
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇటీవల 19 ఆలయాలపై జరిగిన దాడులు, దొంగతనాల కేసుల్లో కొద్దిరోజుల్లోనే 12 కేసులను విజయవంతంగా ఛేదించి నిందితులను అరెస్టు చేశామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. మిగిలిన కేసులనూ త్వరలోనే ఛేదిస్తామని ఆయన చెప్పారు. ఆలయాలు, ఆలయ ప్రాంగణాల్లో పాల్పడిన ఇవన్నీ దొంగతనాలు, మూఢనమ్మకాలతో చేసినవేనని గౌతమ్ సవాంగ్ సోమవారం మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏం పేర్కొన్నారంటే..
► రాష్ట్రంలో దేవాలయాలు, ఇతర ప్రార్థనా మందిరాల్లో ఇటీవల జరిగిన సంఘటనల్లో ఒకదానితో ఒకటి సంబంధం లేదు.
► కానీ, కొందరు దురుద్దేశంతో వాటికి ఏవేవో కారణాలు ఆపాదించి ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నారు. ఉదాహరణకు గతేడాది భారీ వర్షాలకు తడవడం వల్లనే శ్రీకాకుళంలో ఓ విగ్రహం చేయి విరిగింది. కర్నూలు జిల్లాలో ఒకరు పిల్లలు కలగాలని కోరుకుంటూ ఓ విగ్రహంలోని ఓ భాగాన్ని విరిచి తన ఇంటికి తీసుకువెళ్లిపోయాడు.
► రాష్ట్రంలో అన్ని ప్రార్థనా మందిరాల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటివరకు 47,593 ప్రార్థనా మందిరాలను మ్యాపింగ్ చేశాం. వాటిలో 28,567 దేవాలయాలున్నాయి.
► పోలీసు శాఖ ఇప్పటివరకు 880 ప్రాంతాల్లో సీసీ టీవీలు ఏర్పాటు చేసింది. గత ఆరేళ్లలో ఇలాంటి నేరాలకు పాల్పడిన చరిత్ర ఉన్న 8,204మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశాం.
► గత కొన్నేళ్లతో పోలిస్తే 2020లోనే రాష్ట్రంలో ప్రార్థనా మందిరాలపై దాడులు తక్కువగా జరిగాయి. 2015లో 290, 2016లో 322, 2017లో 318, 2018లో 267, 2019లో 305, 2020లో 228 ఇలాంటి కేసులు నమోదయ్యాయి.