మెరైన్ అకాడమీకి మోక్షమెన్నడో? | Moksamennado Marine Academy? | Sakshi
Sakshi News home page

మెరైన్ అకాడమీకి మోక్షమెన్నడో?

Published Sun, Jul 20 2014 1:43 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

మెరైన్ అకాడమీకి మోక్షమెన్నడో? - Sakshi

మెరైన్ అకాడమీకి మోక్షమెన్నడో?

  •  కేంద్రంలో మారిన ప్రభుత్వం
  •  గత ప్రభుత్వ హయాంలో నిర్ణయం
  •  నిర్మాణ వ్యయం రూ. 500 కోట్లు
  •  బడ్జెట్‌లో లేని ప్రస్తావన
  • మచిలీపట్నం : గత యూపీఏ ప్రభుత్వ హయాంలో తీసుకున్న  మెరైన్ అకాడమీ ఏర్పాటు నిర్ణయం అమలవుతుందా లేదా అనే అనుమానాలు నెలకొంటున్నాయి. ప్రస్తుత ఎన్‌డీఏ ప్రభుత్వ  బడ్జెట్‌లో ఈ  అకాడమీ ప్రస్తావన లేకపోవడమే అనుమానాలకు తావిస్తుంది.

    సముద్రం మీదుగా దేశంలోకి ఉగ్రవాదులు చొరబడకుండా నిరంతర నిఘా కొనసాగించేందుకు, పశ్చిమబెంగాల్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో సముద్రతీరంలో గస్తీని మరింత పటిష్టం చేసేందుకు  ఈ అకాడమీని ఏర్పాటు చేయాలని అప్పటి యూపీఏ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  కోస్ట్‌గార్డ్, రాష్ట్ర హోంశాఖ సంయుక్తంగా ఈ అకాడమీ ఏర్పాటు కోసం ప్రయత్నాలు ప్రారంభించాయి.

    గతేడాది అక్టోబరులో బందరు మండలం పెదపట్నం గొల్లగూడెంలోని సముద్రతీరం వెంబడి ఉన్న భూములను రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ టీపీ దాస్, కలెక్టర్ ఎన్.రఘునందన్‌రావు, మెరైన్ ఐజీ కె.శ్రీనివాసరెడ్డి, ఏలూరు రేంజ్ డీఐజీ విక్రమ్‌సింగ్‌మాన్, ఎస్పీ జె.ప్రభాకరరావు పరిశీలించారు. పెదపట్నం గొల్లగూడెం గ్రామంలోని 366.54 ఎకరాల భూమిని ఇచ్చేందుకు కలెక్టర్ అంగీకారం తెలిపారు.

    మెరైన్ అకాడమీ నిర్మాణం కోసం సుమారు రూ. 500 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుందని అంచనా. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఈ అకాడమీ నిర్మాణం, నిర్వహణ జరుగుతుంది. ముంబయి దాడుల అనంతరం తీరంలో గస్తీని ముమ్మరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మెరైన్ అకాడమీ ఏర్పాటు చేయాలని అప్పట్లో నిర్ణయించింది. ముంబైలో ఉగ్రవాదుల దాడుల అనంతరం సముద్రతీరంలో పహారా కాసేందుకు మెరైన్ పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేశారు.

    మెరైన్ సిబ్బందికి కోస్ట్‌గార్డ్, నేవీ విభాగాల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. మెరైన్ అకాడమీని ఏర్పాటు చేసేందుకు జిల్లా ఎస్పీ జె. ప్రభాకరరావు తీవ్రంగా కృషి చేశారు. ఆయన కాకినాడకు బదిలీ అయ్యారు. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం మారడంతో మెరైన్ అకాడమీ ఏర్పాటుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం  మెరైన్ అకాడమీ ఏర్పాటుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తుందా, లేదా అన్నది వేచి చూడాలి.
     
    ఇవీ ఉపయోగాలు...


    మెరైన్ అకాడమీ మచిలీపట్నంలో ఏర్పాటైతే దేశ రక్షణ వ్యవస్థలో ఈ ప్రాంతం కీలకం కానుంది. ఇక్కడ ఏర్పాటు చేసే అకాడమీ నుంచే తీరప్రాంత భద్రతపై పర్యవేక్షణ జరుగుతుంది. ఆధునిక సెన్సార్లతో కూడిన నిఘా వ్యవస్థ ఏర్పాటుతో మెరైన్ పోలీస్‌స్టేషన్ల మధ్య సమాచార వ్యవస్థ పటిష్టత కోసం చర్యలు తీసుకుంటారు.

    ఐదు రాష్ట్రాల పరిధిలో ఉన్న సముద్రజలాలపై పర్యవేక్షణ, విపత్కర పరిస్థితులు ఎదురైతే అనుసరించాల్సిన వ్యూహాలు ఇక్కడి నుంచే రూపకల్పన జరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా 920 కిలోమీటర్ల మేర తీరప్రాంతం ఉంది. దీంతో పాటు కోలకటా నుంచి కొచ్చిన్ వరకు వేలాది కిలోమీటర్ల మేర నిఘా వ్యవస్థ పటిష్టమవుతుంది.  

    జాతీయస్థాయిలో మెరైన్ అకాడమీని ఏర్పాటు చేస్తే దీనికి అనుబంధంగా రాష్ట్రస్థాయిలోనూ మరో మెరైన్ అకాడమీని ఏర్పాటు కానుంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ రిసెర్చ్ సెంటరు, రాజమండ్రి ఎస్సెట్ పరిధిలోని కేజీ బేసిన్ రక్షణ వ్యవస్థ ఈ అకాడమీ పరిధిలోకి వస్తాయి. దీంతో పాటు నాగాయలంక మండలం గుల్లలమోదలో ఏర్పాటు చేయనున్న క్షిపణి ప్రయోగశాల దీని పరిధిలోకే రానుంది. పాలకులు స్పందించి మెరైన్ అకాడమీని జిల్లాలో ఏర్పాటు చేస్తే జాతీయస్థాయిలో గుర్తింపు లభిస్తుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement