
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సహనం కోల్పోయారు. ఓ పోలీస్ అధికారిపై చెయ్యేత్తి కొట్టబోయారు. అదీ పెద్ద పెద్ద నేతలు పాల్గొన్న ఓ పబ్లిక్ మీటింగ్‌లో. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుండగా.. ప్రతిపక్షాలే కాదు సామాన్యులు సైతం మండిపడుతున్నారు.
సోమవారం బెలగావిలో సంవిధాన్ బచావో & ధరల వ్యతిరేకల నిరసన ప్రదర్శన జరిగింది. అయితే ఆ సమయంలో బీజేపీకి చెందిన కొందరు అక్కడికి చేరుకుని నల్ల జెండాలు, కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక ఫ్లకార్డులతో నిరసన నినాదాలు చేశారు. దీంతో ఆయన సహనం కోల్పోయారు. ‘‘ఏయ్ ఎవరు మీరు? నోరు మూయండి’’ అంటూ గట్టిగా అరిచారాయన.
అయినా కూడా వాళ్లు శాంతించకపోవడంతో.. అక్కడే ఉన్న ఏఎస్పీ నారాయణ్ భరమణిని దగ్గరకు పిలిచారు. ‘‘ఏయ్.. ఎవరు ఇక్కడ ఎస్పీ? ఏం చేస్తున్నావ్? అంటూ చెయ్యేత్తి కొట్టబోయారు. అయితే ఆ అధికారి వెనక్కి వెళ్లగా.. సీఎం కూడా తేరుకుని చెయ్యిని వెనక్కి లాక్కున్నారు. ‘‘ఏం చేస్తున్నారయ్యా మీరంతా? వాళ్లంతా ఇక్కడి దాకా ఎలా రాగలిగారు?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారాయన.
#Karnataka Chief Minister #Siddaramaiah lost his temper and raised his hand to slap a senior police officer while he was addressing a Congress rally against the Centre's policies in #Belagavi on Monday.
🔗https://t.co/kkeaADaLnu@XpressBengaluru pic.twitter.com/pTntV5QZrN— The New Indian Express (@NewIndianXpress) April 28, 2025
ఈ వీడియో కన్నడనాట దుమారం రేపింది. అధికారం శాశ్వతం కాదని.. తమరు ఐదేళ్లు అధికారంలో ఉంటారని.. కానీ ఆ అధికారి 60 ఏళ్లు వచ్చే దాకా డ్యూటీలో ఉంటారంటూ జేడీఎస్ ట్వీట్ చేసింది. ఇక.. బీజేపీ ఆ అధికారికి సీఎం సిద్ధరామయ్య క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేసింది. మరోవైపు.. కొందరు నెటిజన్లు సైతం సిద్ధరామయ్య తీరు తప్పుబడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.