
సుప్రీంకోర్టు విస్మయం
సీబీఐ విచారణకు ఆదేశం
న్యూఢిల్లీ: పాస్‌పోర్టు కోర్టు అధీనంలోనే ఉన్నప్పటికీ ధిక్కారం ఆరోపణలను ఎదుర్కొంటున్న వ్యక్తి అమెరికాకు వెలా వెళ్లిపోయాడని సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇది చాలా తీవ్రమైన అంశమని జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ మన్మోహన్‌ల ధర్మాసనం పేర్కొంది. దీనిపై తక్షణమే దర్యాప్తు చేపట్టాలని, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని సీబీఐని ఆదేశించింది. అమెరికాలో భర్త వద్ద ఉన్న తన బిడ్డను అప్పగించాలంటూ ఓ మహిళ పెట్టుకున్న పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జనవరి 29వ తేదీన ఆ వ్యక్తిపై నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. అ
తడిని అరెస్ట్ చేసేలా అవసరమైన అన్ని చర్యలను చేపట్టాలని, చట్టం ముందు అతడిని నిలబెట్టాలని హోం శాఖను సైతం ఆదేశించింది. అయినప్పటికీ, అతడు తప్పించుకుపోవడంపై విస్మయం చెందింది. ఆ వ్యక్తి ఫోర్జరీ పత్రాలతో అమెరికా వెళ్లిపోయి ఉంటాడని పిటిషనర్ తెలిపారు.
అమెరికా హోం శాఖకు విషయం తెలిపి, తప్పించుకున్న వ్యక్తిని అక్కడి అధికారుల సాయంతో వెనక్కి తీసుకువచ్చేందుకు అవకాశముందని అదనపు సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్ ధర్మాసనానికి నివేదించారు. ఆ వ్యక్తి ఎయిర్ పోర్టులో వీల్ చైర్‌లో వెళ్తున్న దృశ్యాలతో కూడిన వీడియోను అందజేశారు. అయితే, చిన్నారిని తల్లి చెంతకు చేర్చడం ముఖ్యమైన అంశమని పేర్కొన్న ధర్మాసనం..చిన్నారి వెంటనే అమెరికా నుంచి తీసుకువచ్చి తల్లికి అప్పగించాలని ప్రతివాది తరఫు లాయర్‌కు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది.