష్ట్రాల్లో సైతం ఉపసంహరించడంతోపాటు దాన్ని సంపూర్ణంగా రద్దు చేసే దిశగా ఆలోచించాలి.
Comments
Please login to add a commentAdd a comment