‘గుడి’కి భద్రత గోవిందా..!
‘ఉగ్ర’ ముప్పుపై నిఘా హెచ్చరికలు పెడచెవిన...
ఈసీఐఎల్ సిఫారసులకు నో చెప్పిన ప్రభుత్వం
ఏడు ప్రధాన దేవాలయాలపై అందిన నివేదిక ఇక బుట్టదాఖలే
మిగతా ఆలయాల్లో సర్వేను కూడా వద్దన్న సర్కారు
సాక్షి, హైదరాబాద్: ప్రధాన దేవాలయాలకు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని నిఘా సంస్థలు హెచ్చరించినా, ప్రభుత్వం వాటిని పెడచెవిన పెడుతోంది. దేవాలయాల భద్రతకు తీసుకోవలసిన చర్యలపై సిఫారసులు చేస్తూ ఈసీఐఎల్ ఇచ్చిన నివేదికను సైతం బేఖాతరు చేస్తోంది. ఈసీఐఎల్ సిఫారసులను అమలుచేయాలంటే భారీగా నిధులు వెచ్చించాల్సి వస్తుందంటూ, దానిని పరిగణనలోకి తీసుకోరాదని నిర్ణయించడమే కాకుండా, మిగిలిన దేవాలయాల్లో సర్వే కూడా అవసరంలేదని ఆదేశించడం విడ్డూరం. ఇటీవల చిత్తూరు జిల్లా పుత్తూరులో పట్టుబడ్డ ఉగ్రవాదులు తిరుపతిలో విధ్వంసానికి కుట్ర పన్నినట్లు తేలిన నేపథ్యంలో ఆలయాల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో సూచించాలంటూ ప్రభుత్వమే ఈసీఐఎల్‌ను ఆశ్రయించింది. పార్లమెంటుపై దాడి తర్వాత దాని భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై ఈసీఐఎల్ నుంచే కేంద్రం సూచనలు తీసుకుంది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ సంస్థకే బాధ్యతలు అప్పగించింది. తొలుత ఏడు ప్రధాన దేవాలయాలను పరిశీలించి, నివేదిక ఇవ్వాలని కోరింది. విజయవాడ కనకదుర్గ దేవాలయం, శ్రీశైలం, యాదగిరిగుట్ట, వేములవాడ, అన్నవరం, సింహాచలం, శ్రీకాళహస్తి దేవాలయాలను పరిశీలించిన ఈసీఐఎల్ నిపుణులు, తమ సిఫారసులను ప్రభుత్వం ముందుంచారు. అయితే, వాటి అమలుకు భారీగా ఖర్చయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ప్రభుత్వం ఆ సిఫారసులను పక్కనపెట్టింది. ఒక్క యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం విషయాన్ని పరిశీలిస్తే, దేవాలయ పరిసరాల్లో 50 సీసీ కెమెరాలు, ప్రతి ద్వారం వద్ద మెటల్ డిటెక్టర్లు, దేవాలయానికి వెళ్లే ముందు భక్తుల సామగ్రిని క్షుణ్ణంగా పరిశీలించేందుకు లగేజి స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఈసీఐఎల్ నిపుణులు సిఫారసు చేశారు. దేవాలయం చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రస్తుతం ఉన్న భద్రతా సిబ్బంది సంఖ్యను రెట్టింపు చేయాలని సూచించారు. ఈ సిఫారసులను అమలు చేస్తే, కోటి రూపాయలకు పైగా ఖర్చవుతుందని ప్రభుత్వం లెక్క తేల్చింది. విజయవాడ, శ్రీశైలం, అన్నవరం దేవాలయాలకు రూ.2.5 కోట్లు వరకు ఖర్చవుతుందని అంచనా వేసింది. ఇంత ఖర్చు సాధ్యం కాదని తేల్చి, ఆ సిఫారసులను అమలు చేయవద్దని నిర్ణయించింది. అలాగే, మిగిలిన దేవాలయాల్లో ఈసీఐఎల్ సర్వే కూడా అవసరం లేదని నిర్ణయించింది.