మహిళా పోలీసులకు పదోన్నతులు | Promotions to women police in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

మహిళా పోలీసులకు పదోన్నతులు

Jan 13 2022 5:13 AM | Updated on Jan 13 2022 5:13 AM

Promotions to women police in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: మహిళలు, బాలల సంరక్షణలో కీలకమైన సచివాలయ మహిళా పోలీసులకు ఇన్‌స్పెక్టర్‌ (నాన్‌ గెజిటెడ్‌) వరకు పదోన్నతులు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మహిళా పోలీసుల నియామకం, శిక్షణ సిలబస్‌; జాబ్‌ చార్ట్, సబార్డినేట్‌ సర్వీస్‌ నిబంధనలను ఖరారు చేసింది. ఈమేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి గుడి విజయకుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిని పోలీసు శాఖలో ప్రత్యేక విభాగంగా పరిగణిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మహిళా పోలీసు, సీనియర్‌ మహిళా పోలీసు, అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఎస్‌ఐ), సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎస్‌ఐ), ఇన్‌స్పెక్టర్‌ (నాన్‌ గెజిటెడ్‌).. ఇలా ఐదు కేటగిరీలుగా వీరిని పరిగణిస్తారు. మొదటి స్థాయిలో ప్రత్యక్ష ఎంపిక ద్వారా మహిళా పోలీస్‌లను  నియమిస్తారు. అనంతరం సీనియర్‌ మహిళా పోలీస్, ఏఎస్‌ఐ, ఎస్‌ఐ, ఇన్‌స్పెక్టర్‌ వరకు పదోన్నతులు ఇస్తారు.  

నియామకం, పదోన్నతులు ఇలా..
► ఇకపై రాష్ట్ర పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా మహిళా పోలీసుల నియామకం ఉంటుంది.
► 90 శాతం మందిని నేరుగా ఎంపిక చేస్తారు. మిగిలిన 10 శాతంలో 5 శాతం అర్హులైన హోమ్‌ గార్డులకు, మిగిలిన 5 శాతం గ్రామ/వార్డు సచివాలయాల వలంటీర్‌లకు కేటాయించారు.
► 5 అడుగులు ఎత్తు, 40 కిలోల తగ్గకుండా బరువు ఉన్న అభ్యర్థులు అర్హులు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని గిరిజనులకు ఎత్తు 148 సెంటీమీటర్లు, బరువు 38 కిలోలు ఉండాలి.
► దేహ దారుఢ్య పరీక్ష (ఫిజికల్‌ టెస్ట్‌)లో 20 నిమిషాల్లో 2 కిలోమీటర్లు నడవాలి. దీంతోపాటు రాత, మెడికల్‌ పరీక్షల్లో అర్హత సాధించాలి.
► రెండేళ్లు ప్రొబేషనరీ పీరియడ్‌ ఉంటుంది.
► కానిస్టేబుల్‌ నుంచి సీఐ/ఇన్‌స్పెక్టర్‌ వరకు పోలీస్‌ శాఖలో ఉన్న రిపోర్టింగ్, పర్యవేక్షణ, నిర్ణయాధికారాలు వీరికీ వర్తిస్తాయి.
► శాంతిభద్రతలు, మహిళలు, పిల్లల రక్షణ, ప్రజా సేవలు సహా పలు అంశాలపై ఇన్‌డోర్, 10 విభాగాల్లో అవుట్‌ డోర్‌ శిక్షణ ఉంటుంది. 
► మహిళా పోలీస్‌గా కనీసం ఆరు సంవత్సరాలు, సీనియర్‌ మహిళా పోలీస్‌గా ఐదేళ్లు, ఏఎస్‌ఐగా ఐదేళ్లు, ఎస్‌ఐగా ఐదేళ్లు పనిచేసిన వాళ్లు ఆపై పదోన్నతులకు అర్హులు. సంబంధిత పోస్టులో పనితీరు, రాష్ట్ర స్థాయి పోలీస్‌ రిక్రూట్మెంట్‌ బోర్డు నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణతను పరిగణనలోకి తీసుకుని పదోన్నతి ఇస్తారు. బోర్డు పరీక్షలకు 90%, పనితీరుకు 10 శాతం వెయిటేజి ఇస్తారు.
► మహిళా పోలీస్‌ నుంచి ఏఎస్‌ఐ వరకు జిల్లా పరిధిలో, ఎస్‌ఐ నుంచి ఇన్‌స్పెక్టర్‌ స్థాయి వరకు రేంజ్‌ పరిధిలో పదోన్నతులు, సీనియారిటీ, బదిలీలు ఉంటాయి.

జాబ్‌ చార్ట్‌
► శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అంశాలను ఎప్పటికప్పుడు స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లకు రిపోర్ట్‌ చేయాలి. 
► తమ పరిధిలోని విద్యా సంస్థలను సందర్శించి విద్యార్థులకు రోడ్‌ సేఫ్టీ, సైబర్‌ క్రైమ్, మహిళల భద్రత తదితర అంశాలపై అవగాహన కల్పించాలి.
► అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచాలి.
► ఆత్మహత్యలు, ఒత్తిడి అధిగమించడంపై రైతులకు కౌన్సెలింగ్‌ ఇవ్వాలి.
► అవసరం మేరకు పోలీస్‌ స్టేషన్‌లలో కేసుల విచారణకు సహాయపడాలి.
► ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలపై గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించాలి.
► బాల్య వివాహాల కట్టడికి ఐసీడీఎస్, రెవెన్యూ, ఇతర శాఖలతో కలిసి పనిచేయాలి.
► గృహ హింస, బాల్య వివాహం, లైంగిక వేధింపుల చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. 

ప్రభుత్వ నిర్ణయం గొప్ప పరిణామం
గ్రామ మహిళా పోలీస్‌ వ్యవస్థను సాధారణ పోలీసు విభాగంలో అంతర్భాగం చేయడం గొప్ప పరిణామమని రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. మహిళా పోలీస్‌ వ్యవస్థను పోలీసు శాఖలో ప్రత్యేక విభాగంగా పరిగణిస్తూనే వారి సేవలను మరింత సమర్థంగా గ్రామ,  వార్డు సచివాలయాల్లో ఉపయోగించుకునేలా ప్రభుత్వం జీవో జారీ చేయడంపట్ల డీజీపీ బుధవారం ఓ ప్రకటనలో హర్షం వ్యక్తంచేశారు. ‘యూనిఫామ్‌ అనేది ఒక గౌరవం. సగర్వంగా యూనిఫామ్‌ ధరించండి. ప్రజా సేవలో పునరంకితమవ్వండి. మహిళా పోలీసులకు పోలీస్‌ శాఖలో తగిన గౌరవం ఉంటుంది’ అని పేర్కొన్నారు.

పోలీసు శాఖ పదోన్నతులతో సంబంధం లేకుండా మహిళా పోలీసులకు ప్రత్యేకంగా పదోన్నతులు లభిస్తాయన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి, వార్డుకు ఒక మహిళను పోలీసు ప్రతినిధిగా నియమించిన ఘనత మన రాష్ట్రానికే దక్కుతుందన్నారు. సామాన్యులకు మెరుగైన సేవలందిస్తూనే, మహిళలు, చిన్నారులు, అట్టడుగు వర్గాల రక్షణే ధ్యేయంగా మహిళా పోలీసు వ్యవస్థను సమర్థవంతంగా, ఆదర్శనీయంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో విధులు నిర్వర్తించనున్న మహిళా పోలీసులకు నాలుగు నెలలు శిక్షణ ఇస్తామన్నారు. మొదటి మూడు నెలలు పోలీస్‌ కళాశాలలో, మరో నెల క్షేత్రస్థాయి శిక్షణ ఇస్తామన్నారు. మహిళా పోలీసుల పదోన్నతులపై తాజా జీవోను స్వాగతిస్తున్నామని పోలీస్‌ అధికారుల సంఘం పేర్కొంది. ఇంతవరకు ఈ వ్యవస్థపై నెలకొన్న అపోహలకు ప్రభుత్వం తెరదించిందని తెలిపింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement