‘లుక్ ఈస్ట్’ నుంచి ‘యాక్ట్ ఈస్ట్’కు!
తూర్పు దేశాల దౌత్యాధికారులకు సుష్మాస్వరాజ్ పిలుపు
హనోయ్: ‘లుక్ ఈస్ట్’ విధానం నుంచి మెరుగైన కార్యాచరణతో కూడిన ‘యాక్ట్ ఈస్ట్’ పాలసీ వైపుగా ముందుకెళ్లాలని ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా దేశాల్లోని భారత దౌత్య ప్రధానాధికారులకు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సూచించారు. 15 దేశాల దౌత్యాధికారులతో ఆమె మంగళవారం ఇక్కడ ఒక సమావేశం నిర్వహించారు. నూతన ప్రభుత్వ విదేశాంగ విధానంలోని కీలకాంశాలను సుష్మా వారికి వివరిస్తూ.. రెండు దశాబ్దాల క్రితం నాటి లుక్ ఈస్ట్ పాలసీ స్థానంలో ‘యాక్ట్ ఈస్ట్’ విధానానికి ప్రాధాన్యత ఇవ్వాలని వారికి స్పష్టం చేశారు.
వ్యూహాత్మకంగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రాంతంలో భద్రత వ్యవస్థ, చైనా ప్రభావం, వివాదాస్పద దక్షిణ చైనా సముద్రం, ఈ ప్రాంతంపై అమెరికా వైఖరి, భారత్‌కున్న వాణిజ్యాభివృద్ధి అవకాశాలు.. మొదలైన అంశాలపై దాదాపు రోజంతా జరిగిన ఆ భేటీలో సునిశిత చర్చలు జరిపారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ ప్రాంతంలోని దేశాలతో సాంస్కృతిక, మైత్రీపూర్వక సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలని మోడీ ప్రభుత్వం భావిస్తోందని సుష్మాస్వరాజ్ వారికి వివరించారు. మధ్య ప్రాచ్య దేశాల దౌత్యాధికారులతో మే నెలలో ఢిల్లీలో ఇదే తరహా సమావేశాన్ని సుష్మా స్వరాజ్ నిర్వహించిన విషయం తెలిసిందే.