
ఐటీకి ‘సిక్కిం’దే లేదు
ఏటా బడ్జెట్ వస్తుందంటే చాలు.. తమకు ఏమైనా ఊరట లభిస్తుందేమోననే ఆశ వేతన జీవుల్లో కనిపిస్తుంది. ఆదాయపన్నులో ఏమైనా రాయితీలు కల్పించారా అనే లెక్కల్లో మునిగిపోతారు. మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉండే మనదేశంలో పన్ను చెల్లించే ఉద్యోగుల నుంచి కార్పొరేట్ కంపెనీల వరకు బడ్జెట్ రోజున ఐటీ శ్లాబ్(IT Slabs)ల గురించి ఆరా తీస్తారు. అయితే, దేశం మొత్తం ఈ లెక్కలతో బిజీగా ఉన్నా.. ఒక్క రాష్ట్రంలోని ప్రజలు మాత్రం తమకేం సంబంధం లేనట్టుగా ఉంటారు. ఎందుకంటే వారు ఆదాయపన్ను అనేదే కట్టరు. అదేంటి పన్ను కట్టకుంటే కేంద్ర ప్రభుత్వం ఊరుకుంటుందా అనే డౌట్ వస్తుందా? అవును ఆ వెసులుబాటు ఇచ్చిందే కేంద్రం. ఇంతకీ ఆ రాష్ట్రం ఏంటో తెలుసా?.. సిక్కిం. 330 ఏళ్లకుపైగా రాచరిక రాజ్యంగా స్వతంత్రంగా ఉన్న సిక్కిం(Sikkim).. 1975లో 22వ రాష్ట్రంగా భారత్‌లో విలీనమైంది. అయితే ఆ సమయంలో సిక్కిం ఓ షరతు పెట్టింది. తాము భారత్‌లో విలీనమైనా.. తాము అంతకుముందు తమ పాలనలో ప్రజలకు పన్నులు విధించలేదని, ఇప్పుడు కూడా ఆ విధానాన్నే అనుసరిస్తామని స్పష్టం చేసింది. దీనికి భారత ప్రభుత్వం అంగీకరించడంతో సిక్కిం ప్రజలకు ఆదాయ పన్ను కట్టే భారం తప్పింది. ఈమేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 371ఎఫ్ ప్రకారం సిక్కింకు ప్రత్యేక హోదా ఉంటుంది.
తలసరి ఆదాయంలో నంబర్‌వన్..
దేశంలో సేంద్రియ రాష్ట్రంగా గుర్తింపు పొందిన సిక్కిం తలసరి ఆదాయం కూడా అదుర్స్. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.5,88,000 తలసరి ఆదాయంతో దేశంలోనే సిక్కిం టాప్‌లో నిలిచింది. 2023–24 ఆర్థిక సంవత్సరం జాతీయ సగటులో సిక్కిం తలసరి ఆదాయం 320 శాతంగా ఉంది. ఇది దేశంలోనే అత్యధికం. ఇక సిక్కిం తలసరి స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జీఎస్‌డీపీ) దేశ తలసరి జీడీపీ కంటే మూడు రెట్లు ఎక్కువ.
ఇదీ చదవండి: ఏఐను అందిపుచ్చుకుంటున్న ప్రభుత్వ విభాగాలు
ఎవరికి మినహాయింపు ఉంటుంది?
ఇదంతా విన్న తర్వాత అర్జెంటుగా సిక్కిం వెళ్లిపోతే ఈ ఐటీ బాధలేమీ ఉండవు అనుకుంటున్నారా? అలాంటి పప్పులేమీ ఉడకవు.. 1975 కంటే ముందు నుంచి అక్కడ ఉన్న సిక్కిం నివాసితులకు మాత్రమే ఈ పన్ను మినహాయింపు వర్తిస్తుంది. వేరే ప్రాంతాల నుంచి అక్కడికి వలస వెళ్లినవారికి ఇది వర్తించదు. ఈ మేరకు 2008లో కేంద్ర ప్రభుత్వం ఆదాయపన్ను(Income Tax) చట్టంలో సెక్షన్ 10 (26 ఏఏఏ)ను తీసుకొచ్చింది. దీని ప్రకారం ఒక వ్యక్తి సిక్కింకి చెందిన వారు అయి ఉండి ఏ రకంగానైనా ఆదాయం సంపాదిస్తున్నట్లయితే పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది. అలాగే ఆ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కంపెనీ వేరే రాష్ట్రంలో ఉండి డివిడెండ్‌లు, సెక్యూరిటీల ద్వారా ఆదాయం వస్తే కూడా పన్ను మినహాయింపు ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment