సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శులను ఇక నుంచి ‘మహిళా పోలీసులు’గా వ్యవహరించాలని నిర్ణయించింది. వారు పోలీస్ శాఖలో అంతర్భాగమని ప్రకటిస్తూ వారికి ‘కానిస్టేబుల్’ హోదా కల్పించింది.
గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 14,910 మంది మహిళా సంరక్షణ కార్యదర్శుల పోస్టులకు గాను ప్రస్తుతం 14,313 మంది ఉన్నారు. త్వరలోనే వీరికి రెండేళ్ల ప్రొబెషన్ సర్వీసు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో వారి సర్వీసులను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. ‘మహిళా పోలీస్’గా పేర్కొంటూ కానిస్టేబుల్‌కు ఉండే అధికారాలు, బాధ్యతలు ప్రకటించడంతోవీరికి మరింత ప్రయోజనం కలగనుంది. మహిళా పోలీసులకు సంబంధించిన విధివిధానాలపై హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
విధివిధానాలు..
► మహిళా పోలీసులకు అవసరమైన శిక్షణ ఇస్తారు. ప్రస్తుతం మహిళా కానిస్టేబుళ్లు వినియోగిస్తున్న యూనిఫాంను వీరికి కూడా ఇస్తారు.
► వివిధ చట్టాల ప్రకారం కానిస్టేబుళ్లకు ఉన్న అధికారాలు, బాధ్యతలు కూడా మహిళా పోలీసులకు కల్పిస్తారు.
► మహిళా పోలీసులు తమ గ్రామ, వార్డు సచివాలయానికి సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు ప్రతినిధులుగా వ్యవహరిస్తారు.
► వీరికి పదోన్నతి కోసం అదనపు హెడ్ కానిస్టేబుల్ పోస్టులను సృష్టిస్తారు.
► మహిళా పోలీసులుగా తగిన అధికారాలు, విధుల కల్పనకు చట్టంలో అవసరమైన మార్పులు చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment