సాక్షి, అమరావతి: పోలీసు శాఖలో రానున్న మూడేళ్లలో పెద్ద ఎత్తున నియామకాలు చేపడతామని డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పారు. వచ్చే ఏడాది జాబ్ క్యాలెండర్ నుంచి ఏడాదికి 6,500 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని భర్తీ చేస్తామని ఆయన వెల్లడించారు. కొత్త నియామకాలపై యువత అపోహలు, సందేహాలు పెట్టుకోవద్దని సూచించారు. మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహిళల భద్రత కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో నియమించిన దాదాపు 15 వేల మంది మహిళా సురక్షా కార్యదర్శులకు మహిళా పోలీసుల హోదా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. వారికి కానిస్టేబుల్ తరహా విడతల వారీగా క్యాప్సుల్ శిక్షణ ఇస్తామని తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్ర పోలీసు శిక్షణ కేంద్రంలో ఒకసారి 6,500 మందికి మాత్రమే శిక్షణ ఇచ్చేందుకు అవకాశం ఉందని డీజీపీ గుర్తు చేశారు. కాబట్టి 15 వేల మంది మహిళా పోలీసులకు క్యాప్సుల్ శిక్షణ ముగిసిన తరువాత ఇతర రెగ్యులర్ పోలీసు నియామక ప్రక్రియపై దృష్టి సారిస్తామన్నారు. 2019–20లో ఇప్పటికే 3,057 కానిస్టేబుళ్ల పోస్టులను భర్తీ చేసి శిక్షణ ఇచ్చి విధుల్లో చేర్చుకున్నామన్నారు. ఇంకా 11,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.
కొందరు నిరుద్యోగుల్లో అపోహలు సృష్టించేలా అవాస్తవాలను ప్రచారం చేయడం తగదని చెప్పారు. ఈ ప్రభుత్వం గడచిన రెండేళ్లలో మొత్తం 6,05,949 పోస్టులు భర్తీ చేసిన విషయాన్ని డీజీపీ గుర్తు చేశారు. వాటిలో 1,84,264 రెగ్యులర్ ఉద్యోగాలు, కాంట్రాక్టు పద్ధతి ద్వారా 19,701 ఉద్యోగాలు, ఔట్ సౌర్సింగ్ ద్వారా 3,99,791 ఉద్యోగాలు, డీఎస్సీ ద్వారా 2,193 ఉద్యోగాలు ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం 34,563 ఖాళీలు మాత్రమే భర్తీ చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment