పణజీ: గోవాలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడింది. సీఎం మనోహర్ పరీకర్ మరణంతో ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రమోద్ సావంత్ ప్రభుత్వం బుధవారం విశ్వాస పరీక్షలో నెగ్గింది. గవర్నర్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక శాసనసభ సమావేశంలో బీజేపీ ప్రభుత్వం 20-15 ఓట్లతో బలపరీక్షలో విజయం సాధించింది. మేజిక్ ఫిగర్ 19 కాగా.. బీజేపీ ఒక ఓటు ఎక్కువే సాధించింది. గోవా అసెంబ్లీలో మొత్తం స్థానాలు 40 కాగా, ప్రస్తుత సభ్యుల సంఖ్య 36.
బీజేపీకి సొంతంగా 12 మంది సభ్యులు ఉండగా. మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ, గోవా ఫార్వర్డ్ బ్లాక్, స్వతంత్ర శాసనసభ్యుల మద్దతుతో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్‌కు 14, బీజేపీకి 12, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీకి మూడు, గోవా ఫార్వర్డ్ బ్లాక్‌కు మూడు, ముగ్గురు స్వతంత్ర సభ్యులు, ఒక్క ఎన్‌సీపీ సభ్యుడు ఉన్నారు. గోవా అసెంబ్లీలో మొత్తం 40 సీట్లకుగాను మనోహర్ పరీకర్, అంతకుముందు ఓ బీజేపీ సభ్యుడి మృతి, అంతకన్నా ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇద్దరు బీజేపీ శాసనసభ్యులు రాజీనామా చేయడంతో సభ్యుల సంఖ్య 36కు పడిపోయింది.
మారిన పరిస్థితుల్లో తమకే ముఖ్యమంత్రి పదవి కావాలంటూ బీజేపీ రెండు మిత్రపక్షాలు డిమాండ్ చేయడంతో గోవాలో అనిశ్చితి పరిస్థితి ఏర్పడుతుందని అందరూ భావించారు. చివరకు రెండు మిత్ర పక్షాలకు ఉప ముఖ్యమంత్రి పదవులకు అంగీకరించడంతో సంధి కుదిరింది. మంగళవారం తెల్లవారుజామున రెండు గంటలకు బీజేపీ నాయకుడు ప్రమోద్ సావంత్ సీఎంగా ప్రమాణం చేయగా, ఇద్దరు డిప్యూటీ ముఖ్యమంత్రులు, 11 మంది మంత్రులు ప్రమాణం చేశారు. అతి చిన్న రాష్ట్రమైన గోవాకు ఇద్దరు డిప్యూటి ముఖ్యమంత్రులు ఉండడం విశేషం. 2017లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకన్నా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ బీజేపీ త్వరగా పావులు కదిపి మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ, ఫార్వర్డ్ బ్లాక్‌తోపాటు ముగ్గురు స్వతంత్య్ర సభ్యుల మద్దతును సేకరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ రక్షణ మంత్రిగా ఉన్న మనోహర్‌ను బీజేపీ సొంత రాష్ట్రానికి తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేసింది.
Comments
Please login to add a commentAdd a comment