అమరావతికి తరలించడం సమంజసమేనా?
ఐదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండి మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చిన పార్టీ ప్రభుత్వ చర్యలూ, దాని ప్రాధాన్యతలపై సహజంగానే ప్రజలకు ఆసక్తి ఉంటుంది. కర్నూలు నుంచి న్యాయ సంస్థలు– ‘లోకాయుక్త’ మానవ హక్కుల కమిషన్, సీబీఐ కోర్టు, ఉన్నత ‘లా’ విద్యాసంస్థలు వంటి వాటిని అక్కడ నుంచి ‘అమరావతి’కి తరలిస్తున్నట్టు, స్థానికులు ఆందోళన చేస్తున్నట్టుగా వచ్చిన వార్తల నేపథ్యంలో... గత పదేళ్ల పరిణామాల సమీక్ష తప్పడం లేదు.ఈ విషయంలో మొదట ఒకమాట అనుకుని అప్పుడు ముందుకు వెళ్ళడం బాగుంటుంది. ఉమ్మడి రాష్ట్రం ఎందుకు రెండుగా విభజించబడింది అనే విషయంలో పదేళ్ళ తర్వాత అయినా మనకు స్పష్టత అవసరం. ఇక్కడ రాష్ట్రాల్లో అయినా అక్కడ ఢిల్లీలో అయినా ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వంలోకి ప్రవేశించే ‘లెజిస్లేచర్’ కాకుండా, శాశ్వతమైన ‘ఎగ్జిక్యూటివ్’ అనే శక్తిమంతమైన వ్యవస్థ మరొకటి ఉంది. ఈ రెండింటిపై ‘జ్యుడిషియరీ’ ఉంది. ప్రభుత్వాలు ఉనికిలో లేని విరామాల మధ్య కూడా వాళ్ళు అధికారంలో ఉంటారు. అప్పటి ముఖ్యమంత్రి కె. కిరణ్‌కుమార్ రెడ్డి రాజీనామా చేస్తే, 2014 ఫిబ్రవరి 20 నుంచి జూన్ 8 వరకు రాష్ట్రం ‘గవర్నర్ పాలన’లో ఉంది. దేశ ప్రాదేశిక భద్రత విషయమై గురుతరమైన బాధ్యత ఈ వ్యవస్థలకు ఉంటుంది. పరిపాలనలో కేంద్ర– రాష్ట్ర సంబంధాలు ఢిల్లీలో ‘హోమ్’శాఖ వద్ద ఎందుకు ఉంటాయో మనకు అర్థం కావాలి. అలాగే, 2014 మొదట్లో ‘యూపీఏ–2’ ప్రభుత్వంలో ఢిల్లీలో రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలయినప్పుడు; అధికారుల కమిటీ కాకుండా, ప్రభుత్వం మంత్రులతో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘానికి కేంద్ర రక్షణశాఖ మంత్రి ఎందుకు అధ్యక్షుడుగా ఉన్నారో మనకు అర్థం కావాలి. అటువంటి గ్రహింపుతో మొత్తంగా భారత ప్రభుత్వం సమగ్రమైన తూర్పు దృష్టి (లుక్ ఈస్ట్) ‘డ్రైవ్’ అంతా కేవలం ఆగ్నేయ ఆసియా వైపు ఎందుకు ఉందో కూడా మనకు తెలియాలి. కీలకమైన కేంద్ర మంత్రిత్వశాఖలు ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రీతిగా ఎందుకు తమ కార్యకలాపాల వేగాన్ని పెంచుతున్నాయో మనకు తెలియాలి. గత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విశాఖపట్టణం రాష్ట్ర రాజధాని ప్రతిపాదనతో ముందుకు వచ్చింది. అది రాష్ట్ర పరిధిలోని అంశం. దానితో పనిలేకుండా కేంద్రం 2022 అక్టోబర్ నాటికి కాకినాడ వద్ద ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్’ సౌత్ ఇండియా కేంపస్ తెచ్చింది. మార్చి 2024 నాటికి బాపట్ల సమీపాన ‘ఇండియన్ ఎయిర్ ఫోర్స్’ దళాల కోసం ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ఏర్పడింది. ‘డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గ నైజేషన్’ (డీఆర్డీఓ) రూ. 100 కోట్లతో ‘మిస్సైల్ టెస్ట్ రేంజ్ సెంటర్’ మచిలీ పట్టణం సమీపాన నాగాయలంక దగ్గరలోని గుల్లలమోద వద్ద నిర్మి స్తున్నది. గత ప్రభుత్వంలో జరిగిన పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా బాపట్ల–బందరు రెండూ కూడా విజయవాడ, గుంటూరు నగరాలతో సంబంధం లేని సొంత కలెక్టరేట్లతో జిల్లా కేంద్రాలుగా మారాయి.చదవండి: శ్రీబాగ్ ఒడంబడిక అమలే కీలకం!కేంద్ర ఆర్థికశాఖ అనంతపురం జిల్లాలో ‘నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్’ వంటి దేశంలోనే అత్యున్నత స్థాయి శిక్షణా సంస్థను 2022 నాటికి బెంగళూరు సమీపాన ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించింది. అదే కాలానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా అనంతపురం జిల్లా నుంచి పుట్టపర్తి ప్రాంతాన్ని వేరుచేసి; సత్యసాయి జిల్లా పేరుతో కొత్తగా మరో జిల్లా ఏర్పాటు చేయడంతో ఇప్పుడు ఈ సంస్థ ఆ కొత్త జిల్లాలో ఉంది. మరి వీటిలో దేన్నైనా ఇది ఇక్కడ కాదు, అని మరొకచోటికి తరలించే ప్రయత్నం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ; లేదా ‘కూటమి’లో భాగస్వామి అయిన బీజేపీ నడుపుతున్న కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఎందుకు అనడం లేదనే సందేహం మనకు రావాలి. అప్పుడు ఐదేళ్ళ ప్రభుత్వాల అవసరాల కంటే, విస్తృతమైన దేశప్రయోజనాల కోసం కేంద్రంలో – రక్షణ, వాణిజ్యం, ఉపరితల రవాణా, రైల్వే, స్పేస్ సైన్స్, వంటి కొన్ని మంత్రిత్వశాఖల్లో– ‘ఏపీ’ కోసం ఒక ప్రత్యేకమైన ‘ప్లానింగ్’ ఎందుకు జరుగుతున్నది? అనే ప్రశ్న వైపుకు అవి మనల్ని మన రాష్ట్రం ‘జాగ్రఫీ’ వైపుకు తీసుకువెళతాయి.చదవండి: వాగ్దానాలు గాలికి వదిలినట్లేనా?అయితే, జరిగినవి ఏవీ గత పదేళ్లుగా బీజేపీ ప్రభుత్వం మనపట్ల ప్రేమతో చేయలేదు. ‘మెతుకు ముట్టుకుంటే అన్నం సోకు తెలుస్తుంది’ అన్నట్టుగా, రాష్ట్ర విభజన జరిగి ఆ ‘షాక్’ నుంచి ఇంకా మనం కోలుకోక ముందే 2014 మధ్యలోనే బందరు వద్ద భూమి కూడా ఎంపిక చేసిన ‘మెరైన్ పోలీస్ అకాడమీ’ని ఇక్కణ్ణించి ఉత్తరాదికి వారు తరలించారు. అదే ఏడాది డిసెంబరులో ‘ఏపీ’కి కూడా మరొక ‘అకాడమీ’ ఇస్తున్నాం అన్నారు. ఇప్పటికి అటువంటిది ఏమీ లేదు. జరుగుతున్నవి అన్నీ ఇటీవల కొత్తగా వాడుకలోకి వచ్చిన ‘జియో – పాలి టిక్స్’లో భాగంగా దేశ ప్రాదేశిక అవసరాల మేరకు ‘బ్యురోక్రసీ’ స్థాయిలో జరుగుతున్న విధాన నిర్ణయాలు. ఇంతటి సమగ్రమైన వైశాల్యంతో మారిన కొత్త ‘మ్యాప్’లోని రాష్ట్రాన్ని అధికారంలో ఉన్న ప్రభుత్వం చూడగలిగినప్పుడే, ఇక్కడ అది అమలు చేయాల్సిన స్వల్పకాలిక – దీర్ఘకాలిక ‘ప్లానింగ్’ ఎలా ఉండాల్సిందీ దానికి అర్థమవుతుంది. అప్పుడు ఈ మొత్తంలో – ‘రాజధాని’ అనే అంశానికి ఉన్న జాగా ఎంతో కూడా మనకు అర్థమవుతుంది.- జాన్సన్ చోరగుడి అభివృద్ధి– సామాజిక అంశాల వ్యాఖ్యాత