Rajasthan Assembly polls 2023: పశ్చిమ రాష్ట్రం రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 25న 200 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. డిసెంబరు 3న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈక్రమంలో ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం గురువారం సాయంత్రంతో ముగియనుంది. ఇక్కడ అటు బీజేపీగానీ, ఇటు కాంగ్రెస్ గానీ వరుసగా అధికారాన్ని దక్కించు కోలేదు. పైగా ఒకదాని తరువాత ఒకటి ఆల్టర్ నేటివ్‌గా గద్దెనెక్కుతున్నాయి. ప్రతీ ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రభుత్వం మారుతుంది. అందుకే ఈ సారి రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటు వేస్తారని బీజేపీ ధీమాగా ఉంది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు కాకుండా, ఈసారి బీజేపీకి రాజస్థాన్ ప్రజలు పట్టం కడతారని సర్వేల అంచనా. అధికార వ్యతిరేకత కూడా బీజేపీకి కలిసి వచ్చే అంశమని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం ఈసారి ట్రెండ్ రివర్స్ అవుతుందనీ, విజయం తమదే ననే ధీమాను వ్యక్తం చేస్తోంది. అసలు ఇక్కడ కీలక నియోజకవర్గాలు,విశేషాలు ఒకసారి చూద్దాం.
సర్దార్‌పురా: ఇది 1998 నుండి కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ 1998 నుండి ఈ సీటును గెలుచుకున్నారు. నాలుగోసారి సీఎం రేసులో ఉన్న ఈ సీనియర్ కాంగ్రెస్ నేత 2018 ఎన్నికల్లో 63శాతం ఓట్లతో బీజేపీకి చెందిన శంభు సింగ్‌ను ఓడించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సర్దార్‌పురా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెహ్లాట్ నామినేషన్ దాఖలు చేశారు.
టోంక్: టోంక్ స్థానం నుంచి అద్భుత విజయం సాధించిన కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ బీజేపీ అభ్యర్థి అజిత్ సింగ్ మెహతాపై పోటీ చేయనున్నారు. టోంక్ నియోజకవర్గంలో గుజ్జర్ జనాభాతో పాటు మీనాలు,ముస్లింలు కూడా ఉన్నారు. 2018 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పైలట్ 54,179 ఓట్ల తేడాతో బీజేపీకి చెందిన యూనుస్ ఖాన్‌పై విజయం సాధించారు.
ఝల్రాపటాన్: రాజస్థాన్‌లోని బీజేపీ కంచుకోటలో మాజీ సీఎం వసుంధర రాజే 2003 నుంచి ఇక్కడ నుంచి గెలుస్తూ వస్తున్నారు. 2018లో కాంగ్రెస్ మాన్వేంద్ర సింగ్‌ను ఓడించారు.
ఉదయ్‌పూర్: ఇక్కడ కూడా బీజేపీకి కూడా గట్టి పట్టుంది. 2003 నుంచి బీజపీ ఉదయపూర్‌లో తన సత్తాను చాటుతోంది. ఇక్కడ తారాచంద్ జైన్ బీజేపీ బరిలోకి దించింది అయితే ఉదయపూర్ మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పరాస్ సింఘ్వి దీన్ని వ్యతిరేకించారు. పార్టీ పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరించారు. కాగా కాంగ్రెస్ గౌరవ్ వల్లభ్‌ను రంగంలోకి దించింది.
నాథ్‌ద్వారా: ఇక్కడి నుంచి మహారాణా ప్రతాప్ సింగ్ వారసుడు విశ్వరాజ్ సింగ్ మేవార్‌ను బీజేపీ పోటీకి దింపింది. రాజస్థాన్ అసెంబ్లీ ప్రస్తుత స్పీకర్, కాంగ్రెస్ కురువృద్ధుడు సీపీ జోషిపై మేవార్ పోటీ చేయనున్నారు. 2018లో జోషి 16,940 సీట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి మహేశ్ ప్రతాప్ సింగ్‌పై విజయం సాధించారు.
ఝుంజును: ఈ నియోజకవర్గంలో చిరకాల ప్రత్యర్థులు కాంగ్రెస్ నుంచి బ్రిజేంద్ర ఓలా, బీజేపీ నుంచి నిషిత్ కుమార్ పోటీ పడుతున్నారు. ఓలా జుంజును (2008, 2013 , 2018లో) నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు.
జోత్వారా: ఒలింపియన్‌గా మారిన రాజకీయ నాయకుడు రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్‌ను తిరిగి కైవసం చేసుకునేందుకు బీజేపీ రంగంలోకి దిగింది. 2018లో ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి లాల్‌చంద్ కటారియా రాథోడ్‌పై విజయం సాధించారు.
చురు: ఇది బీజేపీకి మరో కంచుకోట. రాజస్థాన్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు రాజేంద్ర రాథోడ్ ఆరు వేర్వేరు సందర్భాలలో గెలుపొందారు. అయితే 2008 ఎన్నికల్లో తారానగర్ నుండి కాంగ్రెస్‌కు చెందిన మక్బూల్ మండెలియా బీజేపీ అభ్యర్థి హర్లాల్ సహారన్‌ను ఓడించారు.
స్కాంలు, లీక్‌లు, మహిళల భద్రత
అధికార వ్యతిరేకత, పేపర్ లీక్ స్కామ్‌లు. పేపర్ లీకేజీల కారణంగా 2019, 2022 మధ్య రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (RPSC) నిర్వహించిన ఎనిమిది పరీక్షలు రద్దయ్యాయి.ప్రభుత్వ రిక్రూట్‌మెంట్ పరీక్ష పేపర్ లీక్‌లకు పాల్పడిన వారికి శిక్షను 10 ఏళ్ల జైలు శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చే బిల్లును రాజస్థాన్ అసెంబ్లీ ఈ ఏడాది జూలైలో ఆమోదించింది. రాష్ట్రంలో మహిళల భద్రత మరో సమస్య. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు మహిళల గౌరవ పోరాటమని కేంద్ర కేబినెట్ మంత్రి స్మృతి ఇరానీ పేర్కొనడం గమనార్హం.
ఓటర్లు
రాజస్థాన్‌లో సాధారణ ఓటర్లు 5,25,38,655 మంది ఉండగా, సర్వీస్ ఓటర్లు 1,41,890 మంది ఉన్నారు. ఓటర్ల జాబితా ప్రకారం మొత్తం ఓటర్ల సంఖ్య 5,26,80,545. భారత ఎన్నికల సంఘం ప్రకారం, 2023 జనవరి అక్టోబర్ మధ్య 18 సంవత్సరాలు నిండిన యువ ఓటర్ల సంఖ్య మొత్తం 22,04,514. 11,78,285 మంది ఓటర్లు సీనియర్ సిటిజన్లు (80+) కాగా, రాజస్థాన్‌లో 606 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. రాబోయే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల 2023 కోసం రాష్ట్రంలో 51,756 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment