![Sakshi Editorial On Manipur Issues](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/manipur.jpg.webp?itok=73WNv0n7)
ఎట్టకేలకు మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. దాదాపు రెండేళ్లనాడు హత్యలూ, అత్యాచారాలూ, గృహదహనాలతో అట్టుడికి ప్రపంచవ్యాప్తంగా మన దేశ పరువు ప్రతిష్ఠలను మంటగలిపిన ఆ రాష్ట్రం 649 రోజులైనా ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. 2023 మే 3న రాష్ట్రంలో ప్రధాన తెగలైన మెయితీలకూ, కుకీలకూ మధ్య రాజుకున్న ఘర్షణలు చూస్తుండ గానే కార్చిచ్చులా వ్యాపించగా అధికారిక లెక్కల ప్రకారమే 260 మంది ప్రాణాలు కోల్పోయారు.
60,000 మంది ఇప్పటికీ తమ స్వస్థలాలకు వెళ్లలేక సహాయ శిబిరాల్లో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. భద్రతా బలగాల పహారా కొనసాగుతున్నా మెయితీలు, కుకీలు ఒకరి ప్రాబల్య ప్రాంతాల్లోకి మరొకరు ప్రవేశించే సాహసం చేయటం లేదు. అందువల్ల నిరుపేదల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింది. మణిపూర్ హింసాకాండ సాధారణమైనది కాదు. అనేకచోట్ల మహిళలను వివస్త్రలను చేసి, వారిపై అత్యాచారాలకు పాల్పడిన ఉదంతాలు దిగ్భ్రాంతికి గురిచేశాయి.
పోలీసు స్టేషన్లపై, సాయుధ రిజర్వ్ బెటాలియన్ స్థావరాలపై దాడులకు దిగి తుపాకులు, మందుగుండు ఎత్తుకుపోయిన ఉదంతాలు కోకొల్లలు. ఈ మొత్తం హింసాకాండలో బీరేన్ సింగ్‌కు కేవలం నైతిక బాధ్యత మాత్రమే కాదు... నేరుగా ఆయన ఒక వర్గానికి వత్తాసుగా నిలిచారని అనేకులు ఆరోపించారు. ఇటీవల బయటపడి, ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్న సంభాషణల ఆడియో క్లిప్ ఆ ఆరోపణలకు మరింత బలం చేకూర్చింది.
కొందరి మతిమాలిన చర్యలవల్లా, పాలకులకు సరైన అంచనా లేకపోవటంవల్లా శాంతి భద్రతలు చేజారే ప్రమాదం ఉంటుంది. కానీ మణిపూర్‌లో జరిగింది వేరు. ఘర్షణలను కుకీ మిలి టెంట్లకూ, కేంద్ర భద్రతా బలగాలకూ మధ్య సాగుతున్న లడాయిగా మొదట్లో బీరేన్ సింగ్ కొట్టి పారేశారు. కానీ దాన్ని అప్పటి రక్షణ దళాల చీఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ ఖండించారు. అవి రెండు తెగలమధ్య కొనసాగుతున్న ఘర్షణలేనని తేల్చిచెప్పారు.
ఆ తర్వాత దశలో ఘర్షణలను ఆపడానికి ప్రయత్నిస్తున్న కేంద్ర భద్రతా బలగాలు ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నా యంటూ బీరేన్ నిందించారు. విషాదం ఏమంటే 21 నెలలు గడిచినా ఈనాటికీ పరిస్థితి పెద్దగా మారింది లేదు. వాస్తవానికి ఘర్షణలు చెలరేగిన కొన్ని వారాల తర్వాత 2023 జూన్‌లో బీరేన్‌సింగ్ రాజీనామాకు సిద్ధపడ్డారు.
కానీ రాజ్‌భవన్ కెళ్లే దారిలో ఆయన మద్దతుదార్లు పెద్దయెత్తున గుమి గూడి అడ్డంకులు సృష్టించి వెనక్కు తగ్గేలా చేశారు. ఇన్నాళ్లకు తప్పుకున్నారు. ఈ పని మొదట్లోనే జరిగుంటే ఈపాటికి పరిస్థితులు మెరుగుపడేవి. సకాలంలో తీసుకోని నిర్ణయం ఊహించని విష పరిణామాలకు దారితీసే ప్రమాదమున్నదని చెప్పటానికి మణిపూర్ పెద్ద ఉదాహరణ.
ఇంతకూ బీరేన్ రాజీనామాకు కారణం ఏమిటన్నది మిస్టరీయే. సుప్రీంకోర్టు ధర్మాసనం పరిశీల నలో వున్న ఆడియో టేప్ అందుకు దారితీసి వుండొచ్చని కొందరంటున్నా... మణిపూర్ అరాచకంలోకి జారుకున్నప్పటినుంచీ ఆయనకు సొంత పార్టీలో వ్యతిరేకత పెరుగుతూ వచ్చిందన్నది వాస్తవం. కేబినెట్ సైతం రెండుగా చీలింది. ఒక వర్గం మణిపూర్‌ను విభజించి తాముండే ప్రాంతా లను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలన్న కుకీల డిమాండ్‌ను సమర్థించగా, మరో వర్గం మణిపూర్ సమగ్రత కాపాడాలంటూ కోరుతూ వచ్చింది.
బీజేపీ ఎమ్మెల్యేల్లో కొందరు అసెంబ్లీ స్పీకర్ సత్యబ్రతసింగ్ ఆధ్వర్యంలో ఆదివారం ఇంఫాల్ హోటల్‌లో సమావేశమై బీరేన్‌ను సాగనంపటానికి వ్యూహం రచించగా, సోమవారం నుంచి ప్రారంభం కావాల్సిన అసెంబ్లీ సమావేశాల్లో సర్కారుపై అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ నోటీసులిచ్చింది. బీరేన్ తప్పుకున్నాక అసెంబ్లీ సమావేశాలను గవర్నర్ రద్దుచేశారు. బీజేపీ అధిష్టానం అండదండలుంటే అవిశ్వాస తీర్మానానికి బీరేన్ జడిసేవారు కాదు.
ఎందుకంటే తొలి ఏలుబడిలో మూడుసార్లు అవిశ్వాస తీర్మానం వచ్చిపడినప్పుడు అసెంబ్లీలో తగినంత బలం లేకున్నా సునాయాసంగా బయటపడిన చరిత్ర బీరేన్‌ది. దేశానికి బలమైన రాజ్యాంగం ఉన్నా మణిపూర్‌లో కొనసాగుతున్న దారుణ హింసను అన్ని వ్యవస్థలూ చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయాయి. అది మన దేశంలో అంతర్భాగమని, అక్కడి ప్రజలు కూడా ఈ దేశ పౌరులేనని గుర్తించనట్టే ప్రవర్తించాయి.
గవర్నర్ మొదలుకొని న్యాయవ్యవస్థ వరకూ అందరికందరూ మౌనంగా మిగిలారు. ఇలాంటి సమయాల్లో జోక్యం చేసుకోవాల్సిన కేంద్రం తన కర్తవ్యాన్ని మరిచింది. పార్లమెంటులో ఈ సమస్య ప్రస్తావనకొచ్చినప్పుడల్లా అధికార, విపక్ష సభ్యులు పరస్పరం ఆరోపణలు చేసుకోవటం మినహా జరిగిందేమీ లేదు. కనీసం ఇప్పుడైనా అందరూ కదిలి క్షతగాత్రగా మిగిలిన మణిపూర్‌లో ఉపశమన చర్యలు తీసుకుంటారా?
మాయమైన మనుషులు, ధ్వంసమైన ఇళ్లు, ఛిద్రమైన బతుకులు, మానప్రాణాలు తీసే మృగాళ్లు, జీవిక కోల్పోయి ఎలా బతకాలో తెలియక కుమిలిపోతున్న కుటుంబాలు – మణిపూర్ వర్తమాన ముఖచిత్రం ఇది. అందుకే ఆయుధాలు సమకూర్చుకుని అధికారంలో ఉన్నవారి అండదండలతో ఇన్నాళ్లనుంచీ రెచ్చిపోతున్న ముఠాల ఆటకట్టించటం తక్షణావసరం.
అసెంబ్లీని సస్పెండ్ చేసి తాత్కాలికంగా రాష్ట్రపతి పాలన విధిస్తారో, మరెవరినైనా ముఖ్యమంత్రి పీఠంపై ఎక్కిస్తారో ఇంకా తేలాల్సేవుంది. ఏం జరిగినా ముందు చట్టబద్ధ పాలనపై ప్రజలకు విశ్వాసం కలిగించే చర్యలు తీసుకోవటం అధికార యంత్రాంగం కర్తవ్యం. అప్పుడే శాంతి సామరస్యాలు వెల్లివిరుస్తాయి. సంక్షుభిత మణిపూర్ మళ్లీ చివురిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment