సాక్షి, అమరావతి : హుండీల్లో డబ్బులు చోరీ.. పంచలోహ విగ్రహాలు మాయం.. దేవాలయాలకు సంబంధించిన నేరాల్లో ఏళ్ల తరబడి పోలీసులు, ప్రజలు వింటున్న మాటలు ఇవి. కానీ, ఇందుకు భిన్నంగా.. గత కొంతకాలంగా పథకం ప్రకారం రాష్ట్రంలోని వివిధ ఆలయాల్లో చోటు చేసుకుంటున్న విగ్రహాల ధ్వంసం ఘటనలు పోలీసులకు సరికొత్త సవాళ్లను విసిరాయి. దేవుడి మాటున విపక్షాలు మత రాజకీయాలకు తెరతీశాయి. దీనిని సకాలంలో పసిగట్టిన రాష్ట్ర ప్రభుత్వం సంయమనంతో వ్యవహరించి మత సామరస్యాన్ని కాపాడేందుకు పోలీసులకు దిశా నిర్దేశం చేసింది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో పోలీసులు తీసుకున్న ఈ చర్యలు సత్ఫలితాలిచ్చాయి. దీంతో ఇప్పుడు దేశంలోని పలు రాష్ట్రాలు ఈ విషయంలో ఏపీ వైపు చూస్తున్నాయి. ఆలయాల భద్రతలో రాష్ట్రం చేపట్టిన చర్యలపై అధ్యయనం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.
రాష్ట్రంలో పటిష్ట చర్యలు ఇలా..
ఆలయాల్లో చోటుచేసుకుంటున్న దుర్ఘటనలను అరికట్టేందుకు రాష్ట్ర పోలీసులు తీసుకుంటున్న చర్యలకు ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోంది. దేశంలోనే తొలిసారిగా ఆలయాలకు ఎక్కడాలేని విధంగా భద్రత కల్పించడమే ఇందుకు కారణం. వాటిలో ముఖ్యమైనవి..
►రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనేక మతపరమైన సంస్థలు, ఆలయాలకు సంబంధించిన భద్రతపై పోలీసు శాఖ సోషల్ ఆడిట్ నిర్వహించింది. దానికి అనుగుణంగా భద్రతా చర్యలు చేపట్టింది.
►విగ్రహాల విధ్వంసానికి అడ్డుకట్ట వేసేలా ప్రభుత్వం ‘సిట్’ ఏర్పాటుచేసింది. ప్రతి జిల్లాలోను ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి.
►గతేడాది సెప్టెంబరు 5 నుంచి ఇప్పటివరకు మొత్తం 59,529 మతపరమైన సంస్థలు, ఆలయాలకు పోలీసులు జియో ట్యాగింగ్ చేశారు.
►రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 46,225 సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి నిరంతర నిఘాతో పటిష్టమైన భద్రతను కల్పిస్తున్నారు.
►దేవదాయ శాఖకు చెందిన ప్రధాన ఆలయాలు, ఇతర మతపరమైన సంస్థలకు మూడు షిఫ్ట్‌ల పద్ధతిలో పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు.
►గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లోని వాటికి నిర్వాహకులు, యాజమాన్యం, స్థానిక ప్రజలు బందోబస్తు చర్యలు తీసుకునేలా పోలీసు శాఖ అప్రమత్తం చేసింది.
►అంతేకాక.. రాష్ట్రవ్యాప్తంగా 22,955 గ్రామ రక్షణ దళాలను ఏర్పాటుచేయాలని పోలీసు శాఖ నిర్దేశించుకోగా ఇప్పటివరకు 17,853 ఏర్పాటుచేశారు. మిగిలిన 5,102 దళాల ఏర్పాటుకు కూడా పోలీసు శాఖ చర్యలు చేపట్టింది.
ఇతర రాష్ట్రాల అధ్యయనం
సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు డీజీపీ డి. గౌతమ్ సవాంగ్ దేశంలో మరెక్కడా లేని విధంగా ఆలయాల భద్రతకు పటిష్టమైన చర్యలు చేపట్టారు. డీజీపీ పర్యవేక్షణలో మతపరమైన సంస్థలకు జియో ట్యాగింగ్, సీసీ కెమెరాలు, గ్రామ రక్షణ దళాలు ఏర్పాటయ్యాయి. వీటి గురించి తెలుసుకున్న హిమాచల్‌ప్రదేశ్ పోలీసు అధికారులు ఏపీ డీజీపీ సవాంగ్‌తో చర్చించారు. ఇక్కడికి వచ్చి ఆలయాల భద్రతా చర్యలను అధ్యయనం చేసేందుకు సంసిద్ధత వ్యక్తంచేశారు. అలాగే, పలు ఈశాన్య రాష్ట్రాల పోలీసులు సైతం ఇక్కడి చర్యలను అధ్యయనం చేసేందుకు ఆసక్తి చూపించడం మనకు గర్వకారణం. – జి. పాలరాజు, పోలీస్ అధికార ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment