ఆగని ‘పౌరసత్వ’ ప్రకంపనలు | Protests continue against amended Citizenship Act | Sakshi
Sakshi News home page

ఆగని ‘పౌరసత్వ’ ప్రకంపనలు

Published Mon, Dec 16 2019 1:38 AM | Last Updated on Mon, Dec 16 2019 8:09 AM

Protests continue against amended Citizenship Act - Sakshi

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గువాహటిలో కళాకారులు నిర్వహించిన సంగీత కార్యక్రమానికి భారీగా హాజరైన నిరసనకారులు

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. దేశ రాజధానితో పాటు పశ్చిమబెంగాల్, అస్సాంల్లో ఆదివారం ఉధృతంగా నిరసన ప్రదర్శనలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీలో ఆందోళనకారులు బస్సులకు, అగ్నిమాపక వాహనానికి నిప్పుపెట్టారు. గువాహటిలో పోలీసుల కాల్పుల్లో మృతుల సంఖ్య నాలుగుకి చేరింది. లండన్‌లోని భారతీయ హైకమిషన్‌ కార్యాలయం ఎదుట కొందరు ప్లకార్డులతో నిరసన తెలిపారు.  కాగా, సొంతంగా రాజకీయ పార్టీ పెట్టాలని యోచిస్తున్నట్లు ఆల్‌ అస్సాం స్టూడెంట్స్‌ యూనియన్‌ వెల్లడించింది. మరోవైపు, పౌరసత్వ సవరణ చట్టంపై అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్త ప్రచార కార్యక్రమం నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది.  ‘ముస్లింల హక్కులకు భంగం కలిగే ఒక్క అంశం కూడా చట్టంలో లేదు’ అని పార్టీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర స్పష్టం చేశారు.  

రాజధానిలో..
ఆగ్నేయ ఢిల్లీలోని జామియా మిలియా వర్సిటీ దగ్గరలో ఆందోళనకారులు పలు బస్సులను తగలబెట్టారు. మంటలను ఆర్పేందుకు వస్తున్న అగ్నిమాపక వాహనాలను కూడా ధ్వంసం చేశారు. పోలీసుల లాఠీ చార్జిలో పలువురు విద్యార్థులు, ఆందోళనకారులకు గాయాలయ్యాయి. ఒక పోలీసుకు, ఇద్దరు అగ్నిమాపక సిబ్బందికి గాయాలయ్యాయి. కాగా, తాము శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామని విద్యార్థి సంస్థ ఎన్‌ఎస్‌యూఐ తెలిపింది.  కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు ఉద్యమంలో చేరి హింసకు పాల్పడుతున్నాయని జామియా మిలియా వర్సిటీ విద్యార్థులు ఆరోపించారు. వర్సిటీలో ఉంటూ విద్యార్థులను రెచ్చగొడ్తున్న విద్యార్థేతరులను అదుపులోకి తీసుకునేందుకు ఆదివారం పోలీసులు జామియా మిలియా వర్సిటీలో సోదాలు జరిపారు.

బెంగాల్‌లో.. :పశ్చిమబెంగాల్‌లోని నాడియా, బీర్భుమ్, నార్త్‌ 24 పరగణ, హౌరా జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.  ఆందోళనకారులు రహదారులపై టైర్లు, కట్టెలను తగలబెట్టారు.  ముర్షీదాబాద్, మాల్డా, నార్త్‌ 24 పరగణ, హౌరా జిల్లాల్లో ఇంటర్నెట్‌ను అధికారులు నిలిపేశారు.  అస్సాంలోని గువాహటిలో పోలీసు కాల్పుల్లో చనిపోయిన ఆందోళనకారుల సంఖ్య ఆదివారానికి నాలుగుకి చేరింది. ఆందోళనల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఆల్‌ అస్సాం స్టూడెంట్స్‌ యూనియన్‌ మాత్రం ఐదుగురు చనిపోయారని, పలువురి పరిస్థితి సీరియస్‌గా ఉందని తెలిపింది. బుధవారం నుంచి తమ ఆసుపత్రిలో బుల్లెట్‌ గాయాలతో 29 మంది చేరారని గువాహటి మెడికల్‌ కాలేజీ తెలిపింది. లండన్‌లోని భారతీయ హై కమిషన్‌ ముందు కొందరు అస్సాం వాసులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. సంప్రదాయ అస్సామీ వస్త్రధారణలో పిల్లలతో పాటు వచ్చిన  యువత ఈ కార్యక్రమంలో పాల్గొంది. వీరితోపాటు కాంగ్రెస్‌ పార్టీ యూకే శాఖ కూడా నిరసన ప్రదర్శన చేపట్టింది.

పార్టీ పెడతాం: ఏఏఎస్‌యూ
పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఆల్‌ అస్సాం స్టూడెంట్స్‌ యూనియన్‌(ఏఏఎస్‌యూ) సొంతంగా రాజకీయ పార్టీని ప్రారంభించాలని యోచిస్తోంది. శిల్పి సమాజ్‌తో కలిసి పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ఏఏఎస్‌యూ సంకేతాలిచ్చింది.

సుప్రీంకోర్టుకు ఏజీపీ
పౌరసత్వ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకునేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని అధికార బీజేపీ భాగస్వామ్య పక్షమైన అస్సాం గణపరిషద్‌ (ఏజీపీ) నిర్ణయించిందని ఏజీపీ నేత దీపక్‌ దాస్‌ తెలిపారు. అస్సాం ప్రజల సెంటిమెంట్‌ను ఏజీపీ గౌరవిస్తుందని ఈ చట్టం తమ ఉనికిని, అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేస్తుందని భావిస్తున్నారని ఆయన చెప్పారు.   మరోవైపు ఈ చట్టాన్ని ఏజీపీ ఎప్పుడూ సమర్థించలేదని మంత్రి ప్రఫుల్ల కుమార్‌ మహంత స్పష్టం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement