Temples security
-
ఆలయాల భద్రతపై.. ఏపీ వైపు రాష్ట్రాల చూపు
సాక్షి, అమరావతి : హుండీల్లో డబ్బులు చోరీ.. పంచలోహ విగ్రహాలు మాయం.. దేవాలయాలకు సంబంధించిన నేరాల్లో ఏళ్ల తరబడి పోలీసులు, ప్రజలు వింటున్న మాటలు ఇవి. కానీ, ఇందుకు భిన్నంగా.. గత కొంతకాలంగా పథకం ప్రకారం రాష్ట్రంలోని వివిధ ఆలయాల్లో చోటు చేసుకుంటున్న విగ్రహాల ధ్వంసం ఘటనలు పోలీసులకు సరికొత్త సవాళ్లను విసిరాయి. దేవుడి మాటున విపక్షాలు మత రాజకీయాలకు తెరతీశాయి. దీనిని సకాలంలో పసిగట్టిన రాష్ట్ర ప్రభుత్వం సంయమనంతో వ్యవహరించి మత సామరస్యాన్ని కాపాడేందుకు పోలీసులకు దిశా నిర్దేశం చేసింది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో పోలీసులు తీసుకున్న ఈ చర్యలు సత్ఫలితాలిచ్చాయి. దీంతో ఇప్పుడు దేశంలోని పలు రాష్ట్రాలు ఈ విషయంలో ఏపీ వైపు చూస్తున్నాయి. ఆలయాల భద్రతలో రాష్ట్రం చేపట్టిన చర్యలపై అధ్యయనం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. రాష్ట్రంలో పటిష్ట చర్యలు ఇలా.. ఆలయాల్లో చోటుచేసుకుంటున్న దుర్ఘటనలను అరికట్టేందుకు రాష్ట్ర పోలీసులు తీసుకుంటున్న చర్యలకు ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోంది. దేశంలోనే తొలిసారిగా ఆలయాలకు ఎక్కడాలేని విధంగా భద్రత కల్పించడమే ఇందుకు కారణం. వాటిలో ముఖ్యమైనవి.. ►రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనేక మతపరమైన సంస్థలు, ఆలయాలకు సంబంధించిన భద్రతపై పోలీసు శాఖ సోషల్ ఆడిట్ నిర్వహించింది. దానికి అనుగుణంగా భద్రతా చర్యలు చేపట్టింది. ►విగ్రహాల విధ్వంసానికి అడ్డుకట్ట వేసేలా ప్రభుత్వం ‘సిట్’ ఏర్పాటుచేసింది. ప్రతి జిల్లాలోను ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. ►గతేడాది సెప్టెంబరు 5 నుంచి ఇప్పటివరకు మొత్తం 59,529 మతపరమైన సంస్థలు, ఆలయాలకు పోలీసులు జియో ట్యాగింగ్ చేశారు. ►రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 46,225 సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి నిరంతర నిఘాతో పటిష్టమైన భద్రతను కల్పిస్తున్నారు. ►దేవదాయ శాఖకు చెందిన ప్రధాన ఆలయాలు, ఇతర మతపరమైన సంస్థలకు మూడు షిఫ్ట్‌ల పద్ధతిలో పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. ►గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లోని వాటికి నిర్వాహకులు, యాజమాన్యం, స్థానిక ప్రజలు బందోబస్తు చర్యలు తీసుకునేలా పోలీసు శాఖ అప్రమత్తం చేసింది. ►అంతేకాక.. రాష్ట్రవ్యాప్తంగా 22,955 గ్రామ రక్షణ దళాలను ఏర్పాటుచేయాలని పోలీసు శాఖ నిర్దేశించుకోగా ఇప్పటివరకు 17,853 ఏర్పాటుచేశారు. మిగిలిన 5,102 దళాల ఏర్పాటుకు కూడా పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. ఇతర రాష్ట్రాల అధ్యయనం సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు డీజీపీ డి. గౌతమ్ సవాంగ్ దేశంలో మరెక్కడా లేని విధంగా ఆలయాల భద్రతకు పటిష్టమైన చర్యలు చేపట్టారు. డీజీపీ పర్యవేక్షణలో మతపరమైన సంస్థలకు జియో ట్యాగింగ్, సీసీ కెమెరాలు, గ్రామ రక్షణ దళాలు ఏర్పాటయ్యాయి. వీటి గురించి తెలుసుకున్న హిమాచల్‌ప్రదేశ్ పోలీసు అధికారులు ఏపీ డీజీపీ సవాంగ్‌తో చర్చించారు. ఇక్కడికి వచ్చి ఆలయాల భద్రతా చర్యలను అధ్యయనం చేసేందుకు సంసిద్ధత వ్యక్తంచేశారు. అలాగే, పలు ఈశాన్య రాష్ట్రాల పోలీసులు సైతం ఇక్కడి చర్యలను అధ్యయనం చేసేందుకు ఆసక్తి చూపించడం మనకు గర్వకారణం. – జి. పాలరాజు, పోలీస్ అధికార ప్రతినిధి -
ఆలయాల భద్రతకు అన్ని చర్యలూ తీసుకున్నాం
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): రాష్ట్రంలోని ఆలయాలన్నీ సర్వే చేసి జియో ట్యాగింగ్ ఏర్పాటు చేయడం ద్వారా భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. దేవదాయ ధర్మాదాయ శాఖ, రాష్ట్ర దేవాలయాల పాలక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై నిర్వహించిన సదస్సులో డీజీపీ మాట్లాడారు. అంతర్వేది ఘటన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయాయన్నారు. ఆలయాల్లో వరుసగా ఘటనలు జరుగుతుండటంతో పోలీస్ విభాగం అప్రమత్తమై.. దేవాలయాల భద్రతకు అన్ని చర్యలూ తీసుకుందని వివరించారు. 13 జిల్లాల్లో ఉన్న 59 వేల ఆలయాలను సర్వే చేసి.. వాటికి జియో ట్యాగింగ్ చేశామని చెప్పారు. 47,734 ఆలయాల్లో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. అలాగే 23,832 ఆలయాల్లో గ్రామ రక్షణ దళాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆలయాల్లో ఘటనలకు సంబంధించి.. 1,893 మందిని విచారించామని తెలిపారు. 198 కేసుల్లో 373 మందిని అరెస్టు చేశామని చెప్పారు. మన సంస్కృతి, సంప్రదాయాలకు దేవాలయాలే మూలమన్నారు. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. పాలక మండళ్లు, ఈవోలు చర్చించుకుని ఆలయాల్లో భద్రత ప్రమాణాలను మెరుగుపరచుకోవాలన్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆలయాల భద్రతపై మరింత అప్రమత్తంగా ఉండాలని దేవదాయ శాఖ కమిషనర్ అర్జునరావు సూచించారు. గ్రామాలకు దూరంగా ఉన్న ఆలయాలతో పాటు పురాతన ఆలయాలపై తగిన నిఘా ఉంచాలన్నారు. దేవదాయ అడిషనల్ కమిషనర్ రామచంద్రమోహన్ మాట్లాడుతూ.. కార్యనిర్వహణ అ«ధికారులు, పోలీసు శాఖతో సమన్వయం చేసుకుని ఆలయాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలన్నారు. సమావేశంలో పాల్గొన్న డీజీపీ సవాంగ్‌కు దుర్గగుడి ఈవో సురే‹Ù.. అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. అంతకుముందు డీజీపీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సమావేశంలో ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్, నగర పోలీస్ కమిషనర్ బత్తుల శ్రీనివాసులు, సిట్ అధికారి జీవీజీ అశోక్‌కుమార్, టెక్నికల్ సర్వీసెస్ డీఐజీ డి.పాల్‌రాజ్, డీసీపీ విక్రాంత్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. -
ఆలయాలపై దాడుల కేసులు విజయవంతంగా ఛేదించాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇటీవల 19 ఆలయాలపై జరిగిన దాడులు, దొంగతనాల కేసుల్లో కొద్దిరోజుల్లోనే 12 కేసులను విజయవంతంగా ఛేదించి నిందితులను అరెస్టు చేశామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. మిగిలిన కేసులనూ త్వరలోనే ఛేదిస్తామని ఆయన చెప్పారు. ఆలయాలు, ఆలయ ప్రాంగణాల్లో పాల్పడిన ఇవన్నీ దొంగతనాలు, మూఢనమ్మకాలతో చేసినవేనని గౌతమ్ సవాంగ్ సోమవారం మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏం పేర్కొన్నారంటే.. ► రాష్ట్రంలో దేవాలయాలు, ఇతర ప్రార్థనా మందిరాల్లో ఇటీవల జరిగిన సంఘటనల్లో ఒకదానితో ఒకటి సంబంధం లేదు. ► కానీ, కొందరు దురుద్దేశంతో వాటికి ఏవేవో కారణాలు ఆపాదించి ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నారు. ఉదాహరణకు గతేడాది భారీ వర్షాలకు తడవడం వల్లనే శ్రీకాకుళంలో ఓ విగ్రహం చేయి విరిగింది. కర్నూలు జిల్లాలో ఒకరు పిల్లలు కలగాలని కోరుకుంటూ ఓ విగ్రహంలోని ఓ భాగాన్ని విరిచి తన ఇంటికి తీసుకువెళ్లిపోయాడు. ► రాష్ట్రంలో అన్ని ప్రార్థనా మందిరాల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటివరకు 47,593 ప్రార్థనా మందిరాలను మ్యాపింగ్ చేశాం. వాటిలో 28,567 దేవాలయాలున్నాయి. ► పోలీసు శాఖ ఇప్పటివరకు 880 ప్రాంతాల్లో సీసీ టీవీలు ఏర్పాటు చేసింది. గత ఆరేళ్లలో ఇలాంటి నేరాలకు పాల్పడిన చరిత్ర ఉన్న 8,204మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశాం. ► గత కొన్నేళ్లతో పోలిస్తే 2020లోనే రాష్ట్రంలో ప్రార్థనా మందిరాలపై దాడులు తక్కువగా జరిగాయి. 2015లో 290, 2016లో 322, 2017లో 318, 2018లో 267, 2019లో 305, 2020లో 228 ఇలాంటి కేసులు నమోదయ్యాయి. -
వేద విద్య ప్రోత్సాహానికి పాఠశాలలు: ఇంద్రకరణ్
సాక్షి, హైదరాబాద్: దేవాలయాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, పూజారులు, వేద పండితులు, సిద్ధాంతుల సంక్షేమానికి పాడుతోందని దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ విద్వత్సభ ఆధ్వర్యంలో రాష్ట్ర దేవాదాయ, భాషా సాంస్కృతిక శాఖలు, రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సహకారంతో రెండు రోజుల తెలంగాణ జ్యోతిష మహాసభలు–2018 సోమవారం రవీంద్రభారతిలో ప్రారంభమయ్యాయి. వేదవిద్యను ప్రోత్సహించేందు కు రాష్ట్రంలో అవసరమైనన్ని వేద పాఠశాలలు ప్రారంభించనున్నట్లు మంత్రి చెప్పారు. విద్యుత్ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ, జ్యోతిష మహాసభలు సమాజ శ్రేయస్సుకు, రాష్ట్ర సంక్షేమానికి తోడ్పడతాయని అభిప్రాయపడ్డారు. పుష్పగిరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ అభినవోద్ధండ విద్యాశంకర భారతీస్వామి మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరికీ సనాతన జ్యోతిశ్శాస్త్ర విషయాలపై అవగాహన కల్పించాలన్నారు. తెలంగాణ విద్వత్సభ అధ్యక్షుడు యాయ వరం చంద్రశేఖరశర్మ సిద్ధాంతి మాట్లాడుతూ, ఈ మహాసభలు రాబోయే పండుగల తేదీలపై ఏకాభిప్రాయం సాధించేందుకు దోహదపడతాయన్నారు. జ్యోతిశ్శాస్త్ర వైభవమ్ విశిష్ట సంచికను ఆవిష్కరించి తొలి ప్రతిని గాయత్రీ పీఠం తత్త్వానంద రుషికి అంద జేశారు. కార్యక్రమంలో ‘దర్శనమ్’ ఆధ్యాత్మిక మాసపత్రిక సంపాదకుడు మరుమాముల వేంకటరమణ శర్మ, ఢిల్లీలో తెలంగాణ అధికార ప్రతినిధి సముద్రా ల వేణుగోపాలాచారి, రాష్ట్ర ప్రభుత్వ ప్రజాసంబంధాల అధికారి వనం జ్వాలా నరసింహారావు, రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యులు బోర్పట్ల హనుమంతాచార్య, కవేలి అనంతాచార్యులు, కృష్ణమాచార్య సిద్ధాంతి, అంతర్వేది కృష్ణమాచార్యులు, తెలంగాణ విద్వత్సభ ఉపాధ్యక్షుడు ఐనవోలు అనంతమల్లయ్య శర్మ సిద్ధాంతి తదితరులు పాల్గొన్నారు. -
దేవాలయంలో ముష్కరులు..!
సాక్షి, రాంగోపాల్‌పేట్ : నిత్యం భక్తులతో రద్దీగా ఉండే సికింద్రాబాద్‌లోని లక్ష్మీగణపతి దేవాలయం.. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో కొంత మంది ముష్కరులు దేవాలయంలోకి ప్రవేశించారు.. దేవాలయంలో డిటోనేటర్లు, బాంబులు అమర్చారు.. కొందరు భక్తులు, ఆలయ సిబ్బందిని బంధించారు. దీన్నీ సీసీ కెమెరాల్లో గమనించిన ఆలయ చైర్మన్, ఈవోలు వెంటనే గోపాలపురం పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్థానిక పోలీసులతో పాటు ఆక్టోపస్ సిబ్బంది రంగంలోకి దిగారు. చేతిలో అత్యాధునిక ఆయుధాలు, మాస్క్‌లు ధరించిన ఆక్టోపస్ సిబ్బంది రెండు గ్రూపులుగా విడిపోయి దేవాలయంలోకి ప్రవేశించి చాకచక్యంతో బంధీలను విడిపించారు. బాంబులను నిర్వీర్యం చేసి ముష్కరులను అంతమొందించారు. ఇదంతా నిజం కాదు.. కానీ నిజంగా అలా జరిగితే ఎలా ఉంటుంది. తీవ్రవాదులను ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై ఆక్టోపస్, గోపాలపురం పోలీసులు మాక్ డ్రిల్ ద్వారా అవగాహన కల్పించారు. గోపాలపురం ఏసీపీ శ్రీనివాసరావు, మహంకాళీ ఏసీపీ వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వేణుగోపాలా.. ఎక్కడున్నావయ్యా?!
కామారెడ్డి క్రైం: పురాతన ఆలయ గర్భగుడిలో ఉత్సవ మూర్తులుగా కొలువుదీరిన వేణుగోపాలస్వామి(శ్రీకృష్ణుడు), రుక్మిణి, సత్యభామల పంచలోహ విగ్రహాలు, అందులోనూ 700 ఏళ్లనాటి ఘన చరిత్రగల దేవతామూర్తుల ప్రతిమలు, జనావాసాల మధ్య ఆలయం. నాలుగు ద్వారాలు దాటిన తర్వాతగానీ గర్భగుడిలోనికి ప్రవేశం. నాలుగు నిమిషాల్లోనే దోపిడీ జరిగిపోయింది. శనివారం సాయంత్రం కాలనీలో అందరూ ఉండగానే ఏ మాత్రం అనుమానం రాకుండా సుమారు 75 కిలోల బరువు గల పంచలోహ విగ్రహాలను అపహరించుకుపోయిన కేసు ప్రస్తుతం జిల్లా పోలీసులకు సవాల్‌గా మారింది. ఇద్దరు దుండుగులు విగ్రహాలను చోరీ చేసి ఉడాయించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదైంది. వారి ముఖాలు స్పష్టంగా కనిపించక, ఆలయం నుంచి బయటకు వచ్చాక కొద్ది దూరం తర్వాత ఏ దారిగుండా పారిపోయారో, ఎక్కడకు పోయారో తెలుసుకోవడంలో అడ్డంకులు పోలీసు అధికారులకు నిద్రపట్టనీయడం లేదు. ఈ కేసును పోలీసులు సవాల్‌గా తీసుకుని పరిశోధనకు 10 బృందాలను ఏర్పాటు చేసి విచారిస్తున్నారు. వేణుగోపాలస్వామి జాడ కోసం పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సీసీ ఫుటేజీలో ఇద్దరు దుండగులు... సంఘటన జరిగిన ఆలయాన్ని ఎస్పీ శ్వేత, డీఎస్పీ ప్రసన్నరాణి, పట్టణ పోలీసులు సందర్శించి విచారణ ప్రారంభించారు. వీధి చివరలో ఉన్న సీసీ పుటేజీ పరిశీలించగా దుండగులు ఇద్దరు చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. సాయంత్రం 6.55 గంటలకు తెలుపు రంగు షర్టు వ్యక్తి, ఆ తర్వాత నీలిరంగు షర్ట్ వ్యక్తి లోనికి వెళ్లారు. 6.59 గంటలకు ఇద్దరూ సంచులతో బయటకు వచ్చారు. కొద్ది దూరంలో ఉన్న బీసీ బాయ్స్ హాస్టల్ గల్లీలోకి వెళ్లిపోయారు. అక్కడ నుంచి ఎటు వెళ్లారు, ముఠాలో ఎవరైనా ఉన్నారా అనే విషయాలు తెలుసుకు నే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. పట్టణంలోని అన్ని సీసీ కెమెరాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. 4 నిమిషాల్లోనే దోచేశారు.. దుండగులు కేవలం 4 నిమిషాల్లోనే దేవతా మూర్తుల పంచలోహ విగ్రహాలను దోచుకువెళ్లారు. ప్రధాన అర్చకుడు ధర్మకర్తల కుటుంబీకులు పక్కనే ఉంటారు. ఉద యం స్వామివారికి పూజలు, అభిషేకాలు, నైవేద్యాలు సమర్పించాక ఆలయ గర్భగుడికి తాళం వేసి వెళ్లినట్లు తెలిపారు. ఆ తర్వాత అందరూ మండపంలో నుంచి స్వామివారిని దర్శించుకుని వెళ్తుంటారు. సాయంత్రం ఆలయంలో ఎవరూ లేకపోవడంతో తాళాన్ని శబ్ధం రాకుండా పగులగొట్టినట్లు ఆనవాళ్లున్నా యి. ప్రధాన దేవతల విగ్రహాల ముందు ఉత్సవ మూర్తులను పీటముడుల నుంచి తొలగించుకుని ఉడాయించారు. పంచలోహ విగ్రహాలే టార్గెట్.. 700 ఏళ్ల చరిత్ర కలిగిన వైష్ణవ దేవాలయంగా పెద్దబజార్‌లోని శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం పేరుగాంచింది. కాకతీయుల కాలంనాటిది. దోమకొండ సంస్థానాధీశులు నిర్మించిన కిష్టమ్మగుడిలో ప్రస్తుతం చోరీ అయిన పంచలోహ విగ్రహాలు ఉండేవట. 200 ఏళ్ల క్రితం వాటిని కంజర్ల వంశీయులు వచ్చి వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రతిష్ఠించారు. ఘన చరిత్ర ఉన్న పంచలోహ విగ్రహాలు ఇక్కడ ఉన్నట్లు చాలా మందికి తెలియదు. చోరీ తీరును చూస్తే కేవలం పంచలోహ విగ్రహాలను మాత్రమే టార్గెట్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఆలయంలో దేవతల కిరీటాలు, శంకు చక్రాలు, పాత్రలు ఎన్నో ఉన్నా దేన్నీ ముట్టుకోలేదు. ఎంతో కాలంగా వాటిని కాజేసేందుకు బాగా తెలిసిన వారే కుట్రలు పన్ని పథకం ప్రకారం చోరీ చేసినట్లు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి చోరీలు గతంలో హైదరాబాద్, ఆంధ్రా ప్రాంతాల్లో వెలుగుచూసినట్లు పోలీసులు చెబుతున్నారు. పంచలోహ విగ్రహాలను చోరీ చేసి ఏం చేస్తారు, ఎక్కడ విక్రయిస్తారు? అనే కోణంలో విచారిస్తున్నారు. విగ్రహాల విలువ రూ.కోటిపైగా ఉంటుందని ఆలయ ధర్మకర్తల కుటుంబీకులు చెబుతున్నారు. అన్ని కోణాల్లో విచారణ... సంచలనం సృష్టించిన పంచలోహ విగ్రహాల చోరీ కేసును చేధించేందుకు జిల్లా పోలీసులు అన్నీ కోణాల్లోనూ విచారిస్తున్నారు. ఎస్పీ శ్వేత ఆధ్వర్యంలో కేసు పరిశీలన, తనిఖీల నిమిత్తం పది బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఆలయాల్లో చోరీలకు పాల్పడిన పాత నేరస్తులను, ఇదే తరహాలో చోరీ చేసే వారి వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. సీసీ కెమెరాల్లో ఇద్దరు వ్యక్తులు కనిపించినా మొత్తం వ్యవహారంలో ఎంతమంది ఉన్నారనే దానిపై స్పష్టత రాలేదు. నిందితులను తప్పకుండా పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. -
‘గుడి’కి భద్రత గోవిందా..!
‘ఉగ్ర’ ముప్పుపై నిఘా హెచ్చరికలు పెడచెవిన... ఈసీఐఎల్ సిఫారసులకు నో చెప్పిన ప్రభుత్వం ఏడు ప్రధాన దేవాలయాలపై అందిన నివేదిక ఇక బుట్టదాఖలే మిగతా ఆలయాల్లో సర్వేను కూడా వద్దన్న సర్కారు సాక్షి, హైదరాబాద్: ప్రధాన దేవాలయాలకు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని నిఘా సంస్థలు హెచ్చరించినా, ప్రభుత్వం వాటిని పెడచెవిన పెడుతోంది. దేవాలయాల భద్రతకు తీసుకోవలసిన చర్యలపై సిఫారసులు చేస్తూ ఈసీఐఎల్ ఇచ్చిన నివేదికను సైతం బేఖాతరు చేస్తోంది. ఈసీఐఎల్ సిఫారసులను అమలుచేయాలంటే భారీగా నిధులు వెచ్చించాల్సి వస్తుందంటూ, దానిని పరిగణనలోకి తీసుకోరాదని నిర్ణయించడమే కాకుండా, మిగిలిన దేవాలయాల్లో సర్వే కూడా అవసరంలేదని ఆదేశించడం విడ్డూరం. ఇటీవల చిత్తూరు జిల్లా పుత్తూరులో పట్టుబడ్డ ఉగ్రవాదులు తిరుపతిలో విధ్వంసానికి కుట్ర పన్నినట్లు తేలిన నేపథ్యంలో ఆలయాల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో సూచించాలంటూ ప్రభుత్వమే ఈసీఐఎల్‌ను ఆశ్రయించింది. పార్లమెంటుపై దాడి తర్వాత దాని భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై ఈసీఐఎల్ నుంచే కేంద్రం సూచనలు తీసుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ సంస్థకే బాధ్యతలు అప్పగించింది. తొలుత ఏడు ప్రధాన దేవాలయాలను పరిశీలించి, నివేదిక ఇవ్వాలని కోరింది. విజయవాడ కనకదుర్గ దేవాలయం, శ్రీశైలం, యాదగిరిగుట్ట, వేములవాడ, అన్నవరం, సింహాచలం, శ్రీకాళహస్తి దేవాలయాలను పరిశీలించిన ఈసీఐఎల్ నిపుణులు, తమ సిఫారసులను ప్రభుత్వం ముందుంచారు. అయితే, వాటి అమలుకు భారీగా ఖర్చయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ప్రభుత్వం ఆ సిఫారసులను పక్కనపెట్టింది. ఒక్క యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం విషయాన్ని పరిశీలిస్తే, దేవాలయ పరిసరాల్లో 50 సీసీ కెమెరాలు, ప్రతి ద్వారం వద్ద మెటల్ డిటెక్టర్లు, దేవాలయానికి వెళ్లే ముందు భక్తుల సామగ్రిని క్షుణ్ణంగా పరిశీలించేందుకు లగేజి స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఈసీఐఎల్ నిపుణులు సిఫారసు చేశారు. దేవాలయం చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రస్తుతం ఉన్న భద్రతా సిబ్బంది సంఖ్యను రెట్టింపు చేయాలని సూచించారు. ఈ సిఫారసులను అమలు చేస్తే, కోటి రూపాయలకు పైగా ఖర్చవుతుందని ప్రభుత్వం లెక్క తేల్చింది. విజయవాడ, శ్రీశైలం, అన్నవరం దేవాలయాలకు రూ.2.5 కోట్లు వరకు ఖర్చవుతుందని అంచనా వేసింది. ఇంత ఖర్చు సాధ్యం కాదని తేల్చి, ఆ సిఫారసులను అమలు చేయవద్దని నిర్ణయించింది. అలాగే, మిగిలిన దేవాలయాల్లో ఈసీఐఎల్ సర్వే కూడా అవసరం లేదని నిర్ణయించింది.