ఇంఫాల్‌లో డోలు వాయిస్తున్న ప్రధాని మోదీ
ఇంఫాల్/అగర్తలా: గత ప్రభుత్వాలు అభివృద్ధిపరంగా ఈశాన్య రాష్ట్రాలకు, మిగతా దేశానికి మధ్య తీవ్ర అగాధాన్ని సృష్టించగా తమ ప్రభుత్వం మాత్రం లుక్ ఈస్ట్ విధానంతో ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసిందని ప్రధాని మోదీ అన్నారు. తమ నిరంతర కృషి ఫలితంగానే మిగతా దేశానికి, ఈశాన్యప్రాంతానికి మధ్య ఉన్న అంతరం తగ్గిందన్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో మంగళవారం ఆయన రూ.4,815 కోట్ల విలువైన 22 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రసంగిస్తూ.. కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాల కృషి ఫలితంగా మణిపూర్, ఈశాన్యరాష్ట్రాల్లో తీవ్రవాదం, హింస స్థానంలో శాంతి, అభివృద్ధికి బాటలు పడ్డాయన్నారు. ఒకప్పుడు దిగ్బంధానికి గురైన మణిపూర్, ఈశాన్యప్రాంతం ఇప్పుడు అభివృద్ధికి, అంతర్జాతీయ వాణిజ్యానికి ముఖద్వారాలుగా మారబోతోందని తెలిపారు. బీజేపీ హయాంలో దేశ పురోగతికి ఈశాన్య ప్రాంతం చోదకశక్తిగా మారిందని పేర్కొన్నారు.
ప్రధాని మోదీ ప్రారంభించిన వాటిలో.. ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఫర్ ఇంఫాల్ స్మార్ట్ సిటీ మిషన్, అత్యాధునిక కేన్సర్ ఆస్పత్రి ఉన్నాయి. వీటితోపాటు మణిపూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెర్‌ఫార్మింగ్ ఆర్ట్స్ భవనానికి, 5 జాతీయ రహదారుల నిర్మాణానికి, మూడు తాగునీటి ప్రాజెక్టులు తదితరాలకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆయన త్రిపుర రాజధాని అగర్తలాలో మహారాజా బీర్ బిక్రమ్(ఎంబీబీ) విమానాశ్రయంలో రెండో టెర్మినల్ భవనంతోపాటు పలు సంక్షేమ పథకాలను ప్రారంభించారు. గత ప్రభుత్వాల హయాం లో అవినీతికి, వెనుకబాటుతనానికి మారుపేరుగా ఉన్న త్రిపుర ఇప్పుడు ప్రముఖమైన వాణిజ్య కారిడార్‌గా మారిపోయిందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment